| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | చతుర్థస్కంధము |
| సీ. |
ఉజ్జ్వలంబయి శతయోజనంబుల పొడ వొగిఁ బంచసప్తతియోజనముల పఱపును గల్గి యేపట్టునఁ దఱుఁగని నీడ శోభిల్ల నిర్ణీత మగుచుఁ బర్ణశాఖాసమాకీర్ణమై మాణిక్యములఁ బోలఁగల ఫలములఁ దనర్చి కమనీయసిద్ధయోగక్రియామయమయి యనఘముముక్షుజనాశ్రయంబు |
|
| తే. |
భూరిసంసారతాపనివారకంబు, నగుచుఁ దరురాజ మనఁగఁ బెం పగ్గలించి భక్తజనులకు నిచ్చలుఁ బ్రమద మెసఁగ, వలయు సంపద లందు నావటము వటము. |
136 |
| వ. | ఆ వృక్షమూలతలంబున. | 137 |
| సీ. |
ఇద్ధసనందాదిసిద్ధసంసేవితు శాంతివిగ్రహుని వాత్సల్యగుణునిఁ గమనీయలోకమంగళదాయకుని శివు విశ్వబంధుని జగద్వినుతయశుని గుహ్యకసాధ్యరక్షోయక్షనాథకుబేరసేవితుని దుర్వారబలుని నుదితవిద్యాతపోయోగయుక్తుని బాలచంద్రభూషణుని మునీంద్రనుతునిఁ |
|
| తే. |
దాపసాభీష్టకరు భస్మదండలింగ, ఘనజటాజినధరుని భక్తప్రసన్ను వితతసంధ్యాభ్రరుచివిడంబిత వినూత్న, రక్తవర్ణు సనాతను బ్రహ్మమయుని. |
138 |
| వ. | మఱియును. | 139 |
| సీ. |
అంచితవామపాదాంభోరుహము దక్షిణోరుతలంబున నొయ్య నునిచి సవ్యజానువుమీఁద సవ్యబాహువు సాఁచి వలపలి ముంజేత సలలితాక్ష మాలిక ధరియించి మహనీయతర్కముద్రాయుక్తుఁ డగుచుఁ జిత్తంబులోన నవ్యయం బయిన బ్రహ్మానందకలితసమాధినిష్ఠుఁడు వీతమత్సరుండు |
|
| తే. |
యోగపట్టాభిరాముఁడై యుచిత వృత్తి, రోషసంగతిఁబాసి కూర్చున్న జముని యనువునను దర్భరచిత బ్రుస్యాసనమున, నున్న మునిముఖ్యు నంచితయోగనిరతు, |
140 |
| క. |
అలఘుని నభవుని యోగీం, ద్రులు వినుచుండంగ నారదునితోఁ బ్రియభా షలు జరుపుచున్న రుద్రుని, సలలితపన్నగవిభూషు సజ్జనపోషున్. |
141 |
| క. |
కని లోకపాలురును ముని, జనులును సద్భక్తి నతని చరణంబులకున్ వినతు లయి, రప్పు డబ్జా సనుఁ, గని యయ్యభవుఁ డధిక సంభ్రమ మొప్పన్. |
142 |
| క. |
అనఘ! మహాత్ముం డగు వా, మనుఁ డా కశ్యపున కొగి నమస్కారము సే సిన గతి నజునకు నభివం, దన మొగిఁ గావించె హరుఁడు దద్దయుఁ బ్రీతిన్. |
143 |
| తే. |
అంత రుద్రానువర్తులైనట్టి సిద్ధ, గణమహర్షి జనంబులు గని పయోజ గర్భునకు మ్రొక్కి, రంతన కమలభవుఁడు, శర్వుఁ గని పల్కె మందహాసంబుతోడ. |
144 |
| తే. |
జగములకు నెల్ల యోనిబీజంబులైన, శక్తిశివకారణుండవై జగతి నిర్వి కారబ్రహ్మంబ వగు నిన్నుఁ గడఁగి “విశ్వ, నాథుఁ” గా నెఱిఁగెద నామనమున నభవ! |
145 |
| తే. |
సమత నది గాక తావకాంశంబులైన, శక్తిశివరూపములఁ గ్రీడ సలుపు దూర్ణ నాభిగతి విశ్వజననవినాశవృద్ధి, హేతుభూతుండ వగుచుందు వీశ! రుద్ర! |
146 |
| సీ. |
అనఘ! లోకంబులయందు వర్ణాశ్రమసేతువు లనఁగఁ బ్రఖ్యాతి నొంది బలిసి మహాజనపరిగృహీతంబులై యఖిలధర్మార్థదాయకములైన వేదంబులును మఱి వృద్ధి నొందించుట కొఱకునై నీవు దక్షుని నిమిత్త మాత్రునిఁ జేసి య మ్మఖముఁ గావించితి; వటుగాన శుభమూర్తివైన నీవు |
|
| తే. |
గడఁగి జనముల మంగళకర్ము లయిన, వారి ముక్తి, నమంగళాచారు లయిన వారి నరకంబు, నొందింతు భూరిమహిమ, భక్తజనపోష! రాజితఫణివిభూష! |
147 |
| వ. | అట్లగుటం దత్కర్మంబు లొకానొకనికి విపర్యాసంబ నొందుటకుఁ గారణం బెయ్యదియో? భవదీయ రోషంబు హేతువని తలంచితినేనిఁ ద్వదీయపాదారవిందనిహితచిత్తులై సమస్తభూతంబులయందు నినుం గనుంగొనుచు భూతంబుల నాత్మయందు వేఱుగాఁ జూడక వర్తించు మహాత్ములయందు నజ్ఞులైన వారి యందుంబోలె రోషంబు దఱుచు వొరయ దఁట! నీకుఁ గ్రోధంబు గలదే? యని. | 148 |
| సీ. |
మఱి భేదబుద్ధిఁ గర్మప్రవర్తనముల మదయుతు లయి దుష్టహృదయు లగుచుఁ బరవిభవాసహ్యభవమనో వ్యాధులఁ దగిలి మర్మాత్మభేదకము లయిన బహుదురుక్తులచేతఁ బరుల బీడించుచు నుండు మూఢులను దైవోపహతులుఁ గాఁ దలపోసి య క్కపటచిత్తులకు నీ వంటి సత్పురుషుఁ డే వలన నైన |
|
| తే. |
హింసఁ గావింపకుండు సమిద్ధచరిత!, నీలలోహిత! మహితగుణాలవాల! లోకపాలన! కలిత గంగాకలాప!, హర! జగన్నుతచారిత్ర! యదియుఁ గాక. |
149 |
| సీ. |
అమరసమస్తదేశములందు నఖిలకాలములందుఁ దలఁప దుర్లంఘ్యమహిముఁ డగు పద్మనాభు మాయామోహితాత్మకు లై భేదదర్శనులైన వారి వలనను ద్రోహంబు గలిగిన నైనను నది దైవకృత మని యన్యదుఃఖ ముల కోర్వలేక సత్పురుషుండు దయసేయు గాని హింసింపఁడు గాన నీవు |
|
| తే. |
నచ్యుతుని మాయ మోహము నందకుంటఁ, జేసి సర్వజ్ఞుఁడవు; మాయచేత మోహి తాత్ములై కర్మవర్తను లయినవారి, వలన ద్రోహంబు గలిగిన వలయుఁ బ్రోవ. |
150 |
| వ. | అది గావున యజ్ఞభాగార్హుండ వయిన నీకు సవనభాగంబు సమర్పింపని కతన నీచేత విధ్వస్తంబయి పరిసమాస్తి నొందని దక్షాధ్వరంబు మరల నుద్ధరించి దక్షునిఁ బునర్జీవితుం జేయుము; భగుని నేత్రంబులును, భృగుముని శ్మశ్రువులును, బూషుని దంతంబులును గృపసేయుము. భగ్నాంగు లయిన దేవఋత్విఙ్ని కాయంబులకు నారోగ్యంబు గావింపుము; ఈ మఖావశిష్టంబు యజ్ఞ పరిపూర్తి హేతుభూతం బయిన భవదీయభాగం బగుంగాక. | 151 |