పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
ఈశ్వరుండు బ్రహ్మాదులచేఁ బ్రార్థితుండై దక్షాదుల ననుగ్రహించుట
చ. అని చతురాననుండు వినయంబున వేఁడిన నిందుమౌళి స
య్యనఁ బరితుష్టిఁ బొంది దరహాసమునన్‌ గృప దొంగలింప ని
ట్లను హరిమాయచేత ననయంబును బామరు లైనవారు సే
సిన యపరాధ దోషములు చిత్తములో గణియింప నెన్నఁడున్‌.
152
వ. అట్లయ్యును. 153
క. బలియుర దండించుట దు, ర్బలజన రక్షణము ధర్మపద్ధతి యగుటం
గలుషాత్ముల నపరాధము, కొలఁదిని దండించుచుందుఁ గొనకొని యేనున్‌.
154
వ. అని దగ్ధశీర్షుండయిన దక్షుం డజముఖుం డగు! భగుండు బర్హిస్సంబంధ భాగంబులు గలిగి మిత్ర నామధేయచక్షుస్సునం బొడగాంచుఁ; బూషుండు పిష్టభుక్కగుచు యజమానదంతంబులచే భక్షించు; దేవతలు యజ్ఞావశిష్టంబు నా కొసంగుటంజేసి సర్వావయవపూర్ణులై వర్తింతురు. ఖండితాంగులైన ఋత్విగాది జనంబు లశ్వినీదేవతల బాహువులచేతను బూషుని హస్తంబులచేతను లబ్ధబాహుహస్తులై జీవింతురు; భృగువు బస్తశ్మశ్రువులు గలిగి వర్తించు నని శివుం డానతిచ్చిన సమస్తభూతంబులును సంతుష్టాంతరంగంబులై “తండ్రి! లెస్సయ్యె” యని సాధువాదంబుల నభినందించిరి. అంత నా శంభుని యామంత్రణంబు వడసి సునాసీరప్రముఖులగు దేవతలు ఋషుల తోడంగూడి రా నజుండును రుద్రునిం బురస్కరించుకొని దక్షాధ్వరవాటంబునకుం జనియె నంత. 155
క. శర్వుని యోగక్రమమున, సర్వావయవములుఁ గలిగి సన్మునిఋత్వి
గ్గీర్వాణముఖ్యు లొప్పిరి, పూర్వతనుశ్రీల నార్యభూషణ! యంతన్‌.
156
క. విను దక్షు నంత మేషము, ఖునిఁ జేసిన నిద్ర మేలుకొని లేచిన పో
ల్కిన నిలిచె దక్షుఁ, డభవుఁడు, గనుఁగొనుచుండంగ నాత్మఁ గౌతుక మొప్పన్‌.
157
వ. ఇట్లు లేచి నిలిచి ముందఱ నున్న శివునిం గనుంగొనిన మాత్రాన శరత్కాలంబున నకల్మషం బైన సరస్సునుంబోలెఁ బూర్వరుద్రవిద్వేషజనితంబులైన కల్మషంబులం బాసి నిర్మలుండై యభవుని నుతియింపం దొడంగి మృతిఁ బొందిన సతీతనయం దలంచి యనురాగోత్కంఠబాష్పపూరితలోచనుండును, గద్గదకంఠుండు నునై పలుకంజాలక యెట్టకేలకు దుఃఖంబు సంస్తంభించికొని ప్రేమాతిరేకవిహ్వలుం డగుచు సర్వేశ్వరుండగు హరున కిట్లనియె. 158
క. విను! నీ కపరాధుఁడ నగు, నను దండించు టది దండనము గాదు మది
న్నను రక్షించుటగా మన, మున దలఁతును దేవ! యభవ! పురహర! రుద్రా!
159
సీ. అనఘాత్మ! తగ నీవు నబ్జనాభుండును బరికింప బ్రాహ్మణాభాసు లయిన
వారల యెడల నె వ్వలన నుపేక్షింప రఁట! దృఢవ్రతచర్యులైనవారి
యెడ నీ కుపేక్ష యెక్కడిది? సర్గాదిని నామ్నాయసంప్రదాయప్రవర్త
నము నెఱింగించుట కమరవిద్యాతపోవ్రతపరాయణులైన బ్రాహ్మణులను
 
తే. వరుసఁ బుట్టించితివి; కాక వారి నెపుడు, గేల దండంబుఁ బూని గోపాలకుండు
బలసి గోవుల రక్షించు పగిది నీవు, నరసి రక్షించుచుందు గదయ్య రుద్ర!
160
సీ. తలపోయ నవిదితతత్త్వవిజ్ఞానుండ నైన నాచేత సభాంతరమున
నతిదురుక్త్యంబకక్షతుఁడ వయ్యును మత్కృతాపరాధము హృదయంబునందు
దలఁపక త్ర్యక్ష! నిందాదోషమున నధోగతిఁ బొందుచున్న దుష్కర్ము నన్నుఁ
గరుణఁ గాచిన నీకుఁ గడఁగి ప్రత్యుపకార మెఱిఁగి కావింప నే నెంతవాఁడ?
 
తే. నుతచరిత్ర! భవత్పరానుగ్రహాను, రూపకార్యంబుచేత నిరూఢమైన
తుష్టి నీ చిత్తమందు నొందుదువుగాక, క్షుద్రసంహార! కరుణాసముద్ర! రుద్ర!
161
వ. అని యిట్లు రుద్రక్షమాపణంబు గావించి పద్మసంభవుచేత ననుజ్ఞాతుండై దక్షుం డుపాధ్యాయ ఋత్విగ్గణ సమేతుం డగుచుఁ గ్రతుకర్మంబు నిర్వర్తించు సమయంబున బ్రాహ్మణజనంబులు యజ్ఞంబులు నిర్విఘ్నంబులై సాగుటకుఁ బ్రమథాది వీర సంసర్గకృత దోషనివృత్త్యర్థంబుగా విష్ణుదేవతాకంబును ద్రికపాల పురోడాశ ద్రవ్యకంబును నైన కర్మంబుఁ గావింప నధ్వర్యుకృత్య ప్రవిష్టుండగు భృగువుతోడం గూడి నిర్మలాంతః కరణుం డగుచు దక్షుఁడు ద్రవ్యత్యాగంబుఁ గావింపఁ బ్రసన్నుండై సర్వేశ్వరుండు. 162
సీ. మానితశ్యామాయమానశరీర దీధితులు నల్దిక్కుల దీటుకొనఁగఁ
గాంచనమేఖలాకాంతులతోడఁ గౌశేయచేలద్యుతుల్‌ సెలిమి సేయ
లక్ష్మీసమాయుక్తలలితవక్షంబున వైజయంతీప్రభల్‌ వన్నె సూప
హాటకరత్నకిరీటకోటిప్రభల్‌ బాలార్కరుచులతో మేలమాడ
 
తే. లలితనీలాభ్రరుచిఁ గుంతలములు దనరఁ, బ్రవిమలాత్మీయదేహజప్రభ సరోజ
భవభవామరముఖ్యుల ప్రభలు మాప, నఖిలలోకైకగురుఁడు నారాయణుండు.
163
చ. సలలితశంఖచక్రజలజాతగదాశరచాపఖడ్గ ని
ర్మలరుచులన్‌ సువర్ణరుచిమన్మణికంకణముద్రికాప్రభా
వళులను దేజరిల్లు భుజవర్గ మనర్గళకాంతియుక్తమై
విలసితకర్ణికారపృథివీరుహముంబురుడింప బిట్టుగన్‌.
164
క. సరసోదారసమంచిత, దరహాసవిలోకనములఁ దగ లోకములం
బరితోషము నొందించుచుఁ, బరమోత్సవ మొప్ప విశ్వబంధుండగుచున్‌.
165
చ. మఱియును రాజహంసరుచిమద్భ్రమణీకృతతాలవృంత చా
మరముల వీవఁగా దివిజమానిను లచ్ఛసుధామరీచివి
స్ఫురణసితాతపత్రరుచిపుంజము దిక్కులఁబిక్కటిల్లఁగాఁ
గరివరదుండు వచ్చె సుభగస్తుతివర్ణసుపర్ణయానుఁడై.
166
చ. ఘనరుచి నట్లు వచ్చిన వికారవిదూరుముకుందుఁజూచి బో
రన నరవిందనందనపురందరచంద్రకళాధరామృతా
శనముఖు లర్థి లేచి యతిసంభ్రమ మొప్ప “నమో నమో దయా
వన నిధయే” యటంచు ననివారణ మ్రొక్కిరి భక్తియుక్తులై.
167
వ. అట్లు కృతప్రణాములైన యనంతరంబ. 168
ఉ. ఆ నలినాయతాక్షుని యనంతపరాక్రమదుర్నిరీక్ష్య తే-
జోనిహతస్వదీప్తులగుచు న్నుతిసేయ నశక్తులై భయ
గ్లాని వహించి బాష్పములు గ్రమ్మఁగ గద్గదకంఠులై తనుల్‌
మ్రానుపడంగ న వ్విభుని మన్ననఁ గైకొని యెట్టకేలకున్‌.
169
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )