| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | చతుర్థస్కంధము |
| క. |
విను మఖిలభువనపరిపా, లనమునకై చక్రధరకళాకలితుండై వనజజునకు స్వాయంభువ, మను వపు డుదయించెఁ గీర్తిమంతుం డగుచున్. |
216 |
| తే. |
రూఢి నమ్మనువుకు శతరూపవలన, భూనుతులగు ప్రియవ్రతోత్తానపాదు లనఁగ నిద్దఱు పుత్త్రులై రందులోన, భవ్యచారిత్రుఁ డుత్తానపాదునకును. |
217 |
| క. |
వినుము సునీతియు సురుచియు, నను భార్యలు గలరు; వారియందును ధ్రువునిం గనిన సునీతియు నప్రియయును, సురుచియుఁ బ్రియయు నగుచు నున్నట్టి యెడన్. |
218 |
| సీ. |
ఒకనాఁడు సుఖలీల నుత్తానపాదుండు నెఱిఁ బ్రియురాలైన సురుచి గన్న కొడుకు నుత్తముఁ దన తొడలపై నిడికొని యుపలాలనము సేయుచున్న వేళ నర్థిఁ దదారోహణాపేక్షితుం డైన ధ్రువునిఁ గనుంగొని తివక యాద రింప కుండుటకు గర్వించి యా సురుచియు సవతిబిడ్డండైన ధ్రువునిఁ జూచి |
|
| తే. |
తండ్రి తొడ నెక్కు వేడుక దగిలెనేనిఁ, బూని నాగర్భమున నాఁడు పుట్ట కన్య గర్భమునఁ బుటఁ గోరినఁ గలదె నేఁడు, జనకు తొడ యెక్కు భాగ్యంబు సవతికొడుక! |
219 |
| క. |
అది గాన నీ వధోక్షజు, పదపద్మము లాశ్రయింపు; పాయక హరి నా యుదరమునఁ బుట్టజేయును, వదలక యట్లయిన ముదము వడసెద వనఘా! |
220 |
| క. |
అని యీ రీతి నసహ్య వ, చనములు పినతల్లి యపుడు జనకుఁడు వినఁగాఁ దను నాడిన దుర్భాషా, ఘనశరములు మనము నాఁటి కాఱియ వెట్టన్. |
221 |
| క. |
తను నట్లుపేక్ష సేసిన, జనకునికడఁ బాసి దుఃఖజలనిధి లోనన్ మునుఁగుచును దండతాడిత, ఘనభుజగముఁ బోలె రోషకలితుం డగుచున్. |
222 |
| క. |
ఘనరోదనంబు సేయుచుఁ, గనుఁగవలను శోకబాష్పకణములు దొరఁగన్ జనని కడ కేగుటయు నిజ, తనయునిఁగని యా సునీతి దద్దయుఁబ్రేమన్. |
223 |
| వ. | తొడలపై నిడికొని. | 224 |
| క. |
కర మనురక్తిని మోము ని, విరి తద్వృత్తాంత మెల్ల వెలఁదులు నంతః పురవాసులుఁ జెప్పిన విని, పఱపుగ నిట్టూర్పు లెసఁగ బాష్పాకులయై. |
225 |
| తే. |
సవతి యాడిన మాటలు సారెఁ దలఁచి, కొనుచుఁ బేర్చిన దుఃఖాగ్నిఁ గుములుచుండె దావపావకశిఖలచేఁ దగిలి కాంతి, వితతిఁ గందిన మాధవీలతికవోలె. |
226 |
| వ. | అంత నా సునీతి బాలకునిం జూచి తండ్రీ! దుఃఖింపకుమని యిట్లనియె. | 227 |
| క. |
అనఘా! యీ దుఃఖమునకుఁ, బని లే దన్యులకు సొలయ బలవంతంబై తన పూర్వజన్మదుష్కృత, ఘనకర్మము వెంట నంటఁగా నెవ్వలనన్. |
228 |
| వ. | కావున. | 229 |
| క. |
పెనిమిటిచేతను బెండ్లా, మని కాదు నికృష్టదాసి యనియును బిలువం గను జాలని దుర్భగురా, లనఁగల నా కుక్షి నుదయ మందిన కతనన్. |
230 |
| క. |
నిను నాడిన యా సురుచి వ, చనములు సత్యంబు లగును; సర్వశరణ్యుం డనఁగల హరిచరణంబులు, గను జనకుని యంక మెక్కఁగాఁ దలఁ తేనిన్. |
231 |
| వ. | కావునం బినతల్లియైన యా సురుచి యాదేశంబున నధోక్షజు నాశ్రయింపు మని వెండియు నిట్లనియె. | 232 |
| సీ. |
పరికింప నీ విశ్వపరిపాలనమునకై యర్థి గుణవ్యక్తుఁడైనయట్టి నారాయణుని పాదనలినముల్ సేవించి తగ బ్రహ్మ బ్రహ్మపదంబు నొందె; ఘనుఁడు మీ తాత యా మనువు సర్వాంతర యామిత్వ మగు నేకమైన దృష్టిఁ జేసి యాగముల యజించి తా భౌమసుఖములను దివ్యసుఖముల మోక్ష |
|
| తే. |
సుఖములను బొందె నట్టి యచ్యుతునిఁ బరుని, వితతయోగీంద్రనికరగవేష్యమాణ చరణసరసిజయుగళు శశ్వత్ప్రకాశు, భక్తవత్సలు విశ్వసంపాద్యు హరిని. |
233 |
| వ. | మఱియును. | 234 |
| క. |
కరతలగృహీతలీలాం, బురుహ యగుచుఁ బద్మగర్భముఖగీర్వాణుల్ పరికింపంగల లక్ష్మీ, తరుణీమణిచేత వెదకఁదగు పరమేశున్. |
235 |