| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | చతుర్థస్కంధము |
| వ. | నిజధర్మపరిశోభితంబైన యేకాగ్రచిత్తంబున నిలిపి సేవింపు; మమ్మహాత్ముని కంటె నీ దుఃఖం బపన యించువాఁ డన్యుం డొక్కరుండు గలండే? యని పలికినఁ బరమార్థప్రాప్తిహేతుకంబులైన తల్లి వాక్యంబులు విని తన్నుఁ దాన నియమించుకొని పురంబు వెడలి చను నవసరంబున నారదుండు దద్వృత్తాంతం బెఱింగి యచ్చటికిం జనుదెంచి యతని చికీర్షితంబుఁ దెలిసి పాపనాశకరంబైన తన కరతలంబున ధ్రువుని శిరం బంటి మానభంగంబునకు సహింపని క్షత్త్రియుల ప్రభావం బద్భుతంబు గదా? బాలకుండయ్యుఁ బినతల్లి యాడిన దురుక్తులు చిత్తంబునం బెట్టి చనుచున్నవాఁడని మనంబున నాశ్చర్యంబు నొంది “యో బాలక! సకల సంపత్సమృద్ధంబగు మందిరంబు దెగడి యొంటి నెందు నేగెదవు? స్వజనకృతం బగు నవమానంబుచే నిను సంతప్తుంగాఁ దలంచెద” ననిన ధ్రువుం డిట్లనియె; సపత్నీమాతృవాగిషుక్షతంబగు వ్రణంబు భగవద్ధ్యానయోగరసాయనంబున మాపికొందు ననిన ధ్రువునికి నారదుం డిట్లనియె. | 236 |
| క. |
విను పుత్త్రక! బాలుఁడవై, యనయంబును గ్రీడలందు నాసక్తమనం బునఁ దిరిగెడు నిక్కాలం, బున నీ కవమానమానములు లే వెందున్. |
237 |
| తే. |
కాన మనమునఁ దద్వివేకంబు నీకుఁ, గలిగెనేనియు సంతోషకలితు లయిన పురుషు లాత్మీయకర్మ విస్ఫురణఁ జేసి, వితతసుఖదుఃఖము లనుభవింతు రెపుడు. |
238 |
| వ. | కావున వివేకంబు గల పురుషుండు దనకుం బ్రాప్తంబులగు సుఖదుఃఖంబులు దైవవశంబులుగాఁ దలంచి తావన్మాత్రంబునం బరితుష్టుండగు; నీవును దల్లి చెప్పిన యోగమార్గ ప్రకారంబున సర్వేశ్వరానుగ్రహంబుఁ బొందెద నంటివేని. | 239 |
| సీ. |
అనఘాత్మ! యోగీంద్రు లనయంబు ధరఁ బెక్కు జన్మంబులందు నిస్సంగమైన మతిని బ్రయోగ సమాధినిష్ఠలఁ జేసి యైనను దెలియ లే రతని మార్గ; మది గాన యతఁడు దురారాధ్యుఁ డగు నీకు; నుడుగుము నిష్ఫలోద్యోగ మిపుడు గాక నిశ్శ్రేయసకాముండ వగుదేనిఁ దండ్రి వర్తించు తత్కాలమందుఁ |
|
| తే. |
బూని సుఖదుఃఖముల రెంటిలోన నెద్ది, దైవవశమునఁ జేకుఱు దానఁజేసి డెందమునఁ జాల సంతుష్టి నొందువాఁడు, విమలవిజ్ఞాని యన భువి వెలయుచుండు. |
240 |
| వ. | మఱియు గుణాఢ్యుం డగువానిం జూచి సంతోషించుచు నాభాసుం డగు వానిం జూచి కరుణించుచు సమానునియెడ మైత్రి సలుపుచు వర్తించుచున్నవాఁడు తాపత్రయాదికంబులం దొఱంగునని నారదుండు పలికిన విని ధ్రువుం డిట్లనియె; ననఘా; యీ శమంబు సుఖదుఃఖహతాత్ము లగు పురుషులకు దుర్గమం బని కృపాయత్తుండ వైన నీచేత వినంబడె; నట్లయినం బరభయంకరంబగు క్షాత్త్రధర్మంబు నొందిన యవినీతుండ నగు నేను సురుచి దురుక్తిబాణ వినిర్భిన్న హృదయుండ నగుట మదీయచిత్తంబున శాంతి నిలువదు; కావునం ద్రిభువనోత్కృష్టంబు ననన్యాధిష్ఠితంబు నగు పదంబును బొంద నిచ్ఛించిన నాకు సాధుమార్గంబు నెఱింగింపుము; నీవు భగవంతుండగు నజుని యూరువువలన జనించి వీణావాదన కుశలుండవై జగద్ధితార్థంబు సూర్యుండునుంబోలె వర్తింతు వనిన విని. | 241 |
| క. |
నారదుఁడిట్లను ననఘ! కు, మారక! విను నిన్ను మోక్షమార్గంబునకున్ బ్రేరేచినవాఁ డిప్పుడు, ధీరజనోత్తముఁడు వాసుదేవుం డగుటన్. |
242 |
| వ. | నీవు నమ్మహాత్ముని నజస్రధ్యానప్రవణచిత్తుండవై భజియింపుము. | 243 |
| క. |
పురుషుఁడు దవిలి చతుర్విధ, పురుషార్థశ్రేయ మాత్మఁ బొందెద ననినన్ ధరఁ దత్ప్రాప్తికి హేతువు, హరిపదయుగళంబు దక్క నన్యము గలదే? |
244 |
| వ. | కావున. | 245 |
| క. |
వరయమునానదితటమున, హరిసాన్నిధ్యంబు శుచియు నతిపుణ్యమునై పరఁగిన మధువనమునకును, సరసగుణా! చనుము మేలు సమకుఱు నచటన్. |
246 |
| క. |
ఆ యమునాతటినీ శుభ, తోయములం గ్రుంకి నిష్ఠతో నచ్చట నా రాయణునకును నమస్కృతు, లాయతమతిఁ జేసి చేయు యమనియమములన్. |
247 |
| వ. | మఱియు బాలుండ వగుటంజేసి వేదాధ్యయనాద్యుచితకర్మానర్హుండ వయ్యు నుచితంబులగు కుశాజినంబులం జేసి స్వస్తిక ప్రముఖాసనంబులం గల్పించికొని త్రివృత్ప్రాణాయామంబులచేతం బ్రాణేంద్రియ మనోమలంబు లను చాంచల్య దోషంబుల హరించి స్థిరం బయిన చిత్తంబున. | 248 |
| సీ. |
ఆశ్రితసత్ప్రసాదాభిముఖుండును నిద్ధప్రసన్నాననేక్షణుండు సురుచిరనాసుండు సుభ్రూయుగుండును సుకపోలతలుఁడును సుందరుండు హరినీలసంశోభితాంగుండుఁదరుణుండు నరుణావలోకనోష్ఠాధరుండు గరుణాసముద్రుండుఁబురుషార్థనిధియును బ్రణతాశ్రయుండు శోభనకరుండు |
|
| తే. |
లలితశ్రీవత్సలక్షణలక్షితుండు, సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి పురుషలక్షణయుక్తుండుఁబుణ్యశాలి, యసితమేఘనిభశ్యాముఁడవ్యయుండు. |
249 |
| వ. | మఱియును. | 250 |
| సీ. |
హారకిరీటకేయూర కంకణఘన భూషణుండాశ్రిత పోషణుండు లాలితకాంచీకలాపశోభితకటి మండలుం డంచిత కుండలుండు మహనీయకౌస్తుభమణిఘృణిచారు గ్రైవేయకుం డానందదాయకుండు సలలితఘనశంఖచక్రగదాపద్మహస్తుండు భువనప్రశస్తుఁడజుఁడు |
|
| తే. |
గమ్రసౌరభవనమాలికాధరుండు, హతవిమోహుండు నవ్యపీతాంబరుండు లలితకాంచననూపురాలంకృతుండు, నిరతిశయసద్గుణుఁడు దర్శనీయతముఁడు. |
251 |
| క. |
సరసమనోలోచన ము, త్కరుఁడును హృత్పద్మకర్ణికానివసిత వి స్ఫురదురునఖమణిశోభిత, చరణసరోజాతుఁ డతులశాంతుఁడు ఘనుఁడున్. |
252 |
| వ. | అయిన పురుషోత్తముం బూజించుచు హృదయగతుండును, సానురాగ విలోకనుండును, వరదశ్రేష్ఠుం డును నగు నారాయణు నేకాగ్రచిత్తంబున ధ్యానంబు సేయుచుఁ బరమ నివృత్తి మార్గంబున ధ్యాతుండైన పురుషోత్తముని దివ్యమంగళస్వరూపంబు చిత్తంబునం దగిలిన మరల మగుడ నేర దదియునుంగాక యే మంత్రంబేని సప్తవాసరంబులు పఠియించిన ఖేచరులం గనుంగొను సామర్థ్యంబు గలుగు; నట్టి ప్రణవయుక్తంబగు ద్వాదశాక్షర కలితంబును దేశకాలవిభాగవేదిబుధానుష్ఠితంబును నయిన వాసుదేవమంత్రంబునం జేసి. | 253 |
| సీ. |
దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము జలజంబులను జారుజలజనయనుఁ దులసీదళంబులఁ దులసికాదాముని మాల్యంబులను వినిర్మలచరిత్రుఁ బత్త్రంబులను బక్షిపత్త్రునిఁ గడు వన్య మూలంబులను నాదిమూలఘనుని నంచితభూర్జత్వగాదినిర్మిత వివిధాంబరంబులను బీతాంబరధరుఁ |
|
| తే. |
దనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత, రూపములయందుఁ గాని నిరూఢమైన సలిలములయందుఁ గాని సుస్థలములందుఁ, గాని పూజింపవలయు నక్కమలనాభు. |
254 |
| క. |
ధృతచిత్తుఁడు శాంతుండు ని, యతపరిభాషణుఁడు సుమహితాచారుఁడు వ ర్ణితహరిమంగళగుణుఁడును, మితవన్యాశనుఁడు నగుచు మెలఁగఁగవలయున్. |
255 |
| వ. | ఉత్తమశ్లోకుండగు వుండరీకాక్షుండు నిజమాయాస్వేచ్ఛావతారచరితంబులచేత నచింత్యంబుగా నెద్ది సేయు నద్ది హృదయగతంబుగా ధ్యానంబు సేయందగు. మఱియుఁ గార్యబుద్ధింజేసి చేయంబడు పూజావిశేషంబులు వాసుదేవమంత్రంబున సర్వేశ్వరునికి సమర్పింప వలయు; నిట్లు మనోవాక్కాయకర్మంబులచేత మనోగతం బగునట్లుగా భక్తియుక్తంబు లయిన పూజలచేతఁ బూజింపంబడి, సర్వేశ్వరుండు మాయాభిభూతులు గాక సేవించు పురుషులకు ధర్మాదిపురుషార్థంబులలోన నభిమతార్థంబు నిచ్చు; విరక్తుం డగువాఁడు నిరంతరభావం బయిన భక్తియోగంబునం జేసి మోక్షంబుకొఱకు భజియించు నని చెప్పిన విని ధ్రువుండు నారదునకుం బ్రదక్షిణ పూర్వకంబుగా నమస్కరించి మహర్షిజనసేవ్యంబై సకలసిద్ధుల నొసంగుచు భగవత్పాద సరోజాలంకృతంబైన మధువనంబునకుం జనియె నంత. | 256 |
| తే. |
పద్మభవసూనుఁ డుత్తానపాదుకడకు, నరిగి యా రాజుచే వివిధార్చనముల నంది సంప్రీతుఁడై యున్నతాసనమున, నెలమిఁ గూర్చుండి యాతని వలను చూచి. |
257 |
| వ. | ఇట్లనియె. | 258 |
| క. |
భూనాయక! నీ విపు డా, మ్లానాస్యుఁడ వగుచుఁ జాల మదిలో జింతం బూనుట కేమి కతం? బన, నా నారదుతోడ నాతఁ డనియెన్ మరలన్. |
259 |
| క. |
మునివర! వివేకశాలియు, ననఘుఁడు నైదేండ్ల బాలుఁడస్మత్ప్రియనం దనుఁ డదయుఁడ నగు నాచే, తను బరిభవ మొంది చనియెఁదల్లియుఁదానున్. |
260 |
| మ. |
చని యుగ్రాటవిఁ జొచ్చి యచ్చటఁ బథిశ్రాంతుండు క్షుత్పీడితుం డును సంమ్లానముఖాంబుజుండు ననఘుండున్ బాలకుండైన మ త్తనయున్ ఘోరవృకాహిభల్లముఖసత్త్వశ్రేణి భక్షించెనో యని దుఃఖించెద నాదు చిత్తమున నార్యస్తుత్య! యిట్లౌటకున్. |
261 |
| తే. |
అట్టి యుత్తమబాలు నా యంకపీఠ, మందుఁ గూర్చుండనీక నిరాకరించి యంగనాసక్తచిత్తుండ నైన యట్టి, నాదు దౌరాత్మ్య మిది మునినాథచంద్ర! |
262 |
| ఉ. |
నా విని నారదుండు నరనాథున కిట్లను నీ కుమారుఁడా దేవకిరీట రత్నరుచిదీపితపాదసరోజుఁడైన రా జీవదళాక్షరక్షితుఁడశేషజగత్పరికీర్తనీయకీ ర్తీవిభవప్రశస్తసుచరిత్రుఁడు; వానికి దుఃఖ మేటికిన్? |
263 |
| ఉ. |
కావున న మ్మహాత్ముఁడు సుకర్మముచేత సమస్తలోకపా లావళి కందరాని సముదంచితనిత్యపదంబునం బ్రభు శ్రీవిల్లసిల్లఁ జెందుఁ దులసీదళదాము భజించి; యా జగ త్పావనుఁడైన నీ సుతు ప్రభావ మెఱుంగవు నీవు భూవరా! |
264 |
| వ. | అదియునుంగాక. | 265 |
| క. |
నీ కీర్తియు జగముల యం, దాకల్పము నొందఁజేయు నంచితగుణ ర త్నాకరుఁడిట కేతెంచును, శోకింపకు మతనిఁగూర్చి సుభగచరిత్రా! |
266 |
| క. |
అని నారదుండు పలికిన, విని మనమున విశ్వసించి విభుఁడును బ్రియ నం దనుఁ జింతించుచు నాదర, మునఁ జూడం డయ్యె రాజ్యమును బూజ్యముగన్. |
267 |
| వ. | అంత నక్కడ నా ధ్రువుండు. | 268 |
| క. |
చని ముందటఁ గనుఁగొనె మధు, వనమును మునిదేవయోగివర్ణితగుణ పా వనమును దుర్భవజలదప, వనమును నిఖిలైకపుణ్యవరభవనంబున్. |
269 |
| వ. | అట్లు గని డాయంజని యమునానదిం గృతస్నానుండై నియతుండును, సమాహిత చిత్తుండును నై సర్వేశ్వరుని ధ్యానంబు సేయుచుం ద్రిరాత్రంబుల కొక్కమాఱు కృత కపిత్థ బదరీ ఫలపారణుం డగుచు దేహస్థితి ననుసరించి యొక్క మాసంబు హరిం బూజించి, యంతనుండి యాఱేసి దినంబుల కొక్కపరి కృతజీర్ణతృణపర్ణాహారుం డగుచు, రెండవ మాసంబున విష్ణుసమారాధనంబు సేసి, యంతనుండి నవరాత్రంబుల కొకమా ఱుదక భక్షణంబు సేయుచు, మూఁడవ మాసంబున మాధవు నర్చించి. యంతనుండి ద్వాదశదినంబుల కొకమాఱు వాయుభక్షణుం డగుచు; జితశ్వాసుండై నాలవమాసంబునం, బుండరీకాక్షుని భజియించి యంత నుండి, మనంబున నలయక నిరుచ్ఛ్వాసుండై యేకపదంబున నిలిచి, పరమాత్మం జింతించుచు, నచేతనంబైన స్థాణువుంబోలె నైదవమాసంబును జరపె నంత. | 270 |
| సీ. |
సకలభూతేంద్రియాశయ మగు హృదయంబు నందు విషయములఁ జెందనీక మహదాది తత్త్వ సమాజమ్ములకును నాధార భూతమును బ్రధానపూరు షేశ్వరుఁ డైనట్టి శాశ్వతబ్రహ్మంబుఁ దనదైన హృదయపద్మమున నిలిపి హరి రూపమున కంటె నన్యంబు నెఱుఁగక చిత్త మవ్విభునందుఁ జేర్చియున్న |
|
| తే. |
కతన ముల్లోకములు సాలఁ గంప మొందె;, వెండియును బేర్చి యయ్యర్భకుండు ధరణి నొక్క పాదంబు చేర్చి నిల్చున్న వేళఁ, బేర్చి యబ్బాలు నంగుష్ఠపీడఁ జేసి. |
271 |
| తే. |
వసుమతీతల మర్ధము వంగఁజొచ్చె, భూరిమదదుర్నివారణవారణేంద్ర మెడనుఁ గుడి నొరగఁగ నడుగడుగునకును, జలన మొందుచు నడఁగెడు కలముఁబోలె. |
272 |
| చ. |
అతఁడు ననన్యదృష్టిని జరాచరదేహి శరీరధారణా స్థితి గల యీశునందుఁ దన జీవితమున్ ఘటియింపఁ జేసి యే కతఁ గనఁ దన్నిరోధమునఁ గైకొని కంపము నొందె నీశ్వరుం; డతఁడు చలింప నిజ్జగము లన్నియుఁ జంచల మయ్యె భూవరా! |
273 |
| క. |
ఆలోకభయంకరమగు, నా లోకమహావిపద్దశాలోకనులై యా లోకపాలు రందఱు, నా లోకశరణ్యుఁ గాన నరిగిరి భీతిన్. |
274 |
| వ. | అట్లరిగి నారాయణు నుద్దేశించి కృతప్రణాములై కరంబులు ముకుళించి యిట్లనిరి. | 275 |
| చ. |
హరి! పరమాత్మ! కేశవ! చరాచర భూతశరీరధారివై పరఁగుదు వీవు, నిట్టులుగఁ బ్రాణనిరోధ మెఱుంగ మెందు ముం దిరవుగ దేవదేవ, జగదీశ్వర! సర్వశరణ్య! నీ పదాం బురుహము లర్థిమై శరణుఁబొందెద మార్తి హరించి కావవే! |
276 |
| వ. | అని దేవతలు విన్నవించిన నీశ్వరుండు వారల కిట్లనియె; నుత్తానపాదుం డనువాని తనయుండు విశ్వరూపుండ నయిన నాయందుఁ దన చిత్తం బైక్యంబు సేసి తపంబు గావించుచుండ దానం జేసి భవదీయప్రాణనిరోధం బయ్యె! నట్టి దురత్యయంబైన తపంబు నివర్తింపఁజేసెద; వెఱవక మీ మీ నివాసంబులకుం జనుండని యానతిచ్చిన నా దేవతలు నిర్భయాత్ములై యీశ్వరునకుం బ్రణామంబు లాచరించి త్రివిష్టపంబునకుం జనిరి; తదనంతరంబ. | 277 |
| సీ. |
హరి యీశ్వరుండు విహంగకులేశ్వరయానుఁడై నిజభృత్యుఁడైన ధ్రువునిఁ గనుఁగొను వేడుక జనియింప నా మధువనమున కప్పుడు సని ధ్రువుండు పరువడి యోగవిపాకతీవ్రంబైన బుద్ధిచే నిజమనోంబురుహముకుళ మందుఁదటిత్ప్రభాయతమూర్తి యటఁ దిరోధానంబునను నొంది తత్‌క్షణంబ |
|
| తే. |
తన పురోభాగమందు నిల్చినను బూర్వ, సమధికజ్ఞాననయనగోచరసమగ్ర మూర్తిఁ గనుఁగొని సంభ్రమమునను సమ్మ, దాశ్రువులు రాలఁ బులకీకృతాంగుఁ డగుచు. |
278 |