| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | చతుర్థస్కంధము |
| సీ. |
అని యిట్లు చింతించె ననుచు నమ్మైత్రేయముని విదురునకు నిట్లనియెఁ దండ్రి! కమనీయహరిపాదకమలరజో0000భిసంస్కృతశరీరులును యాదృచ్ఛికముగ సంప్రాప్తమగు దాన సంతుష్టచిత్తులై వఱలుచు నుండు మీ వంటి వారు దగ భగవత్పాదదాస్యంబు దక్కంగ నితర పదార్థంబు లెడఁదలందు |
|
| తే. |
మఱచియును గోర నొల్లరు మనుచరిత్ర!, తవిలి యిట్లు హరిప్రసాదంబు నొంది మరలి వచ్చుచు నున్న కుమారు వార్తఁ, జారుచే విని యుత్తానచరణుఁ డపుడు. |
301 |
| వ. | మనమున నిట్లని తలంచె. | 302 |
| క. |
చచ్చిన వారలు గ్రమ్మఱ, వచ్చుటయే కాక యిట్టి వార్తలు గలవే? నిచ్చలు నమంగళుఁడ నగు, నిచ్చట మఱి నాకు శుభము లేల ఘటించున్. |
303 |
| క. |
అని విశ్వసింపకుండియు, మనమున నా నారదుఁడు “గుమారుఁడు వేగం బునఁ రాఁగలఁ” డనుచును బలి, కిన పలుకులు దలఁచి నమ్మి కృతకృత్యుండై. |
304 |
| క. |
తన సుతుని రాక సెప్పిన, ఘనునకు ధనములును మౌక్తికపు హారములున్ మన మలర నిచ్చి తనయునిఁ, గనుఁగొను సంతోష మాత్మఁ గడలుకొనంగన్. |
305 |
| సీ. |
వలను మీఱిన సైంధవంబులఁ బూన్చిన కనకరథంబు నుత్కంఠ నెక్కి బ్రాహ్మణకులవృద్ధబంధుజనామాత్యపరివృతుం డగుచు విస్ఫురణ మెరసి బ్రహ్మనిర్ఘోషతూర్యస్వనశంఖకాహళవేణురవము లందంద చెలఁగ శిబిక లెక్కియు విభూషితలై సునీతి సురుచు, లుత్తముండు నారూఢి నడవఁ |
|
| తే. |
గరిమ దీపింప నతిశీఘ్రగమన మొప్ప, నాత్మనగరంబు వెలువడి యరుగుచుండి బలసి నగరోపవన సమీపంబునందు, వచ్చు ధ్రువుఁ గని మేదినీశ్వరుఁడు నంత. |
306 |
| చ. |
అరదము డిగ్గి ప్రేమ దొలఁకాడ ససంభ్రముఁడై రమామనో హరచరణారవిందయుగళార్చననిర్దళితాఖిలాఘు నీ శ్వరకరుణావలోకనసుజాతసమగ్రమనోరథున్ సుతుం గర మనురక్తి డాసి పులకల్ ననలొత్తఁబ్రమోదితాత్ముఁడై. |
307 |
| తే. |
బిగియఁగౌఁగిటఁజేర్చి నెమ్మొగము నిమిరి, శిరము మూర్కొని చుబుకంబు చేతఁబుణికి యవ్యయానందబాష్పధారాభిషిక్తుఁ, జేసి యాశీర్వదింప నా చిరయశుండు. |
308 |
| క. |
జనకుని యాశీర్వచనము, లనయముఁ గైకొని ప్రమోదియై తత్పదముల్ దన ఫాలతలము సోఁకఁగ, వినతులు గావించి భక్తివిహ్వలుఁ డగుచున్. |
309 |
| తే. |
అంత నా సజ్జనాగ్రణియైన ధ్రువుఁడు, దల్లులకు భక్తివినతులు దగ నొనర్చి సురుచికిని మ్రొక్క నర్భకుఁ జూచి యెత్తి, నగుమొగంబున నాలింగనంబు సేసి. |
310 |
| సీ. |
కరమొప్ప నానందగద్గదస్వరమున జీవింపు మనుచు నాశీర్వదించె; భగవంతుఁడెవ్వనిపై మైత్రి వాటించు సత్కృపానిరతిఁ బ్రసన్నుఁడగుచు నతనికిఁ దమయంత ననుకూలమై యుండు సర్వభూతంబులు సమతఁ బేర్చి; మహిఁ దలపోయ నిమ్నప్రదేశమునకు ననయంబుఁజేరు తోయములపగిదిఁ |
|
| తే. |
గాన ఘను న మ్మహాత్ముని గారవించె, సురుచి పూర్వంబు దలఁపక సుజనచరిత! విష్ణు భక్తులు ధరను బవిత్రు లగుట, వారి కలుగరు ధరణి నెవ్వారు మఱియు. |
311 |
| వ. | కావున నుత్తముండును ధ్రువుండును బ్రేమవిహ్వలు లగుచు నన్యోన్యాలింగితులై పులకాంకురాలం కృతశరీరులై యానందబాష్పముల నొప్పి; రంత సునీతియుం దన ప్రాణంబుల కంటెఁ బ్రియుండైన సుతు నుపగూహనంబు సేసి తదవయవస్పర్శనంబుచేత నానందంబు నొంది విగతశోక యయ్యె; నప్పుడు సంతోషబాష్పధారాసిక్తంబులై చనుఁబాలునుంగురిసె నంత. | 312 |
| సీ. |
ఉన్నతసంతోషముప్పతిల్లఁగఁ బౌర జనము లా ధ్రువుతల్లి నెనయఁ జూచి తొడరిన భవదీయదుఃఖనాశకుఁడైన యిట్టి తనూజుఁ డెందేని పెద్ద కాలంబు క్రిందటఁ గడఁగి నష్టుం డైన వాఁడిప్డు నీ భాగ్యవశము చేతఁ బ్రతిలబ్ధుఁ డయ్యెను; నితఁడు భూమండల మెల్లను రక్షించు నిద్ధమహిమఁ; |
|
| తే. |
గమలలోచనుఁ జింతించు ఘనులు లోక, దుర్జయం బైన యట్టి మృత్యువును గెల్తు; రట్టి ప్రణతార్తిహరుఁడైన యబ్జనాభుఁ, డర్థి నీచేతఁ బూజితుండగుట నిజము. |
313 |
| వ. | అని ప్రశంసించి, రట్లు పౌరజనంబులచేత నుపలాల్యమానుండగు ధ్రువుని నుత్తానపాదుం డుత్తమ సమేతంబుగా గజారూఢునింజేసి సంస్తూయమానుండును, ప్రహృష్టాంతరంగుండును నగుచు బురాభిముఖుండై చనుదెంచి. | 314 |
| సీ. |
స్వర్ణపరిచ్ఛదస్వచ్ఛకుడ్యద్వారలాలితగోపురాట్టాలకంబు ఫలపుష్పమంజరీకలితరంభాస్తంభపూగపోతాదివిభూషితంబు ఘనసారకస్తూరికాగంధజలబంధురాసిక్తవిపణిమార్గాంచితంబు మానితనవరత్నమయరంగవల్లీవిరాజితప్రతిగృహప్రాంగణంబు |
|
| తే. |
శుభనదీజలకుంభసంశోభితంబు, తండులస్వర్ణలాజాక్షతప్రసూన ఫలబలివ్రాతకలితవిభ్రాజితంబు, నగుచు సర్వతో0000లంకృత మైన పురము. |
315 |
| వ. | ప్రవేశించి రాజమార్గంబునఁ జనుదెంచు నప్పుడు. | 316 |
| మ. |
హరిమధ్యల్ పురకామినీతతులు సౌధాగ్రంబులందుండి భా స్వరసిద్ధార్థఫలాక్షతప్రసవదూర్వావ్రాతదధ్యంబువుల్ గరవల్లీమణిహేమకంకణఝణత్కారంబు శోభిల్లఁ జ ల్లిరి యా భాగవతోత్తమోత్తమునిపై లీలానుమేయంబుగన్. |
317 |
| వ. | ఇట్లు వాత్సల్యంబునం జల్లుచు సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచితమణి దీప నీరాజనంబుల నివాళింపం బౌరజానపదమిత్రామాత్యబంధుజనపరివృతుండై చనుదెంచి. | 318 |
| సీ. |
కాంచనమయమరకతకుడ్యమణిజాల సంచయరాజితసౌధములను వరసుధాఫేనపాండురరుక్మపరికరోదాత్త పరిచ్ఛదతల్పములను సురతరుశోభితశుకపికమిథునాళి గానవిభాసితోద్యానములను సుమహితవైదూర్యసోపానవిమల శోభితజలపూర్ణవాపీచయముల |
|
| తే. |
వికచకహ్లారదరదరవింద కైర, వ ప్రదీపితబకచక్రవాకరాజ హంససారసకారండవాదిజలవి, హంగనినదాభిరామపద్మాకరముల. |
319 |
| వ. | మఱియును. | 320 |
| తే. |
చారుబహువిధవస్తువిస్తార మొప్ప, నంగనాయుక్త మగుచుఁ బెంపగ్గలించి యర్థిఁ దనరారు జనకు గృహంబు సొచ్చె, నెలమిఁ ద్రిదివంబు సొచ్చు దేవేంద్రు పగిది |
321 |
| వ. | ఇట్లు ప్రవేశించిన రాజర్షియైన యుత్తానపాదుండు సుతుని యాశ్చర్యకరంబైన ప్రభావంబు వినియుం జూచియు మనంబున విస్మయంబు నొంది ప్రజానురక్తుండును బ్రజాసమ్మతుండును నవయౌవన పరిపూర్ణుండును నైన ధ్రువుని రాజ్యాభిషిక్తుంజేసి వృద్ధవయస్కుండైన తన్నుం దాన యెఱింగి యాత్మగతిఁ బొంద నిచ్ఛయించి విరక్తుండై వనంబునకుం జనియె; నంత నా ధ్రువుండు శింశుమార ప్రజాపతికూఁతురైన భ్రమి యనుదాని వివాహంబై దానివలనఁ గల్పవత్సరు లను నిద్దఱు గొడుకులం బడసి వెండియు వాయుపుత్రియైన యిల యను భార్య యందు నుత్కలనామకుండైన కొడుకు నతిమనోహర యైన కన్యారత్నంబును గనియె; నంతఁ దద్భ్రాతయైన యుత్తముండు వివాహంబు లేకుండి మృగయార్థంబు వనంబున కరిగి హిమవంతంబున యక్షుని చేత హతుం డయ్యె; నతని తల్లియుఁ దద్దుఃఖంబున వనంబున కేఁగి యందు గహన దహనంబున మృతిం బొందె; ధ్రువుండు భ్రాతృమరణంబు విని కోపామర్ష శోకవ్యాకులిత చిత్తుండై జైత్రంబను రథంబెక్కి యుత్తరాభిముఖుండై చని హిమవద్ద్రోణియందు భూతగణసేవితంబును గుహ్యకసంకులంబును నైన యలకాపురంబు వొడగని యమ్మహాబాహుండు. | 322 |