పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుండు స్తుతించుట
తే. నయనముల విభు మూర్తిఁ బానంబుసేయు, పగిదిఁ దన ముఖమునను జుంబనము సేయు
లీలఁ దగ భుజములను నాలింగనంబు, సేయుగతి దండవన్నమస్కృతు లొనర్చె.
279
వ. ఇట్లు దండప్రణామంబు లాచరించి కృతాంజలియై స్తోత్రంబు సేయ నిశ్చయించియు స్తుతిక్రియా సమర్థుండు గాక యున్న ధ్రువునకును సమస్తభూతంబులకు నంతర్యామి యైన యీశ్వరుం డాతని తలం పెఱింగి వేదమయంబయిన తన శంఖంబు చేత నబ్బాలుని కపోలతలం బంటిన జీవేశ్వరనిర్ణయజ్ఞుండును, భక్తిభావ నిష్ఠుండును నగు ధ్రువుండు నిఖిలలోకవిఖ్యాతకీర్తి గల యీశ్వరుని భగవత్ప్రతిపాదితంబు లగుచు వేదాత్మకంబులైన తన వాక్కుల నిట్లని స్తుతియించె; దేవా! నిఖిలశక్తి ధరుండవు, నంతఃప్రవిష్టుండవు నైన నీవు లీనంబు లైన మదీయవాక్యంబుల బ్రాణేంద్రియంబులం గరచరణ శ్రవణత్వగాదులను జిచ్ఛక్తిచేఁ గృపంజేసి జీవింపం జేసిన భగవంతుడవును, బరమపురుషుం డవును నైన నీకు నమస్కరింతు; నీ వొక్కరుండవయ్యు మహదాద్యంబైన యీ యశేషవిశ్వంబు మాయాఖ్యం బయిన యాత్మీయ శక్తిచేతం గల్పించి యందుం బ్రవేశించి యింద్రియంబు లందు వసించుచుఁ దత్తద్దేవతారూపంబులచే నానాప్రకారంబుల దారువులం దున్న వహ్ని చందంబునం బ్రకాశింతు వదియునుం గాక. 280
చ. వరమతి నార్తబాంధవ! భవద్ఘనబోధసమేతుఁడై భవ
చ్చరణముఁ బొంది నట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమం
దరయఁగఁ జూచురీతిఁ గనునట్టి ముముక్షు శరణ్యమైన నీ
చరణములం గృతజ్ఞుఁడగు, సజ్జనుఁ డెట్లు దలంప కుండెడున్‌.
281
సీ. మహితాత్మ! మఱి జన్మమరణప్రణాశన హేతుభూతుండవు నిద్ధకల్ప
తరువవు నగు నిన్నుఁదగ నెవ్వరే నేమి పూని నీ మాయావిమోహితాత్ము
లగుచు ధర్మార్థకామాదులకొఱకుఁ దా మర్పించుచును ద్రిగుణాభమైన
దేహోపభోగ్యమై దీపించు సుఖముల నెనయంగ మదిలోన నెంతు; రట్టి
 
తే. విషయసంబంధజన్యమై వెలయు సుఖము, వారికి నిరయమందును వఱలు దేవ!
భూరిసంసారతాపనివారగుణ క, థామృతాపూర్ణ! యీశ! మాధవ! ముకుంద!
282
మ. అరవిందోదర! తావకీనచరణధ్యానానురాగోల్లస
చ్చరితాకర్ణనజాతభూరిసుఖముల్‌ స్వానందకబ్రహ్మ మం
దరయన్‌ లే వఁట! దండభృద్ధతవిమానాకీర్ణులై కూలు నా
సురలోకస్థులఁజెప్పనేల సుజనస్తోమైకచింతామణీ!
283
చ. హరి! భజనీయమార్గనియతాత్మకులై భవదీయమూర్తిపై
వఱలిన భక్తియుక్తు లగువారల సంగతి గల్గఁజేయు స
త్పురుషసుసంగతిన్‌ వ్యసనదుస్తరసాగర మప్రయత్నతన్‌
సరసభవత్కథామృతరసంబున మత్తుఁడనై తరించెదన్‌?
284
చ. నిరతముఁ దావకీనభజనీయపదాబ్జసుగంధలబ్ధి యె
వ్వరి మది వొందఁగాఁ గలుగు, వారలు తత్ప్రియమర్త్యదేహము
న్నరయఁ దదీయదార తనయాదిసుహృద్గృహబంధువర్గమున్‌
మఱతురు విశ్వతోముఖ! రమాహృదయేశ! ముకుంద! మాధవా!
285
సీ. పరమాత్మ! మర్త్యసుపర్వతిర్యఙ్మృగ దితిజ సరీసృపద్విజగణాది
సంవ్యాప్తమును సదసద్విశేషంబును గైకొని మహదాదికారణంబు
నైన విరాడ్విగ్రహంబు నే నెఱుఁగుదుఁ గాని తక్కిన సుమంగళము నైన
సంతతసుమహితైశ్వర్యరూపంబును భూరిశబ్దాదివ్యాపారశూన్య
 
తే. మైన బ్రహ్మస్వరూప మే నాత్మ నెఱుఁగఁ, బ్రవిమలాకార! సంసారభయవిదూర!
పరమమునిగేయ! సంతతభాగధేయ!, నలిననేత్ర! రమాలలనాకళత్ర!
286
సీ. సర్వేశ! కల్పాంతసమయంబు నందు నీ యఖిలప్రపంచంబు నాహరించి
యనయంబు శేషసహాయుండవై శేషపర్యంకతలమునఁ బవ్వళించి
యోగనిద్రారతి నుండి నాభీసింధుజస్వర్ణలోకకంజాతగర్భ
మందుఁ జతుర్ముఖు నమరఁ బుట్టించుచు రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన
 
తే. నీకు మ్రొక్కెద నత్యంతనియమ మొప్ప, భవ్యచారిత్ర! పంకజపత్త్రనేత్ర!
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!, యవ్యయానంద! గోవింద! హరి ముకుంద!
287
వ. అట్లు యోగనిద్రాపరవశుండ వయ్యును జీవులకంటె నత్యంతవిలక్షణుండవై యుండుదు; వది యెట్లనిన బుద్ధ్యవస్థాభేదంబున నఖండితం బయిన స్వశక్తిం జేసి చూచు లోకపాలననిమిత్తంబు యజ్ఞాధిష్ఠాతవు గావున నీవు నిత్యముక్తుండవును, బరిశుద్ధుండవును, సర్వజ్ఞుండవును, నాత్మవును, గూటస్థుండవును, నాది పురుషుండవు, భగవంతుండవు, గుణత్రయాధీశ్వరుండవునునై వర్తింతువు; భాగ్యహీనుండైన జీవునియందు నీ గుణంబులు గలుగ; వే సర్వేశ్వరునం దేమి విరుద్ధగతులై వివిధశక్తి యుక్తంబులైన యవిద్యాదు లానుపూర్వ్యంబునం జేసి ప్రలీనంబు లగుచుండు నట్టి విశ్వకారణంబు నేకంబు ననంతంబు నాద్యంబు నానందమాత్రంబు నవికారంబు నగు బ్రహ్మంబునకు నమస్కరించెద; మఱియు దేవా! నీవ సర్వవిధఫలం బని చింతించు నిష్కాము లయిన వారికి రాజ్యాదికామితంబులలోనఁ బరమార్థం బయిన ఫలంబు సర్వార్థరూపుండవైన భవదీయపాదపద్మ సేవనంబ; యిట్లు నిశ్చితంబ యైనను సకాములైన దీనులను గోవు వత్సంబును స్తన్యపానంబు సేయించుచు వృకాదిభయంబువలన రక్షించు చందంబునం గామప్రదుండవై సంసారభయంబువలన బాపుదు వని యిట్లు సత్యసంకల్పుండును, సుజ్ఞానియు నయిన ధ్రువునిచేత వినుతింపంబడి భృత్యానురక్తుండైన భగవంతుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె. 288
క. ధీరవ్రత! రాజన్యకు, మారక! నీ హృదయమందు మసలిన కార్యం
బారూఢిగా నెఱుంగుదు, నారయ నది వొందరాని దైనను నిత్తున్‌.
289
వ. అది యెట్టి దనిన నెందేని మేధియందుఁ బరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలె గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబు లయిన ధర్మాగ్నికశ్యపశక్రులును, సప్తర్షులును, దారకాసమేతులై ప్రదక్షిణంబు దిరుగుచుండుదు; రట్టి దురాపంబును ననన్యాధిష్ఠితంబును లోకత్రయప్రళయకాలంబు నందు నశ్వరంబు గాక ప్రకాశమానంబును నయిన ధ్రువక్షితి యను పదంబు ముందట నరువది యాఱువేలేండ్లు సనం బ్రాపింతువు; తత్పదప్రాప్తిపర్యంతంబు భవదీయజనకుండు వనవాస గతుండైనం దద్రాజ్యంబు పూజ్యంబుగా ధర్మమార్గంబున జితేంద్రియుండవై చేయుదువు; భవదనుజుం డగు నుత్తముండు మృగయార్థంబు వనంబునకుం జని మృతుం డగుఁ; దదన్వేషణార్థంబు తదాహితచిత్తయై తన్మాతయు వనంబునకుం జని యందు దావదహననిమగ్నయగు; వెండియు, 290
సీ. అనఘాత్మ! మఱి నీవు యజ్ఞరూపుం డనఁ దగు నన్ను సంపూర్ణదక్షిణంబు
లగు మఖంబులచేత నర్చించి సత్యంబు లగు నిహసౌఖ్యంబు లనుభవించి
యంత్యకాలమున నన్నాత్మఁ దలంచుచు మఱి సర్వలోకనమస్కృతమును
మహిఁ బునరావృత్తిరహితంబు సప్తర్షిమండలోన్నత మగు మామకీన
 
తే. పదము దగఁ బొందఁగల వని పరమపురుషుఁ, డతని యభిలషితార్థంబు లర్థి నిచ్చి
యతఁడు గనుఁగొను చుండంగ నాత్మపురికి, గరుడగమనుఁడు వేంచేసెఁ గౌతుకమున.
291
తే. అంత ధ్రువుఁడునుఁ బంకేరుహాక్ష పాద, కమలసేవోపపాదితఘనమనోర
థములఁ దనరియుఁ దనదు చిత్తంబులోనఁ, దుష్టిఁ బొందక చనియె విశిష్టచరిత!
292
క. అని మైత్రేయుఁడు ధ్రువుఁ డ, ట్లనయము హరిచేఁ గృతార్థుఁ డైన విధం బె
ల్లను వినిపించిన విదురుఁడు, విని మునివరుఁ జూచి పలికె వినయం బెసఁగన్‌.
293
క. మునినాయక! విను కాముక, జనదుష్ప్రాపంబు విష్ణుచరణాంబురుహా
ర్చనమునిజనసంప్రాప్యము, ననఁగల పంకేరుహాక్షు నవ్యయపదమున్‌.
294
వ. పెక్కు జన్మంబులం గాని పొందరాని పదంబు దా నొక్కజన్మంబుననే పొందియుం దన మనంబునం దప్రాప్తమనోరథుండ నని పురుషార్థవేది యైన ధ్రువుం డెట్లు దలంచె ననిన మైత్రేయుం డిట్లనియె. 295
తే. అనఘ! పినతల్లి దన్నుఁ బల్కిన దురుక్తి, బాణవిద్ధాత్ముఁ డగుచుఁ దద్భాషణములు
చిత్తమందుఁ దలంచుటఁ జేసి ముక్తిఁ, గోరమికి నాత్మలో వగఁ గూరుచుండె.
296
వ. అంత నా ధ్రువుండు. 297
చ. అనఘ! జితేంద్రియుల్‌ సుమహితాత్ములు నైన సనందనాదు లెం
దనయ మనేకజన్మసముపార్జితయోగసమాధిఁజేసి యె
వ్వని చరణారవిందములు వారని భక్తి నెఱుంగుచుందు, రా
ఘనుఁ బరమేశు నీశు నవికారు నమేయు నజేయు నాద్యునిన్‌.
298
వ. ఏను షణ్మాసంబులు భజియించి తత్పాదపద్మచ్ఛాయం బ్రాపించియు భేదదర్శనుండ నైతి; నక్కటా! యిట్టి భాగ్యహీనుండనైన యేను భవనాశకుండైన యతనిం బొడఁగనియు నశ్వరంబులైన కామ్యంబు లడిగితి; నిట్టి దౌరాత్మ్యం బెందేనిం గలదే? తమ పదంబులకంటె నున్నత పదంబు నొందుదునో యని సహింపజాలని యీ దేవతలచేత మదీయ మతి గలుషితం బయ్యెంగాక! నాఁడు నారదుం డాడిన మాట తథ్యం బయ్యె; నతని వాక్యంబు లంగీకరింపక యే నసత్తముండనై స్వప్నావస్థలం బొందిన వాఁడు దైవికంబైన మాయం జెంది భిన్నదర్శనుండగు చందంబున నే నద్వితీయుండ నైనను భ్రాతయను శత్రువుచేఁ బ్రాప్తంబైన దుఃఖంబు నొంది జగదాత్మకుండును, సుప్రసాదుండును, భవనాశకుండును నైన యీశ్వరు నారాధించి తత్ప్రసాదంబు వడసియు నాయుర్విహీనుండైన రోగికిం బ్రయోగించు నౌషధంబుం బోలె నిరర్థకంబులైన, నశ్వరంబులైన యీ కామితంబులు గోరితి నని వెండియు. 299
మ. ధనహీనుండు నృపాలుఁ జేరి మిగులన్‌ ధాటిన్‌ ఫలీకార మి
మ్మని యర్థించిన రీతి ముక్తిఫలదుం డైనట్టి పంకేజలో
చనుఁడే చాలఁ బ్రసన్నుఁడైన నతనిన్‌ సాంసారికం బర్థిఁ గో
రిన నావంటి విమూఢమానసులు ధాత్రింగల్గిరే యెవ్వరున్‌?
300
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )