పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
ప్రృథు చక్రవర్తి గోరూపిణి యగు భూమివలన, నోషధులఁ బిదుకుట
సీ. ఏమి నిమిత్తమై భూమి గోరూపిణి యయ్యె? దానికి వత్స మయ్యె నెద్ది?
గొనకొని దోహనమునకు నర్హంబైన పాత్ర మెయ్యది? దలఁపంగ దోగ్ధ
యైన యా పృథు వే పదార్థముల్‌ పిదికెను? బరికింప నవని స్వభావమునను
విషమమై యుండియు వెలయంగ నే రీతి సమగతిఁజెందెను జంభవైరి?
 
తే. క్రతుహయంబును గొనిపోవఁగార్య మెద్ది?, ధీరనిధి యాతఁడు సనత్కుమారువలనఁ
గలితవిజ్ఞానుఁడగుచు నే గతిని బొందె?, ననఘచారిత్ర! మైత్రేయ! యదియుఁగాక.
467
వ. మఱియుఁ బరబ్రహ్మంబును భగవంతుండును బుణ్యశ్రవణకీర్తనుండును సర్వనియామకుండును నగు కృష్ణుని యవతారాంతరాశ్రయం బగు దివ్య కథలను భగవంతుండైన పుండరీకాక్షుండు పృథ్వవతారంబు ధరియించి గోరూపిణి యగు పృథివిం బిదికినది మొదలగు కథలన్నియు నీకు నధోక్షజునకు దాసుండనయిన నాకు నెఱింగింపు మనిన వాసుదేవ కథాసంప్రీత చేతస్కుండగు విదురుం బ్రశంసించి మైత్రేయుం డిట్లనియె, నట్లు బ్రాహ్మణ జనంబులచే రాజ్యంబునం దభిషిక్తుండై పృథువు రాజ్యంబు సేయుచుండు నంత నీరస యగు ధరిత్రియం దన్నరహితు లగుచుం బ్రజలు క్షుత్పీడా క్షీణదేహులై వైన్యునిం జూచి యిట్లనిరి. 468
క. అరయఁగ నేము బుభుక్షా, పరిపీడం బడితి మయ్య! పైకొని తరు కో
టరజనితవహ్నిచేతను, దరికొను వృక్షములఁబోలె ధరణీనాథా!
469
క. శరణశరణ్యుఁడ వగు నిను, శరణము వేఁడెదము మాకు సత్కృప నన్నం
బరసి కృపసేసి ప్రోవుము, నరనాయక! యనుచుఁబ్రజలు నతులై పలుకన్‌.
470
క. విని దానికి సదుపాయము, జననాయకుఁడాత్మఁదలఁచి సక్రోధుండై
ధనువున బాణముఁదొడిగెను, ఘనరౌద్రుండైన త్రిపురఘస్మరుపగిదిన్‌.
471
వ. ఇట్లు దొడిగిన. 472
క. మహిపతి నప్పుడు గనుఁగొని, మహి గోరూపమునఁ గంప్యమానయు నగుచుం
గుహకుండగు లుబ్ధకుఁగని, గహనంబునఁ బాఱు హరిణికైవడిఁ బాఱెన్‌.
473
వ. ఇట్లు ధరణి వాఱిన నతండు కుపితారుణేక్షణుండై వెంటఁ దగిలి దిక్కులను విదిక్కులను భూభాగ నభోభాగంబుల నెక్కడం జనియె, నక్కడికి వెనుదగిలి యుద్యతాయుధుండై చనుచుండ నవ్వైన్యునిం గని మృత్యు గ్రస్తులగు ప్రజల చందంబున ననన్య శరణ్యయై యతిభయంబునం బరితప్యమాన హృదయ యగుచు వైన్యా! ధర్మవత్సలుండవును, నాపన్న రక్షకుండవును, మహాత్ముండవును, సకల ప్రాణి పరిపాలనావస్థితుం డవును నయిన నీ వీ దీనయుం బాపరహితయుం గామినియు నగు నన్ను వధియింపం బూని యేల వెనుదగులుచున్న వాఁడవు? ధర్మతత్త్వం బెఱుంగువారు సతీజనంబులు గృతాపరాధలైనం దీనవత్సలతం జేసి వధింప రని పలికి మఱియు నా ధరణీదేవి పృథుచక్రవర్తి కిట్లనియె. 474
క. జననాథచంద్ర! యీ భూ, జనకోటికి యానపాత్రసదృశస్థితితో
ఘనదృఢశరీరయగు నే, ననయము నాధారభూత నగుచుఁ జరింతున్‌.
475
తే. ఇట్టి నన్నుఁగృపామతి యెడలి యిటు వి, పాటనము సేసి త్రుంచెదు? ప్రజలు నీట
మునుఁగకుండంగ నే రీతి ననఘచరిత!, యరసి రక్షింతు వన నతండవని కనియె.
476
వ. ధరిత్రీ! మదీయాజ్ఞోల్లంఘనంబు సేయు చున్నదాన! వదియునుంగాక నీవు యజ్ఞంబులందు హవిర్భాగంబుల ననుభవించుచు ధాన్యాదికంబుల విస్తరింపం జేయక గోరూపంబు ధరియించి యనయంబుఁ దృణ భక్షణంబు సేయుచుఁ బాలం బిదుకక నీయంద యడంచికొంటివి; నీ యందున్న యోషధీ బీజంబులు బ్రహ్మచేతం బూర్వంబునందె కల్పింపంబడినయవి, వానిని నీ దేహంబునంద యడంచికొని యిప్పుడీయక మూఢహృదయవు, మందమతివియునై యపరాధంబు చేసిన దురాత్మురాలవగు నిను నా బాణంబులచే జర్జరీభూత శరీరం జేసి వధియించి నీ మేని మాంసంబునం జేసి క్షుద్బాధితులు దీనులు నగు నీ ప్రజల యార్తి నివారించెద, నీవు కామిని నంటివి, స్త్రీ పురుష నపుంసకులలో నెవ్వరేని భూతదయ లేక స్వమాత్ర పోషకులగుచు నిరనుక్రోశంబుగ భూతద్రోహులై వర్తింతురు, వారిని రాజులు వధించినన్‌ వధంబు గాదు, గాన దానఁ బాపంబు వొరయదు, నీవు కామిని వైనను దుర్మదవు స్తబ్ధవు నగుచు మాయాగోరూపంబునం బాఱి పోవుచున్న నిన్నుఁ దిలలంతలు ఖండంబులు సేసి నా యోగ మహిమం బ్రాణికోటి నుద్ధరించెద నని పలికి రోషభీషణాకారంబు ధరియించి దండధరుని వడువున వర్తించు పృథునింజూచి వడంకుచు మేదిని ప్రాంజలియై యిట్లని నుతింపందొడంగె. 477
క. ఓ నాథ! పరమపురుషుఁడ, వై నిజమాయాగుణంబు లందినకతనన్‌  
వ. అట్టి నీవు. 479
క. నను సకలజీవతతికిని, మును నీ వాధారభూతముగ నిర్మింపన్‌,
విను నాయందుఁ జతుర్విధ, ఘనభూతవిసర్గ మర్థిఁ గైకొనవలసెన్‌.
480
వ. అట్లయి యుండ. 481
క. నను నుద్యతాయుధుఁడవై, మనుజేంద్ర! వధింపఁబూని మసలెదు, నీకం
టెను నన్యుని నెవ్వని నే, ఘనముగ శరణంబు సొత్తుఁగరుణాభరణా!
482
వ. అదియునుంగాక. 483
సీ. అనఘ! స్వకీయంబునై యతర్కితమునై మహిమ నొప్పిన భవన్మాయచేత
సకలచరాచరసర్గంబు నిర్మించి ధర్మపరుండవై తనరు దీశ!
నీ విక్రమము నవనీరజలోచన! సకలలోకులకు దుర్జయము; దలఁపఁ
దగు నట్టి నీవు స్వతంత్రుఁడ వగుటను బ్రహ్మఁబుట్టించి యా బ్రహ్మచేత
 
తే. సకలజగములఁజేయింతు సమతఁ బేర్చి, యేక మయ్యు మహాత్మ! యనేకవిధము
లగుచు వెలుఁగొందు చుందు వీ యఖిలమందుఁ, జారుతరమూర్తి! యో పృథుచక్రవర్తి!
484
వ. మఱియు మహాభూతేంద్రియకారక చేతనాహంకారంబులను శక్తులం జేసి యీ జగంబుల కుత్పత్తి స్థితిలయంబులం గావించుచు సముత్కట విరుద్ధ శక్తులు గల పురుషునకు నమస్కరించెద, నట్టి పరమపురుషుండ వయిన నీవు నిజనిర్మితంబును భూతేంద్రియాంతఃకరణాత్మకంబును నైన యీ విశ్వంబు సంస్థాపింపంబూని. 485
సీ. ఆదివరాహంబ వగుచు రసాతలగతనైన నన్ను నక్కటికతోడ
నుద్ధరించితి, వట్టి యుదకాగ్రభాగంబు నం దర్థి నున్న నే ననెడి నావ
యందున్న నిఖిలప్రజావళి రక్షింపఁ గోరి యీ పృథురూపధారి వైతి,
వట్టి భూభరణుండ వైన నీ విపుడు పయోనిమిత్తంబుగా నుగ్రచరుఁడ
 
తే. వగుచు నన్ను వధించెద ననుచు బుద్ధిఁ, దలఁచుచున్నాఁడ, విది విచిత్రంబుగాదె!
విశ్వసంపాద్య! నిరవద్య! వేదవేద్య!, భవ్య గుణసాంద్ర! వైన్య భూపాలచంద్ర!
486
వ. కావున నీశ్వరగుణ సర్గరూపంబైన మాయచే మోహితాంతఃకరణులమైన మా వంటి వారలచేత హరిభక్తుల చేష్టితం బెఱుంగఁ బడదన్న హరిచేష్టితం బెట్లెఱుంగంబడు? నట్టి జితేంద్రియ యశస్కరు లయిన వారలకు నమస్కరింతు ననుచు నవ్విధంబునం గోపప్రస్ఫురితాధరుండైన పృథుని నభినుతించి ధైర్యం బవలంబించి వెండియు నిట్లనియె. 487
క. విమలాత్మ! నాకు నభయము, సమకూరెడు నట్లుగాఁగ సన్మతి నీ క్రో
ధము నుపశమించి కరుణిం, పుము నా విన్నపము వినుము పురుషనిధానా!
488
క. ధర విరులు గందకుండఁగ, సరసగతింబూవుఁదేనెఁజవిగొను నిందిం
దిరవిభు కైవడి బుధుఁడగు, పురుషుఁడు సారాంశ మాత్మఁబూని గ్రహించున్‌.
489
సీ. వినవయ్య! తత్త్వదర్శనులైన యట్టి స న్మునులచే నైహికాముష్మికంబు
లైన ఫలప్రాప్తి కర్థిఁ గృష్యాద్యగ్ని హోత్రాద్యుపాయంబు లుర్విమీఁద
దృష్టంబులును నాచరితములు నగుచుఁ దా నెనయంగఁ దదుపాయ మెవ్వఁడాచ
రించును వాఁడు ప్రాపించుఁదత్ఫలమును విద్వాంసుఁడైనను వెలయ దీని
 
తే. నాదరింపక తనయంత నాచరించె, నేని నాయాసమే యగుఁ గాని తత్ఫ
లమును బొందఁడు బహుళకాలమునకైన, వినుతగుణశీల! మాటలు వేయునేల?
490
వ. అని మఱియు మహి యిట్లనియె. 491
చ. జలరుహగర్భుచేత మును చాల సృజింపఁగఁబడ్డ యోషధుల్‌
కలుషమతిన్‌ ధృతవ్రతులు గాని యసజ్జనభుజ్యమానమై
వెలయుటఁజూచి యే నృపతివీరులు మాన్పమిఁజోరబాధలం
బలుమఱుఁబొంది యే నపరిపాలితనై కృశియించి వెండియున్‌.
492
క. అనుపమమఖకర్మక్రియ, లనయము లేకుంట నే ననాదృత నగుచున్‌
జననాయక! యీ లోకము, ఘనచోరీభూత మగుటఁ గనుఁగొని యంతన్‌.
493
క. సవనాదిసిద్ధికొఱకై, తవిలి తదీయౌషధీవితతులను ధరణీ
ధవ! యే నపుడు గ్రసించితి, నవియును నాయందు జీర్ణమయ్యెఁగడంకన్‌.
494
క. విను వాని నొక యుపాయం, బునఁ గ్రమ్మఱఁబడయవచ్చు భూవరచంద్రా!
విను మది యెఱిఁగించెద నీ, కును వత్సలురాల నగుట గురుతరచరితా!
495
క. అనయము నా కొక వత్సము, ననురూపసుదోహనమ్ము ననురూపక దో
గ్ధను గల్పింపుమ యట్లయి, నను నీ భూతముల కవనినాయక! దానన్‌.
496
క. పరఁగ నభీప్సితములు బల, కరములు నగు, నన్నదుగ్ధకలితము లగు భా
సురకామంబులఁ బిదికెద, నరనాయక చంద్ర! వినుము నా వచనంబుల్‌.
497
చ. మనుజవరేణ్య! యేను విషమస్థలినై యిపు డున్నదాన, నొ
య్యన జలదాగమోదితపయఃప్రకరంబు తదాగమంబు వో
యినను దదంబువుల్‌ పుడమి నింకక యంతట నిల్చునట్లుగా
మనునిభ! నన్ను నిప్పుడు సమస్థలినై పెనుపొందఁజేయవే.
498
క. అని యి వ్విధమున నా భూ, వనితామణి వలుకు మధురవచనంబులు దా
విని యనురాగము దన మన, మునఁగడలుకొనంగ రాజముఖ్యుండంతన్‌.
499
చ. మనువును దూడఁజేసి గరిమన్‌ నిజపాణితలంబు లీల దో
హనముగఁజేసి యందు సకలౌషధులంబిదికెంగ్రమంబునం
దనరఁగఁదద్విధంబునను దత్పృథువత్సల యైన భూమియం
దనయము వారువారును బ్రియంబగు కోర్కులు వొంది రున్నతిన్‌.
500
సీ. బలసి ఋషుల్‌ బృహస్పతి వత్సకంబుగా నర్థించి తమయింద్రియంబులందు
నంచిత చ్ఛందోమయ క్షీరమున దేవతలు సురరాజు వత్సంబు గాఁగఁ
గనక పాత్రమునందుఁ దనరు నోజోబల వీర్యామృతంబునై వెలయు పయసు
దైత్య దానవులు దైత్య శ్రేష్ఠుఁడగు గుణశాలిఁ బ్రహ్లాదు వత్సంబుఁ జేసి
 
తే. ఘన సురాసవరూప దుగ్ధంబు వరుస, నప్సరోజన గంధర్వు లలరి యపుడు
దనర విశ్వావసును వత్సమునుగఁ జేసి, పద్మమయ నిర్మితంబైన పాత్రమందు.
501
వ. మాధుర్య సౌందర్య సహిత గాంధర్వక్షీరంబును బితృదేవతలు సూర్యవత్సకంబుగా నామ పాత్రంబునందుఁ గవ్యంబును దుగ్ధంబును, సిద్ధులు గపిలవత్సకంబుగా నాకాశపాత్రమందు సంకల్పనా రూపాణిమాది సిద్ధియను క్షీరంబును, విద్యాధరాదులు తద్వత్సకంబును తత్పాత్రకంబునుగా ఖేచరత్వాదివిద్యా వ్యాపారరూప క్షీరంబును, గింపురుషాదులు మయవత్సకంబును నాత్మ పాత్రంబునుంగా సంకల్పమాత్ర ప్రభవంబును నంతర్ధానాద్భుతాత్మ సంబంధియు నగు మాయయను క్షీరంబును, యక్షరక్షోభూత పిశాచంబులు భూతేశ వత్సకంబుగాఁ గపాల పాత్రకంబునుగా రుధిరాసవంబను క్షీరంబును, నహిదందశూక సర్పనాగంబులు దక్షకవత్సంబును బిలపాత్రంబునుంగా విషరూపక్షీరంబును, బశువులు గోవృషవత్సకంబు నరణ్య పాత్రంబునుంగాఁ దృణంబును క్షీరంబును, గ్రవ్యాద మృగంబులు మృగేంద్ర వత్సకంబును నాత్మకళేబర పాత్రంబునుంగాఁ గ్రవ్యంబను దుగ్ధంబును, విహంగంబులు సుపర్ణవత్సకంబు నిజకాయ పాత్రంబునుంగాఁ గీటకఫలాదికంబను దుగ్ధంబును, వనస్పతులు వటవత్సకంబుగా భిన్నరోహరూప పయస్సును, గిరులు హిమవద్వత్సకంబును నిజసాను పాత్రకంబునుంగా నానాధాతువులను దుగ్ధంబునుంగా నవ్విధంబున సమస్తచరాచర వర్గంబు స్వముఖ్యవత్సకంబును స్వస్వపాత్రకంబునుంగా భిన్నరూపంబులైన క్షీరంబులం బిదికె నని చెప్పి మఱియును. 502
క. క్రమమున నిటు పృథ్వాదులు, దమతమ కామితము లనఁగఁదగు భిన్న క్షీ
రము దోహనవత్సక భే, దమునం దగఁబిదికి, రంత ధరణీధవుఁడున్‌.
503
తే. సముచితానందమును బొంది సర్వకామ, దుఘ యనందగు భూమిని దుహిత గాఁగఁ
గోరి కైకొని నిజధనుఃకోటిచేత, భూరిగిరికూటములఁ జూర్ణములుగఁజేసి.
504
తే. చండదోర్దండలీల భూమండలంబు, సమతలంబుగఁ జేసి శశ్వత్ప్రసిద్ధి
నొంది య వ్విభుఁడీ లోకమందు నెల్ల, బ్రజకుఁదండ్రియు జీవనప్రదుఁడు నగుచు.
505
తే. అక్కడక్కడఁ బూర్వంబునందు లేని, గ్రామపట్టణదుర్గఖర్వటపుళింద
ఖేటశబరాలయవ్రజవాటఘోష, వివిధనిలయము లర్థిఁగావించె నంత.
506
క. వారును భయవిరహితులై, బోరనఁ దత్తన్నివాసముల యందు సుఖ
శ్రీరుచి నొప్పుచు నుండిరి, వారక యా పృథునిఁ బొగడ వశమె ధరిత్రిన్‌?
507
సీ. అని చెప్పి మునినాథుఁడైన మైత్రేయుఁ డవ్విదురున కిట్లను వేడ్కతోడ
ననఘాత్మ! రాజర్షి యైన వైన్యుండశ్వమేధశతంబు సన్మేధతోడఁ
గావింతు నని దీక్ష గైకొని వ్రతనిష్ఠఁ దివిరి బ్రహ్మావర్తదేశమందు
నలరు మనుక్షేత్ర మందు సరస్వతీ నది పొంతఁదా మహోన్నతి నొనర్చు
 
తే. సవనకర్మక్రియకు నతిశయవిశేషఫలము గలిగెడి నని బుద్ధిఁదలఁచి యచట,
వరుసఁగావించు నతిశయాధ్వర మహోత్స, వము సహింపక యుండె న య్యమరవిభుఁడు.
508
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )