| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | చతుర్థస్కంధము |
| సీ. |
అట్టి యధ్వరకర్మమందు సాక్షాద్భగవంతుఁడు హరి రమేశ్వరుఁడు లోక గురుఁడును సర్వాత్మకుండును విభుఁడును నీరజభవభవాన్వితుఁడు లోక పాలకనిఖిలసుపర్వానుగుండును యజ్ఞాంగుఁడఖిలాధ్వరాదివిభుఁడు గంధర్వమునిసిద్ధగణసాధ్యవిద్యాధరాప్సరో దైత్య గుహ్యాళి దాన |
|
| తే. |
వాది జేగీయమానుఁ డత్యలఘుయశుఁడు, ప్రకటనందసునందాదిపార్షదుండు కపిలనారదసనకాదికప్రముఖ్య, మహితయోగీంద్రసంస్తూయమానుఁడజుఁడు. |
509 |
| వ. | మఱియుం బరమ భాగవత సేవితుండును నారాయణాంశ ప్రభవుండును నైన పృథు చక్రవర్తికి భూమి హవిరాదిదోగ్ధ్రియయ్యును సర్వకామదుఘయై సమస్త పదార్థంబులం బిదుకుచుండె, మఱియుఁ దరువులు ఘనతరాకారంబులు గలిగి మకరందస్రావు లగుచు నిక్షుద్రాక్షాది రసంబులును దధిక్షీరాజ్య తక్ర పానకాదికంబులును వర్షింప నవి యెల్ల నదులు వహించె, సముద్రంబులు హీరాది రత్న విశేషంబుల నీనుచుండెఁ, బర్వతంబులు భక్ష్యభోజ్యలేహ్య చోష్యంబు లను చతుర్విధాన్నంబులం గురియుచుండె, లోకపాల సమేతులైన సకలజనంబులు నుపాయనంబులు దెచ్చి యిచ్చుచుండి, రట్టి పరిపూర్ణ విభవాభిరాముండై యధోక్షజ సేవాపరాయణుండగు పృథు చక్రవర్తి యేకోన శతాశ్వమేధంబులు సన్మేధంబునం గావించి నూఱవయాగంబు నందు యజ్ఞపతి యైన పుండరీకాక్షుని యజించుచుండం దదీయ పరమోత్సవంబు సహింపంజాలక. | 510 |
| క. |
అమరేంద్రుఁడు ఘనరోషో, ద్గముఁడై పాషండ వేషకలిత తిరో భా వమునం దన్మఖపశువుం, గ్రమ మేది హరించి చనియె గగనంబునకున్. |
511 |
| వ. | అట్లు సనునప్పుడు. | 512 |
| క. |
అనఘుండగు నత్రి మహా, మునిచోదితుఁడగుచుఁబృథుని పుత్రుఁడు బాణా సనతూణీరధరుండై, యనిమిషపతి వెనుకఁజనియె నతిదర్పమునన్. |
513 |
| వ. | అట్లు సని చని ముందట. | 514 |
| సీ. |
యజ్ఞసాధనపశుహరణుని వధియించు ధర్మంబునందు నధర్మమనెడి బుద్ధిఁబుట్టఁగఁజేయ భూరి మాయావేషధారియై యరుగు సుత్రాముఁగదిసి నిలు నిలు మని యార్చి నిజగుణధ్వని సేసి ఘనజటాభస్మాస్థికలిత మయిన మూర్తిఁగనుంగొని మూర్తీభవించిన ధర్మంబ కా బుద్ధిఁదలఁచి యమర |
|
| తే. |
నాయకునిమీఁద సాయక మేయఁజాల, కున్నఁగనుఁగొని యత్రి విద్వన్నుతుండు వైన్యజున కనె వాసవువలను సూపి, మనములోపల రోషంబు మల్లడింప. |
515 |
| క. |
విను మితఁడు యజ్ఞహంతయు, ననిమిషనికరాధముండు నగు నింద్రుఁడు గా వున నితని జయింపుము నీ, వని ముమ్మా ఱుచ్చరింప నవ్వైన్యజుఁడున్. |
516 |
| మ. |
వినువీథింజను దేవవల్లభునిపై వీరుండు గ్రోధాంతరం గ నిరూఢిన్ మృగరాట్కిశోరము మహాగంధద్విపేంద్రంబు మీఁ దను లంఘించువిధంబునంబడిన నాతండశ్వచౌర్యైక సా ధనరూపంబుఁదదశ్వమున్ విడిచి యంతర్ధానముంబొందినన్. |
517 |
| క. |
వీరుఁడు పృథుభూపాల కు, మారుఁడు నిజయజ్ఞపశువు మరలం గొని దు ర్వారబలుఁ డగుచు జనకుని, భూరి సవనరాజపుణ్యభూమికి వచ్చెన్. |
518 |
| వ. | అయ్యవసరంబున నచ్చట నున్న పరమర్షిపుంగవు లతని యద్భుత కర్మంబు గనుంగొని యాశ్చర్యంబు నొంది యతనికి జితాశ్వుండను నన్వర్థనామంబు వెట్టియున్న సమయంబున. | 519 |
| చ. |
మఱియును దేవతాపతి తమఃపటలంబు జనింపఁజేసి యె వ్వరుఁదనుఁగానకుండ ననివారణఁగాంచనపాశబద్ధమై సురుచిరయూపదారుపరిశోభితమైన హయంబుఁగొంచుఁజె చ్చెర వినువీథి నేగఁగ ఋషిప్రవరుండగు నత్రి సెప్పినన్. |
520 |
| క. |
విని పృథుభూవరతనయుఁడు, ఘనబలమునఁజని కపాలఖట్వాంగము లో లిని ధరియించి రయంబునఁ, జను నింద్రునిఁగాంచి నొంపఁజాలక యంతన్. |
521 |
| ఉ. |
క్రమ్మఱ నత్రిచేఁదెలుపఁగాఁబడి వైన్యతనూభవుండు రో షమ్మునఁదోఁకఁద్రొక్కిన భుజంగమపుంగవుఁబోలి యుగ్రుఁడై యమ్మరిఁబోసినంగని సురాధిపుఁడెప్పటియట్లఁబాఱె న శ్వమ్మును రూపమున్ విడిచి చాలఁదిరోహితుఁడై రయంబునన్. |
522 |
| వ. | అట్లు సనినంబశువుంగొని మరలి య వ్వీరోత్తముండు పితృయజ్ఞశాలకుంజనుదెంచె నంత. | 523 |
| సీ. |
హరిహయుండధ్వరహయహరణార్థమై మించి కైకొని విసర్జించినట్టి భూరి యమంగళభూతమాయారూపములను ధరించిరి మూఢజనులు, పాషండచిహ్నముల్ పరఁగుట వారలు జగతిపై నగ్నవేషములు గలుగు జైనులు భూరికాషాయవస్త్రంబులు ధరియించు బౌద్ధులుదగ జటాస్థి |
|
| తే. |
భస్మధారులు నయిన కాపాలికాదు, లనఁగ వెలసిరి లోకంబులందుఁజాలఁ దలఁప ధర్మోపమంబనఁదగు నధర్మ, మందు నభిరతి వొడమిన యజ్ఞజనులు. |
524 |
| వ. | తదీయ చిహ్నంబులు పారంపర్యంబుగా ధరియింపం దొడంగిరి, తద్వృత్తాంతంబు భగవంతుం డయిన పృథుచక్రవర్తి యెఱింగి కుపితుండై యుద్యతకార్ముకుండగుచు నింద్రునిమీఁద బాణంబు నేయ నుద్యమించిన ఋత్విక్కులు శక్రవధోద్యుక్తుండు నసహ్యరంహుండు నయిన పృథుచక్రవర్తింగనుంగొని యిట్లనిరి. | 525 |
| క. |
జననాయక! యజ్ఞములం, దనుపమవిధిచోదితంబు లనఁదగు పశు బం ధనహింసల కా కితరుల, ఘనదీక్షితునకు వధింపఁగాదండ్రు బుధుల్. |
526 |
| వ. | కావున నీ విపు డింద్రవధోద్యోగంబుపసంహరింపుము, భవదీయధర్మవిరోధియైన యింద్రుని. | 527 |
| క. |
జనపాల! వీర్యవంతము, లనఁదగు మంత్రములచేత నాహ్వానము సే సిన నతఁడిచటికి వచ్చును, జనుదెంచిన యమరవిభుని సరభసతఁదగన్. |
528 |
| క. |
ధృతి సెదరఁబట్టి శిఖి కా, హుతిఁగా వేల్చెదము, దాన నుర్వీవర! నీ వితతమహోహత వీర్యో, న్నతుఁడై చెడిపోవు నమరనాథుండంతన్. |
529 |
| వ. | అని పృథుని వారించి ఋత్విగ్జనంబులు గుపితస్వాంతులై హస్తంబుల స్రుక్స్రువంబులు ధరియించి వేల్చు సమయంబునం జతుర్ముఖుండు సనుదెంచి ఋత్విజులం గనుంగొని యిట్లనియె; యజ్ఞంబులందు యజింపంబడు దేవత లెవ్వని యంశంబు, లెవ్వండు యజ్ఞనామకంబగు భగవదంశంబగు, నట్టి యింద్రుండు మీచేత వధార్హుండుగాఁ డితండు భగవదంశసంభవుం డగుట నీ యజ్ఞకర్మ విధ్వంసనేచ్ఛుండయి కావించు ధర్మ వ్యతికరంబులు సూచుచుండ వలయుంగాని ప్రతీకారంబులు గర్తవ్యంబులుగా, వీ పృథుకీర్తియగు పృథునకు నేకోనశతంబగు నధ్వర ప్రయోగ ఫలంబు సిద్ధించుం గాక యని పృథుచక్రవర్తి కిట్లనియె. | 530 |
| సీ. |
మనుజేంద్ర! మోక్షధర్మము నెఱింగిన నీకు సవనముల్ సేయుట సాలు మఱియు నే విధంబుననైన దేవేంద్రు మనమునఁ గై కొని రోషంబు గదురకుండ వర్తింపవలయును, వాసవుండును నీవుఁ బూని సుశ్లోకులు గాన మీకు మంగళంబగుఁగాక! మానవనాథ! నీ చిత్తంబులోపలఁజింతఁదొఱఁగి |
|
| తే. |
మించి మద్వాక్యముల నాదరించి వినుము, దైవహతమగు యజ్ఞంబుఁదగిలి చేయు కొఱకు భవదీయచిత్తంబు గుంది రోష, కలుషితంబైన నజ్ఞానకలిత మగును. |
531 |
| వ. | భవదీయ యజ్ఞహననార్థం బశ్వహరణుండైన యింద్రుండు దేవతలలోనన్ దురాగ్రహుం డగుటం జేసి యతనిచేత నిర్మింపంబడి చిత్తాకర్షకంబులైన యీ పాషండ ధర్మంబులచేత ధర్మ వ్యతికరంబు కలుగుం గాన యీ యజ్ఞంబు సాలింపుమని మఱియు నిట్లనియె. | 532 |
| సీ. |
అది గాక వినుము వేనాపచారంబునఁ బూని విలుప్తంబు లైన యట్టి యలఘు నానాసమయానుధర్మంబులఁ బరిపాలనము సేయఁబరఁగి వేను దేహంబువలనను దివిరి జనించి యున్నాఁడవు, నారాయణాంశజుఁడవు, గావున నీ నరకలితలోకంబునఁ బుట్టిన తెఱఁగు నీ బుద్ధిఁదలఁచి |
|
| తె. |
యెవరిచే నేమిటికి సృజియింపఁబడితి, వట్టి యా బ్రహ్మసంకల్ప మవనినాథ! తప్పకుండంగఁ బాలింపు ధర్మగతిని, జారుశుభమూర్తి! యో పృథుచక్రవర్తి! |
533 |
| వ. | అని మఱియు నిట్లనియె; నుపధర్మ మాతయుం బ్రచండ పాషండ మార్గంబు నైన యీ యింద్రకృతం బగు మాయను జయింపుమని వనజసంభవుండానతిచ్చినం బృథుచక్రవర్తియు దదాజ్ఞాపితుండై దేవేంద్రునితోడ బద్ధ సఖ్యుండయ్యె; నంత నవభృథానంతరంబున. | 534 |
| చ. |
సురుచిరలబ్ధదక్షిణల సొంపునఁ బొంపిరివోయి భూసురుల్ వరుసను బెక్కు దీవన లవారణ నిచ్చిరి, సర్వదేవతల్ భరితముదంతరంగములఁ బాయని వేడ్క వరంబు లిచ్చి రా నరవరుఁడైన వైన్యునకు నందితకీర్తికిఁ బుణ్యమూర్తికిన్. |
535 |
| వ. | అంత నచటి జనంబు లిట్లనిరి. | 536 |
| తే. |
అనఘ! నీ చేత నాదృతులైరి సర్వ, జనులు మఱి దానమానోపచారములను బితృసుదేవర్షిమానవవితతి పూజ, నొంది యంచితమోదంబు నొందె నయ్య! |
537 |