పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
నారాయణుండు ప్రసన్నుండై పృథు చక్రవర్తి ననుగ్రహించుట
వ. అని పలుకు సమయంబున యజ్ఞభోక్తయు యజ్ఞవిభుండును భగవంతుండునైన సర్వేశ్వరుం డింద్రసమేతుండై యచ్చటికిం జనుదెంచి యా పృథున కిట్లనియె. 538
క. జనవర! భవదీయంబై, జననుతమగు నశ్వమేధశతమున కిపు డీ
యనిమిషపతి భంగము సే, సినకతన క్షమాపణంబు సేసెడిఁగంటే!
539
వ. కావున నితని క్షమింపుము, సత్పురుషులగువారు దేహాభిమానులు గాకుండుటం జేసి భూతంబులయెడ ద్రోహం బాచరింప, రట్లగుటం జేసి నీవంటి మహాత్ములు దేవమాయా మోహితులై పరోపతాపంబులు సేసిరేని దీర్ఘతరంబైన వృద్ధజన సేవ వ్యర్థంబు గాదె! యదియునుం గాక యీ శరీరం బవిద్యాకామ కర్మంబుల చేత నారబ్ధం బని తెలిసిన భూతద్రోహి గాని పరమజ్ఞాని యీ దేహంబునందు ననుషక్తుండు గాకుండుట సహజం బన, దేహోత్పాదితంబులైన గృహదారాదులయందు మమత్వంబు లేకుండుటం జెప్పనేల? యిట్టి దేహంబునందున్న యాత్మ యేకంబును, శుద్ధ స్వరూపంబును, స్వయంజ్యోతియు నిర్గుణంబును, గుణాశ్రయంబును, వ్యాప్య వ్యాపకంబును, నసంవృతంబును, సాక్షిభూతంబును, నిరాత్మంబును నగు, దీని దేహంబుకంటె వేఱుగా నెవ్వండు దెలియు వాఁడు మత్పరుం డగుటం జేసి దేహధారియై యుండియుఁ దద్గుణంబులం బొరయక వర్తించు. మఱియు నెవ్వండేని స్వధర్మాచార పరుండును, నిష్కాముండును, శ్రద్ధాయుక్తుండునై నన్నెల్లప్పుడు భజియించు నట్టివాని మనంబు క్రమంబునఁ బ్రసన్నంబగు, నట్లు ప్రసన్న మనస్కుండును, ద్రిగుణాతీతుండును సమ్యగ్దర్శనుండును నైన యతండు మదీయ సమవస్థాన రూపశాంతి నొందు, నదియు కైవల్యపదం బనంబడుఁ, గూటస్థంబైన యీ యాత్మ యుదాసీనభూతం బైనను దీని ద్రవ్యజ్ఞాన క్రియా మనంబులకు నీశ్వరుంగా నెవ్వండు దెలియు, వాఁడు భవంబు నొందకుండు,నీ సంసారంబు ద్రవ్య క్రియాకారక చేతనాత్మకం బగుటం జేసి ప్రభిన్న దేహోపాధికంబు గావునఁ బ్రాప్తంబు లైన యాపత్సంపదలయందు మత్పరులైన మహాత్ములు వికారంబు నొందరు, గావున నీవు సుఖదుఃఖంబుల యందు సమచిత్తుండవును, సమానోత్తమ మధ్యమాధ ముండవును, జితేంద్రియాశయుండవునై వినిష్పాది తాఖిలామాత్యాది సంయుతుండవై, యఖిలలోక రక్షణంబు సేయు మని వెండియు నిట్లనియె. 540
సీ. పార్థివోత్తములకుఁబ్రజల రక్షించుట పరమధర్మం బగు నరవరేణ్య!
ధరణీశులకుఁ బ్రజాపరిపాలనంబునఁబూని లోకులు సేయు పుణ్యమందు
షష్ఠాంశమర్థిని సంప్రాప్తమగునట్లు ప్రజలఁబ్రోవని రాజు ప్రజలచేత
నపహృతసత్పుణ్యుఁడై వారు గావించు ఘనపాపఫలముఁ దా ననుభవించుఁ
 
తే. గాన నీవును విప్రవరానుమతము, సంప్రదాయకవిధమునై జరుగు ధర్మ
మహిమఁజేపట్టి యర్థకామములయందు, సమత నమ్మూఁటియందు నాసక్తి లేక.
541
వ. ఇవ్విధంబున. 542
క. జనులకు ననురక్తుఁడవై, జననాయక! నీవు ధరణి సమచిత్తుఁడవై
యనయముఁబరిపాలించిన, సనకాదులఁగాంతు వాత్మసదనమునందున్‌.
543
సీ. భూవర! యోగతపోమఖంబుల చేతఁ, గై కొని సులభుండఁ గాని యేను
సమచిత్తులైన సజ్జనుల చిత్తంబుల, వర్తించుచుండెడివాఁడ నగుటఁ
జేసి తావకశమశీలవిమత్సర, కీర్తనముల వశీకృతుఁడ నైతి;
నే నీకు నొక వరం బిచ్చెద వేఁడుము, నావుడు విని మేదినీవరుండు
 
తే. లోకగురుఁడైన యప్పుండరీకనయనుఁ, డానతిచ్చిన మృదులలితామృతోప
మాన వాక్యము లాత్మీయమస్తకమునఁ, దాల్చి సమ్మోదితాత్ముఁడై ధరణివిభుఁడు,
544
క. తన పాదములకు భక్తిన్‌, వినతుండై యాత్మకర్మ వితతికి లజ్జం
దనరుచు నున్న సురేంద్రుని, గనుఁగొని సత్ప్రేమ మొదవఁగౌఁగిటఁజేర్చెన్‌.
545
వ. ఇట్లు గౌఁగిటంజేర్చి గతద్వేషుండై యున్న యనంతరంబ. 546
మ. భగవంతుండును విశ్వరూపకుఁడునై భాసిల్లు నవ్విష్ణుఁ డా
జగతీనాథకృతార్చనా నతులచే సంప్రీతచేతస్కుఁడున్‌
నిగృహీతాంఘ్రిసరోరుహద్వయుఁడునై నిల్చెంబ్రయాణాభి ము
ఖ్యగరిష్ఠాత్మకుఁడయ్యు నా పృథునిపైఁగారుణ్య మేపారఁగన్‌.
547
వ. ఇట్లు దనమీఁది యనుగ్రహంబునం జేసి విలంబితుం డగుటయు న య్యాది రాజన్యుండైన పృథుచక్రవర్తి యమ్ముకుంద సందర్శనానంద బాష్పజలబిందు సందోహ కందళిత నయనార విందుండై యవ్విభుమూర్తిం గనుంగొని కనుంగొనలేక గద్గదకంఠుండై పలుకలేక యుండియు నెట్టకేలకుఁ దన హృదయంబున నద్దేవుని నుపగూహనంబు గావించి తన్మూర్తి ధరియించి కన్నులం దొరఁగు నానంద బాష్పంబులు దుడిచికొని విలోకనంబు సేయుచు, నతృప్తదృగ్గోచరుండును, గరుడస్కంధవిన్యస్తహస్తుండును, వసుధాతలస్థిత పాదకమలుండును నై యొప్పు న ద్దివ్య పురుషున కిట్లనియె. 548
క. వరదా! యీశ్వర! నిను స, త్పురుషుఁడు దేహాభిమానభోగములకు నీ
వరమెట్లు గోరు నిహసుఖ, వరములు నారకులకైన వఱలవె చెపుమా.
549
చ. ఘనమగు దేవ! యీ వరమె కాదు మహాత్మకవాగ్వినిర్గతం
బనఁదగు తావకీయచరణాంబుజచారుమరందరూపమై
తనరిన కీర్తియున్‌ విని ముదంబును బొందఁగలేని మోక్షమై
నను మదిఁగోర నొల్ల నఘనాశ! రమేశ! సరోజలోచనా!
550
క. అది గాన పద్మలోచన!, సదమల భవదీయఘనయశము వినుటకునై
పదివేల చెవులు కృప ని, మ్మిదియే నా యభిమతంబు నిపుడు ముకుందా!
551
చ. అనఘ! మహాత్మవాగ్గళితమైన భవత్పదపంకజాత సం
జనితసుధాకణానిలవశంబున విస్మృతతత్త్వమార్గ వ
ర్తనులగు దుష్టయోగులకుఁగ్రమ్మఱఁదత్త్వముఁజూపఁజాలు ని
ట్లొనరుట దక్క నన్యవర మొల్లఁ బయోరుహపత్త్రలోచనా!
552
సీ. వినుతమంగళయశోవిభవ! సర్వేశ్వర! యిందిర గుణసంగ్రహేచ్ఛఁజేసి
యే నీదు శివతరంబైన సత్కీర్తిని నర్థియై వరియించె నట్టి కీర్తి
చతురసత్పురుషసంగతము గల్గుచునుండ ధృతి నెవ్వఁడేని యాదృచ్ఛికతను
జేసియు నొకమాటు చెవులార విన్నవాఁ డనయంబును గుణజ్ఞుఁడయ్యెనేని
 
తే. విరతి నేరీతిఁ బొందును ధరణిఁబశువుఁ, దక్కఁ దక్కిన తద్‌జ్ఞుండు దనుజభేది
గాన యుత్సుకమతినైన యేను లక్ష్మి, కరణి నిన్ను భజింతునో పరమపురుష!
553
వ. ఇట్లు భవదీయ సేవాతత్పరులమైన యిందిరయు నేను నేక పదార్థాభిలాషం జేసి స్పర్ధమానుల మగుచున్న మా యిద్దఱకును బర్యాయ సేవంజేసి కలహంబు లేకుండ ని మ్మట్లు గాక భవదీయ చరణసరోరుహ సేవాసక్త మనోవిస్తారుల మగుటం జేసి యేన యేన మున్ను భజియింతు నను తలంపులం గలహం బయిననుం గానిమ్ము, దేవా యని వెండియు నిట్లయె. 554
సీ. జగదీశ! దేవ! యుష్మత్పదకైంకర్యపరతఁదనర్చు సాగరతనూజ
కృత్యంబునందు నకిల్బిషబుద్ధినేఁ బ్రీతిఁగోరుట జగన్మాతయైన
యా రమాసతితోడి వైర మవశ్యంబుఁ గల్గు నైనను దయాకార! నీవు
దీనవత్సలుఁడవు గాన స్వల్పంబైన నధికంబు సేయుదు, వట్లుగాన
 
తే. భవ్యచరిత! నిజస్వరూపంబునందు, నభిరతుఁడవైన నీవు నన్నాదరించు
పగిది నిందిర నాదరింపవు మహాత్మ!, భక్తజనలోకమందార! భవవిదూర!
555
వ. ఇట్లగుటం జేసి సత్పురుషులైనవారలు నిరస్తమాయా గుణ సముదయంబు గల నిన్ను భజియింతురు. వారలు భవత్పాదానుస్మరణరూపంబయిన ప్రయోజనంబు దక్క నితర ప్రయోజనంబుల నెఱుంగరు, దేవా! సేవక జనంబులను వరంబులు వేఁడు మని జగద్విమోహనంబు లైన వాక్యంబులు వలుకుదు, వట్టి భవదీయ వాక్య తంత్రీ నిబద్ధులు లోకులు గాకుండి రేని ఫలకాములై కర్మంబుల నెట్టు లాచరింతు? రీశా! భవదీయ మాయావిమోహితులై జను లేమి కారణంబున నీకంటె నితరంబులఁ గోరుచుందు? రిట్లగుటం జేసి తండ్రి దనంతన బాలహితం బాచరించునట్లు మాకు నీవ హితాచరణంబాచరింప నర్హుండవని పలికిన నాదిరాజర్షియైన పృథుచక్రవర్తి యర్థవంతంబులయిన వచనంబులు విని విశ్వద్రష్టయగు నారాయణుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె? “మహారాజా! దైవ ప్రేరితుండవై నాయెడ నిట్టి బుద్ధి గలుగుటం జేసి యచలాచలంబగు భక్తి వొడము, దానిచే దుస్తరంబగు మదీయమాయం దరింతువు, నీవు నాచే నాదిష్టంబగు కృత్యం బప్రమత్తుండవగుచు నాచరించిన సకలశుభంబులం బొందుదువు, మదీయ భక్తజనంబులు స్వర్గాపవర్గ నరకంబులం దుల్యంబులుగా నవలోకింతురు, గావున నీ యధ్యవసాయంబు నట్టిదియ, మఱియు మదీయాదేశంబున దుస్త్యజంబగు రోషంబును ద్యజించి నా యెడ భక్తి సలిపితివి గాన నిదియె నాకుఁ బరమహర్షదంబగు, నని యభినందించి యనుగ్రహించి యతండు గావించు పూజలు గయికొని గమనోన్ముఖుండయ్యె, నయ్యవసరంబున. 556
సీ. నరసిద్ధచారణసురమునిగంధర్వకిన్నర పితృసాధ్యపన్నగులును
నఖిలజనంబులు హరిపార్శ్వవర్తులు నానందమగ్నాంగు లగుచు వేడ్క
యజ్ఞేశచింతనుండైన యా పృథువుచే సత్కారమునుఁబొంది సమ్మదమునఁ
జనిరి నిజాధివాసములకు, భగవంతుఁ డైన నారాయణుండచ్యుతుండు
 
తే. దగ నుపాధ్యాయసహితుఁడై తనరు పృథుని, విమలమతులయి చూచుచు నమరవరులు
దన్ను జయజయకలితశబ్దములఁబొగడఁ, జనియె నప్పుడు వైకుంఠసదనమునకు.
557
వ. అంతఁ బృథుచక్రవర్తియు నింద్రియాగోచరుండయ్యును దర్శితాత్ముండును దేవదేవుండును నయిన వాసుదేవునకు నమస్కరించి నిజపురంబునకుం జనుదెంచు సమయంబున మౌక్తిక కుసుమ మాలికా దుకూల స్వర్ణతోరణాలంకృతంబును, లలిత సుగంధ ధూపవిలసితంబును, రత్నమయ రంగ వల్లికా విరాజితంబును, ఫలపుష్ప లాజాక్షత దీపమాలికా స్తంభ పూగపోతాభిరామ ప్రతిగృహ ప్రాంగణంబును, మృగమద ఘనసార చందనాగరు వాఃపూర సంసిక్త రథ్యావళీ విభాసితంబును, దరుపల్లవాభి శోభితంబును నైన పురంబుఁ బ్రవేశించి రాజమార్గంబునం జనుదేర మండిత రత్నకుండలమణి మరీచులు గండ ఫలకంబులం దాండవంబులు సలుపం బురకామినులు గనక పాత్ర విరచితంబు లయిన యశేష మంగళ నీరాజనంబుల నివాళింప, శంఖ దుందుభి ప్రముఖ తూర్య ఘోషంబులును, ఋత్విఙ్నికాయాశీర్వచనంబులును జెలంగ వందిమాగధ జనసంస్తూయమానుం డగుచు విగతగర్వుండై యంతఃపురంబుంబ్రవేశించి యనంతరంబ. 558
సీ. సమధికమతిఁబౌరజనజానపదులచేఁ దనరారు వివిధపూజనము లొంది
రాజు సంతుష్టాంతరంగుండుఁ బ్రియవర ప్రదుఁడునై వారల బహువిధములఁ
బూజించె, నవ్విధంబున మహత్తరములై నట్టి కర్మంబుల నాచరించు
చును నిరవద్యచేష్టుండై మహత్తముఁ డన నొప్పు నా పృథుమనుజవిభుఁడు
 
తే. మించి భూమండలంబుఁ బాలించి విశద, యశము సర్వధరాచక్రమందు నిలిపి
చారుశుభమూర్తి రాజన్యచక్రవర్తి, పరమమోదమునఁబరమపదము నొందె.
559
క. అని మైత్రేయ మహాముని, యనఘుఁడు విదురునకుఁ జెప్పె నని శుకుఁడభి మ
న్యుని సుతునకుఁజెప్పిన తెఱఁ, గని సూతుఁడు సెప్పె శౌనకాదులతోడన్‌.
560
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )