పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
రుద్రుండు ప్రచేతసులకు యోగాదేశ మను స్తోత్రముం దెల్పుట
క. కావున భగవంతుండును, దేవాధీశుండు నయిన దేవుని సంగం
బే వెరవున ఘటియించెనొ, యా విధ మంతయును దెలియ నానతి యీవే.
686
క. అనవుడు విదురున కమ్ముని, జననాయకుఁ డనియె నట్టి సాధుమనీషం
దనరు ప్రచేతసులును నిజ, జనకుని సద్భాషణములు సమ్మతి తోడన్‌.
687
క. శిరమున వహించి పడమటి, కరిగెడి సమయమున నెదుర నంబుధికంటెం
బఱ పగు నొక సరసి మనో, హర నిర్మల సలిల పూర్ణయై యది మఱియున్‌.
688
సీ. రక్తోత్పలేందీవరప్రఫుల్లాంభోజ కమనీయ కహ్లార కలిత మగుచుఁ
గంజాత కింజల్క పుంజ విక్షేపక మందగంధానిలానంద మగుచు
రమణీయ హంస సారస చక్రవాక కారండవ నినదాభిరామ మగుచు
వర మత్త మధుప సుస్వర మోద పల్లవాంకురిత లతా తరు భరిత మగుచు
 
తే. సిద్ధచారణ గంధర్వ సేవ్య మగుచుఁ, బుణ్యముల కాలయం బయి పొలుపు మిగిలి
లలితమై చూడ నొప్పగు లక్షణములఁ, బరఁగి శుచి లఘు మధురాంబు భవ్య మగుచు.
689
తే. సజ్జనుని హృదయముఁ బోలి స్వచ్ఛ మగుచు, హరిపదాకృతి దివిజవిహార మగుచు
ఘనుని సిరి భంగి నర్హజీవనము నగుచు, మానవతి వృత్తి గతిని నిమ్నంబు నగుచు.
690
తే. శశికరంబులుఁ బోలి విశదము లగుచు, హరికథలఁ బోలి కల్మషహరము లగుచు
వహ్నులనుబోలి భువనపావనము లగుచుఁ, బొగడఁదగు నీరములచేఁ బ్రపూర్ణ మగుచు.
691
వ. ఒప్పునట్టి సరోవరంబుఁ బొడగని యందు నొక్క దివ్యపురుషునిం గని రతండును. 692
మ. సమదశ్రీక మృదంగ వేణుముఖ భాస్వన్నాదమై దివ్య మా
ర్గ మనోరంజకమై తనర్చు విలసద్గాంధర్వగానంబు నె
య్యము సంధిల్లఁగ వించుఁ దన్మహిమ కత్యాశ్చర్యముం బొంది వే
గమునం దత్కమలాకరంబు వెడలెం గౌతూహలోల్లాసియై.
693
వ. ఇట్లు వెడలివచ్చిన. 694
మ. కని రా తాపసపుంగవుల్‌ దివిజలోక శ్రేష్ఠునిం దప్తకాం
చన వర్ణున్‌ సనకాది యోగిజన భాస్వద్గీయమానుం ద్రిలో
చను భక్తానుగుణానుగున్‌ సుమహితైశ్వర్యుం బ్రసాదాభిశో
భనవక్త్రున్‌ నిహతాఘకర్తృజన సంపద్భద్రునిన్‌ రుద్రునిన్‌.
695
క. కని వారలు దమ మనముల, ననురాగము నద్భుతంబు ననయము వొడమన్‌
వినయము దోఁపఁగఁ దత్పద, వనజములకు మ్రొక్కి భక్తి వశగతు లగుచున్‌.
696
వ. భగవంతుండును నఖిల ధర్మజ్ఞుండును గృపాళుండును భక్తవత్సలుండును దర్శనంబున నఖిల పాపహారుండును నయిన హరుండు ప్రీతుం డగుచుఁ బ్రసన్నాంతఃకరణులు ధర్మజ్ఞులు శీల సంపన్నులు సంప్రీతులు నయిన వారల కిట్లనియె. 697
సీ. వినుఁడు నృపాలనందనులార! మీ మదిఁ గల తలం పెల్లను గానవచ్చె,
మీకు భద్రం బగు, మీ యెడ నే ననుగ్రహబుద్ధిచే నిటు గానఁబడితిఁ,
గైకొని యిపుడు సూక్ష్మముఁ ద్రిగుణాత్మకము నగు నా ప్రకృతి కంటెను ధరణిని
బరఁగు జీవుని కంటెఁ బరుఁడైన వాసుదేవుని చరణాబ్జముల్‌ దనరు భక్తి
 
తే. నర్థి నెవ్వరు భజియింతు రట్టివారు, నాకుఁ బ్రియతముల్‌, వారికి నయచరిత్రు
లార! యేను బ్రియుండనై భూరిమహిమ, వెలయు చుండుదు, నది గాక వినుఁడ మీరు.
698
వ. స్వధర్మ నిరతుండైన పురుషుం డనేక జన్మాంతరసుకృత విశేషంబులం జతుర్ముఖత్వంబు నొంది, తదనంతరంబునం బుణ్యాతిరేకంబున నన్నుం బొంది యధికారాంతంబున నేనును దేవతాగణంబులును నవ్యాకృతంబైన యే హరిపదంబును బొందుదు, మట్టి పదంబు భాగవతుండు దనంతనె పొందుం, గావున మీరు భాగవతత్వంబు నొందుటం జేసి నాకు బ్రియంబు ఘటియింపుఁడు, భాగవత జనంబులకు నా కంటె నధిక ప్రియుండు లేఁడు, గాన వివిక్తంబును జప్యంబును బవిత్రంబును మంగళంబును నిశ్శ్రేయస కరంబును నైన నా వచనంబు నాకర్ణింపుఁడు, సర్గాదిని బ్రహ్మ నిజనందనుల కెఱింగించిన శ్రీహరి స్తోత్రంబు మీకు నెఱింగింతు, వినుం డది యెట్టిదనిన. 699
క. వనజాసనుఁ డాత్మజు లగు, సనకాదులఁ జూచి పలికె సమ్మతితోడన్‌
వినుఁడు కుమారకులారా!, వనజోదరు మంగళ స్తవం బెఱిఁగింతున్‌.
700
వ. అని హరి నుద్దేశించి వారలు విన నిట్లనియె, ‘ నో యీశా! యాత్మవేదులైన వారలకు భవదీ యోత్కర్షంబు స్వానందలాభకరంబు గావున నట్టి స్వానందలాభంబు మాకుం గలుగ వలయు, నీవు పరిపూర్ణానంద స్వరూపుండ, విట్టి సర్వాత్మకుండవైన నీకు నమస్కరింతు నని వెండియు నిట్లనియె. 701
సీ. పంకజనాభాయ సంకర్షణాయ శాం, తాయ విశ్వప్రబోధాయ భూత
సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే, వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వి
కారాయ కర్మనిస్తారకాయ త్రయీ, పాలాయ త్రైలోక్యపాలకాయ
సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ, యం జ్యోతిషే దురన్యాయ కర్మ
 
తే. సాధనాయ పురాపురుషాయ యజ్ఞ, రేతసే జీవతృప్తాయ పృథ్విరూప
కాయ లోకాయ నభసే0000న్తకాయ విశ్వ యోనయే విష్ణవే జిష్ణవే నమో0000స్తు.
702
సీ. స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వ ర, సాత్మనే పరమహంసాయ ధర్మ
పాలాయ సద్ధిత ఫలరూపకాయ కృ, ష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తి
యుక్తాయ ఘన సాంఖ్య యోగీశ్వరాయ హి, రణ్య వీర్యాయ రుద్రాయ శిష్ట
నాథాయ దుష్ట వినాశాయ శూన్య ప్ర, వృత్తాయ కర్మణే మృత్యవే వి
 
తే. రాట్ఛరీరాయ నిఖిల ధర్మాయ వాగ్వి, భూతయే నివృత్తాయ సత్పుణ్య భూరి
వర్చసేఽఖిల ధర్మదేహాయ చాత్మ, నేఽనిరుద్ధాయ నిభృతాత్మనే నమోఽస్తు.
703
తే. సర్వ సత్తాయ దేవాయ సన్నియామ, కాయ బహిర న్తరాత్మనే కారణాత్మ
నే సమస్తార్థలిఙ్గాయ నిర్గుణాయ, వేధసే జితాత్మక సాధవే నమోఽస్తు.
704
వ. అని మఱియుఁ బ్రద్యుమ్నుం డవు నంతరాత్మవు సమస్త శేషకారణుండవు చాతుర్హోత్రరూపుండవు నంతకుండవు సర్వజ్ఞుండవు జ్ఞాన క్రియా రూపుండవు నంతఃకరణ వాసివియు నైన నీకు నమస్కరింతునని 705
క. అనఘా! దేవ! భవత్పద, వనరుహ సందర్శనేచ్ఛ వఱలిన మాకున్‌
విను వైష్ణవసత్కృతమై, యెనయు భవద్దర్శనంబు నీవె మహాత్మా!
706
వ. అది యెట్టి దనిన. 707
క. అనఘ! సకలేంద్రియగుణాం, జనమును భక్త ప్రియంబు జలదశ్యామం
బును సౌందర్య సమగ్రము, ననుపమమును నిత్య మంగళావహ మగుచున్‌.
708
వ. మఱియును. 709
సీ. అళికులోపమ లసదలక శోభిత మగు, నమృతాంశు రేఖానిభాననమును
సమకర్ణ దివ్య భూషా ప్రభాకలితంబు, సుందర భ్రూనాస సురుచిరంబు
సలలిత కుంద కుట్మల సన్నిభ ద్విజ, పూరిత స్నిగ్ధ కపోల యుగముఁ
బద్మ పలాశ శోభన లోచనంబును, మందస్మితాపాంగ సుందరమును
 
తే. సస్మితాలోక సతత ప్రసన్న ముఖముఁ, గంబు సుందర రుచిర మంగళ గళంబు
హారమణి కుండల ప్రభాపూర కలిత, చారు మృగరాజ సన్నిభ స్కంధ యుతము.
710
వ. వెండియు శంఖ చక్ర గదా పద్మ కలితాయత బాహు చతుష్టయంబును, వైజయంతీ వనమాలికా కౌస్తుభమణి శ్రీవిరాజితంబును, నిత్యానపాయిని యయిన యిందిరా సుందరీరత్న పరిస్పందంబునం దనరి తిరస్కృత నికషోపల వక్షస్స్థలంబును, నుచ్ఛ్వాస నిశ్శ్వాసంబులం జంచలంబులైన వళిత్రయ రుచిర ప్రకాశమాన దళోదరంబును, బూర్వవినిర్గత నిఖిల విశ్వంబునుం బ్రవిష్టంబుఁ జేయురీతి నొందు సలిలావర్త సన్నిభ గంభీరనాభీ వివరంబును, బంకజ కింజల్క విభాసిత దుకూలనిబద్ధకనక మేఖలాకలాప శోభితశ్యామ పృథు నితంబ బింబంబును, నీల కదళీ స్తంభరుచిరోరు యుగళంబును, సమచారు జంఘంబును, నిమ్నజాను యుగళంబును, బద్మపత్త్ర భాసుర పాదద్వయంబును, మదీయాంతరంగ తమోనివారక నిర్మల చంద్రశకల సన్నిభ నఖంబును, గిరీట కుండల గ్రైవేయహార కేయూర వలయ ముద్రికా మణి నూపురాది వివిధ భూషణ భూషితంబును, నిరస్త సమస్త నతజన సాధ్వసంబును, భక్తజన మనోహరంబును సర్వమంగళాకరంబును నైన భవద్దివ్య రూపంబుఁ దామసజన సన్మార్గ ప్రదర్శకుండవైన నీవు మాకుఁ జూపి మమ్ముఁ గృతార్థులం జేయుమని వెండియు నిట్లనియె. 711
సీ. ఆత్మకుఁ బరిశుద్ధి నర్థించు వారికి ధ్యేయ వస్తువు భవద్దివ్యమూర్తి!
యంచిత స్వర్గరాజ్యాభిషిక్తున కైన సమధిక స్పృహణీయతముఁడ వీవు,
సద్భక్తియుత భక్తజన సులభుండవు దుష్టాత్ములకుఁ గడు దుర్లభుండ
వాత్మదర్శనులకు నరయ గమ్యుండవు నై యర్థి విలసిల్లు దనఘచరిత!
 
తే. యిట్టి నిఖిల దురారాధ్యు నీశు నిన్ను, నెఱయ సుజనులకైన వర్ణింపరాదు,
వఱల నెవ్వఁడు పూజించుఁవాడు విడువఁ, జాలునే పద్మదళ నేత్ర! సచ్చరిత్ర!
712
చ. ఎనసిన భక్తి యోగమున నే భవదీయపదాబ్జ మొందఁగా
ననయముఁ గోరువాఁడు చటులాగ్రహభీషణ వీర్యశౌర్య త
ర్జనములచే ననూనగతి సర్వజగంబులు సంహరించు న
య్యనుపముఁడైన కాలుని భయంబును బొందఁడు సుమ్ము కావునన్‌.
713
తే. ఇట్టి నీ పాదమూలంబు లెవ్వఁడేని, పొంది ధన్యాత్ముఁడౌ నట్టి పుణ్యుఁ డొండు
మనము లోపలఁ గోరునే మఱచియైన, నవ్యయానంద! గోవింద! హరి! ముకుంద!
714
క. హరి! నీ భక్త జనులతో, నిరుపమగతిఁ జెలిమిసేయు నిమిషార్ధముతో
సరిగాదు మోక్ష మనిన న, చిరశుభ మగు మర్త్య సుఖముఁ జెప్పఁగ నేలా?
715
క. దురిత వినాశక పదపం, కరుహ! భవత్కీర్తి తీర్థకణచయ బాహ్యాం
తర సేక ధూత కల్మష, పురుషులు ధరమీఁదఁ దీర్థభూతులు గారే!
716
వ. అట్టి భూతదయా సమేతులును రాగాది విరహిత చిత్తులును నార్జవాది గుణ యుక్తులును నయిన భాగవత జనుల సంగంబు మాకుం గలుగంజేయు, మిదియ మమ్మనుగ్రహించుట యని వెండియు నిట్లనియె. 717
చ. సరసిజనాభ! సత్పురుష సంగసమంచిత భక్తి యోగ వి
స్ఫురణ ననుగ్రహింపఁబడి శుద్ధము నొందినవాని చిత్త మ
స్థిర బహిరంగముం గనదు, చెందదు భూరితమస్స్వరూపసం
సరణ గుహం జిరంబు గనఁజాలు భవన్మహనీయతత్త్వమున్‌
718
వ. అది యెట్టిదనిన. 719
సీ. అరయంగ నేమిటి యందు నీ విశ్వంబు విదితమై యుండు నీ విశ్వమందు
నేది ప్రకాశించు? నెప్పుడు నట్టి స్వయంజ్యోతి నిత్యంబు నవ్యయంబు
నాకాశమును బోలి యవిరళ వ్యాపక మగు నాత్మతత్త్వంబు నధిక మహిమ
నమరు పరబ్రహ్మ మగు నని పల్కి యి ట్టనియె నవిక్రియుండైన వాఁడు
 
తే. నెవ్వఁ డాతఁడు దనయందు నెపుడు నాత్మ, కార్యకరణ సమర్థంబు గాని భేద
బుద్ధి జనకంబు నాఁదగు భూరిమాయఁ, జేసి విశ్వంబు సత్యంబుగా సృజించె.
720
ఆ. మరల మరలఁ బెక్కుమాఱు లీ విశ్వంబు, జనన వృద్ధి విలయ సంగతులను
నందఁ జేయుచుండు నట్టి యీశ్వరుఁడవై, తనరు నిన్ను నాత్మ తత్త్వముగను.
721
వ. తెలియుదు మని వెండియు నిట్లనియె, యోగపరాయణు లగువారు శ్రద్ధా సమన్వితులై క్రియాకలాపంబుల నంతఃకరణోపలక్షితం బయిన భవదీయ రూపంబు యజింతురు, వారు వేదాగమతత్త్వ జ్ఞానులు, నీ వాద్యుండవును ననాదియు నద్వితీయుండవును మాయాశక్తి యుక్తుండవునునై విలసిల్లుచుండుదు వట్టి మాయాశక్తిచేత. 722
సీ. చతురాత్మ! సత్త్వరజస్తమోగుణములు వరుస జనించెను, వాని వలన
మహదహంకార తన్మాత్రనభోమరు దనల జలావని ముని సుపర్వ
భూతగణాత్మక స్ఫురణ నీ విశ్వంబు భిన్నరూపమున నుత్పన్న మయ్యె,
దేవ! యీ గతి భవదీయ మాయను జేసి రూఢిఁ జతుర్విధరూపమైన
 
తే. పురము నాత్మాంశమునఁ జెందు పురుషుఁ డింద్రి, యములచే విషయ సుఖము లనుభవించు
మహిని మధుమక్షికాకృత మధువుఁ బోలి, యతనిఁ బురవర్తి యగు జీవుఁ డండ్రు మఱియు.
723
వ. ఇట్టి జగత్సర్జకుండవైన నీవు. 724
క. భూత గణంబుల చేతనె, భూతగణంబులను మేఘ పుంజంబుల ని
ర్ధూతముగఁ జేయు ననిలుని, భాతిని జరియింపఁ జేసి పౌరుష మొప్పన్‌.
725
తే. రూఢిఁ దత్తత్క్రియాలబ్ధ రూపుఁ డవును, సుమహిత స్ఫురదమిత తేజుఁడవుఁ జండ
వేగుఁడవు నయి ఘనభుజావిపులమహిమ, విశ్వసంహార మర్థిఁ గావింతు వీశ!
726
వ. అది యెట్లనిన. 727
క. ఇతి కర్తవ్య విచారక, మతిచేఁదగ నెప్పుడుం బ్రమత్తంబును సం
చిత విషయ లాలసము నూ, ర్జిత లోభము నైన యట్టి సృష్టి గడంకన్‌.
728
తే. అప్రమత్తుండ వగుచుఁ బద్మాక్ష! నీవు, మ్రింగుదువు చాల నాఁకట వ్రేఁగు చుండి
నాలుకలుఁ గోయు భూరిపన్నగము వాతఁ, బడిన యెలుకను భక్షించు పగిది ననఘ!
729
చ. అనిశము నస్మదీయగురుఁడైన సరోరుహసంభవుండు న
మ్మనువులు నాత్మసంశయము మాని భజించు భవత్పదాబ్జముల్‌
మనమున నిల్పి యుష్మదవమాన మహావ్యథఁ జెందునట్టి స
జ్జనుఁడు పరిత్యజించునె? భుజంగమతల్పక! భక్త కల్పకా!
730
క. కావున నాకును సూరి జ, నావళికిని సర్వసంశయంబులు వాపం
గావను బ్రోవను దగు గతి, నీవని వినుతించు నట్టి యీ స్తవ మెలమిన్‌.
731
వ. రుద్రుండు ప్రచేతసుల కెఱింగించి వెండియు నిట్లనియెఁ, బ్రచేతసులారా! యిట్టి యోగాదేశ నామకంబైన యీ స్తోత్రంబు బహువారావృత్తిచేఁ బఠించి మనంబున ధరియించి సమాహిత చిత్తులై మీరందఱు నాదరంబున విశ్వాసయుక్తులును, స్వధర్మాచారవంతులును భగవదర్పితాశయులును నై జపియించుచు సర్వభూతావ స్థితుండు నాత్మారాముండు నైన సర్వేశ్వరుని నుతించుచు ధ్యానయుక్తంబుగాఁ బూజించుచుండుఁడు, తొల్లి యీ స్తోత్రంబు భగవంతుండైన పద్మసంభవుండు సిసృక్షు వగుచు నాత్మజులమైన మాకును సృజియింప నిచ్చగించు భృగ్వాదులకును నెఱింగించె, మేము నా భృగ్వాదులును ప్రజాసర్గంబునందు బ్రహ్మ చోదితులమై యీ స్తోత్రంబునం జేసి విధ్వస్త సమస్త తమోగుణులమై వివిధ ప్రజాసర్గంబు గావించితిమి, కావున నీ స్తోత్రంబు నెల్లప్పుడు నేకాగ్ర చిత్తుండును వాసుదేవ పరాయణుండునై యెవ్వండు జపియించు, వాఁడు వేగంబె శ్రేయస్సును బొంది తదీయ జ్ఞాన ప్లవంబున వ్యసనార్ణవ రూపంబయిన సంసారంబును సుఖతరంబుగఁ దరియించు, నిట్టి మదుపదిష్టంబయిన శ్రీహరి స్తవంబు నెవ్వండు సదువుచు దురారాధ్యుండైన శ్రీహరిం బూజించు వాఁడు మదుక్త స్తోత్ర గాన సంతుష్టుండును శ్రేయస్సులకు నేకాశ్రయ భూతుండును నగు, శ్రీమన్నారాయణుని వలన సమస్తాభీష్టంబులం బొందు, నెవ్వండు ప్రభాతంబున లేచి ప్రాంజలియు శ్రద్ధా సమన్వితుండునై యీ మంగళస్తవరాజంబును విను, వినుపించు వాఁడు కర్మబంధ విముక్తుండగు నని మఱియు నిట్లనియె. 732
క. నరదేవతనయులారా!, పురుషాధీశుండుఁ బరమపురుషుఁడు నగు నీ
శ్వరు సుస్తోత్రము మీ కా, దరమునఁ దెలిపితిని, మీరు దద్దయు భక్తిన్‌.
733
క. ఏకాగ్రచిత్తులును సు, శ్లోకులునై జపము సేయుచును ఘనతపముం
గైకొని చేసిన మీకును, జేకుఱు మహితేప్సితార్థ సిద్ధి గడంకన్‌.
734
క. అని యీ గతి నుపదేశం, బొనరించి సదాశివుండు నొగి వారలచే
తను బూజితుఁడై వారలు, గన నంతర్ధానుఁ డయ్యెఁ గౌతుక మొప్పన్‌.
735
వ. అంత. 736
తే. తివుట వారలు రుద్రోపదిష్టమైన, యచ్యుత స్తవము జపించు చయుతసంఖ్య
వత్సరము లుగ్రతపము దుర్వార వారి, మధ్యమునఁ జేయుచున్న సమయమునందు.
737
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )