| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | చతుర్థస్కంధము |
| వ. | ఘనకర్మాసక్త చిత్తుండై యున్న ప్రాచీనబర్హి కడకు నధ్యాత్మవేదియుం గృపాళువు నైన నారదుండు సనుదెంచి యా రాజునకు జ్ఞాన బోధంబు సేయుకొఱకు నతనితో నిట్లనియె, రాజా! యీ కర్మంబునం జేసి యెట్టి శ్రేయస్సు నభిలషించుచున్న వాఁడవట్టి యనిష్ట నిరసనంబును నభీష్ట ప్రాప్తి కరంబు నయిన శ్రేయం బీ కర్మంబు వలన లభింప దనినం బ్రాచీనబర్హి నారదున కిట్లనియె. | 738 |
| సీ. |
అనఘ! మునీంద్ర! మహాభాగ! యేను గర్మాపహత జ్ఞాని నగుచు మోక్ష మెఱుఁగంగ లే నైతి నిట్టి నా కిప్పుడు గడు విమలంబును గర్మబంధ నాశకంబును నగు జ్ఞానోపదేశంబు గావింపు మతిదయాకార! కూట ధర్మంబులగు గేహతతులందుఁ జెంది జా, యా తనూజాత ధనాదికములె |
|
| తే. |
భూరి పురుషార్థములు గాఁగ బుద్ధిఁ దలఁచు, మతివిహీనుండు సంసార మార్గములను దగఁ బరిభ్రామ్యమాణుఁడై మొగిని మోక్ష, పదము నొందంగఁ జాలఁడు భవ్యచరిత! |
739 |
| క. |
అనవుఁడు నతనికి నతఁ డను, ననఘా! యీ యధ్వరంబులందును గృప మా లిన నీచే విశసింపం, జని కూలిన పసుల వేల సంఖ్యలఁ గనుమా! |
740 |
| వ. | కావునం బశువ్రాతంబులు త్వదీయవైశసంబును స్మరించు చున్నవై లోహయంత్రమయ శృంగంబులచేత నెప్పుడు నీవు పరలోకంబు నొందెద వప్పుడు నిన్ను హింసింతు మని భవదీయమృతికి నెదురుచూచు చున్న, విట్టి సంకటంబు నొందం గల నీకు నిస్తారకం బయిన యొక్క యితిహాసంబు గల దెఱింగింతు విను మని యిట్లనియె. | 741 |