పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
పురంజనోపాఖ్యానము
సీ. భూమీశ! వినుమయ్య పూర్వకాలమునఁ బురంజనుం డను నొక్క రాజు గలఁడు,
అతని కవిజ్ఞాతుఁ డనుపేరఁ దగిలి విజ్ఞాత చేష్టితుఁ డగు సఖుఁడు కలఁడు,
ఆ పురంజనుఁడు పురాన్వేషియై ధరాచక్రంబుఁ గలయంగ సంచరించి
తన కనురూపమై పెనుపొందు పుర మెందు వీక్షింపఁ జాలక విమనుఁ డగుచు
 
తే. నే పురము లుర్విఁ బొడఁగనె నా పురములు, గామములఁ గోరు తనకు న క్కామములను
బొందుటకు వానిని ననర్హములుగఁ దన మ, నమునఁ దలఁచి యొకానొకనాఁ డతండు.
742
వ. చనుచున్న సమయంబున హిమవత్పర్వత దక్షిణ సానువులందు. 743
సీ. వరనవ ద్వార కవాట గవాక్ష తోరణ దేహళీగోపురముల నొప్పి
ప్రాకార యంత్రవప్రప్రతోళీ పరిఖాట్టాల కోపవనాళిఁ దనరి
సౌవర్ణ రౌప్యాయస ఘన శృంగంబుల రమణీయ వివిధ గేహముల మించి
రథ్యాసభా చత్వరధ్వజ క్రీడాయతన సుచైత్యాపణతతిఁ దనర్చి
 
తే. మరకత స్ఫటిక విదూర మణి వినూత్న, మౌక్తికాయుత ఖచిత హర్మ్యములు గలిగి
విద్రుమ ద్రుమ వేదుల వెలయు నొక్క, పురముఁ గనియె భోగవతినిఁ బోలు దాని.
744
వ. ఇట్లు గనుంగొని యనంతరంబ ముందటం బురబాహ్యాంతరంబున దివ్యద్రుమ లతాకుంజ పుంజంబును, సమద నదద్విహంగ మత్త మధుకర కుల కోలాహల సంకుల జలాశయ శోభితంబును, హిమనిర్ఝర బిందుసందోహ పరిస్పంద కందళిత మందమలయ మరుదుచ్చలిత ప్రవాళ విటప నళినీ తటంబును, బాంథజన మనోరంజనాహ్వాన బుద్ధిజనక కలహంస రాజకీర కోకిలాలాప విరాజమానంబును, మునివ్రత నానావిధ వనమృగవ్రాతబాధా రహితంబును, నైన పురబాహ్యోద్యాన వనంబునందు యాదృచ్ఛికంబుగ నేకైక శతనాయకంబైన యనుచరదశకంబును, బంచమస్తకసర్ప ప్రతీహారుండును దోడరా! జనుదెంచుచున్న భర్త్రన్వేషిణియుం గామరూపిణియు నప్రౌఢయు నయినయట్టి. 745
సీ. ఘన సమవిన్యస్త కర్ణ కుండల రుచుల్‌ గండభాగంబుల నిండి పర్వఁ
దమ్మిరేకులసిరిఁ దటమటింపఁగ జాలు మెఱుఁగుఁ గన్నులు దలఁ దిరిగి రాఁగ
జఘన సంకలిత పిశంగ నీవీద్యుతి కనక కాంచీరుచిఁ గరము పెనుపఁ
జరణ సరోజ భాసుర చలన్నూపుర ఝణ ఝణ ధ్వని నర్మ సరణిఁ జూప
 
తే. లలిత యౌవన లక్ష్మీ విలాస భాసు, రోదయ వ్యంజిత ప్రభాయుక్త పీన
సమ నిరంతర కుచకుట్మలముల వ్రీడఁ, జెంది పయ్యెదఁ గప్పు బాలేందుముఖిని.
746
వ. మఱియును బాలయు సుదతియు గజగామినియు నయిన యొక్క ప్రమదోత్తమం గాంచి. 747
క. తరమిడి ప్రేమోద్గమమై, మరువిండ్లం బోలు కన్బొమలు గల తరుణీ
సరసాపాంగ విలోకన, శరపరివిద్ధాంగుఁ డగుచు జనవిభుఁ డనియెన్‌.
748
క. ‘ఎవ్వరి దానవు? జనకుం, డెవ్వఁడు? పేరేమి? భృత్యు లీ పది యొక రిం
దెవ్వరు? సతు లెవ్వరు? మఱి, యివ్వనమున నుండఁ గార్య మెద్ది మృగాక్షీ!
749
క. భవదీయ పురస్సరుఁ డగు, పవనాశనుఁ డెవ్వఁ డతికృపామతి నాకున్‌
వివరింపు మనుచు వెండియు, ధవళేక్షణఁ జూచి ధరణిధవుఁ డిట్లనియెన్‌.
750
సీ. తరళాక్షి! పతి యగు ధర్ము నన్వేషింపఁ జరియించు హ్రీ యను సతివొ, కాక
రుద్రు నన్వేషించు రుద్రాణివో కాక బ్రహ్మను వెదకు భారతివొ, కాక,
నారాయణుని భక్తిఁ గోరి యన్వేషించు నిందిరవో, కాక యెవ్వరీవు?
త్వత్పాద కామనత్వమునను సంప్రాప్తసకలకాముండగు సరసు నెట్టి
 
తే. వాని వెదకెదు? తరుణీ? భవత్కరాగ్ర, పద్మకోశంబు నేఁడెందుఁ బతిత మయ్యె?
నాకు నెఱిఁగింపఁ దగుదు వివేక చరిత, యని నృపాలుఁడు మఱియు నిట్లనియె సతికి.
751
క. కర మొప్పఁగ నీ విటు భూ, చర వగుటను హ్రీవి శివవు శారదవును సా
గర కన్యవుఁ గాకుండుటఁ, దరుణీ? పొడగంటి నని పదంపడి పలికెన్‌.
752
సీ. మొనసి యదభ్రకర్ముఁడ నైన నాచేత నిపుడు పాలితమైన యీ పురంబు
సరసిజోదరుని భుజాపాలితోదాత్త లలిత వైకుంఠ మలంకరించు
నిందిరా సుందరి చందంబునను నీ వలంకరింపఁ గడంగు పంకజాక్షి!
యది గాక తావకీనాపాంగరుచి మోహితాంతరంగుండ నైనట్టి నన్ను
 
తే. మహిత సవ్రీడ భావ సన్మందహాస, చారు విభ్రమ భ్రూలతా ప్రేరితుఁడుగఁ
దనరు భగవంతుఁ డగునట్టి మనసిజుండు, పడఁతి! యుడుగక పీడింపఁ దొడఁగె నిపుడు.
753
వ. కావున 754
చ. తరుణి! సుతారలోచనయుతంబును మంజుసుధాసమాన భా
సుర మృదువాక్యయుక్తమును శోభిత కోమల లంబమాన సుం
దర చికురాభిరామము నుదారము నైన భవన్ముఖాబ్జమున్‌
సురుచిరలీల నెత్తి ననుఁ జూడుము, సిగ్గును జెంద నేటికిన్‌?
755
వ. అని యివ్విధంబున నధీరుండై పలుకు పురంజనుం జూచి యా ప్రమదోత్తమ వీరమోహితయై సస్మితానన యగుచు నానందంబు నొంది యిట్లనియె. 756
క. పురుషవర! నాకు నీకును, గురువును నామమును గులముఁ గోరి యెఱుఁగ నీ
పురమున నుండుదుఁగా కీ, పురమును నిర్మించి నట్టి పురుషు నెఱుంగన్‌.
757
క. వీరలు నా సఖు లీలల, నారత్నము లార్యవినుత! నా చెలు! లీ వృ
ద్ధోరగ మే నిద్రింపఁగ, ధీరత మేల్కాంచి పురము ధృతిఁ బాలించున్‌.
758
వ. వెండియు నిట్లనియె. 759
సీ. మనుజ నాయక! నీవు మద్భాగ్య వశమున నిటకు నేతెంచితి, విపుడు నీకు
మంగళంబగు, నీవు మహితేంద్రియగ్రామ భోగ్యంబు లగు కామపుంజములను
నర్థి సంపాదింతు వనఘాత్మ! యీ నవ ద్వార ప్రయుక్తమై తనరు పురము
నీవు గైకొని యేలు, నీ కంటె దీనికి నధిపుఁ డన్యుండు లేఁ డనఘ! యందు
 
తే. మదుపనీతములైన కామముల ననుభ, వింపఁగా సమాశత మధిష్ఠింపు మెలమిఁ,
గోరి నీకంటెఁ బ్రియులు నెవ్వారు నాకు? నరసి చూడంగ మనుజేంద్ర! యదియుఁగాక.
760
వ. మఱియు రతిజ్ఞాన విహీనుండు నకోవిదుండు నిహపరచింతాశూన్యుండుఁ బశుప్రాయుండుఁ ద్వదన్యుండు నైన వాని నెవ్వని వరియింతు? గృహస్థాశ్రమమందు ధర్మార్థ కామ మోక్ష ప్రజానందంబులును యశంబును యతి వేద్యంబులు గాని రజస్తమో విహీన పుణ్యలోకంబులును గలుగుఁ, బితృదేవర్షి మర్త్యభూత గణంబులకుం దనకు నీ లోకంబున గృహస్థాశ్రమంబు సర్వక్షేమార్థం బయిన యాశ్రమం బండ్రు, గావున వదాన్యుండవు, వీర విఖ్యాతుండవు, ప్రియదర్శనుండవు, స్వయంప్రాప్తుండవు నయి భోగి భోగ సదృశ భుజాదండంబులచే నొప్పు భవాదృశుం దగిలి మాదృశయగు కన్య వరియింపకుండునే యని వెండియు 761
క. కరుణారస పరిపూర్ణ, స్ఫురిత స్మిత రుచి విలోక పుంజముచేతం
గర మర్థి దీన జన భయ, హరణుఁడవై సంచరింపు మఖిల జగములన్‌.
762
క. అని యీ గతిఁ బలికిన యా, వనజాక్షిఁ బురంజనుండు వరియించి ముదం
బున నన్యోన్య ప్రీతిం, దనరుచుఁ దత్పురము సొచ్చి ధన్యుం డగుచున్‌.
763
చ. శతసమకాల మప్పురి నజస్రము భూరి సమస్త సౌఖ్య సం
గతులఁ దనర్చి వందిజన గాయక సద్వినుతోరు గాన మో
దిత మతి నొప్పి సుందరసతీ జనసేవితుఁడై నృపాల కో
చిత లలితస్థలంబుల వసించుచుఁ గ్రీడలు సల్పుచుండఁగన్‌.
764
క. నరనాథుఁడు లోకభయం, కరగతి వర్తించు గ్రీష్మకాలము దోఁపం
దరళ లహరీ మనోహర, వరహ్రాదిని సలిలమందు వసియించెఁ దగన్‌.
765
వ. ఇట్లు వసియించి కతిపయదినంబు లగు సమయంబున. 766
సీ. అవనీశ్వరోత్తమ! య ప్పురంబున నాల్గు వంకలనున్న గవఁకులు వినుము
తూర్పు దిక్కునను నై దును దక్షిణోత్తరంబుల రెండుఁ బశ్చిమంబునను రెండుఁ
గాఁగ నా తొమ్మిది గవఁకుల నుపరి దిక్కున నేడుఁ గ్రింది దిక్కునను రెండు
నయి యుండు, మఱి వానియందుఁ బృథగ్విధ విషయ గత్యర్థమై వెలయు నీశ్వ
 
తే. రుం డొకం డరయఁ గలండు రూఢిఁ దత్పు, రంబుఁ బాలించునట్టి పురంజనుండు
నా పురద్వార నవకంబు, నందులోన, నర్థిఁ బ్రాగ్ద్వార పంచకమందు వరుస.
767
వ. ఖద్యోతయు హవిర్ముఖియు నను నామంబులు గల ద్వార యుగంబున ద్యుమత్సఖుఁడై విభ్రాజితాఖ్య జనపదంబును బొందు, వెండియు నళినియు నాళినియు నను పేళ్లు గల వాకిళ్లు రెంటియందు నవధూతసఖుండై సౌరభరూపంబులయిన విషయంబులం బొందు, మఱియు ముఖ్యనామకం బైన ప్రధానప్రాగ్ద్వారంబున రసజ్ఞ విపణాన్వితుండై యాపణబహూదనంబులను విషయంబులనొందుఁ, బితృహూ నామకం బయిన దక్షిణద్వారంబున శ్రుతధరాన్వితుండై దక్షిణ పాంచాలంబను రాష్ట్రంబు నొందు, దేవహూ నామకం బైన యుత్తరపు వాకిట శ్రుతధరాన్వితుండై యుత్తర పాంచాలంబను రాష్ట్రంబు నొందు, వెండియుం బడమటి వాకిళ్లు రెంటియందు నాసురీ నామకంబైన వాకిట దుర్మద సమేతుండై గ్రామక నామకంబైన విషయంబును, నిరృతి నామకం బయిన వాకిటియందు లుబ్ధకయుక్తుండై వైశసంబను విషయంబు నొందుచుండు, వెండియుం బురంజను డప్పురంబునం బౌరజనంబులందు నిర్వా క్పేశస్కరులను నిద్దఱంధులు గలరు. వారలచేత గమన కరణంబులను క్రియలనొందుచు నంతః పురగతుండగు నప్పుడు విషూచీన సమన్వితుండై జాయాత్మ జోద్భవంబులైన మోహ ప్రసాద హర్షంబుల నొందుచుండు, నివ్విధంబునం గర్మాసక్తుఁడు గామాత్మకుండునై బుద్ధియను మహిషిచేత వంచితుం డయ్యె, న క్కామినియు. 768
సీ. పానంబు సేసినఁ దానుఁ బానముఁ జేయుఁ గుడిచినఁ దానును గుడుచు మఱియు
భక్షింపఁ దానును భక్షించు, నడచిన నడచును, నవ్విన నవ్వు, నేడ్వ
నేడుచుఁ, బాడినఁ బాడు, విన్నను వినుఁ, జూచినఁ జూచు, గూర్చున్న నుండు,
దుఃఖింప దీనుఁడై దుఃఖించు, నిలిచిన నిలుచు, నిద్రింపఁగ నిద్రవోవు
 
తే. ముట్టినను ముట్టు, మూర్కొన్న మూరుకొనును, బలుకఁ బలుకును, బవళింపఁ బవ్వళించు
హర్షమును బొంద నాత్మను హర్ష మొందు, మోదమును బొంద దానును మోద మందు.
769
వ. ఇవ్విధంబున నతండు మహిషీ విప్రలబ్ధుండును వంచిత స్వభావుండునునై పారవశ్యంబునం జేసి యజ్ఞుండును నితరేచ్ఛా విరహితుండునునై క్రీడామృగంబు చాడ్పున వర్తించుచు నా పురంబునఁ గాపురం బుండఁ గొన్ని దినంబుల కా పురంజనుం డొకానొక దినంబున ధనుర్ధరుండై. 770
సీ. పంచాశ్వయుక్తంబుఁ బంచబంధనముఁ జక్రద్వితయమును యుగద్వయంబు
నాశువేగంబు నేకాక్షంబుఁ గూబర ద్వయముఁ బతాకాత్రితయయుతంబు
నేకరశ్మియుతంబు నేకసారథికంబు సప్తవరూథంబు స్వర్ణభూష
మును బంచవిక్రమమును నేక నీడంబుఁ బ్రకట పంచప్రహరణము నయిన
 
తే. రథము కాంచన రచిత వర్మము ధరించి, విలస దక్షయ తూణీర కలితుఁ డగుచుఁ
గడఁక దీపింప నెక్కి యేకాదశ ప్ర, సంఖ్య సేనాసమేతుఁడై సరభసముగ.
771
వ. పురంబు వెడలి పంచప్రస్థంబను వనంబునకుం జని యందు విడువరాని మహిషిని విడిచి మృగయాసక్తుండై దృప్తుండగుచు ధనుర్బాణంబులు ధరియించి సంచరించుచు నాసురవర్తనంబునం దగిలి ఘోరాత్ముండు నదయుండునై నిశాతసాయకంబుల చేత నమ్మృగ వ్రాతంబులం బరిమార్చె, రాజులకు మృగయా వినోదంబు విహితానుష్ఠానం బగుచుండ నాసురవృత్తి యెట్లయ్యె? నని యంటి వే? నిది రాగప్రాప్తం బగుటను విహితంబు గాదు, వినుము. శ్రాద్ధాదులందే ప్రఖ్యాత శ్రాద్ధ దివసంబుల యందే, రాజైన వాఁడే, మేధ్యంబులయిన పశువులనే, వనంబునందే యథోపయుక్తంబుగానే వధియింపం జను నను నియమ మాత్రంబు గలదు, గావున జ్ఞానియైన విద్వాంసుం డాచరింపండు గాన యాచరించినం గర్మానుష్ఠానజనితం బయిన జ్ఞానంబునంజేసి యందుఁ బొరయం, డట్టుగాక నియమోల్లంఘనంబునం గర్మాచరణుం డగువాఁ డభిమానంబు నొంది కర్మబద్ధుండై గుణప్రవాహ పతితుండును, నష్టప్రజ్ఞుండునునై యధోగతిం గూలు, నిట్లగుటం జేసి సాధుజనులకు సర్వప్రకారంబుల నాసురవృత్తి మానందగు నని వెండియు నిట్లనియె. నంతం బురంజనుం డవ్వనంబున. 772
క. వర చిత్ర పక్ష సునిశిత, శరములచే శశ వరాహ చమరీ రురు కా
సర గవయ శల్య హరిణీ, కరి హరి వృక పుండరీక కపి ఖడ్గములన్‌.
773
వ. వధియించి మఱియును. 774
సీ. వరుస మేధ్యామేధ్య వనమృగంబుల ఘృణ సన దుస్సహ క్రీడ సంహరించి
శ్రమయుక్తుఁడై వేఁట సాలించి మరలి మందిరమున కర్థి నే తెంచి యందు
సముచిత స్నాన భోజన కృత్యములు దీర్చి యతి పరిశ్రాంతి శయానుఁ డగుచుఁ
బరిమళ మిళిత ధూపవ్రాత వాసిత సర్వాంగుఁ డగుచు స్రక్చందనములు
 
తే. వివిధ భూషణ చేలముల్‌ వెలయఁ దాల్చి, తుష్టుఁడును హృష్టుఁడున్‌ మఱి ధృష్టుఁడై య
నన్యజాకృష్ట చిత్తుండునై రతి ప్ర, సంగ కౌతుక మాత్మను దొంగలింప.
775
వ. అంత స్వకీయ ప్రాణవల్లభ యగు మహిషియందు మనంబు నునిచిన యా వరారోహయు గృహమేధినియు నయిన గృహిణిం గానక విమనస్కుండై నిజాంతఃపుర కామినులం గనుంగొని యిట్లనియె. 776
క. రామాజన సంఘము లా, రా! మానవతీ లలామ రామామణి నా
రామకృప వడసి మెలఁగుదు, రా? మానుగఁ గుశలమా? పరామర్శింపన్‌.
777
ఉ. సార వివేకలార! గృహసంపద లీ యెడఁ బూర్వరీతిచే
నారయఁగా రుచింపవు గృహస్థునకుం గృహమందు మాతగా
నీ రమణానుకూల రమణీ మణియై తనురారు భార్య గా
నీ రుచి నొందకున్నఁ గన నేర్చునె తద్గృహమేధి సౌఖ్యముల్‌.
778
వ. అదియునుం గాక. 779
క. పొగ డొందు జనని గానీ, తగవున వర్తించునట్టి దయితయ కానీ
తగ నుండని గృహమున నుం, టగుఁ జక్ర విహీన రథమునందుం టరయన్‌.
780
వ. కావున. 781
చ. తలకొని నాకుఁ దాననుపదంబును బ్రజ్ఞ జనింపఁజేసి సం
చల దురు దుర్భర వ్యసన సాగరమగ్నుఁడ నైన నన్ను ని
శ్చలమతి నుద్ధరించి యనిశంబును మత్ప్రియయైన భార్య యే
వలనఁ జరించుచున్న దనివారణ నా కెఱిఁగింపరే దయన్‌.
782
క. అనవుడు విని య క్కాంతలు, జనపతి కిట్లనిరి రాజసత్తమ! యిదిగోఁ
దన కొంగైనను బఱపుగ, నొనరింపక నేలఁ బొరలుచున్నది వగలన్‌.
783
తే. ఏమి కతమున నున్నదో యెఱుఁగ మేము, నీవు సూడు మటన్న నా భూవరుండు
నేలఁ బడి పొరలెడు భార్యఁ బోలఁ జూచి, మనములో దుఃఖ తాపంబు మల్లడింప.
784
వ. అంత. 785
ఆ. జలజనేత్రి! ప్రణయ సంజాత రోష భా, వమున నయిన యట్టి వక్రదృష్టి
జన విభుండు సూచి యనునయ కోవిదుఁ, డగుచు నప్పయోరుహాక్షిఁ జేరి.
786
క. పొలఁతుకఁ దన యుత్సంగం, బుల నిడి తత్పాద యుగళమును నంటుచు మం
జుల మృదు భాషణముల నా, లలనామణిఁ జూచి పలికె లాలన మొప్పన్‌.
787
చ. రమణిరొ! భృత్యులందు నపరాధము గల్గిన నాయకుల్‌ స్వప
క్షముఁ దలపోసి యుగ్రతర శాసనముం దెగిచేయ రట్లు గా
క మనసులోని కిన్కఁ దమకంబున నాజ్ఞ యొనర్చి రేని ని
క్కముగ ననుగ్రహించుటయ కాక తలంపగ నాజ్ఞ సేయుటే?
788
క. కమలానన! బాంధవ కృ, త్యముఁ దలఁపక రోషచిత్తుఁడగు కుటిలాత్మున్‌
సమదామర్షుఁడు నీతి, క్రమరహితుఁడు నైన బాలుఁగా నెన్నఁదగున్‌.
789
వ. అని వెండియు నిట్లనియె. సుదతీ హృదయేశ్వరి వైన నీవు. 790
మ. సరసోదార సుధా రసోపమ వచశ్చాతుర్య సౌభాగ్యమై
హరినీలోపమ కోమలాలక యుతంబై విభ్రమ భ్రూలతా
పరిజుష్ట స్మిత సద్విలోకనమునై భాసిల్లు యుష్మన్ముఖాం
బురుహంబున్‌ భవదీయ దాసునకుఁ బూఁబోఁడీ, కృపం జూపవే!
791
క. విను వీరపత్ని నీ యెడ, ననయంబును బ్రాహ్మణులును హరి భక్తులుఁ ద
క్కను నితరు లెగ్గు సేసిన, వనితా! శిక్షింతు నెంతవారల నయినన్‌.
792
క. ఈ ముల్లోకము లందును, నా మనమున రోష మొదవినన్‌ భయరహితుం
డై మదిలోఁ బరితోషము, తో మెలఁ గెడువానిఁ గానఁ దోయజనేత్రా!
793
సీ. ఇందీవరేక్షణ! యే నెందు భవదీయ తిలక విరహితము మలినయుతము
హర్ష శూన్యంబు నపాస్తరాగంబును యత్యమర్షయుతంబు నయిన ముఖము
గళితాశ్రుబిందు సంకలిత సంచిత శోభ మాన పీనస్తన మండలమును
రమణీయ తాంబూలరాగ విహీన మై నట్టి సుపక్వ బింబాధరంబుఁ
 
తే. గాన నిట్లుంట కిపుడేమి కతము? నాకు, నర్థి నెఱిఁగింపవే మృగయాతిసక్తి
నబల! నీ కెఱిఁగింపక యరిగి నట్టి, తప్పు సైరించి కావంగఁ దగుదు నేను.
794
క. వనితాజన పరవశుఁడై, మనసిజశరబాధ్యమానమానసుఁ డగు వా
నిని దగఁ గర్తవ్యార్థము, లను భజియింపక తొలంగు లలనలు గలరే?
795
వ. అనుచుం దదీయ విభ్రమ వశంగతుండై పలికిన విని. 796
క. కంజాతపత్రనేత్ర పు, రంజను దెస రోష ముడిగి రమణీయశ్రీ
మంజుల మృదూక్తుల మనము, రంజించుచుఁ బలికె సదనురాగ మెలర్పన్‌.
797
వ. అంత. 798
సీ. అ మ్మహాదేవి నెయ్యంబున మంగళ, స్నాతయై మృదుల వస్త్రములు గట్టి
స్రక్చందనాది భూషణములు ధరియించి, కమనీయ మోహనాకార యగుచుఁ
బతికడ నిలిచిన నతఁడు సంతుష్టాంత, రంగుఁడై యభ్యంతరమున నుండి
యన్యోన్య సరస గాఢాలింగనంబులు, గావించి గోప్య వాక్యముల చేత,
 
తే. నతఁడు ప్రమదా పరిగ్రహ వ్యసనమునకు, గడఁక నపకృష్టఘన వివేకంబు గలిగి
పగలు రేయని ప్రొద్దు లేర్పఱుప రాక, యెనసి యాయుర్వ్యయంబు దా నెఱుఁగఁ డయ్యె.
799
వ. మఱియు నతం డున్నద్ధమదుండును మహామనుండును నర్హశయ్యాశయానుండును మహిషీ భుజోపధానుండునునై యజ్ఞానాభిభూతుం డగుటం జేసి స్వరూప భూత పరమపురుషార్థంబు నెఱుంగక నిజమహిషియె పరమపురుషార్థంబుగాఁ దలంచుచు రమించుచుం గామ కశ్మలచిత్తుండైన యతనికి నవయౌవనంబైన కాలంబు క్షణార్ధంబునుం బోలె గతం బయ్యె, నంత. 800
క. విశద యశోజలనిధి యా, శశిముఖి యగు భార్య వలన సమ్మతి నేకా
దశ శత పుత్రుల రణక, ర్కశ దేహులఁ గాంచి కౌతుకంబున మఱియున్‌.
801
క. గురు శీలౌదార్య గుణో, త్తరలను సల్లలిత గుణ కదంబలఁ బ్రియలన్‌
వరకుల పావనల దశో, త్తర శత దుహితలను గాంచెఁ దత్సతి వలనన్‌.
802
వ. ఇట్లు పుత్త్ర పుత్త్రికా జనంబు గని యున్నంత. 803
క. విను మాతని యాయువులో, నను నర్ధం బరిగె, నంత నరపతి కుల వ
ర్ధను లగు సుతులకుఁ బరిణయ, మొనరించెన్‌ సదృశ లయిన యువిదల తోడన్‌.
804
క. నరనాథుఁ డాడు బిడ్డల, వరరూప వయో విలాస వైభవములచేఁ
బరఁగిన నిజతనయల సమ, వరులకు సంప్రీతితో వివాహము చేసెన్‌.
805
వ. అట్లు వివాహంబులు గావించి యున్న సమయంబున. 806
క. విను, తత్సుతు లొక్కొకనికి, ననయముఁ బాంచాల దేశమందులఁ బౌరం
జన కులవర్ధను లగుచున్‌, జనియించిరి నూర్వురేసి శౌర్య బలాఢ్యుల్‌.
807
ఆ. అనఘ! యట్టి రిక్థహారులు గేహకో, శానుజీవయుతులు నయిన యట్టి
నందనాదులందుఁ జెందిన మమత ని, బద్ధుఁడయ్యె నంతఁ బార్థివుండు.
808
చ. తిరమగు నిష్ఠతో నతఁడు దీక్షితుఁడై పశుమారకంబులున్‌
సరవి భయంకరంబులగు సన్మఖముల్‌ దగఁ బెక్కు సేసి యా
దరమున నీవునుం బలెను దత్తదనూన ఫలాప్తి కాముఁడై
సురపితృ భూత సంఘము నసూయ దనర్ప భజించె భూవరా!
809
వ. ఇట్లాత్మహితంబు లైన కర్మంబులయం దనవహితుండును గుటుంబాసక్త మానసుండునునై యున్న యతనికి విరోధియై ప్రియాంగనాజనంబులకు నప్రియంబగు కాలంబు సంభవించినం జండవేగ విఖ్యాతుండును గంధర్వాధీశుండు షష్ట్యుత్తర శతత్రయ సంఖ్యాకులైన గంధర్వులును నందఱ గంధర్వీజనంబులును సితాసిత వర్ణంబులు గలిగి మిథునీభూతు లగుచు ననుగమింపం జనుదెంచి స్వపరిభ్రమణంబుచేతనే సర్వకామంబుల నిర్మితంబగు నా పురంబు నిరోధించిన నప్పు డా చండవేగానుచరులైన గంధర్వు లా పురంజను పురంబు వ్యాకులత్వంబు నొందించుచు నపహరింప నుపక్రమించు సమయంబునఁ బురంజన పురాధ్యక్షుండైన ప్రజాగరుండనువాఁడు వింశత్యుత్తర సప్తశతంబులైన గంధర్వ గంధర్వీ జనంబుల నివారించి బలవంతుడై సంవత్సరశతంబు యుద్ధంబు గావించి యొక్కరుండయ్యు నప్పెక్కండ్రతో నిట్లు పోరి క్షీణుండైనం బురంజనుండు దాన నిలిచి తత్పురంబున నల్పసుఖంబు లనుభవించుచుం బాంచాల దేశంబులందు నిజపార్షదులచేత నానీతంబులైన పదార్థంబుల నొందుచుం గామినీ జన సమేతుండై భయపర్యాలోచనంబు సేయ నేరక రాష్ట్ర పురబాంధవ సమేతుండై యార్తి నొంది చింతాక్రాంతుండై యుండె నంత. 810
క. అనయంబుఁ గాల పుత్రిక, యను నొక కామిని వరేచ్ఛ నఖిల జగంబుం
దనయంతఁ గలయఁ దిరుగుచుఁ, జని చని యొకనాఁడు రాజసత్తమ! వింటే.
811
సీ. అనఘాత్మ! రాజర్షి యైన యయాతి కుమారకుం డయినట్టి పూరుచేత
వరియింపఁగాఁ బడి వలనొప్ప నతనికి వర మిచ్చి దౌర్భాగ్యవశత నొంది
ప్రఖ్యాతి గనుట దుర్భగ యనుపేరను బరఁగు న క్కాంత నే పురుషవరుఁడు
వరియింపఁ డయ్యె, నా తరుణియు నొక నాఁడు గర మొప్ప బ్రహ్మలోకమున నుండి
 
తే. వసుధ కేతెంచి విను బృహద్వ్రతుఁడ నయిన, నన్ను వరియింపఁ గోరి మనమునఁ గామ
శరవిమోహిత యై వేఁడఁ గరము నేను, సమ్మతింపక యున్న రోషమున నలిగి.
812
వ. ఇట్లను, మునీంద్రా! మదీయాశా విముఖుండవైన నీకు నేకత్రావస్థానంబు లేక యుండుంగాక! యని శపించి విహత సంకల్పయై మదుపదేశంబునం జని యవనేశ్వరుండును భయనామకుండును నయిన వానిం గదిసి యిట్లనియె. 813
క. అవనీపతి! భయనామక, యవనకులాధీశ్వరుండ వగు నినుఁ బతిఁగాఁ
దవిలి వరింపఁగ వచ్చితి, సవినయముగ వినుము భూత సంకల్పమునన్‌.
814
వ. కలుగు మత్కామితంబు వృథ గాదు, లోకంబున వేదంబులందు దేయగ్రాహ్యరూపం బైన వస్తువు యాచ్యమానం బగుచుండ నెవ్వం డొసంగం, డెవ్వం డిందు దీయమానం బగు చుండం గోరం డట్టి వీర లిద్దఱును జడ స్వభావు లని సత్పురుషులు శోకంబు నొందుదురు! గావున నిన్ను భజియించుచున్న నన్నుం గరుణార్ద్ర చిత్తుండవై భజియింపు మిట్టి యార్తానుకంపయుఁబురుషధర్మం బని పలికిన నక్కాలపుత్త్రిక వచనంబులు విని యవనేశ్వరుండు దేవగుహ్యచికీర్షు వగు దానిం గనుంగొని మందస్మిత వదనుం డగుచు నిట్లనియె. 815
క. విను తరుణి! యాచ్యమానం, బనఁదగు నీ లోకమందు నత్యశుభవు స
జ్జనముల కసమ్మతవు నగు, నిను నభినందింపకుండ్రు నెఱి నెవ్వారున్‌.
816
వ. కావున నేను జ్ఞానదృష్టిం జేసి నీకుం బతి నిరూపణంబు సేసెద, నది యెట్లనిన మదీయసేనా సాహాయ్యంబు వడసి ప్రజానాశం బొనరించునట్టి నీ వవ్యక్తగతివై కర్మనిర్మితంబైన లోకంబు ననుభవింపు, మీ ప్రజ్వారుం డనువాఁడు నాకు సహోదరుండు, నీవు మదీయ భగినివి. మీ యిద్దఱం గూడి యీ లోకంబునందు నవ్యక్తుండును భీమసైనికుండును నై యేను వర్తింతు ననిన నా భయనామకుం డయిన యవనేశ్వరుని దిష్టకారులైన సైనికులు ప్రజ్వార కాలకన్యాయుక్తులై భూమండలం బెల్ల దిరుగుచు నొక్కనాఁ డతివేగంబున భౌమ భోగాఢ్యంబును జరత్పన్నగ పాలితంబును నయిన బురంజను పురంబు నావరించి యున్నంత స్వాభిభూతుం డయిన పురుషునకు నిస్సారత్వంబు గలిగించునట్టి కాలకన్యక బలాత్కారంబున నా పురంజను పురంబు ననుభవించె, నట్లు కాలకన్య కోపభుజ్యమానంబైన పురంబు సర్వద్వారంబులందును సర్వతో0000ధికంబుగా న య్యవనులు ప్రవేశించి తత్పురంబు సమస్తంబును బీడింప నిట్లు పురంబు ప్రపీడ్యమానం బగుచుండ నభిమానియైన పురంజనుండు. 817
సీ. అనఘ! యెంతయు మమతాకుల చిత్తుఁడై బహువిధ భూరితాపములఁ బొందె,
ఘనకుటుంబియుఁ గాలకన్యోపగూఢుండు నష్టసంపదుఁడు వినష్టమతియు
విషయాత్మకుండును వినిహతైశ్వరుండుఁ గృపణుండు సాల నకించనుండు
నగు పురంజనుఁడు శోకావిలభావుఁడై, గంధర్వ యవన సంఘములచేత
 
తే. నోజ సెడి వికలత నొందు నైజపురముఁ, దవిలి ప్రతికూలురును ననాదరణయుతులు
నయిన పుత్త్రులఁ బౌత్త్రుల ననుచరులను, సచివ పౌరోహితుల నిజసతినిఁ జూచి.
818
వ. మఱియుఁ గాలకన్యాగ్రస్తుం డయిన తన్నును నరిదూషితంబులైన పాంచాల బలంబులనుం జూచి యపార చింత నొంది తత్ప్రతీకారంబు సేయ నెఱుంగక కాలకన్యాపహృతవీర్యంబు లయినం గామంబుల నభిలషించుచు దీనుండును విగతాత్మగతికుండును స్నేహంబునం జేసి పుత్రదారోపలాలన పరుండునునై కాలకన్యోపమర్దితంబును గంధర్వ యవనాక్రాంతంబును నైన పురంబు విడువ నిచ్ఛ లేకయు విడువ నుపక్రమించె, నప్పుడు. 819
క. అనఘా! భయనామాగ్రజుఁ, డనఁగల ప్రజ్వారుఁ డపుడ యరుదెంచి పురం
బును సకలంబును భయనా, మునికిం బ్రీతిగ దహించె మునుకొని యంతన్‌.
820
వ. అట్లు పురంబు దహ్యమానం బగుచుండఁ బౌరభృత్యవర్గాది సమన్వితుండును, గౌటుంబికుండును, పుత్త్రాది సమన్వితుండును, యవనోపరుద్ధాలయుండును, గాలకన్యాగ్రస్తుండును నయిన పురంజనుం డప్పురంబునందుఁ బ్రజ్వార సంస్పృష్టుండై యనుతాపంబునొంది తత్పురపాలనంబు నందు సమర్థుండు గాక పురకృచ్ఛ్రోరువేపథుండయి యం దుండ నశక్తుం డయ్యె, నంత 821
క. దవశిఖియుత తరుకోటర, నివసిత పన్నగము పగిది నిజపురి వెడలం,
దివురుచు నతఁడు శిథిల దవ, యవుఁడును గంధర్వ గణ విహత శౌర్యుండున్‌.
822
సీ. అయి చాల ఘుర ఘుర మనుశబ్ద మడరంగ మనమునఁ జింతానిమగ్నుఁ డగుచుఁ
గొడుకులఁ గోడండ్రఁ గూఁతుల నల్లుర మనుమల నాప్తుల ననుచరాళి
ననయంబు నల్పమాత్రావశిష్టం బైన గృహకోశనివహపరిచ్ఛదముల
మసలు నహంకారమమకారములఁ జేసి మతిహీనుఁ డగుచు నెమ్మనములోనఁ
 
తే. గడఁకఁ దలఁచుచు విప్రయోగమునఁ దాను, గటకటా! యిట్లు పరలోక గతుఁడ నైన
నిట్టి భార్య యనాథయై యీ కుమార, వరుల నేరీతిఁ బ్రోచునో యరసి యనుచు.
823
వ. మఱియు నిట్లని తలంచు. 824
సీ. పడఁతి యే మును భుజింపక భుజింపదు నేను, నిద్ర వోవక మఱి నిద్ర వోదు,
నేను నీళ్లాడక నీళ్లాడ నొల్లదు పదరి యేఁ గోపింప భయము నొందు,
భర్జించినను మాఱుపలుకక వాయోడు బుద్ధిహీనుఁడనైన బుద్ధి సెప్పు!
లలి మీఱ నిట్టి కళత్రంబుతో నేను గడఁగి దేహాంతరగతుఁడ నైన
 
తే. ననయమును దాను బుత్త్రిణి యగుటఁ జేసి, యాత్మశోచిని యగుచు గృహస్థధర్మ
మాచరించుచు నుండునో? యనుగమనము, సేయునో యని మనమునఁ జింత నొంది.
825
క. తన పుత్త్రులుఁ దన పౌత్త్రులు, ననయముఁదాఁ జనినయెడ నిరాశ్రయు లగుచున్‌
వననిధి మధ్యంబున నవి, సిన కలముం బోలి యెట్లు జీవించెదరో?
826
క. అని యి వ్విధమునఁ గృపణుని, యనువున ఘనదుఃఖ విహ్వలానర్హుం డ
య్యును దుఃఖించు పురంజను, ననయముఁ గొనిపోవ నిశ్చితాత్ముం డగుచున్‌.
827
క. చనుదెంచెను భయనాముం, డనువాఁ డప్పుడు పురంజనాఖ్యుఁడు పెలుచన్‌
వినుతాత్మ! పశువు భంగిని, మనము గలఁగ యవననీయమానుం డయ్యెన్‌.
828
వ. అనుచరవర్గంబు భృశాతురులును దుఃఖితులునై వెనుచనుచుండ నుపరుద్ధంబగు భుజంగమం బప్పురంబు నెప్పుడు వాసె నప్పు డాపురంబు పురంజనుం బాసి విశీర్ణంబై ప్రకృతిం బొందె, బలవంతుం డయిన యవనునిచేత బలాత్కారంబున వికృష్యమాణుండైన పురంజనుండు దమఃపిహితుండై పూర్వ సుహృత్తగు సఖు నీశ్వరు నెఱుంగకుండె, నంతం బరలోకగతుండైన పురంజనుం గదిసి పూర్వంబున నదయుండైన యతనిచేత హింసింపంబడిన యజ్ఞపశువులు క్రోధోద్రేకంబునఁ గుఠారంబుల నతని నఱకె, న వ్విధంబునఁ బ్రమదా సంగ దోష దూషితుండును, నపార తమోనిమగ్నుండును, నష్ట జ్ఞానుండును నయి పురంజనుం డనేక కాలంబు పరలోకంబున నార్తి ననుభవించి తద్భార్యయైన ప్రమదోత్తమం జిత్తంబున నశ్రాంతంబును దలంచుచుండం దదీయ సంస్మరణంబునం జేసి తరువాతి జన్మంబున విదర్భరాజ గృహంబునం బ్రమదో త్తమయై జన్మించె నంత. 829
సీ. అవనీశ! వీర్యపణాత్త యైనట్టి వైదర్భిని మలయకేతనుఁ డనంగఁ
బరపురంజయుఁడైన పాండ్య భూమీశుండు దారుణ సంగర స్థలమునందు
శక్తి ననేక రాజన్యుల నిర్జించి పరిణయం బయ్యె, నా గురుభుజుండు
నా విదర్భాత్మజయం దసితేక్షణ యైన కూఁతును ద్రావిడాధినాథు
 
తే. లైన కొడుకుల నేడ్వుర నర్థిఁ గనియె, వారలకు నెల్ల నొక్కొక్క వరుస నర్బు
దార్బుద సుతులు సంజాతు లైరి యతని, సుత ధృతవ్రత నా యగస్త్యుఁడు వరించె.
830
క. అతఁ డా కన్యక వలనను, జతురుండై యిధ్మవాహజనకుఁ డగు దృఢ
చ్యుతుఁడను మునీంద్రుఁ గనియెను, మతి నంత విరక్తుఁ డగుచు మలయధ్వజుఁడున్‌.
831
తే. క్ష్మాతలం బెల్ల నిజతనూజాతులకును, బంచి యిచ్చి సరోజాక్ష పాదపంక
జార్చనాయత్తుఁ డగుచుఁ గులాద్రి కరుగ, నంత మదిరాక్షి సతి యగు నా విదర్భి
832
తే. కడఁక గృహములు నఖిల భోగములు విడిచి, చంద్రు వెనుచను చంద్రిక చందమునను
భక్తి దళుకొత్తఁబాండ్య భూపాలుఁడయిన, మలయకేతను వెనుకొని మగువ సనియె.
833
వ. ఇట్లు ధర్మపత్ని వెంట రాఁ జని యందుఁ జంద్రమసా తామ్రపర్ణీ నవోదక లను నదుల పుణ్యజలంబుల సుస్నాతుండయి ప్రక్షాళిత బాహ్యాభ్యంతరుండును గందమూల ఫలబీజ పుష్ప పర్ణ తృణ తోయాహారుండునై కాయకర్శనంబైన తపం బాచరించుచు శీతోష్ణ వర్ష వాతంబులు క్షుత్పిపాసలుఁ బ్రియా ప్రియంబులు సుఖదుఃఖంబులు నను ద్వంద్వంబుల సమదర్శనుండై జయించి తపోవిద్యా యమ నియమంబులం జేసి పక్వకషాయుండై బ్రహ్మంబునందు నిజాత్మ ననుసంధించి విజితేంద్రియ ప్రాణచిత్తుండై స్థాణువుంబోలె దివ్యవర్షశతంబు దపంబు సేసి భగవంతుం డయిన వాసుదేవుని యందుఁ బ్రీతి వహించుచు నన్యం బెఱుంగక వర్తించుచుఁ దన్ను స్వప్నమందు ‘మమేదం శిర శ్ఛిన్నమిత్యాది’ ప్రతీతియందుం బలె వ్యతిరిక్తునిఁగ వ్యాపకునిఁగ నంతఃకరణవృత్తి సాక్షిగా నెఱింగి. 834
సీ. సాక్షాత్కృతుండును సర్వేశ్వరుండును భగవంతుఁడును గృపాపరుఁడునైన
హరి యను లోకైక గురునిచే నుక్తమై సర్వతోముఖమును స్వప్రకాశి
తము నగు మహిత శుద్ధ జ్ఞానదీప ప్రభాతతిచేఁ బరబ్రహ్మమందుఁ
దన్నును, దనయందుఁ దగఁ బరబ్రహ్మంబు నెనయఁ గన్గొనుచు దగ్ధేంధనాగ్ని
 
తే. భంగి నీషణములఁ, బెడఁబాసి భూరి, వ్యసన సాగర సంసృతి వలనఁ జాల,
నుపరతుం డయ్యె, నా మహితోన్నతుండు, నవని నాయక! విను మప్పు డతని భార్య.
835
క. పతిదైవత శీల సమం, చిత వేణీ భూత చికుర చీరాంబర సు
వ్రత చర్యా క్షామాంగి వి, గతదోష విదర్భరాజ కన్యక యచటన్‌.
836
తే. కమలలోచన నిఖిలభోగముల దొఱఁగి, మలయకేతనుఁ బరమ ధర్మజ్ఞుఁ జేరి
నిరుపమైక పతివ్రతా నియమ మొప్ప, సాధ్వియై భక్తిఁ బరిచర్య సలుపుచుండె.
837
క. విమలమతి నిజేశు సమీ, పమునన్‌ సతి ధూమరహిత పవమానసఖా
గ్రమున వెలుఁగొందు కీల వి, ధమునఁ బ్రకాశించు చుండెఁ దద్దయు వేడ్కన్‌.
838
క. సతి దన ప్రాణేశ్వరుఁ డుప, రతుఁ డగుట మనంబులో నరయకయె పూర్వ
స్థితి నుపచార క్రియ లం, చితమతిఁ గావింపఁ దలఁచి చిరతరభక్తిన్‌.
839
క. అనుపమ సుస్థిర నియమా, సనుఁడగు నిజనాథు డాయఁ జని పూర్వగతిన్‌
వినమితయై సతి తత్పద, వనజము లర్చించునపుడు వరుపాదములన్‌.
840
క. విను మూష్మత లేకున్నను, గని యూథభ్రష్ట హరిణి కైవడి సతి నె
మ్మనమున బెగడుచు దీనత, ననయంబును బంధురహితయై శోకించెన్‌.
841
చ. అనయము నిట్లు శోకవిపులాశ్రుపయః కణసిక్త మానిత
స్తనయుగయై వియోగపరితాపమునన్‌ హృదయంబు మాఁడ శో
భన లలితాధరోష్ఠ నవపద్మము గందఁగ సుస్వరంబుగా
వనజదళాక్షి యేడ్చె ననివారణఁ దద్విపినాంతరంబునన్‌.
842
ఉ. హా! నరనాథ! హా! సుమహితాత్మక! హా! గుణశాలి! యింక నం
భోనిధి మేఖలాకలిత భూమి యధార్మిక రాజ చోర పీ
డా నిరతిం గృశింప నకటా! తగునయ్య యుపేక్షసేయ! శో
భా నయశాలి! నీవు పరిపాలన సేయుము, లెమ్ము భూవరా!
843
చ. అని విలపించుచున్‌ సరసిజాక్షి నిజేశు పదారవిందముల్‌
దన నిటలంబు సోఁకఁ బరితాపమునం బడి బిట్టు చాల రో
దన మొనరించుచుం దగిలి దారువులం జితిఁబేర్చి యందులోఁ
బెనుపగు తత్కళేబరముఁ బెట్టి శిఖిం దరికొల్చి యిమ్ములన్‌.
844
క. తా ననుగమనము సేయం, బూనుటయును నంతలోనఁ బూర్వసఖుఁడు వి
జ్ఞాన స్వరూపకుండును, నైన ధరాదివిజుఁ డొక్కఁ డబలం గదియన్‌.
845
క. చనుదెంచి య త్తలోదరి, సునయోక్తుల ననునయించుచుం దగ ననియెన్‌
వనితా! నీ వెవ్వతె? వె, వ్వని దాన? వితం డెవండు? వగచెద వేలా?’
846
క. అని యడిగి వెండియును ని, ట్లనియెను నీ సృష్టి పూర్వమందును నీ వె
వ్వనితోడ సఖ్య సౌఖ్యము, లనవరతము ననుభవించి తట్టి సఖుండన్‌.
847
క. న న్నెఱుఁగు దేని మనమున, న న్నెఱుఁగక యున్న నై న నలినదళాక్షీ!
నన్నుఁ బురాతన సఖుఁగా, నెన్నంగలదాన; వై న నెఱుఁగవె చెపుమా!
848
వ. కావున నీవును నేనునుం బూర్వంబునందు మానసనివాసులమైన హంసలమై యుండి గృహంబుఁ బాసి సహస్రవత్సరంబులు సఖులమై వర్తించు నంత నీవు ననుం బాసి భౌమభోగరతుండవై పదంబు నిచ్చగించుచు మహీమండలంబు గలయం గ్రుమ్మరునప్పు డొక్క కామినీ నిర్మితంబుం బంచారామంబు నవద్వారసమేతంబు నేకపాలకంబుఁ ద్రికోష్ఠంబు షట్కులంబుఁ బంచవిపణంబుఁ బంచ ప్రకృతియు స్త్రీ నాయకంబు నైన యొక్క పురంబు వొడగంటి, వది యెట్టి దనినం బంచారామంబు లనం బంచేంద్రి యార్థంబులు, నవద్వారంబు లన నాసికాది ద్వారంబు, లేకపాలకం బనం బ్రాణపాలనంబు, త్రికోష్ఠంబు లనం దేజోభిన్నంబులు, షట్కులంబు లన నింద్రియ సంగ్రహంబు, విపణంబులనం గర్మేంద్రియంబులు, పంచ ప్రకృతి యనం బంచ భూతంబులు, ప్రకృతి యను కామిని యన బుద్ధి, యిట్టి పురంబునం బ్రవిష్టుండైన పురుషం డంగనా పరతంత్రుండును, నజ్ఞుండును నైన నీవ య ప్పురంబునం గామినీ సంస్పృష్టుండవై రమియించుచుఁ దత్సంగమంబున నష్టస్మృతివై వైదర్భీ జనసంభావిత సుఖాభాసంబులగు దుఃఖంబులచే నిట్టి పాపిష్ఠంబైన దశం బొందితివి, గావున. 849
సీ. నీవు వైదర్భివి గావు, వీరుఁ డితండు వివరింపఁగాఁ గాఁడు విభుఁడు నీకు
నొగి మున్ను పురమున నుపరుద్ధుఁ జేసిన యా పురంజనపతి వరయఁ గావు
మఱియు నీ వన్య సీమంతిని యనియును జర్చింపఁగాఁ బూర్వ జన్మమందు
బురుషుండ వనియును బుద్ధిఁ దలంచుట యరయంగ నీ యుభయము నసత్య
 
తే. మింతయును మామకీనమై యెసఁగు మాయఁ జేసి కల్పిత మయ్యెఁ జర్చింప మనము
పూర్వమున హంసలమ యని పూని యెఱుఁగఁ, బలికితిఁ దెలియు మనల రూపంబుఁ జూడు
850
వ. నేనే నీవు గాని యన్యుండవు గావు, నీవే నేఁ గాని యన్యుండం గా, నిట్లని యెఱుంగుము, విద్వాంసులు మన యిద్దఱయందు నంతరంబు నీక్షింపరు, పురుషుండు ద న్నొక్కనినె యాదర్శ చక్షువులందు భిన్న రూపునింగాఁ దలంచు చందంబున మన యిద్దఱికిని భేదంబు గలిగిన యట్ల దోఁచు, నని యివ్విధంబున నతం డతని చేత నీవు పూర్వంబున మదీయసఖుండవైన హంస వని తెలుపం బడి స్వస్థుండై తద్వియోగ నష్టంబైన జ్ఞానంబు గ్రమ్మఱం బొందె నని చెప్పి నారదుండు ప్రాచీన బర్హింజూచి యీ యధ్యాత్మ తత్త్వంబు రాజకథామిషంబున నీకు నెఱింగించితి ననిన. 851
క. విని భూమీశుఁడు నారద, ముని కను భవదీయ వచనములు సూరులు ద
క్కను గర్మ మోహితులమై, వనరెడు నే మెట్లు దెలియు వారము చెపుమా!
852
వ. అనిన యోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె. నరేంద్రా! యేమి కతంబున నాత్మచేత నేక ద్విత్రి చతుష్పాదం బును బహుపాదంబును నపాదంబు నగుచుఁ బురంజను దేహంబు ప్రకటం బగుచుండు, నా కతంబునం బురంజనుండును బురుషుం డయ్యె, నట్టి పురుషునకు నామ క్రియా గుణంబుల విజ్ఞాతుండు గాకుండుటం జేసి యవిజ్ఞాత శబ్దంబునం జెప్పంబడు సఖుం డీశ్వరుండు, పురుషుండు సాకల్యంబునం జేసి దేహపరిగ్రహంబు సేయ నిచ్చయించునప్పుడు నవద్వార కలితంబును ద్విహస్తచరణ యుక్తంబును నయిన పురం బేది గల, దదియ లెస్స యని తలంచి య ప్పురంబను దేహంబునందుఁ బురుషుం డింద్రియంబులం జేసి యే బుద్ధి నధిష్ఠించి విషయంబుల ననుభవించు, నహంకార మమకారంబులకు నే బుద్ధితత్త్వంబు గారణంబగు నట్టి బుద్ధి ప్రమదోత్తమ యనంబడె, దానికి సఖులు జ్ఞానకర్మ కారణంబులైన యింద్రియ గుణంబులు, సఖీజనంబులు దదీయ వృత్తులు, పంచముఖోరగం బనం బంచవృత్తియైన ప్రాణంబు, నేకాదశ మహాభటులన బృహద్బలుండు నుభయేంద్రియ నాయకుండునైన మనంబు, నవద్వార సమేతంబైన యప్పురంబు చుట్టివచ్చిన పాంచాలదేశంబు లనం బంచ విషయంబులు, నవద్వారంబులన నక్షి నాసికాకర్ణముఖ గుదశిశ్నంబులు, నందు నక్షినాసాస్యంబు లైదునుం బ్రాగ్ద్వారపురస్కృతంబులు, దక్షిణోత్తర కర్ణంబులు దక్షిణోత్తర ద్వారంబులు, గుద శిశ్నంబులు పశ్చిమ ద్వారంబు, లందు నేకస్థల నిర్మితంబు లయిన ఖద్యోతావిర్ముఖులు నేత్రంబులు, విభ్రాజితంబన రూపంబు, ద్యుమంతుం డనం జక్షురింద్రియంబు, నళినీ నాళిను లన నాసికా ద్వారంబులు, సౌరభం బనం గంధంబు, నవధూత యన ఘ్రాణేంద్రియంబు, ముఖ్య యన నాస్యంబు, విపణం బనవాక్కు, రసజ్ఞుం డన రసనం, బాపణం బన వ్యవహారంబు, బహూదనం బన వివిధాన్నంబు, పితృహు వన దక్షిణ కర్ణంబు, దేవహు వన నుత్తర కర్ణంబు, చండవేగుం డనం గాలోపలక్షకంబైన సంవత్సరంబు, గంధర్వు లన దివంబులు, గంధర్వీ జనంబు లన రాత్రులు, పరీవర్తనం బన నాయుర్హరణంబు, గాలకన్యక యన జర, యవనేశ్వరుం డన మృత్యు, వతని సైనికులన నాధివ్యాధులు, ప్రజ్వారుం డనం బ్రాణిహింసయందు శీఘ్రవేగంబు గలిగి శీతోష్ణభేదంబులం ద్వివిధంబైన జ్వరంబు, దక్షిణ పాంచాలం బనం బితృలోక ప్రాపకంబును బ్రవృత్తి రూపకంబునైన శాస్త్రం, బుత్తర పాంచాలం బన దేవలోక ప్రాపకంబు నివృత్తి సంజ్ఞికంబు నయి శాస్త్రంబు, శ్రుతధరుం డన శ్రోత్రంబు, నాసురీ నామకం బనం బశ్చాద్ద్వారంబయిన మేఢ్రంబు, గ్రామకం బన సురత సుఖంబు, దుర్మదుం డన గుహ్యేంద్రియంబు, నిరృతినామకంబైన పశ్చిమ ద్వారం బన గుదంబు, వైశసం బన నరకంబు, లుబ్ధకుం డనం బాయువు, నంధు లన హస్తపాదంబు, లంతఃపురం బన హృదయంబు, విషూచి యన మనం బని వెండియు నిట్లనియె. 853
సీ. అనఘాత్మ! వినుము జాయాత్మజులును గుణాక్తం బగు మఱి బుద్ధితత్త్వ మర్థి
వెలయ నే యే గతి వికృతి సేయం బడు నే యే తెఱంగుల నింద్రియములు
వికృతిని బొందు నా విధమునఁ దద్గుణాన్వితుఁడును వరుసఁ దద్వృత్తులకును
ఘనుఁడు నుపద్రష్టయును దగు నాత్మయుఁ దద్వృత్తులను బలాత్కారమునను
 
తే. ననుకరింపంగ నర్థిఁ జేయంగఁ బడుట, ననయమును నాత్మమహిషిని ననుసరించు
టయు నెఱుఁగఁ జెప్పి యిట్టు లనియెను మఱియు, జనవరేణ్యునితో యోగిసత్తముండు.
854
వ. మఱియు నరదం బన దేహంబు, దురంగంబులన నింద్రియంబు, లీషాద్వయం బన సంవత్సరంబును దత్కృత వయస్సును, జక్రద్వయం బనం బుణ్యపాప కర్మద్వయంబు, వేణుత్రయం బన గుణత్రయంబు, పంచబంధనం బనం బంచప్రాణంబులు, రశ్మి యన మనంబు, సారథి యన బుద్ధి, రథికోపవేశస్థానం బన హృదయంబు, గూబరంబు లన శోకమోహంబులు, పంచప్రహరణంబు లనం బంచేంద్రియార్థప్రక్షేపంబు, పంచవిక్రమం బనం గర్మేంద్రియంబులు, సప్తవరూధంబు లన ధాతువులు, హైమోపస్కరం బన రజోగుణం, బక్షయతూణీరం బన ననంతవాసనాహంకారోపాధి, యేకాదశ చమూపతి యన నేకా దశేంద్రియంబైన మనం, బాసురీవృత్తి యనం బాహ్యవిక్రమంబు, పంచేంద్రియంబులచేత మృగయా వినోదంబు చందంబున హింసాదులం జేసి విషయంబు లనుభవించుటయ మృగయాచరణం, బీ విధంబున నుండ జీవుండు దేహంబున స్వప్న సుషుప్తి జాగ్రదవస్థలయందు నాధ్యాత్మికాధిదైవికాధిభౌతికంబులైన బహువిధ దుఃఖంబులం జేసి క్లేశంబుల ననుభవించుచు నజ్ఞానావృతుండయి వర్షశతంబు నిర్గుణుం డయ్యును బ్రాణేంద్రియ మనోధర్మంబులం దనయందు నధ్యవసించి కామలవంబుల ధ్యానంబు సేయుచు నహంకార మమకార సహితంబుగాఁ గర్మాచరణంబు సేయుచుండు. 855
క. పురుషుఁడు నిజప్రకాశతఁ, బరఁగియు నలఘుఁడుఁ బరుండు భగవంతుండున్‌
గురుఁడును నగు న య్యాత్మను, బరువడి నెఱుఁగంగ లేక ప్రకృతిగుణములన్‌.
856
క. విను మెపుడు దగులు నప్పుడ, యొనరంగ గుణాభిమానియును గర్మవశుం
డనఁ దగు నా పురుషుఁడు దా, ఘనమగు త్రైగుణ్య కర్మకలితుం డగుచున్‌.
857
సీ. ధృతి నొప్పుచున్న సాత్త్విక కర్మమునను బ్రకాశ భూయిష్ఠ లోకముల భూరి
రాజస ప్రకట కర్మమున దుఃఖోదర్క లోలక్రియాయాస లోకములను
గైకొని తామస కర్మంబునను దమ శ్శోక మోహోత్కట లోకములను
బొందుచుఁ బుంస్త్రీ నపుంసక మూర్తుల దేవతిర్యఙ్మర్త్య భావములను
 
తే. గలుగుఁ గర్మానుగుణములు గాఁగ జగతిఁ, బుట్టి చచ్చుచుఁ గ్రమ్మఱఁ బుట్టు చిట్లు
దివిరి కామాశయుండైన దేహి యెప్డు, నున్నతానతపదముల నొందుచుండు.
858
వ. అని మఱియు నిట్లనియె. 859
మ. ఎనయన్‌ క్షుత్పరిపీడఁ గుంది శునకం బింటింటికిం బోవఁ బూ
నినఁ దద్దైవిక మైన దండహతి గానీ, కాక చౌర్యాన్నమై
నను గానీ తగఁ బొందు చందమున నెన్నన్‌ దైవయోగంబు పెం
పున నీ జీవుఁడు దాఁ బ్రియా ప్రియములం బొందుం ద్రిలోకంబులన్‌.
860
చ. గొనకొని యిట్టి దుఃఖములకుం బ్రతికారము మానవేంద్ర! క
ల్గిన విను తత్ప్రతిక్రియ నకించనవృత్తి జనుండు మస్తకం
బున నిడుమోపు మూఁపునను బూనినఁ దద్భర దుఃఖ మాత్మఁ బా
యని గతి జీవుఁడుం ద్రివిధమై తగు దుఃఖముఁ బాయఁ డెన్నఁడున్‌.
861
క. ఘన దుఃఖ హేతుకర్మం, బును దత్ప్రతికార కర్మమును నివి మాయా
జననము లగుటను బురుషుఁడు, గనుఁ గలలోఁ దోఁచి నట్టి కల చందమునన్‌.
862
వ. సవాసనోచ్ఛేదకంబు గా దని వెండియు నిట్లనియె. 863
సీ. నరనాథ! వినుము స్వప్నంబు చందంబున నజ్ఞానవిలసితం బగుటఁ జేసి
తివిరి మిథ్యాభూత దేహాదికమునకు నరయ నివర్తనాయాస మేటి
కని యంటివేనియు నర్థంబు లేకున్న నర్థి సోపాధికం బైన మనము
వాంఛతో స్వప్నము వర్తింపఁ బురుషునిఁ బూని జాగ్రద్బోధచే నుపాధి
 
తే. చెడక స్వాప్నిక సంసృతి విడువనట్లు, తత్త్వ విజ్ఞానమున నవిద్యానివృత్తి
దారదేహాదిక నివృత్తి దగులకున్నఁ, దివుట సంసృతి దా నివర్తింప కుండు.
864
చ. ఘన పురుషార్థభూత మనఁగాఁ దగు నాత్మకు నే నిమిత్తమై
యొనర ననర్థహేతు వన నూల్కొను సంసృతి సంభవించు న
ట్లనయముఁ దన్నిమిత్త పరిహారక మర్థి జగద్గురుండు నాఁ
దనరిన వాసుదేవ పద తామరస స్ఫుటభక్తి యారయన్‌.
865
క. పూనిన తద్భక్తి సమీ, చీనగతిం దెలియ ననఘ! చిరవైరాగ్య
జ్ఞాన జనక మగు భక్తి ని, ధానము గోవింద వరకథాశ్రయమ యగున్‌.
866
వ. కావున నది తత్కథాకర్ణన గాన నిరతుండు, విశ్వాస సంయుక్తుండు నైన వానికి సంభవించు, మఱియును 867
క. ధర సాధులు విమలాంతః, కరణులు భగవద్గుణానుకథన శ్రవణ
స్ఫురిత స్వాంతులు ననఘులు, వరధిషణులు నైన భాగవత జనుల సభన్‌.
868
క. సరసోదార మహాత్మ ము, ఖరితము లగు మధువిరోధి కమనీయ గుణో
త్కర సురుచిర చరితామృత, పరిపూరిత వాహినులను బరమ ప్రీతిన్‌.
869
క. మన మలరఁగ శ్రోత్రాంజలు, లను బానము సేయు పుణ్యులకు క్షుత్తృష్ణా
ఘన భయ శోకవిమోహము, లనయంబును సోఁకకుండు నవనీనాథా!
870
వ. కావున నిట్టి భాగవత సహవాసంబు లేక తనంతన భగవద్భాగవత గుణాభివర్ణన కథానుచింత నాదులయందుం బ్రవర్తించిన నాలస్యాది దోషంబు లొంది యీ జీవలోకంబు సహజక్షుధాదికంబున నుపద్రుతంబై సర్వేశ్వరకథామృత వాహిని యందు రతిం జేయ, దిది నిశ్చితం బని మఱియు నిట్లనియె 871
సీ. పద్మసంభవుఁడును భవుఁడును మనుకుల సమితి దక్షాది ప్రజాపతులును
నైష్ఠికులైన సనకముఖ్య మునులుఁ బులస్త్యుండు భృగువుఁ బులహుఁడుఁ గ్రతువు
నత్రి మరీచియు నంగిరసుండు నరుంధతీ విభుఁడును రూఢి మెఱయఁ
బహుపుణ్యు లే గడపలఁ గాఁగఁ గల బ్రహ్మ వాదులు నందఱు వాక్కులకును
 
తే. నెనయ నీశ్వరులై యుండియును సమగ్ర, మతిఁ దపో యోగ విద్యా సమాధి వర వి
చారులై యుండియును సర్వసాక్షి యైన, యీశ్వరుని వెదకియుఁ గాన రిద్ధచరిత!
872
వ. అది యెట్లంటేని. 873
మ. ఘనవిస్తార మపార మద్వయ మనంగా నొప్పు వేదంబు దా
మనువర్తించుచు మంత్రయుక్తి వివిధంబై నట్టి దేవాఖ్య శో
భనసామర్థ్యముచేత నింద్రముఖరూపం బిష్టదైవంబుగాఁ
గని వేడ్కన్‌ భజియించువారలు గనంగా నేర్తురే యీశ్వరున్‌.
874
క. విను మాత్మ భావితుం డన, నెనసిన భగవంతుఁ డెప్పు డెవ్వనిఁ గరుణం
దనరుచు ననుగ్రహించును, మనుజేశ్వర! యపుడు వాఁడు మహితాత్మకుఁడై,
875
క. ధీరత నీ లోకవ్యవ, హారంబును వైదికంబు ననఁదగు కర్మా
చారములందు వినిష్ఠిత, మై రూఢిఁ దనర్చు బుద్ధి నర్థిన్‌ విడుచున్‌.
876
సీ. కావున రాజేంద్ర! నీవును బరమార్థ, రూపంబు లగుచుఁ బ్రరోచమాన
ములును గర్ణప్రియంబులును నస్పృష్ట వ, స్తువులును నైన యీ వివిధ కర్మ
ములయందుఁ బురుషార్థ బుద్ధి గావింపకు, మతిఘన స్వాంతు లైనట్టివారు
పరఁగు జనార్దన ప్రతిపాదకంబైన, శ్రుతిఁ గర్మపర మని చూపుచుండు
 
తే. వారు వేదజ్ఞు లనఁదగువారు గారు, రూఢి మఱివారు నిత్యస్వరూపభూత
మైన యీ యాత్మతత్త్వంబు నలరు వేద, కలిత తాత్పర్యమని యాత్మఁ దెలియలేరు.
877
వ. కావునం బ్రాగగ్రంబులైన దర్భలచేత సకలక్షితిమండలాస్తరణంబు గావించి యహంకార యుక్తుండవు నవినీతుండవు పెక్కుపశువులఁ జంపనే కాని కర్మస్వరూపంబును విద్యాస్వరూపంబును నెఱుంగ, వా కర్మ విద్యాస్వరూపంబు లెట్టి వనిన సర్వేశ్వర పరితోషకం బేది, యదియ కర్మం, బా సర్వేశ్వరునియందు నేమిట మతి సంభవించు నదియ విద్య, యతండే దేహులకు నాత్మయు నీశ్వరుండు నగుచుండుఁ, గావునఁ బురుషులకు క్షేమకరంబైన యాశ్రయంబు తద్పాదమూలంబ, యతండు ప్రియతముండును సేవ్యమానుండును నగుచుండ నణుమాత్రం బయిన దుఃఖంబులే, దట్టి యా భగవత్స్వరూపం బెవ్వం డెఱుంగు, వాఁడు విద్వాంసుండును గురుండును హరియు నని చెప్పి వెండియు నిట్లనియె. 878
క. అవనీశ! యీ విధంబున, భవదీయ ప్రశ్న మిట్లు పరిహృత మయ్యెం,
దవిలి యిఁక నొక్క గోప్యము, వివరించెదఁ జిత్తగింపు విమలచరిత్రా!
879
సీ. లలి సుమనో వాటికల యందు నల్ప ప్రసూన మరంద గంధానుమోద
సంచారియును మృగీసహితముఁ దన్నివేశిత చిత్తమును మధువ్రత నినాద
మేదుర శ్రవణానుమోదితమును బురోభాగ చరన్నిజ ప్రాణహారి
దీపిత వృక గణాధిష్ఠితమును లుబ్ధక క్రూర ఘన సాయక ప్రభిన్న
 
తే. పృష్ఠభాగంబునై తగ నెదను మృత్యు, భీతి వాటిల్ల నొండు దప్పింప వెరవు
గాన కడవిఁ జరించు మృగంబు పగిది, భూవరోత్తమ! వినవయ్య! పురుషుఁ డెపుడు.
880
వ. అంగనా నివాసంబుల యందు క్షుద్రతమంబగు కామ్య కర్మ పరిపాక జనితంబైన జిహ్వోపస్థాది కామజనిత సుఖలేశంబుల నన్వేషించుచుఁ, గామినీయుక్తుండును, దన్నివేశిత మానసుండును నతిమనోహర వనితాజనాలాప శ్రవణ తత్పర చిత్తుండును, బ్రత్యక్షంబున నాయుర్హరణ కార ణాహోరాత్రాది కాలవిశేషగణనా పరుండునుగాక పరోక్షంబునం గృతాంత శరనిర్భిన్న గాత్రుండును నగుచు నీ జీవుండు విహరించు చుండుం, గావున నీవు నీ జీవుని మృగచేష్టితునిఁగా విచారించి శ్రోత్రాదులందున్న శబ్దాదులం బోలె బాహ్య వృత్తులగు శ్రౌతస్మార్తాది రూప కర్మంబును హృదయంబునందు నియమించుచు నసజ్జనయూథ వార్తాసహితం బైన గృహాశ్రమంబు విడువుము, సకల జీవాశ్రయుండైన యీశ్వరుని భజియింపు, మిట్లు సర్వతో విరక్తుండవు గమ్మని నారదుండు వలికినం బ్రాచీనబర్హి యిట్లనియె. 881
క. మునివర! భగవంతుండవు, ననుపమ విజ్ఞాననిధివి ననఁదగు నీచే
తను వివరింపంగాఁ దగి, యెనసిన యీ యాత్మతత్త్వ మిట నా చేతన్‌.
882
వ. శ్రుతంబును విచారితంబును నయ్యెఁ, గర్మనిష్ఠు లగు నుపాధ్యాయు లైనవార లీ యాత్మతత్త్వంబును నెఱుంగ, రెఱింగిరేని యుపదేశింపరు. కావునఁ దద్కృతంబయిన మహాసంశయంబు నీ చేత నివృత్తం బయ్యెనని వెండియు నిట్లనియె. 883
సీ. అనఘాత్మ! యేమిటి యందు నీ యింద్రియ వృత్తులు దగఁ బ్రవర్తింపకుండు
టను జేసి ఋషులైన ఘనముగ మోహింతు రట్టి యర్థము నందు నాత్మ సంశ
యము గల్గుచున్నది, యది యెట్టి దనినను బురుషుఁ డే యే దేహమునను జేసి
కర్మముల్‌ సేసి తత్కాయంబు నీ లోక మందునే విడిచి తా నన్యదేహ
 
తే. మర్థితో ఘటియించి లోకాంతరమును, బొంది తత్కర్మఫలమును బొందు ననుచుఁ
బ్రకటముగ వేదవేత్తలు వలుకు చుందు, రన్న నది యెట్లు విన నుపపన్న మగును?
884
వ. అదియునుం గాక యాచరితంబైన కర్మంబు తత్‌క్షణంబు వినష్టం బగుటంజేసి జీవుండు దేహాంతర లోకాంతర భావి యయిన ఫలం బెట్లు సంభవించు ననిన ప్రాచీనబర్హికి నారదుం డిట్లనియె. నరేంద్రా! స్వప్నావస్థయందు లింగశరీరాధిష్ఠాతయైన జీవుండు జాగ్రద్దేహాభిమానంబు విడిచి తాదృశంబ కాని యతాదృశంబ కాని యైన శరీరాంతరంబు నొంది మనంబునందు సంస్కార రూపంబున నాహితంబైన కర్మంబు ననుభవించు చందంబునం బురుషుం డే లింగశరీరంబునం జేసి కర్మంబు నాచరించు, నా లింగశరీరంబుననే లోకాంతరంబున దేహవిభేదంబు నొందక తత్ఫలం బనుభవించు, నదియునుం గాక దాన ప్రతిగ్రహాదుల యందు స్థూలదేహంబునకుం గర్తృత్వంబు గల దంటివేని నహంకార మమకార యుక్తుండైన పురుషుండు మనంబునం జేసి యే యే దేహంబు పరిగ్రహించు, నా యా దేహంబున సిద్ధంబైన కర్మం బా జీవుం డనుభవించు, నట్లు గాకున్నఁ గర్మంబు పునర్భవ కారణం బగుట యుపపన్నంబు గాకుండుఁ, గావున మనఃప్రధానం బైన లింగశరీరంబునకే కర్తృత్వం బుపపన్నం బగునని వెండియు నిట్లనియె. 885
క. క్షితి నుభయేంద్రియ కర్మ, స్థితు లనుభవ మందఁబడిన చిత్తము పగిదిన్‌
ధృతిఁ జిత్తవృత్తులను ల, క్షిత మగుఁ దత్పూర్వ దేహకృత కర్మంబుల్‌.
886
వ. అది యెట్లనిన నీ దేహంబునం జేసి యే రూపంబు నే ప్రకారంబున నెప్పు డెచట నగు, నది యనను భూతంబును నదృష్టంబును నశ్రుతంబునునై యుండు, నట్టిది యొకానొక కాలంబున వాసనాశ్రయుం డయిన పురుషునకుఁ దదనుభవాది యుక్తం బగు పూర్వదేహంబున ననుభూతంబును దృష్టంబును శ్రుతంబును నని విశ్వసింపు, మీ మనంబున అననుభూతార్థంబు గోచరింపఁజాల, దీ మనంబు పురుషులకు శుభాశుభ నిమిత్తంబులైన పూర్వాపర దేహంబులం బ్రకాశింపం జేయుచుండు, నీ మనంబునందు నదృష్టంబు నశ్రుతంబు నైన యర్థంబు స్వప్నాదికమందుం దోఁచు నంటివేని నది దేశకాల క్రియాశ్రయంబని తలంపం దగు, నీ సమస్త విషయంబులఁ గ్రమానురోధంబున మనంబునం జేసి భోగ్యంబులగు నని మఱియు నిట్లనియె. 887
చ. సుమహిత శుద్ధ సత్త్వగుణ శోభితమున్‌ సరసీరుహోదరో
త్తమ గుణచింతనాపరము ధన్యము నైన మనంబునందు భూ
రమణ! సుధాంశునందు నుపరాగమునన్‌ దివిఁ దోఁచు రాహు చం
దమునను గోచరంబగు నుదారత నీ యఖిల ప్రపంచమున్‌.
888
వ. అని వెండియు నిట్లనియె. లింగదేహమునకు గర్తృత్వ భోక్తృత్వంబులు స్థూలదేహద్వారకంబు లగుటంజేసి స్థూలదేహ వినాశంబు గలుగం జీవునకుఁ గర్తృత్వ భోక్తృత్వంబులు లేకుండుటం జేసి ముక్తి గలుగు నంటివేని నీ స్థూలదేహ సంబంధంబు జీవునియందు బుద్ధి మనోమోక్షార్థ గుణవ్యూహరూపాది లింగ శరీరభంగ పర్యంతంబు గలుగుచుండును, సుషుప్తి మూర్ఛాదులందు నిష్టవియోగాది దుఃఖమందు నహంకారంబు గలిగియుండు, నది యింద్రియోపహతింజేసి యమావాస్య యందలి చంద్రుండునుంబోలెఁ దరుణపురుషునకు గర్భ బాల్యావస్థలయందు నింద్రియ పౌష్కల్యంబు లేకుండుటం జేసి యేకాదశేంద్రియ స్ఫురణ సమర్థం బయిన యహంకారంబు గర్భాదులకుఁ బ్రకాశింపని చందంబుం దోఁపకుండుఁ గావున స్థూలదేహ విచ్ఛేదంబు లేకుండుటం జేసి వస్తుభూతార్థంబు లేకున్న నీ సంసారంబు విషయంబులయం దాసక్తుండగు జీవునకు స్వాప్ని కానర్థాగమనంబునుంబోలె నివర్తింప, దీ తీరునం బంచతన్మాత్రాత్మకంబును ద్రిగుణాత్మకంబును షోడశ వికారాత్మకంబునునై విస్మృతంబు నయిన లింగ శరీరంబు నధిష్ఠించి చేతనాయుక్తుండైన జీవుండని చెప్పంబడు, మఱియును. 889
సీ. తివిరి యప్పురుషుండు దేహంబుననుజేసి, యనయంబుఁ బెక్కు దేహాంతరముల
నంగీకరించుచు నవి విసర్జించుచు, సుఖ దుఃఖ భయ మోహ శోకములను
బొలుపొందు తద్దేహములనె పొందుచు నుండు, నది యెట్టు లన్నను నగ్రభాగ
తృణ మూఁది మఱి పూర్వతృణ పరిత్యాగంబు, గావించు తృణజలూకయును బోలె
 
ఆ. జీవుఁడవనిఁ గొంత జీవించి మ్రియమాణు, డగుచు నొండు దేహ మర్థిఁ జెంది
కాని పూర్వమైన కాయంబు విడువఁడు, గాన మనమె జన్మకారణంబు.
890
తరల. నరవరోత్తమ! యట్లు గాన మనంబె జీవులకెల్ల సం
సరణకారణ, మట్టి కర్మవశంబునన్‌ సకలేంద్రియా
చరణుఁడౌట నవిద్య గల్గును, సంతతంబు నవిద్యచేఁ
బరఁగుటన్‌ బహుదేహకర్మనిబంధముల్‌ గలుగుం జుమీ!
891
చ. విను మది గాన భూవర! యవిద్య లయించుటకై రమాపతిన్‌
ఘనజనన స్థితి ప్రళయకారణ భూతునిఁ బద్మపత్త్ర లో
చనుఁ బరమేశు నీశ్వరుని సర్వజగంబుఁ దదాత్మకంబుగాఁ
గనుఁగొనుచుం దదీయపదకంజము లర్థి భజింపు మెప్పుడున్‌.
892
క. అని యీ గతి భగవంతుం, డనఘుఁడు భాగవతముఖ్యుఁడగు నారదుఁ డా
ఘనునకు జీవేశ్వర గతి, ఘనకృప నెఱిఁగించి సిద్ధ గతిఁ జనిన యెడన్‌.
893
సీ. రాజర్షి యైనట్టి ప్రాచీనబర్హి దాఁ దగఁ బ్రజాపాలనార్థంబు సుతుల
ధరకు నియోగించి తపము సేయుటకునై కపిలాశ్రమంబున కపుడు వోయి
యచ్చట నియతి నేకాగ్రచిత్తుండును ముక్తసంగుండును భూరిధైర్య
యుక్తుండు నగుచు సద్భక్తి యోగంబున ననఘ! గోవిందపదారవింద
 
తే. చింతనామృత పాన విశేషచిత్తుఁ, డగుచు విధిరుద్ర ముఖ్యుల కందరాని
యవ్య యానందమయ పద మందె నప్పు, డనుచు మైత్రేయముని విదురునకుఁ జెప్పి.
894
వ. వెండియు నిట్లనియె, నిట్లు ముకుందయశంబునం జేసి భువనపావనంబు, మనశ్శుద్ధికరంబు సర్వోత్కృష్ట ఫలప్రదాయకంబు, దేవర్షివర్య ముఖ వినిస్సృతంబునైన యీ యధ్యాత్మ పారోక్ష్యంబు నెవ్వండు పఠియించు, నెవ్వఁడు విను, నట్టివాఁడు లింగ శరీర విధూననంబు గావించి ముక్తసమస్త బంధుండయి విదేహకైవల్యంబు నొంది సంసారంబునందుఁ బరిభ్రమింపం డనిన మైత్రేయునకు విదురుం డిట్లనియె 895
క. మునినాథ! ప్రచేతసు లా, ఘన మగు రుద్రోపదిష్ట కమలోదర కీ
ర్తనమున నే గతిఁ బొందిరి, వనజాక్షుఁడు సంతసింప వా రనఘాత్మా!
896
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )