| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | షష్ఠస్కంధము |
| సీ. |
వినవయ్య! నరనాథ! విశదంబుగాఁ ద్వష్టృ వంశంబు సెప్పితి, వాని వెనుక సవితృండు పృశ్నియు సావిత్రి వ్యాహృతి యను భార్యలందు నింపారు వేడ్క నగ్నిహోత్రంబుల నరయంగఁ బశుసోమ పంచయజ్ఞంబులఁ బరఁగఁ గనియె, భగుఁడు సిద్ధిక యను భార్యకు మహిమానుభావుల విభవులఁఁ బడసె మువురఁ |
|
| ఆ. |
దనయ నొకతెఁ గాంచెఁ దదనంతరమున నా, తరళనేత్ర సద్వ్రతస్వధామ పుణ్యశీల సుగుణ పూరిత చారిత్ర, యఖిలలోక పూజ్య యాశిషాఖ్య! |
505 |
| వ. | మఱియు ధాతకుఁ గల కుహూ సినీవాలీ రాకానుమతు లనియెడు నలువురు భార్యలలోఁ గుహూదేవి సాయమను సుతునిం గాంచె; సినీవాలి దర్శాఖ్యునిం బడసె; రాక ప్రాతరాఖ్యునిఁగాంచె; ననుమతి పూర్ణిమాఖ్యునిఁ గనె; విధాత క్రియయను భార్యయందు నగ్నిపురీష్యాదులం గనియె; వరుణునకుఁ జర్షిణి యను భార్యయందుఁ బూర్వకాలంబున బ్రహ్మపుత్త్రుండయిన భృగువును వల్మీకంబునం జనియించిన వాల్మీకియు నుదయించిరి; మిత్రావరుణులకు నూర్వశియందు రేతోద్గమంబైన, దానిఁ గుంభంబునం బ్రవేశింపం జేయ నందు నగస్త్యుండును వసిష్ఠుండును జనియించిరి; ప్రత్యేకంబ మిత్రునకు రేవతియందు నుత్సర్గసంభవులైన యరిష్టయుఁ బిప్పలుండును ననువారలు జనియించిరి; శక్రునకుఁ బౌలోమియందు జయంత ఋషభ విదుషులన ముగ్గురు పుట్టిరి; వామనుం డయిన యురుక్రమ దేవునకుఁ గీర్తియను భార్యయందు బృహచ్ల్ఛోకుండు పుట్టె, నా బృహచ్ల్ఛోకునకు సౌభగాదులు పుట్టిరి; మఱియు మహానుభావుండయిన కశ్యపప్రజాపతికి నదితియందు శ్రీమన్నారాయణుం డవతరించిన ప్రకారంబు వెనుక వివరించెద; దితిసుతులైన దైతేయుల వంశంబు సెప్పెద; ఆ దైతేయ వంశంబునం బ్రహ్లాద బలులు పరమభాగవతులై దైత్యదానవ వందితులై వెలసిరి; దితి కొడుకులు హిరణ్యకశిపు హిరణ్యాక్షులనఁ బ్రసిద్ధి నొంది, రందు హిరణ్యకశిపునకు జంభాసురతనయయైన కయాధువను వధువునకుఁ బ్రహ్లాదానుహ్లాద సంహ్లాదహ్లాదులను నలుగురు కొడుకులును సింహికయను కన్యకయు జన్మించి, రా సింహికకు రాహువు జనియించె; నా రాహువు శిరం బమృతపానంబు సేయ హరి దన చక్రంబునం ద్రుంచె; సంహ్లాదునకు గతి యను భార్యయందుఁ బంచజనుండు వుట్టె; హ్లాదునకు దమని యను భార్యయందు వాతాపీల్వలులు పుట్టిరి; వారల నగస్త్యుండు భక్షించె; అనుహ్లాదునకు సూర్మ్యయను భార్యయందు బాష్కలమహిషులు గలిగిరి; ప్రహ్లాదునకు దేవియను భార్యయందు విరోచనుండు వుట్టె; నతనికి బలి జన్మించె; నా బలికి నశన యను భార్యయందు బాణుండు జ్యేష్ఠుండుగా నూర్వురు గొడుకులు పుట్టిరి. ఆ బలి ప్రభావంబు వెనుక వివరించెద; బాణాసురుండు పరమేశ్వరు నారాధించి ప్రమథగణంబులకు ముఖ్యుండయ్యె; మఱియు నా దితిసంతానంబులగు మరుత్తు లేకోన పంచాశత్సంఖ్యగలవార, లందఱు ననపత్యులై యింద్రునితోఁ గూడి దేవత్వంబు నొంది రనిన విని పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె. | 506 |
| ఆ. |
ఏమి కారణమున నింద్రునికిని మరు, చ్చయము లాప్తు లగుచు శాంతి నొంది? రరయఁ దత్సమాను లగుచు వర్తించిరి?, దీని వినఁగ వలయుఁ దెలుపవయ్య! |
507 |
| వ. | అనిన శుకుం డిట్లనియె. | 508 |
| సీ. |
నరనాథ! విను తన నందను లందఱు నమరేంద్రుచే హతు లగుచునుండఁ గోపశోకంబులఁ గ్రుళ్లుచుఁ దనలోన మండుచు దితి చాల మఱుఁగఁ దొడఁగె, భ్రాతృ ఘాతకుఁ డతిపాతకుం డీ యింద్రుఁ జంపక నాకేల సొంపు గలుగు? వీని భస్మము సేయువానిఁగా నొక సుతుఁ బడసెద నని చాల భర్తఁ గోరి |
|
| ఆ. |
ప్రియము సేయఁదొడఁగెఁ బెక్కు భావంబుల, భాషణముల నధిక పోషణముల భక్తియుక్తిచేతఁ బరిచర్యగతిచేత, నుతులచేత నతుల రతులచేత. |
509 |
| చ. |
కలికి కటాక్ష వీక్షణ వికారములన్ హృదయానురాగ సం కలిత విశేషవాఙ్మధుర గర్జనలన్ లలితాననేందు మం డల పరిశోభి తామృత విడంబిత సస్మిత సుప్రసన్నతా ఫల రుచిర ప్రదానముల భామిని భర్తమనంబు లోఁగొనెన్. |
510 |
| తే. |
అఖిల మెఱిఁగిన కశ్యపు నంతవాని, హితవు తలకెక్కు రతుల సంగతులచేత నవశుఁ గావించె వ్రేల్మిడి నబ్జవదన, పతుల భ్రమియింప నేరని సతులు గలరె? |
511 |
| క. |
ఏ తలఁ పెఱుఁగక నిలిచిన, భూతంబులఁ జూచి ధాత పురుషుల మనముల్ ప్రీతి గొలుపంగ యువతీ, వ్రాతంబు సృజించెఁ బతులు వారల కరుదే! |
512 |
| వ. | ఇట్లు నిజసతిచేత నుపలాలితుండై కశ్యపప్రజాపతి యా సతికిం బరమప్రీతుండై యిట్లనియె; ఓ తన్వీ! నీకుఁ బ్రసన్నుండనైతి, వరంబు గోరు మిచ్చెద; నాథుండు ప్రసన్నుండైన స్త్రీలకుం గోరిక సంభవించుట కేమి కొఱంత?; సతికిం బతియె దైవంబు; సర్వభూతంబుల మానసంబులకు వాసుదేవుండే భర్త; నామరూప కల్పితులైన సకల దేవతామూర్తులచేతం బురుషులచేతను భర్తృరూపధరుండయిన భగవంతుండు సేవింపంబడు చుండు; విశేషించి స్త్రీలచేతఁ బతిరూపంబున భజియింపంబడుఁగావునం బతివ్రతలైన సుందరులు శ్రేయస్కామలై యేకచిత్తంబున నాత్మేశ్వరుండయిన య ప్పరమేశ్వరుని భర్తృ భావంబున సేవించుచుండుదురు; ఏనును నీకీ భావంబున వరదుఁడ నైతి; దుశ్శీలలయిన వనితలకుం బొందరాని వరంబు నీ కిచ్చెద. వేఁడు మనిన నా కశ్యపునకు దితి యిట్లనియె. | 513 |
| ఆ. |
వరము గోర నాకు వరదుండ వేనియు, నింద్రుఁ ద్రుంచునట్టి యిద్ధబలుని నమితతేజుఁ దనయు నమరత్వసంప్రాప్తు, నెందుఁ జెడనివాని నిమ్ము నాథ! |
514 |
| వ. | అనవుడు. | 515 |
| క. |
ఉట్టిపడునట్టి వర మీ, కట్టిఁడి న న్నెట్టు వేఁడె? గటకట యనుచున్ మిట్టిపడి యతఁడు మదిలోఁ, బుట్టిన తల్లడముతోడఁ బొక్కుచు నుండెన్. |
516 |
| చ. |
ప్రకృతినిఁ గర్మపాశమున బద్ధుఁడ నై తిఁ గదయ్య! నేఁడు నే వికటసతీస్వభావమున వేఁదుఱు గొల్పిన మాయ నింద్రియా ధికమతి యైనవాఁడు దన తెంపునఁ జిత్తము వెచ్చపెట్టి పా తకములఁ గూలకున్నె? నను దైవము నవ్వదె లోలితాత్మునిన్? |
517 |
| సీ. |
ఖండ శర్కరతోడఁ గలహించు పలుకులఁ బద్మవిలాస మేర్పఱచు మోముఁ దుహినాంశు కళలతోఁ దులదూఁగు చెయ్వులుఁ జెమటఁ గ్రొన్నెత్తురు సేయు మేను నిలువెల్లఁ గరఁగించు నేర్పులయింపులుఁ బువ్వుల కరుదైన ప్రోది సేఁత తమకంబు రెట్టించు తరితీపుతలఁపులు నెనసిన మదిలోని యిచ్చగింత |
|
| ఆ. |
గలిగి కఱవనున్న కాలాహిపోలికిఁ, జెలఁగుచున్న సతులచిత్తవృత్తిఁ దెలియవశమె యెంత ధృతి గలవారికి, నాక కాదు నిఖిలలోకములకు. |
518 |
| ఆ. |
కోరి సతుల కెల్లఁ గూర్చువా రెవ్వరు?, పతులనైన సుతుల హితులనైన బలిమిఁ జేసి యైనఁ బరహ స్తమున నైన, హింసపఱతు రాత్మహితము కొఱకు. |
519 |
| వ. | అని చింతించి దీనికి నే మని ప్రతివాక్యం బిచ్చువాఁడ? మద్వచనం బెందు నమోఘంబు; త్రిలోక పరిపాలనశీలుండయిన భిదురపాణి వధార్హుండె? యేను దీనికి నైనది యొకటి గల్పించెద నని దితిం జూచి “యో తనుమధ్య! నీకు నట్లు దేవబాంధవుం డయిన యింద్రహంత యగు పుత్త్రుండు గలిగెడు; నొక్క సంవత్సరంబు వ్రతంబునం జరియింపుము; దాని ప్రకారం బెల్ల నేను జెప్పెద విను, మెల్లజీవులవలన హింసాభావంబు లేక యతిధ్వనివాక్యంబులుడిగి కోపంబు మాని యనృతంబులు వలుకక నఖరోమచ్ఛేదనంబు సేయక యస్థి కపాలాదులైన యమంగళంబులు నంటక నదీతటాకాదులన కాని ఘటోదక కూపోదకంబుల స్నానంబు సేయక దుర్జనసంభాషణంబు వర్జించి కట్టిన కోకను ముడిచిన పువ్వులను గ్రమ్మఱ ధరియింపక భోజనంబులయందు నుచ్ఛిష్టాన్నంబును జండికానివేదితాన్నంబును గీశ శునక మార్జార కంక క్రిమిపిపీలికాది విదూషితాన్నంబును సామిషాన్నంబును వృషలాహృతాన్నంబును నను నీ పంచవిధ నిషిద్ధాన్నంబులు వర్జించి దోయిట నీళ్లు ద్రావక సంధ్యాకాలంబుల ముక్తకేశిగాక మితభాషిణియై యలంకారవిహీనగాక వెలుపలం దిరుగక పాదప్రక్షాళనంబు సేసికొని కాని శయనింపక యార్ద్రపాదయై పవ్వళింపక పశ్చిమ శిరస్కయయ్యును నగ్నయయ్యును సంధ్యాకాలంబుల నిద్రింపక నిత్యంబును ధౌతవస్త్రంబులు గట్టి శుచియై సర్వమంగళసంయుక్తయై ప్రాతః కాలంబునఁ దూర్పుమొగంబై లక్ష్మీనారాయణుల నారాధించి యావాహనార్ఘ్యపాద్యోపస్పర్శన వాసోపవీత భూషణ పుష్పధూప దీపోపచారాద్యుపచారంబుల నర్చించి హవిశ్శేషంబు ద్వాదశాహుతుల వేల్పించి ప్రణామంబు లాచరించి భగవన్మంత్రంబును దశవారంబు లనుసంధించి స్తోత్రంబుసేసి గంధపుష్పాక్షతంబుల ముత్తైదువులం బూజించి పతిని సేవించి పుత్త్రుం గుక్షిగతుంగా భావించి యివ్విధంబున మార్గశీర్షశుద్ధ ప్రతిపదారంభంబుగా నొక్క సంవత్సరంబు సలిపి యా ద్వాదశమాసాంత్యదివసంబున విధ్యుక్తంబుగా నుద్యాపనంబు సేయవలయు; నీ వీ పుంసవనం బనియెడు వ్రతంబు ద్వాదశమాసపర్యంతం బేమఱక సల్పిన నీవుగోరిన కుమారుండు గలిగెడు యనిన సేవించుచు వ్రతంబుతోడనె గర్భంబు ధరియించి వ్రతంబు సలుపుచునుండ నింద్రుండు మాత్రభిప్రాయం బెఱింగి యా యమ్మ నహరహంబును రహస్యంబున సేవించుచు వ్రతంబునకుం దగిన పుష్ఫఫల సమిత్కుశ పత్త్రాంకురంబులు మొదలయిన వస్తువితతిం ద్రికాలంబులం దెచ్చి యిచ్చుచుఁ బుండరీకంబు హరిణికిం బొంచియున్న భంగి నా యమ్మ వ్రతభంగంబునకై కాచి శుశ్రూష సేయుచు నా యమ్మగర్భంబున ధరియించిన తేజోవిశేషంబునకు బెగ్గలించుచుఁ గృశించుచునుండె, నంత నొక్కనాఁడు. | 520 |
| సీ. |
వామాక్షి యనుదిన వ్రతధారణోన్నత పరిచర్య విధులచే బడలి యలసి యొంటి సంధ్యావేళ నుచ్ఛిష్టయై పద ప్రక్షాళనాదులఁ బాసి మఱచి తన కర్మమోహంబు దవిలి నిద్రింపంగ నింద్రుండు సయ్యన నెడరు గాంచి యోగమాయాబలోద్యుక్తుఁడై యా యింతి యుదరంబుఁ జొరఁబడి యుగ్రుఁ డగుచుఁ |
|
| తే. |
దివిరి దేదీప్యమానమై తేజరిల్లు, నర్భకుని వజ్రధారల నడిచె నేడు దునుకలుగ వాఁడు దునిసియుఁ దునుకఁదునుక, చెడక యొక్కొక్క బాలుఁడై చెలఁగుచున్న |
521 |
| క. |
వా రేడ్వు రగుచుఁ గుయ్యిడ, నోరి యఱవ కనుచుఁ ద్రుంచె నొక్కొక్కని నా శూరుం డేడ్గురుఁ దునుకలు, గా రయమున వారు సెడక ఖండితు లయ్యున్. |
522 |
| క. |
ఖండము లన్నియు నందఱుఁ, జండాంశుసమప్రకాశ శాశ్వతులగుచున్ యొండుకొని నిల్చి యని రా, ఖండలునకుఁ గరుణ వుట్టుగతి మదిఁ దోఁపన్. |
523 |
| వ. | అందఱు ముకుళితకరకమలులై నీకుం దోడంబుట్టువులము. మమ్ము హింసింపంబని లేదు. నీకుం బారిషదులమై మరుద్గణములమై నిన్ను సేవించెదము, మమ్ము రక్షింపుమనిన నారాయణప్రసాదంబునం జెడని మరుద్గణంబుల పలుకులకుం గృపాళుండై యింద్రుండు వారల సహోదరులంగాఁ గైకొని మఱి హింసింపక మానె; అశ్వత్థామశరాగ్నివలన నారాయణరక్షితుండ వయిన నీవునుంబోలెఁ గులిశధారల శకలంబు లయిన కుమారు లన్నిరూపంబులై సంవత్సరంబునకు నొక్కింత కడమగా హరిం బూజించి నుద్భవించినవారు గావున నింద్రుతోడం గూడ నేకోనపంచాశద్దేవత లయిన మరుద్గణంబులు దితిగర్భంబు వెలువడి రంత దితి మేల్కాంచి యనలప్రకాశులై యింద్రుతోడం గూడి వెలుంగుచున్నకుమారులం జూచి సంతోషింపక యింద్రుం జూచి నీకు మృత్యురూపంబయిన పుత్త్రుం గోరి దుస్తరంబయిన వ్రతంబు సలిపితి; సంకల్పించిన పుత్త్రుం డొక్కరుం డీ సప్త సప్త సంఖ్యలం గల కుమారు లగుట కేమి కతంబు? నీ వెఱింగిన భంగి తథ్యంబు పలుకుమనిన నింద్రుం డిట్లనియెఁ; దల్లీ! భవద్వ్రతంబుఁ జింతించి సమయవిచ్ఛేదనంబున గర్భంబు జొచ్చి పాపచిత్తుఁడనై వజ్రధారల గర్భంబు విదళనంబు సేసిన నాశకలంబులు సెడక మహాశ్చర్యంబుగా నివ్విధంబునం గుమారకులైరి. మహాపురుష పూజాసంసిద్ధి కార్యానుషంగి గాకుండునే? భగవదారాధనంబుఁ గోరికలఁ బాసి యెవ్వరు గావింతురు, వా రిహపరంబుల సర్వార్థకుశలు లగుదురు; అ మ్మహాపురుష వ్రతసముత్పన్న తేజంబు నడంప నెవ్వండోవుఁ? గావున దుర్మదంబున బాలిశ స్వభావుండనై దోషంబు సేసిన నా దౌర్జన్యకర్మంబు సహింపఁ దల్లికన్న నెవ్వరు సమర్థులు? పాపాత్ముండ నగు నన్నుం గావుము; నేను వీరలతోడివాఁడ నని నిష్కపటంబుగాఁ బ్రార్థించిన నద్దేవి యట్లగాక యని శాంతచిత్త యయ్యె; నింద్రుండును వారలం గూడి త్రిదివంబునకుం బోయి సోమపాన హవిర్భాగంబులు వారలకుం బంచిపెట్టి కూడి సుఖంబుండె నని చెప్పి పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండు వెండియు నిట్లనియె. | 524 |
| క. |
హరి వరదుఁ డయిన వ్రతమఁట, హరి యంశజు లగుచు నెగడు నమరులజన్మ స్ఫురణం బఁట! పఠియించిన, నరయఁగ నురుదీర్ఘపాపహరమగు టరుదే! |
525 |
| వ. | అని విష్ణుకథాశ్రవణ కుతూహలాయమాన మానసులైన శౌనకాది మహామునులకు సూతుండు సెప్పెనని శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకుఁ జెప్పె ననుటయు. | 526 |
| క. |
రాజీవరాజపూజ్య, శ్రీజిత గోపీకటాక్ష సేవాంతర వి భ్రాజితమూర్తి! మదోద్ధత, రాజకులోత్సాద రామరాజాఖ్యనిధీ! |
527 |
| తరల. |
మురవిదారణ! ముఖ్య కారణ! మూలతత్త్వ విచారణా! దురితతారణ! దుఃఖవారణ! దుర్మదాసుర మారణా! గిరివిహారణ! కీర్తిపూరణ! కీర్తనీయ మహారణా! ధరణిధారణ! ధర్మతారణ! తాపసస్తుతి పారణా! |
528 |
| తోటకము. |
కరుణాకర! శ్రీకర! కంబుకరా!, శరణాగత సంగత జాడ్యహరా! పరిరక్షిత శిక్షిత భక్తమురా!, కరిరాజ శుభప్రద! కాంతిధరా! |
529 |
| గద్య. | ఇది సకల సుకవి జనమిత్ర శ్రీవత్సగోత్ర పవిత్ర కనువయామాత్య పుత్త్ర బుధజన ప్రసంగానుషంగ సింగయ నామధేయ ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణంబునందు నజామిళోపాఖ్యానంబును, బ్రచేతసులఁ జంద్రుం డామంత్రణంబు సేయుటయు, దక్షోత్పత్తియుఁ, బ్రజాసర్గంబును, దక్షుండు శ్రీహరిం గూర్చి తపంబు సేయుటయు, నతనికి న ప్పరమేశ్వరుండు ప్రత్యక్షం బగుటయు, హర్యశ్వ కబళాశ్వుల జన్మంబును, వారలకు నారదుండు బోధించుటయు, నారదు వచనప్రకారంబున వారు మోక్షంబు నొందుటయుఁ, దద్వృత్తాంతంబు నారదు వలన విని దక్షుండు దుఃఖాక్రాంతుం డగుటయుఁ, దదనంతరంబ బ్రహ్మ వరంబున దక్షుండు శబళాశ్వసంజ్ఞుల సహస్ర సంఖ్యాకులగు పుత్త్రులం గాంచుటయు, సృష్టినిర్మాణేచ్ఛా నిమిత్తంబున దక్షుపంపున వార లగ్రజన్ములు సిద్ధింబొందిన దీర్థరాజంబైన నారాయణ సరస్సునకుం జనుటయు, వారికి నారదభగవంతుండు బ్రహ్మజ్ఞానంబు నుపదేశించుటయు, వారు పూర్వజు లేగిన ప్రకారంబున మోక్షంబు నొందుటయుఁ, దద్వృత్తాంతంబును దక్షుండు దివ్యజ్ఞానంబున నెఱింగి నారదోపదిష్టంబని తెలిసి నారదుని శపియించుటయు, నారదుండు దక్షుశాపంబు ప్రతిగ్రహించుటయుఁ, దక్షునకు మరల బ్రహ్మవరంబున సృష్టివిస్తారంబు కొఱకుఁ గూఁతులఱువండ్రు జనించుటయు, నందుఁ గశ్యపునకు నిచ్చిన పదమువ్వుర వలన సకల లోకంబులు నిండుటయు, దేవాసురనర తిర్యఙ్మృగఖగాదుల జన్మంబులును, దేవేంద్ర తిరస్కారంబున బృహస్పతి యధ్యాత్మ మాయచేతం గానరాకుండుటయుఁ, దద్వృత్తాంతంబు రాక్షసులు విని శుక్రోపదిష్టులై దేవతలపై నెత్తి వచ్చుటయు, దేవాసుర యుద్ధంబును, నాచార్య తిరస్కారంబున దివిజరాజ పలాయనంబును, బలాయమానులైన దేవతలు బ్రహ్మసన్నిధికిం జనుటయును, బ్రహ్మవాక్యంబునఁ ద్వష్టృ కుమారుం డయిన విశ్వరూపు నాచార్యునింగా దేవతలు వరించుటయును, విశ్వరూపు ప్రసాదంబున నింద్రుండు నారాయణవర్మంబను మంత్ర కవచంబు ధరియించి రాక్షసుల జయించుటయుఁ, బరోక్షంబున రాక్షసులకు ననుకూలుం డయిన విశ్వరూపు నింద్రుండు వధించుటయు, విశ్వరూప వధానంతరంబున నింద్రునకు బ్రహ్మహత్య సంప్రాప్తం బయిన నింద్రుండు స్త్రీ భూ జలద్రుమంబులయందుఁ బంచిపెట్టుటయు, విశ్వరూపుండు హతుం డగుటకుఁ ద్వష్ట కోపించి యింద్రవధార్థంబు మారణహోమంబు సేయ వృత్రాసురుండు జనియించుటయు, వృత్రాసుర యుద్ధంబునఁ బరాజితులై యింద్రసహితులైన దేవతలు శ్వేతద్వీపంబునకుఁ జనుటయు, నందు శ్రీహరి ప్రసన్నుండై దధీచి వలన భిదురంబు గైకొనుటయు, నింద్రుండు వజ్రాయుధంబున వృత్రుని సంహరించుటయు, నింద్రుండు బ్రహ్మ హత్యా పీడితుండై మానస సరస్సుఁ బ్రవేశించుటయు, నహుషుండు శతాశ్వమేధంబులం జేసి యింద్రాధిపత్యంబు వడయుటయు, నహుషుం డగస్త్య శాపంబున సురరాజ్య చ్యుతుండై యజగరయోనిం బుట్టుటయు, నింద్రాగమనంబును, నశ్వమేధంబును, నింద్రుండు త్రిలోకాధిపత్యంబు వడయుటయును, జిత్రకేతూపాఖ్యానంబును, మరుద్గణంబుల జన్మ ప్రకారంబును నను కథలం గల షష్ఠస్కంధము సంపూర్ణము. | 530 |