పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము షష్ఠస్కంధము
చిత్రకేతుం డీశ్వరధిక్కారంబున గౌరిచే శాప మొందుట
మ. హరిఁ గీర్తించుచు నల్లనల్ల మదిలో నబ్జాక్షు సేవించుచుం
బరమానందము నొందుచున్‌ జగములం బ్రఖ్యాతి వర్తించుచున్‌
సురరాజోపమమూర్తి యక్షగణముల్‌ సొంపార విద్యాధరా
ప్సరసల్‌ గొల్వఁగఁ బాడఁగా సితగిరిప్రాంతంబున న్నేఁగుచున్‌.
486
శా. ఆ విద్యాధరభర్త గాంచె హరనీహారామృతాహాసమున్‌
శ్రీవిభ్రాజితమున్‌ నిరస్తగిరిజాసేవాగతాయాసమున్‌
దేవానీక వికాసమున్‌ శుభమహాదేవాంఘ్రి సంవాసమున్‌
భూవిఖ్యాత విలాసముం ద్రిభువనీ పూతంబుఁ గైలాసమున్‌.
487
క. ఆ రజతభూధరంబున, నీరేజభవామరాదినికరము గొల్వం
బేరోలగమున నుండిన, గౌరీయుతుఁడయిన హరునిఁ గనియె నరేంద్రా!
488
సీ. తన నిజరూప మింతయు నున్కి దెలియక, వాదంబుసేసెడు వేదరవముఁ
గరుణావలోకనాకాంక్షితులై యున్న బ్రహ్మాది సనకసంప్రణుతిరవము
సారశివానంద సల్లాపముల నొప్పు ప్రమథగణాళి యార్భటరవంబు
డమరుమృదంగాది ఢమఢమధ్వనితోడి పటుభృంగి నాట్యవిస్ఫారరవము
 
తే. మానుగాఁ జామరలు వీచు మాతృకాది, కామినీజన మహిత కంకణరవంబు
మెండు జెలఁగఁగఁ గన్నుల పండువయ్యెఁ, గొండరాచూలి పెనిమిటి నిండుకొల్వు.
489
వ. ఇట్లు బ్రహ్మాది సురనికర సేవితుండై యూరుపీఠంబున నున్న భవానిఁ గౌఁగిటం జేర్చుకొని యొడ్డోలగంబున నున్న పరమేశ్వరుం జూచి చిత్రకేతుండు పకపక నగి యద్దేవి వినుచుండ నిట్లనియె. 490
సీ. కొమరొప్పఁగా లోకగురుఁడును గడలేని ధర్మస్వరూపంబుఁ దాన యగుచు
జడలు ధరించియు సరిలేనితపమునఁ బొడవైన యీ యోగిపుంగవులును
బ్రహ్మవాదులుఁ గొల్వ భాసిల్లు కొల్వులో మిథునరూపంబున మెలఁతతోడఁ
బ్రాకృతుండునుబోలె బద్ధానురాగుఁడై లాలితుం డయ్యె నిర్లజ్జత నిట
 
ఆ. నకట! ప్రకృతి పురుషుఁ డై నఁ దా నేకాంత, మందు సతులతోడ నలరుఁగాని
యిట్లు ధర్మసభల నింతులతోఁగూడి, పరిఢవింపలేఁడు భ్రాంతి నొంది.
491
క. అన విని పరమేశ్వరుఁ డా, తని నేమియు ననక నవ్వెఁ దత్సభవారుం
గనుఁగొని యూరక యుండిరి, మనుజేశ్వర! యీశుధైర్య మహి మెట్టిదియో?
492
వ. ఇట్లు దన పూర్వకర్మశేషంబున నింద్రియజయుండ నని పుట్టిన యహంకారంబున జగద్గురువుం బెక్కు ప్రల్లదంబు లాడుచున్న చిత్రకేతుం జూచి భవాని యిట్లనియె. 493
క. మముబోఁటి లజ్జ లుడిగిన, కుమతులకుం గర్త యగుచుఁ గోపింపంగా
నమితాజ్ఞానిపుణుండగు, శమనుండా నేఁడు వీఁడు జగముల కెల్లన్‌?
494
క. భృగునారద కపిలాదులు, నిగమాంతజ్ఞులును యోగనిర్ణయ నిపుణుల్‌
త్రిగుణాతీతు మహేశ్వరు, నగ రెన్నఁడు వారు ధర్మనయ మెఱుఁగరొకో!
495
సీ. ఎవ్వని పదపద్మ మింద్రాదివిబుధుల, చూడాగ్రపంక్తుల నీడఁ జూచు,
నెవ్వని తత్త్వంబ దెనయంగ బ్రహ్మాది, యోగిమానసపంక్తి నోలలాడు,
నెవ్వని రూపంబు నేర్పాటు గానక వేదంబు లందంద వాద మడుచు
నెవ్వని కారుణ్య మీలోకముల నెల్లఁ దనిపి యెంతయు ధన్యతములఁ జేయు
 
తే. నట్టి సర్వేశుఁ బాపసంహారు ధీరు, శాశ్వతైశ్వర్యు నాత్మసంసారు నీశు
నెగ్గు పల్కిన పాపాత్ముఁ డెల్లభంగి, దండనార్హుండు గా కెట్లు దలఁగఁ గలఁడు?
496
తే. నిఖిలలోకాశ్రయంబు సన్నిహిత సుఖము, సకలభద్రైక మూలంబు సాధుసేవ్య
మైన కంజాక్షు పాదపద్మార్చనంబు, ననుసరింపంగ ఖలుఁడు వీఁ డర్హుఁ డగునె?
497
వ. కావున నోరి! దురాత్మక! యీ పాపంబునం బాపస్వరూపంబైన రాక్షసయోనిం బుట్టుమని శపియించి యింతనుండి మహాత్ములకు నవజ్ఞ సేయకుండు మని పలికినఁ జిత్రకేతుండు విమానంబు డిగ్గి వచ్చి యద్దేవికి దండప్రణామంబు లాచరించి కరకమలంబులు దోయిలించి యిట్లనియె; ఓ జగన్మాత! భవచ్ఛాపవాక్యంబులట్ల కైకొంటిఁ బ్రాచీనకర్మంబులం బ్రాప్తంబైన సంసారచక్రంబుచేత నజ్ఞానమోహితులై తిరుగుచున్న జంతువులకు సుఖదుఃఖంబులును నైజంబులై ప్రవర్తిల్లుచుండు; నిందులకుఁ బరతంత్రులైన వా రాత్మపరసుఖదుఃఖంబులకు నెవ్వరు కర్త లీగుణంబుల నిమిత్తమై శాపానుగ్రహంబులును స్వర్గనరకంబులును సుఖదుఃఖంబులును సమంబులు; భగవంతుం డొక్కండ తన మాయచేత జగంబులు సృజియించుచు, వారివారికి బంధాదిరాగంబులు గలుగం జేయుచుఁ దాను వానికి లోనుగాక నిష్కళుండై యుండు; నీ విధంబునం బుట్టుచున్న నరునకుం బత్ని బంధుశత్రు మిత్రోదాసీనత్వంబు లెక్కడివి?; వారి వారి కర్మవశంబునం బరమేశ్వరుండు కల్పించుచు సర్వసముండై యుండు; అప్పరమేశ్వరునకు సుఖదుఃఖంబులచేత రాగంబు లేదు; రాగానుబంధంబైన రోషంబును లేదు; అతని మాయాగుణవిసర్గంబు జంతువులకు సుఖదుఃఖంబులను, బంధమోక్షంబులను గల్పించుచుండుం గావున నీకు నమస్కరించుచున్న నన్ను ననుగ్రహింపుము; శాపభయశంకితుండం గాను; జగన్మాతవైన నిన్నుఁ బలికిన దోషంబునకు శంకించు చున్నవాఁడ నని దండప్రణామంబు లాచరించి పార్వతీపరమేశ్వరులం బ్రసన్నులం జేసి తనవిమానం బెక్కి చనియె; నప్పుడు పరమేశ్వరుండు బ్రహ్మాది దేవర్షిదైత్యదానవ ప్రమథగణంబులు వినుచుండఁ బార్వతి కిట్లనియె; నీకు నిప్పుడు దృష్టంబయ్యెఁగదా నారాయణదాసదాసానుచరుల నిస్స్పృహభావంబు!; హరితుల్యార్థదర్శనులై నిస్స్పృహులైన భాగవతులకు స్వర్గాపవర్గ నరక భేదభావంబులు లేవు; ప్రాణులకు దేహసంయోగంబు వలన నారాయణలీలం జేసి యుండి ద్వంద్వాదిసుఖదుఃఖంబు లాత్మయందు నజ్ఞానంబున భేదంబు సేయంబడియె; నిట్టి విపర్యయంబులు భగవంతుండయిన వాసుదేవునిభక్తి గలవారిం జెందవు; మఱియును. 498
ఉ. నేనుఁ గుమారనారదులు నీరజగర్భుఁడు దేవసంఘమున్‌
మానితయోగివర్యమునిమండల మిట్లగువార మందఱున్‌
దానవవిద్విడంశ జనితాత్ముల మయ్యుఁ దదీయతత్త్వముం
గానఁగనేర, మీశు ఘనగర్వమునం దలపోసి చూచుచున్‌.
499
క. ఆతనికినిఁ బ్రియుఁ డ ప్రియుఁ, డే తెఱఁగున లేఁడు నిఖిల మెల్లను దానై
భూతముల కాత్మ యగుటయు, భూతప్రియుఁ డొక్కఁ డాదిపురుషుఁడు తన్వీ!
500
ఆ. అరయఁ జిత్రకేతుఁ డతిశాంతుఁ డతిలోక, సముఁడు విష్ణుభక్తిసంగతుండు,
నితని నేమి సెప్ప? నీశుండ నగు నేను, నువిద! యచ్యుతప్రియుండఁ జుమ్మి!
501
క. కావున భగవద్భక్తుల, భావమునకు విస్మయంబు పనిలేదు మహా
ధీ విభవశాంత చిత్తులు, పావన పరతత్త్వనిపుణ భవ్యులు వారల్‌.
502
వ. అనిన విని యద్రినందన విస్మయంబు మాని శాంతచిత్త యయ్యె, నట్లు పరమభాగవతుండయిన చిత్రకేతుం డద్దేవికిఁ బ్రతిశాపం బియ్య సమర్థుండయ్యును మరల శపింపక యతి శాంతరూపంబునఁ దచ్ఛాపంబు శిరంబున ధరియించె. ఇట్టి సాధులక్షణంబులు నారాయణపరాయణు లయిన వారలకుంగాక యొరులకుఁ గలుగ నేర్చునే? యిట్లు శాపహతుండయిన చిత్రకేతుండు త్వష్ట సేయు యజ్ఞంబున దక్షిణాగ్నియందు దానవయోనిం బుట్టి వృత్రాసురుం డన విఖ్యాతుండయి భగవద్‌జ్ఞానపరిణతుం డయ్యెం గావున. 503
సీ. నరనాథ! యీ వృత్రునకు రాక్షసాకృతి గలిగిన యీ పూర్వకారణంబు
చిరపుణ్యుఁ డయినట్టి చిత్రకేతు మహానుభావంబు భక్తితోఁ బరఁగ విన్నఁ
జదివినవారికి సకలదుష్కర్మముల్‌ శిథిలంబులై కడుఁ జెదరిపోవు
సకలవైభవములు సమకూరుఁ దమయంతఁ దొల్కాడు కోర్కులతోడఁ గూడి
 
ఆ. నిర్మలాత్ము లగుచు నిత్యసత్యజ్ఞాన నిరతు లగుచు విగతదురితు లగుచు
బంధుమిత్ర పుత్త్ర పౌత్త్రాదులను గూడి యనుభవించుచుందు రధిక సుఖము.
504
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - ShaShTa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )