| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| సీ. |
సర్వభూతములకు సముఁడు నెచ్చెలి ప్రియుం డైన వైకుంఠుఁ డనంతుఁ డాఢ్యుఁ డింద్రుని కొఱకు దైత్యేంద్రుల నేటికి విషముని కైవడి వెదకి చంపె? నసురులఁ జంపంగ నమరులచేఁ దన కయ్యెడి లాభ మింతైనఁ గలదె? నిర్వాణ నాథుండు నిర్గుణుం డగు తన కసురుల వలని భయంబుఁ బగయుఁ |
|
| ఆ. |
గలుగ నేర, దట్టి ఘనుఁడు దైత్యులఁ జంపి, సురలఁ గాచుచునికి చోద్యమనుచు సంశయంబు నాకు జనియించె! మునినాథ! ప్రజ్ఞ మెఱసి తెలియఁ బలుకవయ్య. |
3 |
| వ. | అనిన శుకుం డిట్లనియె. | 4 |
| శా. |
నీ సంప్రశ్నము వర్ణనీయము గదా, నిక్కంబు, రాజేంద్ర! ల క్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింపఁ, ద ద్దాసాఖ్యానము లొప్పు విష్ణుచరణధ్యాన ప్రధానంబులై శ్రీ సంధానములై మునీశ్వర వచో జేగీయమానంబులై. |
5 |
| క. |
చిత్రంబులు త్రైలోక్య ప, విత్రంబులు భవలతా లవిత్రంబులు స న్మిత్రంబులు మునిజన వన, చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. |
6 |
| వ. | నరేంద్రా! కృష్ణద్వైపాయనునకు నమస్కరించి హరికథనంబులు సెప్పెద వినుము. వ్యక్తుండు గాక, గుణంబులు లేక, ప్రకృతిం జెందక, భవంబుల నొందక పరమేశ్వరుండు దన మాయవలన నయిన గుణంబుల నావేశించి బాధ్య బాధకత్వంబుల నొందు, నతండు గుణరహితుండు, సత్త్వ రజ స్తమంబులు ప్రకృతి గుణంబు, లా గుణంబులకు నొక్కొక్క కాలంబున హాని వృద్ధులు గల, వా యీశ్వరుండు సత్త్వంబున దేవఋషులను, రజోగుణంబున నసురులను, దమోగుణంబున యక్ష రక్షోగణంబులను విభజించె. సూర్యుండు పెక్కెడలం గానంబడియు నొక్కరుండయిన తెఱంగునఁ దద్విభుండును సర్వగతుండయ్యును భిన్నుండు గాఁడు, తత్త్వ విదులయిన పెద్దలు తమలోనం బరమాత్మ స్వరూపంబున నున్న యీశ్వరు నవ్విధంబున నెఱుంగుదురు, జీవాత్మకుఁ బరుండైన సర్వమయుండు, దనమాయ చేత విశ్వంబు సృజియింపంగోరి రజంబును, గ్రీడింపంగోరి సత్త్వంబును, నిద్రింపంగోరి తమంబును నుత్పాదించి చరమైన కాలంబును సృజియించు, నా కాలంబున సర్వదర్శనుండయిన యీశ్వరుండును గాలాహ్వయుండునునై సత్త్వగుణంబయిన దేవానీకంబునకు వృద్ధియు, రజస్తమోగుణు లయిన రాక్షసులకు హానియుం జేయుచుండు. | 7 |
| క. |
జననాయక! యీ యర్థము, ఘన యశుఁడగు ధర్మజునకుఁ గ్రతుకాలమునన్ మును నారదుండు సెప్పెను, వినిపించెద వినుము చెవులు విమలత నొందన్. |
8 |
| వ. | మున్ను ధర్మరాజు సేయు రాజసూయయాగంబున బాలుం డైన శిశుపాలుండు హరిని నిందించి, నిశిత నిర్వక్రచక్రధారాదళితమస్తకుండయి తేజోరూపంబున వచ్చి హరి దేహంబు సొచ్చుటం జూచి వెఱఁగుపడి ధర్మజుండు సభలో నున్న నారదునిం జూచి యిట్లనియె. | 9 |
| ఆ. |
ఎట్టివారికైన నేకాంతులకు నైన, వచ్చి చొరఁగరాని వాసుదేవు తత్త్వమందుఁ జేదిధరణీశుఁ డహితుఁడై, యెట్లు సొచ్చె మునివరేణ్య! నేఁడు. |
10 |
| ఉ. |
వేనుఁడు మాధవుం దెగడి విప్రులు దిట్టిన భగ్నుఁడై తమో లీనుఁడు గాఁడె? తొల్లి మదలిప్తుఁడు చైద్యుఁడు పిన్న నాఁట నుం డేనియు మాధవున్ విన సహింపఁడు భక్తి వహింపఁ డట్టి వాఁ డే నిబిడ ప్రభావమున నీ పరమేశ్వరునందుఁ జొచ్చెనో? |
11 |
| మ. |
హరి సాధింతు, హరిన్ గ్రసింతు, హరిఁ బ్రాణాంతంబు నొందింతుఁ, దా హరికిన్ వైరి నటంచు వీఁడు పటురోషాయత్తుఁడై యెప్పుడున్ దిరుగుం బ్రువ్వదు నోరు వ్రీలి పడ, దా దేహంబు దాహంబుతో నరకప్రాప్తియు నొందఁ; డే క్రియ జగన్నాథుం బ్రవేశించెనో? |
12 |
| వ. | అదియునుం గాక దంతవక్త్రుండును వీఁడును నిరంతరంబు గోవిందు నిందసేయుదురు, నిఖిలజనులు సందర్శింప నేఁడు వీనికి విష్ణుసాయుజ్యంబు గలుగుట కేమి హేతువు? వినిపింపుము, పవనచలిత దీపశిఖయునుం బోలె నా హృదయంబు సంచలించుచున్న దనిన ధర్మనందనునకు నారదుం డిట్లనియె. దూషణభూషణ తిరస్కారంబులు శరీరంబునకుఁ గాని పరమాత్మకు లేవు, శరీరాభిమానంబునం జేసి దండవాక్పారుష్యంబులు హింసయై తోఁచు తెఱంగున నేను, నాయది యనియెడు వైషమ్యంబును భూతంబులకు శరీరంబు నందు సంభవించు, అభిమానంబు బంధంబు. నిరభిమానుండై వధించినను వధంబు గాదు. కర్తృత్వ మొల్లని వానికి హింసయు సిద్ధింపదు. సర్వభూతాత్మకుండైన యీశ్వరునికి వైషమ్యంబు లేదు. గావున - | 13 |
| ఆ. |
అలుకనైనఁ జెలిమి నైనఁ గామంబున, నైన బాంధవమున నైన భీతి నైనఁ దగిలి తలఁప నఖిలాత్ముఁడగు హరిఁ, జేరవచ్చు వేఱు సేయఁ డతఁడు. |
14 |
| క. |
వైరానుబంధనంబునఁ, జేరిన చందమున విష్ణుఁ జిరతర భక్తిం జేరఁగరా దని తోఁచును, నారాయణ భక్తియుక్తి నా చిత్తమునన్. |
15 |
| క. |
కీటకముఁ దెచ్చి భ్రమరము, పాటవమున బంభ్రమింప భ్రాంతంబై త త్కీటకము భ్రమరరూపముఁ, బాటించి వహించుఁగాదె భయయోగమునన్. |
16 |
| వ. | ఇవ్విధంబున | 17 |
| శా. |
కామోత్కంఠత గోపికల్ భయమునం గంసుండు వైర క్రియా సామగ్రిన్ శిశుపాలముఖ్యనృపతుల్ సంబంధులై వృష్ణులున్ బ్రేమన్ మీరలు భక్తి నేము నిదె చక్రిం గంటి మెట్లైన ను ద్దామ ధ్యానగరిష్ఠుఁడైన హరిఁ జెందన్‌వచ్చు ధాత్రీశ్వరా! |
18 |