| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| వ. | మఱియుం బెక్కండ్రు కామ ద్వేష భయ స్నేహ సేవాతిరేకంబులఁ జిత్తంబు హరిపరాయత్తంబుగాఁ జేసి తద్గతిం జెందిరి, హరి నుద్దేశించి క్రోధాదులైన ఏ నింటి లోపల నొక్కటియైన వేనునికి లేని నిమిత్తంబున నతండు వ్యర్థుండయ్యె. మీ తల్లికి చెలియలి కొడుకు లయిన శిశుపాల దంతవక్త్రులు దొల్లి విష్ణు మందిర ద్వారపాలకులు విప్రశాపంబునఁ బదభ్రష్టులై భూతలంబునన్ జన్మించి, రనిన విని యుధిష్ఠిరుండు నారదుని కిట్లనియె. | 19 |
| మ. |
అలుగం గారణ మేమి విప్రులకు? ము న్నా విప్రు లెవ్వారు? ని శ్చలు లేకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారు లీశాను వ ర్తులు వైకుంఠ పురీనివాసు లన విందున్, వారి కెబ్భంగి నీ ఖల జన్మంబులు వచ్చె? నారద! వినం గౌతూహలం బయ్యెడిన్. |
20 |
| వ. | అనిన నారదుం డిట్లనియె. ఒక్కనాఁడు బ్రహ్మమానస పుత్త్రులైన సనకసనందనాదులు దైవయోగంబున భువనత్రయంబునందును సంచరించుచు, నై దా ఱేండ్ల ప్రాయంపు బాలకుల భావంబున దిగంబరులయి హరి మందిరంబునకు వచ్చి చొచ్చు నెడ, మొగసాల నున్న పురుషు లిరువురు వారలం జూచి | 21 |
| క. |
డింభకుల ననర్గళ వి, స్రంభకుల రమాధినాథసల్లాపసుఖా రంభకుల ముక్తమానస, దంభకులం జొరఁగ నీక తరిమి రధీశా! |
22 |
| క. |
వారించిన తమకంబున, వా రించుక నిలువలేక వడిఁ దిట్టిరి దౌ వారికుల నసురయోని న, వారితులై పుట్టుఁడనుచు వసుధాధీశా! |
23 |
| వ. | మఱియు నా పిన్న పెద్దలు వారలం జూచి ‘మీర లీయెడ నుండ నర్హులు గారు. నారాయణ చరణమూలంబు విడిచి రజస్తమోగుణులైన రాక్షసయోనిం బుట్టుం”డని శపియించిన వారు నా శాపవశంబునఁ బదభ్రష్టులై కూలుచు మొఱలిడిన న మ్మహాత్ములు దయాళువులై క్రమ్మఱం గరుణించి మూఁడు జన్మంబులకు వైరంబున భగవత్సన్నిధానంబు గలిగెడు మని నిర్దేశించి చని, రివ్విధంబున శాపహతులై హరిపార్శ్వ చరులైన పురుషు లిరువురు హిరణ్యకశిపు హిరణ్యాక్షులన దితికి జన్మించి, రందుఁ గనిష్ఠుండైన హిరణ్యాక్షుని హరి వరాహ రూపంబున సంహరించె, నగ్రజుండయిన హిరణ్యకశిపుండు నరసింహమూర్తి యయిన శ్రీహరిచేత విదళితుండయ్యె, నతని కొడుకు ప్రహ్లాదుండు దండ్రిచేత హింసితుం డయ్యును నారాయణ పరాయణుండై శాశ్వతుం డయ్యె, రెండవ భవంబునఁ గైకసి యను రాక్షసికి రావణ కుంభకర్ణులయి సంభవించిన, విశ్వంభరుండు రఘుకులంబున రాఘవుండయి యవతరించి వారల వధియించె, న మ్మహాత్ముని పరాక్రమంబులు మార్కండేయ ఋషివలన నెఱింగెదవు, తృతీయజన్మంబున మీ తల్లి చెలియలికి శిశుపాల దంతవక్త్రులన నుద్భవించి. | 24 |
| శా. |
వక్రత్వం బెటు లేక పాయని మహావైరంబుతో నిత్య జా తక్రోధ స్మరణంబులన్ విదళితోద్యత్పాపసంఘాతులై చక్రచ్ఛిన్నశిరస్కులై మునివచశ్శాపావధిప్రాప్తులై చక్రిం జెందిరి వారు పార్శ్వచరులై సారూప్యభావంబునన్. |
25 |
| వ. | అనిన విని ధర్మనందనుం డిట్లనియె. | 26 |
| క. |
బాలున్ హరిపద చింతా, శీలున్ సుగుణాలవాలు శ్రీమ న్మేధా జాలున్ సంతోషింపక, యేలా శిక్షించె రాక్షసేంద్రుం డనఘా! |
27 |
| క. |
పరిభూత వ్యథనంబులు, నిరుపమ సంసార జలధి నిర్మథనంబుల్ నరకేసరి కథనంబులు, పరిరక్షిత దేవ యక్ష ఫణి మిథునంబుల్. |
28 |
| వ. | మునీంద్రా! వినిపింపు మనిన నారదుం డిట్లనియెఁ, కమలోదరుచేతం దన సహోదరుండు హతుం డయ్యె నని విని, హిరణ్యకశిపుండు రోష శోక దందహ్యమాన మానసుండయి ఘూర్ణిల్లుచు, నాభీల దావదహనజ్వాలా కరాళంబులయిన విలోకన జాలంబుల గగనంబునం బొగ లెగయ నిరీక్షింపుచుఁ దటిల్ల తాంకుర సంకాశ ధగద్ధగిత దంత సందష్ట దశనచ్ఛదుండును, నదభ్ర భయంకర భ్రుకుటిత ఫాలభాగుండును, నిరంతరాక్రాంత దురంతవైర వేగుండును నై మహాప్రభాజాల జటాలంబగు శూలంబుఁ గేల నందుకొని, సభామండపంబున నిలువంబడి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర, శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి ప్రముఖులైన దైత్య దానవుల నాలోకించి ఇట్లనియె. | 29 |
| శా. |
నాకుం దమ్ముఁడు, మీకు నెచ్చెలి, రణన్యాయైకదక్షుండు బా హాకుంఠీకృత దేవయక్షుఁడు హిరణ్యాక్షుండు, వానిన్ మహా సౌకర్యాంగము దాల్చి దానవవధూ సౌకర్యముల్ నీఱుగా వైకుంఠుండు వధించిపోయెనఁట! యీ వార్తాస్థితిన్ వింటిరే? |
30 |
| చ. |
వనముల నుండుఁ జొచ్చు మునివర్గములోపల ఘోణిగాఁడు, సం జనన మెఱుంగ రెవ్వరును, జాడ యొకింతయు లేదు, తన్ను డా సిన మఱి డాయు, వెంటఁబడి చిక్కక చిక్కఁడు, వీని నొక్క కీ లున మన మెల్ల లోఁబడక లోఁబడఁ బట్టుకొనంగ వచ్చునే? |
31 |
| సీ. |
భుజశక్తి నాతోడఁ బోరాడ శంకించి మున్నీట మునిఁగిన మునుఁగుఁగాక, యలయించి పెనఁగ నా యచలసంభ్రమమున కెఱఁగి వె న్నిచ్చిన నిచ్చుఁగాక, జగడంబు సైఁపక సౌకర్య కాంక్షి యై యిలక్రింద నీఁగిన నీఁగుఁగాక, క్రోధించి యటు గాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుఁ గాక, |
|
| ఆ. |
కఠినశూలధారఁ గంఠంబు విదళించి, వాని శోణితమున వాఁడి మెఱసి మత్సహోదరునకు మహిఁ దర్పణము సేసి, మెఱసి వత్తు, మీకు మేలు దెత్తు. |
32 |
| క. |
ఖండిత మూలద్రుమమున, నెండిన విటపముల భంగి నితఁడు వడిన నా ఖండల ముఖ్యులు వడుదురు, భండనమున నితఁడు దమకుఁ బ్రాణము లగుటన్. |
33 |
| సీ. |
పొండు దానవులార! భూసురక్షేత్ర సంగతయైన భూమికి గములు గట్టి మఖతపస్స్వాధ్యాయ మౌనవ్రతస్థుల వెదకి ఖండింపుఁడు, విష్ణుఁ డనఁగ నన్యుఁ డొక్కఁడు లేఁడు, యజ్ఞంబు వేదంబు నతఁడె, భూదేవ క్రియాది మూల మతఁడె, దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధార మతఁడె |
|
| తే. |
యే స్థలంబుల గో భూసురేంద్ర వేద, వర్ణ ధర్మాశ్రమంబులు వరుస నుండు నా స్థలంబుల కెల్ల మీ రరిగి చెఱచి, దగ్ధములు చేసి రండు మీ దర్ప మొప్ప. |
34 |
| వ. | అని యిట్లు నిర్దేశించిన దివిజమర్దను నిర్దేశంబులు శిరంబుల ధరియించి రక్కసులు పెక్కండ్రు భూతలంబునకుం జని. | 35 |
| సీ. |
గ్రామ పుర క్షేత్ర ఖర్వట ఖేట ఘోషారామ నగ రాశ్ర మాదికములు గాలిచి కొలఁకులు గలఁచి ప్రాకార గోపుర సేతువులు ద్రవ్వి, పుణ్యభూజ చయములు ఖండించి సౌధ ప్రపాగేహ పర్ణశాలాదులు పాడుచేసి సాధు గోబ్రాహ్మణ సంఘంబులకు హింస గావించి వేదమార్గములు సెఱచి |
|
| ఆ. |
కుతల మెల్ల నిట్లు కోలాహలంబుగా, దైత్యు లాచరింపఁ దల్లడిల్లి నష్టమూర్తు లగుచు నాకలోకము మాని, యడవులందుఁ జొచ్చి రమరవరులు. |
36 |
| వ. | అంత హిరణ్య కశిపుండు దుఃఖితుండై మృతుండైన సోదరునకు నుదక ప్రదానాది కార్యంబు లాచరించి యతని బిడ్డలగు శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ ప్రముఖుల నూఱడించి వారల తల్లితోఁగూడ హిరణ్యాక్షుని భార్యల నందఱ రావించి, తమ తల్లియైన దితి నవలోకించి యిట్లనియె. | 37 |
| శా. |
నీరాగారనివిష్ట పాంథుల క్రియన్ నిక్కంబు సంసార సం చారుల్ వత్తురు గూడి విత్తురు, సదా సంగంబు లేదొక్కచో శూరుల్ వోయెడి త్రోవఁ బోయెను భవత్సూనుండు దల్లీ! మహా శూరుం డాతఁడు త ద్వియోగమునకున్ శోకింప నీ కేటికిన్? |
38 |
| సీ. |
సర్వజ్ఞుఁ డీశుండు సర్వాత్ముఁ డవ్యయుం డమలుండు సత్యుఁ డనంతుఁ డాఢ్యుఁ డాత్మరూపంబున నశ్రాంతమును దన మాయా ప్రవర్తన మహిమ వలన గుణములఁ గల్పించి గుణసంగమంబున లింగ శరీరంబు లీలఁ దాల్చి కంపిత జలములోఁ గదలెడి క్రియఁ దోఁచు పాదపంబుల భంగి భ్రామ్యమాణ |
|
| ఆ. |
చక్షువుల ధరిత్రి చలిత యై కానంగఁ, బడిన భంగి వికల భావరహితుఁ డాత్మమయుఁడు కంపితాంత రంగంబునఁ, గదలినట్ల తోఁచుఁ గదలకుండు. |
39 |