| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | అష్టమస్కంధము |
| క. |
దానవు లమృతము ద్రావం బూని పయోరాశిఁ ద్రచ్చి పొగిలిన మాడ్కిన్ శ్రీనాథపరాఙ్ముఖులగు, హీనులు వొందంగఁ జాల రిష్టార్థంబుల్. |
326 |
| క. |
శోధించి జలధి నమృతము, సాధించి నిలింపవైరి చక్షుర్గతులన్ రోధించి సురల కిడి హరి, బోధించి ఖగేంద్రు నెక్కి పోయె నరేంద్రా! |
327 |
| క. |
శుద్ధముగ సురల కమృతము, సిద్ధించిన నసురవరులు సిడిముడిపడుచున్ గ్రుద్ధులు నానాయుధ సన్నద్ధులు నయి యుద్ధమునకు నడచిరి బలిమిన్. |
328 |
| క. |
ధన్యులు వైరోచని శత, మన్యుప్రముఖులు మదాభిమానులు దమలో నన్యోన్యరణము బాణా, సిన్యాసంబులను బేర్చి చేసిరి కడిమిన్. |
329 |
| మ. |
అరుదై కామగమై మయాసురకృతంబై లోకితాలోక్యమై వరశస్త్రాస్త్రసమేతమై తరళమై వైహాయసంబై మహా సురయోధాన్వితమైన యానమున సంశోభిల్లెఁబూర్ణేందు సు స్థిరకాంతిన్ బలి చామరధ్వజచమూదీప్తస్థితిన్ ముందటన్. |
330 |
| వ. | మఱియు నముచి శంబర బాణ ద్విమూర్ధ కాలనాభ శకుని జంభాయోముఖ ప్రహేతి హేతి భూత సంత్రాస హయగ్రీవ కపిలేల్వ లోత్కల మేఘదుందుభి మయ త్రిపురాధిప విప్రచిత్తి విరోచన వజ్రదంష్ట్ర తార కారిష్టారిష్టనేమి శుంభ నిశుంభ శంకుశిరః ప్రముఖులును, బౌలోమ కాలకేయులును, నివాత కవచ ప్రభృతులును, దక్కిన దండ యోధులునుం గూడికొని యరదంబులం దురంగంబుల మాతంగంబుల హరిణంబుల హరి కిరి కీట జలచరంబులను, శరభ మహిష గవయ ఖడ్గ గండభేరుండ చమరీ జంబుక శార్దూల గోవృషాది మృగంబులను, గంక గృధ్ర కాక కుక్కుట బక శ్యేన హంసాది విహంగంబులను, దిమి తిమింగిలాది జలచరంబులను, నరులను, నసుర సుర నికర వికృతి విగ్రహరూపంబులగు జంతువులను నారోహించి, తమకు నడియాలంబులగు గొడుగులు జోడుఁగైదువులు పక్కెరలు బొమిడికంబులు మొదలగు పోటు ముట్లాయితంబుగఁ గైకొని వేఱు వేఱ మొనలై విరోచననందనుండగు బలిముందట నిలువంబడిరి; దేవేంద్రుండును నైరావతారూఢుఁడై వైశ్వానర వరుణవాయు దండధరా ద్యనేక నిర్జరవాహినీ సందోహంబును, దాను నెదురుపడి పిఱు తివియక మోహరించె; నట్లు సంరంభసన్నాహ సముత్సాహంబుల రెండు దెఱంగుల వారునుం బోరాడు వేడుకల మీఁటగు మాటల సందడించుచున్న సమయంబున, | 331 |
| సీ. |
వజ్రదంష్ట్రాంచితవ్యజనంబులును బర్హ చామరంబులు సితచ్ఛత్త్రములును జిత్రవర్ణధ్వజచేలంబులును వాత చలితోత్తరోష్ణీషజాలములును జప్పుళ్ల నెసఁగు భూషణ కంకణంబులుఁ జండాంశురోచుల శస్త్రములును వివిధఖేటకములు వీరమాలికలును బాణపూర్ణములైన తూణములును |
|
| ఆ. |
నిండి పెచ్చురేఁగి నిర్జరాసురవీర, సైన్యయుగ్మకంబు సాల నొప్పె గ్రాహతతులతోడఁగలహంబునకు వచ్చు, సాగరముల భంగి జనవరేణ్య! |
332 |
| క. |
భేరీభాంకారంబులు వారణఘీంకారములును వరహరిహేషల్ భూరిరథనేమిరవములు ఘోరములై పెల్లగించెఁగులశైలములన్. |
333 |
| వ. | ఇ వ్విధంబున నుభయబలంబులును మోహరించి బలితో నింద్రుండును, దారకునితో గుహుండును, హేతితో వరుణుండును, బ్రహేతితో మిత్రుండును, గాలనాభునితో యముండును, మయునితో విశ్వకర్మయు, శంబరునితోఁద్వష్టయు, విరోచనునితో సవితయు, నముచితోఁబరాజితుండును, వృషపర్వునితో నశ్వినీ దేవతలును, బలిసుతబాణాది పుత్త్రశతంబుతో సూర్యుండును, రాహువుతో సోముండును, బులోమునితో ననిలుండును, శుంభ నిశుంభులతో భద్రకాళీదేవియు, జంభునితో వృషాకపియును, మహిషునితో విభావసుండును, నిల్వల వాతాపులతో బ్రహ్మపుత్త్రులును, దుర్మర్షణునితోఁగామదేవుండును, నుత్కలునితో మాతృకా గణంబును, శుక్రునితో బృహస్పతియు, నరకునితో శనైశ్చరుండును, నివాతకవచులతో మరుత్తులును, గాలేయులతో వసువులు నమరులును, బౌలోములతో విశ్వేదేవగణంబును, గ్రోధవశులతో రుద్రులును, నివ్విధంబునం గలసి పెనంగి ద్వంద్వ యుద్ధంబు సేయుచు మఱియు రథికులు రథికులను, పదాతులు పదాతులను, వాహనారూఢులు వాహనారూఢులను దాఁకి సింహనాదంబులు సేయుచు, నట్టహాసంబు లిచ్చుచు నాహ్వానంబు లొసంగుచు, నన్యోన్య తిరస్కారంబులు సేయుచు, బాహునాదంబుల విజృంభించుచుఁ, బెనుబొబ్బల నుబ్బిరేఁగుచు, హుంకరించుచు, నహంకరించుచు, ధనుర్గుణంబులం డంకరించుచు, శరంబుల నాఁటించుచుఁ, బరశువుల నఱకుచుఁ, జక్రంబులం జెక్కుచు, శక్తులం దునుముచుఁ, గశలం బెట్టుచుఁ, గుఠారంబులఁబొడుచుచు, గదల నడచుచుఁ, గరంబులఁ బొడుచుచుఁ, గరవాలంబుల వ్రేయుచుఁబట్టిసంబుల నొంచుచుఁ, బ్రాసంబులం ద్రెంచుచుఁ, బాశంబులం గట్టుచుఁ, బరిఘంబుల మొత్తుచు, ముసలంబుల మోఁదుచు, ముద్గరంబులఁజదుపుచు, ముష్టివలయంబుల ఘట్టించుచుఁ, దోమరంబుల నుఱుముచు, శూలంబులఁజిమ్ముచు, నఖంబులం జీరుచుఁ, దరుశైలంబుల ఱువ్వుచు, నుల్ముకంబులం జూఁడుచు నిట్లు బహువిధంబులం గలహవిహారంబులు సలుపు నవసరంబున భిన్నంబులైన శిరంబులును, విచ్ఛిన్నంబులైన కపాలంబులును, వికలంబులైన కపోలంబులును, జిక్కువడిన కేశబంధంబులును, భగ్నంబులైన దంతంబులును, గృత్తంబులైన భుజంబులును, ఖండితంబులైన కరంబులును, విదళితంబులైన మధ్యంబులును, వికృతంబులైన వదనబింబంబులును, వికలంబులైన నయనంబులును, వికీర్ణంబులైన కర్ణంబులును, విశీర్ణంబులైన నాసికలును, విఱిగి పడిన యూరుదేశంబులును, విసంధులైన పదంబులును, జిరిఁగిన కంకటంబులును, రాలిన భూషణంబులును, వ్రాలిన కేతనంబులును, గూలిన ఛత్రంబులును, మ్రొగ్గిన గజంబులును, నుగ్గయిన రథంబులును, నుఱుమైన హయంబులును, జిందఱవందఱలైన భటసమూహంబులును, నొఱలెడు కొఱప్రాణంబులును, బొరలెడు మేనులును, నుబ్బియాడెడు భూతంబులును, బాఱెడు రక్తప్రవాహంబులును, గట్టలు గొన్న మాంసంబులును, నెగసి తిరిగెడి కళేబరంబులును, గలకలంబులు సేయు కంక గృధ్రాది విహంగంబులు నయి యొప్పు న ప్పో రతిఘోరంబయ్యె నప్పుడు. | 334 |
| శా. |
నాకాధీశుఁబదింట; మూఁట గజమున్, నాల్గింట గుఱ్ఱంబుల న్నేకాస్త్రంబున సారథిం జొనిపె, దైత్యేంద్రుండు వీఁకన్ వియ ల్లోకాధీశుఁడు ద్రుంచి యన్నిటిని దోడ్తో నన్నిభల్లంబులన్ రాకుండన్ రిపువర్గముందునిమె గీర్వాణారి యగ్గింపఁగన్. |
335 |
| సీ. |
తన తూపులన్నియుఁ దరమిడి శక్రుండు నఱికిన జోదు విన్ననువు మెఱసి బలి మహాశక్తిచేఁ బట్టిన నదియును నతఁడు ఖండించె నత్యద్భుతముగ; మఱి ప్రాసశూల తోమరములు గైకొన్నఁదోడ్తోడ నవియును దునిమివైచె; నంతటఁబోక యెయ్యది వాఁడు సంధించెఁ దొడరి తా నదియును దుమురు సేసె; |
|
| ఆ. |
నసురభర్త విరథుఁడై తన పగఱకుఁ, గానఁబడక వివిధ కపట వృత్తి నేర్పు మెఱసి మాయ నిర్మించె, మింటను వేల్పుగములు సూచి వెఱఁగు పడఁగ. |
336 |
| వ. | ఇట్లు దానవేంద్రుని మాయావిశేషవిధానంబున సురానీకంబులపైఁ బర్వతంబులు వడియె; దావాగ్ని దందహ్యమాన తరువర్షంబులు గురిసె; సటంక శిఖర నికరశిలాసారంబులు గప్పె; మహోరగ దందశూకంబులు గఱచె; వృశ్చికంబులు మీటె; వారాహ వ్యాఘ్ర సింహంబులు గదిసి విదళింపం దొరఁకొనియె; వనగజంబులు మట్టి మల్లాడం జొచ్చె; శూలహస్తులు దిగంబరులునై రండు రండని బలురక్కసులు శతసహస్రసంఖ్యులు భేదనచ్ఛేదన భాషణంబులు సేయం దొడంగిరి; వికృత వదనులు గదాదండధారులు నాలంబిత కేశ భారులునై యనేక రాక్షస వీరులు ‘పోనీకు పోనీకుఁడు; తునుము తునుముం’డని వెనుతగిలిరి; పరుష గంభీర నిర్ఘాత సమేతంబులయిన జీమూత సంఘాతంబులు వాతాహతంబులై యుప్పతిల్లి నిప్పుల కుప్పలు మంటల ప్రోవులం గురిసె; మహాపవన విజృంభితంబైన కార్చిచ్చు ప్రళయానలంబు చందంబునం దరికొనియెఁ, బ్రచండ ఝంఝానిల ప్రేరిత సముత్తుంగ తరంగావర్తభీషణంబయిన మహార్ణవంబు సెలియలికట్ట దాఁటి వెల్లి విరిసి నట్లమేయంబై యుండె; నా సమయంబునం బ్రళయకాలంబునుం బోలె మిన్ను మన్నును, రేయుంబగలని యెఱుంగ రా దయ్యె; నయ్యవసరంబున. | 337 |
| క. |
ఆ యసురేంద్రుని బహుతర, మాయాజాలంబులకును మా ఱెఱుఁగక వ జ్రాయుధముఖరాదిత్యు ల, పాయంబునుఁబొంది చిక్కువడిరి నరేంద్రా! |
338 |
| వ. | అప్పుడు. | 339 |
| క. |
ఇయ్యసురులచేఁ జిక్కితి, మెయ్యది దెరు? వెందుఁజొత్తు? మిటు వొలయఁగదే యయ్యా! దేవ! జనార్దన!, కుయ్యో! మొఱ్ఱో! యటంచుఁ గూయిడి రమరుల్. |
340 |
| వ. | అట్లు మొఱయిడు నవసరంబున. | 341 |
| మ. |
విహగేంద్రాశ్వనిరూఢుఁడై మణిరమావిభ్రాజితోరస్కుఁడై బహుశస్త్రాస్త్రరథాంగసంకలితుఁడై భాస్వత్కిరీటాది దు స్సహుఁడై నవ్యపిశంగచేలధరుఁడై సంఫుల్లపద్మాక్షుఁడై విహితాలంకృతితోడ మాధవుఁడు దా వేంచేసె నచ్చోటికిన్. |
342 |
| చ. |
అసురులమాయ లన్నియును నబ్జదళాక్షుఁడు వచ్చినంతటన్ గసిబిసియై నిరర్థమయి గ్రక్కునఁ బోయెను; నిద్రనొంది సం తసమున మేలుకొన్నగతిఁ దాల్చి చెలంగిరి వేల్పులందఱుం బస సెడ కేల యుండు హరిపాదపరిష్కృతిసేయ నాపదల్? |
343 |
| వ. | అయ్యెడ. | 344 |
| ఆ. |
కాలనేమి ఘోరకంఠీరవము నెక్కి, తార్క్ష్యు శిరము శూలధారఁబొడువ నతని పోటుముట్టు హరి కేల నంకించి, దానఁజావఁబొడిచె దానవునిని. |
345 |
| క. |
పదపడి మాలిసుమాలులు, బెదరించినఁ దలలు ద్రుంచెఁ బృథుచక్రహతిన్ గదఁగొని గరుడుని ఱెక్కలు, సెదరించిన మాల్యవంతు శిరమున్ వ్రేసెన్. |
346 |
| వ. | ఇట్లు పరమపురుషుండగు హరి కరుణాపరత్వంబునఁ బ్రత్యుపలబ్ధమనస్కులైన వరుణవాయువాసవ ప్రముఖులు పూర్వంబున నెవ్వ రెవ్వరితోఁ గయ్యంబు సేయుదురు, వారు వారలం దలపడి నొప్పించి; ర య్యవసరంబున. | 347 |
| క. |
బాహుబలంబున నింద్రుఁడు, సాహసమున బలిని గెలువ సమకట్టి సము త్సాహమున వజ్ర మెత్తిన, హాహా నినదంబు సేసి రఖిలజనంబుల్. |
348 |
| వ. | ఇట్లు సముద్యత భిదుర హస్తుండై యింద్రుండు దన పురోభాగంబునం బరాక్రమించుచున్న విరోచన నందను ఉపలక్షించి యిట్లనియె. | 349 |
| మ. |
‘జగతిన్ వైరి మొఱంగి గెల్చుటదియున్ శౌర్యంబె? ధైర్యంబె?తా మగవాఁడయ్యునుఁ దన్నుఁ దా నెఱిఁగి సామర్థ్యంబునుం గల్గియున్ బగవానిం గని డాఁగెనేని మెయి సూపంజాలఁడేనిం గటా! నగరే బంధులు? దిట్టరే బుధులు? గన్యల్ గూర్తురే? దానవా! |
350 |
| శా. |
మాయల్ సేయఁగ రాదు పో; నగవులే మాతోడి పోరాటముల్? దాయా! చిక్కితి; వ్రక్కలించెదఁ గనద్దంభోళిధారాహతిన్; నీ యిష్టార్థము నెల్లఁ జూడుము వెసన్ నీ వారలం గూడుకో నీ యాటోపము నిర్జరేంద్రుఁ డడఁచున్ నేఁ డాజిలో దుర్మతీ! |
351 |
| వ. | అని యుపాలంభించిన విని విరోచననందనుం డిట్లనియె. | 352 |
| శా. |
నీవే పోటరివే? సురేంద్ర! తెగడన్ నీకేల? గెల్పోటముల్ లేవే? యెవ్వరిపాలఁబోయినవి? మేల్గీడుల్ విరించ్యాదులుం ద్రోవంజాలుదు రెవ్విధానమున సంతోషింప శోకింప నా దైవం బేమి? కరస్థలామలకమే! దర్పోక్తులుం బాడియే? |
353 |
| ఆ. |
జయము లపజయములు సంపద, లాపద లనిలచలితదీపికాంచలములు చంద్రకళలు మేఘచయములు దరఁగలు మెఱుఁగు లమరవర్య! మిట్టిపడకు. |
354 |
| వ. | అని యి ట్లాక్షేపించి. | 355 |
| క. |
వీరుఁడు దానవనాథుఁడు, నారసముల నింద్రుమేన నాఁటించి మహా ఘోరాయుధకల్పములగు, శూరాలాపములు సెవులఁజొనిపెన్ మరలన్. |
356 |
| వ. | ఇట్లు తథ్యవాదియైన బలిచే నిరాకృతుండై. | 357 |
| క. |
శత్రువు నాక్షేపంబునఁ, దోత్రాహతగజము భంగిఁ ద్రుళ్ళుచు బలి నా వృత్రారి వీచి వైచిన, గోత్రాకృతి నతఁడు నేలఁగూలె నరేంద్రా! |
358 |
| క. |
చెలికానిపాటు గనుఁగొని, బలిసఖుఁడగు జంభుఁ డతులబాహాశక్తిం జెలితనము సాల నెఱపుచు, నిలు నిలుమని వీఁకఁ దాఁకె నిర్జరనాథున్. |
359 |
| క. |
పంచాననవాహనుఁడై, చంచద్గద జంభుఁ డెత్తి శైలారిని దాఁ కించి సురేభంబును నొప్పించి, విజృంభించి యార్చి పేర్చెం గడిమిన్. |
360 |
| క. |
వీఁక సెడి ఘనగదాహతిఁ, దోఁకయుఁ గదలింపలేక దుస్సహపీడన్ మోఁకరిలఁబడియె నేలను, సోఁకోర్వక దిగ్గజంబు సుడిసుడిగొంచున్. |
361 |
| వ. | అయ్యెడ. | 362 |
| క. |
సారథి వేయుహయంబుల, తే రాయితపఱచి తేర దేవేంద్రుఁడు దా నారోహించెను దైత్యుఁ, డుదారత మాతలిని శూలధారంబొడిచెన్. |
363 |
| ఆ. |
శూలనిహతి నొంది స్రుక్కక యార్చిన, సూతు వెఱకు మంచు సురవిభుండు వాని శిరముఁ దునిమె వజ్రఘాతంబున, దైత్యసేన లెల్లఁ దల్ల డిల్ల. |
364 |
| చ. |
చని సురనాథుచేఁ గలన జంభుఁడు సచ్చుట నారదుండు సె ప్పిన విని వానిభ్రాతలు గభీరబలాధికుఁడా బలుండు పా క నముచు లాపురందరునిఁగాంచి ఖరోక్తులఁ దూలనాడుచున్ ఘనజలధారలన్ నగముఁ గప్పిన చాడ్పునఁ గప్పిరమ్ములన్. |
365 |
| సీ. |
విబుధలోకేంద్రుని వేయుగుఱ్ఱంబుల నన్ని కోలల బలుఁ డదర నేసె నిన్నూట మాతలి నిన్నూట రథమును నా రీతి నింద్రు ప్రత్యంగకమును వేధించెఁ; బాకుండు వింట వాఁడస్త్రంబు లేయుట దొడుగుట యెఱుఁగరాదు; కనకపుంఖంబుల కాండంబు లొకపది యేనింట నముచియు నేసి యార్చె; |
|
| ఆ. |
బలిమి నిట్లు ముగురు పగవాని రథసూత, సహితు ముంచి రస్త్రజాలములను వనజలోకసఖుని వానకాలంబున, మొగిలుగములు మునుఁగ మూఁగినట్లు |
366 |
| వ. | అయ్యవసరంబున. | 367 |
| మ. |
అమరారాతుల బాణజాలముల పాలై పోయితే చెల్లరే యమరాధీశ్వర! యంచు భిన్నతరులై యంభోధిలోఁ జంచల త్వమునం గ్రుంకు వణిగ్జనంబుల క్రియన్ దైత్యాధిపవ్యూహ మ ధ్యమునం జిక్కిరి వేల్పు లందఱు విపద్ధ్వానంబులం జేయుచున్. |
368 |
| శా. |
‘ఓహో దేవతలార! కుయ్యిడకుఁ; డే నున్నాఁడ’ నంచంబు భృ ద్వాహుండాశరబద్ధపంజరము నంతం జించి తేజంబునన్ వాహోపేతరథంబుతోడ వెలికిన్ వచ్చెన్ నిశాంతోల్లస న్మాహాత్మ్యంబునఁ దూర్పునంబొడుచు నా మార్తాండుచందంబునన్. |
369 |
| వ. | ఇట్లు వెలువడి. | 370 |
| చ. |
విఱిగిన సేనఁ గాంచి సురవీరుఁ ‘డొహో!’ యని బిట్టు చీరి క్ర మ్మఱఁ బురికొల్పి పాకబలమస్తకముల్ నిశితాస్త్రధారలన్ నెఱసిన తీక్ష్ణవజ్రమున నేలకు వ్రాల్చెను వానిచుట్టముల్ వెఱచిరి; తచ్చమూపతులు విహ్వలులై చెడి పాఱి రార్తితోన్. |
371 |
| వ. | అప్పుడు నముచి నిలువంబడి. | 372 |
| మ. |
తన చుట్టంబులఁ జంపె వీఁడనుచు నుద్యత్క్రోధశోకాత్ముఁడై కనకాంతంబును నశ్మసారమయమున్ ఘంటాసమేతంబునై జనదృగ్దుస్సహమైన శూలము నొగిన్ సారించి వైచెన్ సురేం ద్రునిపై ‘దీన హతుండ వౌ’ దని మృగేంద్రుం బోలి గర్జించుచున్. |
373 |
| శా. |
ఆకాశంబున వచ్చుశూలమును జంభారాతి ఖండించి నా నా కాండంబుల వాని కంఠము దెగ న్దంభోళియున్ వైచె న స్తోకేంద్రాయుధమున్ సురారిగళముం ద్రుంపంగ లేదయ్యె; వాఁ డాకంపింపక నిల్చె దేవవిభుఁ డత్యాశ్చర్యముం బొందఁగన్. |
374 |
| వ. | ఇట్లు నిలిచి యున్న నముచిం గనుంగొని వజ్రంబు ప్రతిహతం బగుటకు శంకించి బలభేది దన మనంబున. | 375 |
| సీ. |
‘కొండలఱెక్కలు ఖండించి వైచుచో వజ్రమెన్నఁడు నింత వాఁడి సెడదు వృత్రాసురాదుల విదళించుచో నిది దిరుగ దెన్నఁడు పనిఁదీర్చికాని యింద్రుండఁగానొకో యేను దంభోళియుఁ గాదొకో యిది ప్రయోగంబు సెడెనొ దనుజాధముఁడు మొనతాఁకుఁ దప్పించెనో భిదురంబు నేఁడేల బెండువడియె!’ |
|
| ఆ. |
ననుచు వజ్రి వగవ నార్ద్ర శుష్కంబులం, జావకుండఁ దపము సలిపె నీతఁ డితర మెద్ది యైన నింద్ర! ప్రయోగింపు, వైళ’ మనుచు దివ్యవాణి పలికె. |
376 |
| వ. | ఇట్లాదేశించిన దివ్యవాణి పలుకు లాకర్ణించి పురందరుండు. | 377 |
| ఆ. |
ఆత్మబుద్ధిఁ దలఁచి యార్ద్రంబు శుష్కంబు గాని సాధనంబు ఫేన మనుచు నది యమర్చి దాన నమరులు మెచ్చంగ నముచి శిరముఁ ద్రుంచె నాకవిభుఁడు. |
378 |
| వ. | అ య్యవసరంబున. | 379 |
| సీ. |
పురుహూతు నగ్గించి పుష్పాంజలులు సేసి మునులు దీవించిరి ముదము తోడ గంధర్వముఖ్యులు ఘనులు విశ్వావసుఁడును బరావసుఁడు నింపెనయఁ బాడి రమరాంగనాజను లాడిరి; దేవతా దుందుభులును మ్రోసె దురములోన వాయు వహ్ని కృతాంత వరుణాదులును బ్రతిద్వంద్వుల గెల్చి రుద్దండవృత్తి |
|
| తే. |
నల్పమృగముల సింహంబు లట్ల తోలి, రమరవర్యులు దనుజుల నదటు వాయ నజుఁడు పుత్తేర నారదుఁ డరుగు దెంచె, దైత్యహరణంబు వారింప ధరణినాథ! |
380 |
| వ. | వచ్చి సురలకు నారదుం డిట్లనియె. | 381 |
| శా. |
సిద్ధించెన్ సురలార! మీ కమృతమున్; శ్రీనాథసంప్రాప్తులై వృద్ధిం బొందితి రెల్లవారలును; విద్వేషుల్ మృతిం బొంది రీ యుద్ధం బేటికి? నింకఁ జాలుఁ; బనిలేదో హో పురే;’ యంచు సం బద్ధాలాపము లాడి మాన్చె సురలం బాండవ్యవంశాగ్రణీ! |
382 |
| వ. | ఇట్లు నారదవచననియుక్తులై రాక్షసులతోడి సంగ్రామంబు సాలించి సకలదేవముఖ్యులును ద్రివిష్టపంబునకుం జనిరి; హతశేషులైన దైత్యదానవులు విపన్నుండైన బలిం దోడ్కొని పశ్చిమశిఖరిశిఖరంబుఁ జేరిరి; విధ్వంసమానకంధరులై వినష్టదేహులగు యామినీచరుల నెల్లను శుక్రుండు మృతసంజీవనియైన తనవిద్య పెంపునం జేసి బ్రదికించె; బలియును భార్గవానుగ్రహంబున విగతశరీరవేదనుండై పరాజితుండయ్యును లోకతత్త్వవిచక్షణుండగుటం జేసి దుఃఖింపక యుండె నని చెప్పి రాజునకు శుకుండిట్లనియె. | 383 |
| సీ. |
‘కైలాసగిరిమీఁద ఖండేందుభూషణుఁ డొకనాఁడు గొలువున నున్నవేళ నంగనయై విష్ణుఁ డసురుల వంచించి, సురలకు నమృతంబు సూఱ లిడుట విని దేవియును దాను వృషభేంద్రగమనుఁడై కడువేడ్క భూతసంఘములు గొలువ మధుసూదనుండున్న మందిరంబున కేగి పురుషోత్తముని చేతఁ బూజ వడసి |
|
| తే. |
తాను గూర్చుండి పూజించె దనుజవైరిఁ, గుశలమే మీకు మాకును గుశల మనుచు మధురభాషల హరిమీఁద మైత్రి నెఱపి, హరుఁడు పద్మాక్షుఁ జూచి యిట్లనియెఁ బ్రీతి. |
384 |
| సీ. |
దేవ! జగన్మయ! దేవేశ! జగదీశ! కాలజగద్వ్యాపకస్వరూప! యఖిలభావములకు నాత్మయు హేతువు నైన యీశ్వరుఁడ వాద్యంతములును మధ్యంబు బయలును మఱి లోపలయు లేక పూర్ణమై యమృతమై భూరిసత్య మానందచిన్మాత్ర మవికార మాద్య మనన్య మశోకంబు నగుణ మఖిల |
|
| తే. |
సంభవస్థితిలయముల దంభకంబు, నైన బ్రహ్మంబు నీవ; నీ యంఘ్రియుగము నుభయసంగవిసృష్టులై యున్న మునులు, గోరి కైవల్యకాములై కొల్తు రెపుడు. |
385 |
| సీ. |
భావించి కొందఱు బ్రహ్మంబు నీ వని తలపోసి కొందఱు ధర్మ మనియుఁ జర్చించి కొందఱు సదసదీశ్వరుఁ డని సరవిఁగొందఱు శక్తిసహితుఁ డనియుఁ జింతించి కొందఱు చిరతరుండవ్యయుఁ డాత్మతంత్రుఁడు పరుండధికుఁ డనియుఁ దొడరి యూహింతురు తుది నద్వయద్వయ సదసద్విశిష్టసంశ్రయుఁడ వీవు; |
|
| తే. |
తలఁప నొక్కింత వస్తుభేదంబు గలదె, కంకణాదులు పసిఁడి యొక్కటియ కాదె? కడలు పెక్కైన వార్ధి యొక్కటియ కాదె? భేద మంచును నిను వికల్పింపవలదు. |
386 |
| సీ. |
యద్విలాసము మరీచ్యాదు లెఱుంగరు; నిత్యుఁడనై యున్న నేను నెఱుఁగ యన్మాయ నంధులై యమరాసురాదులు వనరెద రఁట; యున్న వారలెంత? యే రూపమునఁ బొంద కేపారుదువు నీవు; రూపివై సకలంబు రూపుసేయ రక్షింపఁ జెఱుపఁ గారణమైన సచరాచరాఖ్యమై విలసిల్లు దంబరమున |
|
| తే. |
ననిలుఁ డే రీతి విహరించునట్ల నీవు, గలసి వర్తింతు సర్వాత్మకత్వ మొప్ప; జగములకు నెల్ల బంధమోక్షములు నీవ, నీవ సర్వంబుఁ దలపోయ నీరజాక్ష! |
387 |
| మ. |
ఘనతన్ నీ మగపోఁడుముల్ పలుమఱుంగన్నారఁ గన్నార; మే నిను విన్నారము; చూడ మెన్నఁ డును మున్ నీ యాఁడు చందంబు; మో హినివై దైత్యులఁ గన్నుఁబ్రామి యమృతంబింద్రాదిదేవాళి కి చ్చిన నీ రూపముఁ జూపుమా! కుతుకముంజిత్తంబునంబుట్టెడిన్. |
388 |
| క. |
మగవాఁడ వై జగంబులఁ, దగిలిచి చిక్కులను బెట్టు దంటకు నీకున్ మగువతనంబున జగములఁ, దగులము బొందింప నెంతతడవు ముకుందా! |
389 |
| వ. | అని పలుకుచున్న శూలపాణిచే నపేక్షితుండై విష్ణుండు భావగంభీరమగు నవ్వు నివ్వటిల్ల నవ్వామ దేవున కిట్లనియె. | 390 |
| శా. |
‘శ్రీకంఠా! నిను నీవ యేమఱకుమీ చిత్తంబు రంజించెదన్ నాకద్వేషుల డాఁగురించుటకునై నాఁడేను గైకొన్న కాం తాకారంబు జగన్నిమజ్జనము నీవై చూచెదేఁజూపెదం గైకో నర్హము లండ్రు కాముకులు సంకల్పప్రభూతార్థముల్’. |
391 |