పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము అష్టమస్కంధము
శ్రీహరి తన మోహినీ రూపంబుచే నీశ్వరుని మోహింపఁజేయుట
వ. అని పలికి, కమలలోచనుం డంతర్హితుండయ్యె; నయ్యుమా సహితుం డయిన భవుండు విష్ణుండెటు వోయెనో యెందుఁజొచ్చెనోయని దిశదిశలం గలయ నవలోకించుచుండం దన పురోభాగంబున. 392
సీ. ఒక యెలదోఁటలో నొకవీథి నొక నీడఁ గుచకుంభములమీఁది కొంగు దొలఁగఁ
గబరికాబంధంబు గంపింప నుదుటిపైఁ జికురజాలంబులు సిక్కువడఁగ
ననుమానమై మధ్యమల్లాడఁజెక్కులఁ గర్ణకుండలకాంతి గంతు లిడఁగ
నారోహభరమున నడుగులు దడఁబడఁ దృగ్దీప్తిసంఘంబు దిశలఁగప్ప
 
తే. వామకరమున జాఱిన వలువఁబట్టి, కనకనూపురయుగళంబు గల్లనంగఁ
గంకణంబుల ఝణఝణత్కార మెసఁగ, బంతిచే నాడు ప్రాయంపుటింతిఁగనియె.
393
వ. కని, మున్ను మగువ మరగి సగమయిన మగవాఁ డమ్మగువ వయో రూప గుణ విలాసంబులు దన్ను నూరింపం గనుఱెప్ప వ్రేయక తప్పక చూచి మెత్తనయిన చిత్తంబున. 394
శా. ‘ఈ కాంతాజనరత్న మెవ్వరిదొకో? యీ యాఁడురూపంబు ము
న్నే కల్పంబులయందుఁ గాన; మజుఁ డీ యింతిన్‌ సృజింపంగఁ దా
లేకుంటెల్ల నిజంబు, వల్లభత నీ లీలావతిం జేరఁగా
నే కాంతుండు గలండొ క్రీడలకు నా కీ యింతి సిద్ధించునే?’
395
వ. అని మఱియుం జెఱకువిలుతుని కోలలు మేరమీఱి దఱుమ నెఱబిరుదు వెఱఁగుపడం దెఱవ దుఱిమిన తుఱుము బిగిముడి వదలి కదలి భుజముల మెడల నదరి చెదరిన కురులు నొసలి మృగమద తిలకంపుటసలు మసల, విసవిస నగు మొగము మెఱుంగులు దశదిశలం బసలు కొలుపఁ, జిఱునగవు మెఱయ నునుఁ జెమటం దడంబడి పులకరములు గులకరములు గొన, హృదయానందఁకందంబగు కందుకంబు గరారవిందంబునం దమర్చి, యక్కునం జేర్చి, చెక్కున హత్తించి, చుబుకంబు మోపి, చూచుకంబులం గదియించి, నఖంబుల మీటుచు, మెల్లమెల్లన గెల్లాడు కరకమలంబులఁ గనక మణివలయంబులు ఝణఝణయనం గుచకలశంబు లొండొంటి నొరయ, నెడమఁ గుడినిం దడంబడఁ గ్రమ్మన నెగురఁ జిమ్ముచు, నెగురఁ జిమ్మి తనకుఁ దానె కొన్ని చిన్ని పన్నిదంబులు సేసికొని బడుగునడుము బెడఁకి వడ వడ వడంకి నఱితి సరులు గలయం బడఁ దిరుగుచుఁ దిరుగునెడఁ బెనఁకువలుగొనఁ జెవుల తొడవుల రుచులు గటముల నటనములు సలుపఁ, బవిరి తిరిగి యొడియుచు, నొడిసి కెలంకులం జడియుచు, జడిసి జడనుపడక వలువ నెలవు వదలి దిగంబడం, గటిస్థలంబునఁ గాంచీ కనకమణి కింకిణులు మొరయఁ, జరణ కటకమ్ములు గల్లు గల్లు మనం, గరకంకణ మణి గణములు మెఱయ, మితి దప్పిన మోహాతిరేకం బుప్పొంగ వెనుకొని యుఱికి పట్టుచుఁ, బట్టి పుడమిం బడవైచి, పాటు వెంటనే మింటికెగసినం గెంటక కరంబునం గరంబు దిరంబయి పలుమఱు నెగయ నడుచుచు, నెగయు నెడం దిగంబడు తఱిని నీలంపు మెఱుంగు నిగ్గు సోగపగ్గంబుల వలలు వైచిరాఁ దిగిచిన పగిది వెనుకొనంగ, విలోకన జాలంబులు నిగిడించుచు, మగిడించుచుఁ, గర లాఘవంబున నొకటి, పది, నూఱు, వేయు సేసి నేర్పులు వాటించుచు, నరుణ చరణకమల రుచుల నుదయ శిఖరి శిఖర తరణి కరణి సేయుచు, ముఖచంద్ర చంద్రికలఁ జంద్రమండలంబులు గావించుచు, నెడ నెడ నురోజ దుర్గ నిర్గతచేలాంచలంబుఁ జక్క నొత్తుచుఁ గపోలఫలకాలోల ఘర్మజలబిందు బృందంబులు నఖాంకురంబుల నొనరించుచు, నధరబింబారుణ సంభ్రాంత సమాగత రాజకీరంబులం జోపుచు, ముఖసరోజ పరిమళాసక్త మత్తమధుపంబుల నివారించుచు, మందగమనాభ్యాస కుతూహలాయత్తమరాళ యుగ్మంబులకుం దలంగుచు, విలాస వీక్షణానందిత మయూర మిథునంబులకు నెడఁగలుగుచుఁ, బొదరిండ్ల యీఱములకుం బోక మలంగుచుఁ, గరకిసల యాస్వాద కాముక కలకంఠ దంపతులకు దూరమగుచుఁ, దీఁగె యుయ్యెలల నూఁగుచు; మాధవీ మండపంబు లెక్కుచుఁ, గుసుమరేణు పటలంబుల గుబ్బళ్లు వ్రాఁకుచుఁ, మకరందస్యంద బిందుబృందంబు నుత్తరించుచుఁ, గృతక శైలంబుల నారోహించుచుఁ బల్లవ పీఠంబులం బరిశ్రమంబు పుచ్చుచు, లతాసౌధభాగంబులఁ బొడసూపుచు, నున్నత కేతకీ స్తంభంబుల నొరగుచుఁ, బుష్పదళ రచిత వాతాయనంబులం దొంగిచూచుచుఁ, గమల కాండ పాలికల నాలంబించుచుఁ, జంపక దేహళి మధ్యంబుల నిలువంబడుచుఁ; గదళికాపత్ర కవాటంబున నుద్ఘాటించుచుఁ, బరాగ నిర్మిత సాలభంజికా నివహంబుల నాదరించుచు, మణికుట్టిమంబుల మురియుచుఁ, జంద్రకాంత వేదికల నెలయుచు, రత్నపంజర శారికా నివహంబులకుం జదువులు సెప్పుచుఁ, గోరిన క్రియం జూచుచుఁ, జూచినక్రియ మెచ్చుచు, మెచ్చిన క్రియ వెఱఁగుపడుచు, వెఱఁగుపడిన క్రియ మఱచుచు, మఱవక యేకాంతం బగు నవ్వనాంతంబున ననంతవిభ్రమంబుల జగన్మోహినియై విహరించుచు నున్న సమయంబున. 396
ఆ. వాలుఁగంటి వాఁడి వాలారుఁజూపుల, శూలి ధైర్యమెల్లఁగోలుపోయి
తఱలి యెఱుకలేక మఱచె గుణంబుల, నాలి మఱచె నిజగణాలి మఱచె.
397
వ. అప్పుడు. 398
ఆ. ఎగురవైచి పట్ట నెడలేమిఁ జే దప్పి, వ్రాలు బంతిఁగొనఁగ వచ్చు నెడను
బడఁతి వలువ వీడి పడియె మారుతహతిఁ, జంద్రధరుని మనము సంచలింప.
399
మ. రుచిరాపాంగిని వస్త్రబంధనపరన్‌ రోమాంచవిభ్రాజితం
గుచభారానమితం, గరద్వయపుటీగూఢీకృతాంగిం, జల
త్కచబంధం, గని మన్మథాతురత నాకంపించి శంభుండు ల
జ్జ చలింపం, దన కాంత సూడఁ, గదిసెంజంద్రాస్య కేల్దమ్మికిన్‌.
400
ఆ. పదము సేరవచ్చు ఫాలాక్షుఁ బొడగని, చీరవీడి పడిన సిగ్గుతోడ
మగువ నగుచుఁదరుల మాటున డాఁగెను, వేల్పుఱేఁడు నబల వెంటఁ బడియె.
401
మ. ప్రబలోద్యత్కరిణిం గరీంద్రుఁడు రమింపన్‌ వచ్చు లీలన్‌ శివుం
డబలా! పోకుము; పోకుమీ యనుచు డాయంబాఱి కెంగేలఁ ద
త్కబరీబంధము వట్టి సంభ్రమముతోఁగౌఁగిళ్ల నోలార్చె నం
త బహిఃప్రక్రియ నెట్టకేనిఁగదియందద్బాహునిర్ముక్తయై.
402
సీ. వీడి వెన్నున నాడు వేణీభరంబుతో జఘనభారాగతశ్రాంతితోడ
మాయావధూటియై మఱలిచూచుచుఁ బాఱు విష్ణునద్భుతకర్ము వెంటఁదగిలి
యీశాను మరల జయించె మరుండనఁ గరిణి వెన్చను కరి కరణిఁదాల్చి
కొండలు నేఱులుఁగొలఁకులు వనములు దాఁటి శంభుఁడు సనందన్మహాత్ము
 
తే. నిర్మలామోఘవీర్యంబు నేలమీఁదఁ బడిన చోటెల్ల వెండియుఁబైఁడి యయ్యె
ధరణి వీర్యంబు వడఁదన్నుఁదా నెఱింగి దేవ మాయాజడత్వంబు దెలిసె హరుఁడు.
403
క. జగదాత్మకుఁడగు శంభుఁడు, మగిడెను హరి నెఱిఁగి తనదు మాహాత్మ్యమునన్‌
విగతత్రపుఁడై నిలిచెను, మగువతనంబుడిగి హరియు మగవాఁడయ్యెన్‌.
404
ఆ. కాము గెలువవచ్చుఁగాలారి గావచ్చు,మృత్యుజయము గలిగి మెఱయవచ్చు
నాఁడువారి చూపుటంపఱ గెలువంగ, వశము గాదు త్రిపురవైరి కైన.
405
వ. ఇట్లు పురుషాకారంబు వహించిన హరి హరున కిట్లనియె. 406
సీ. ‘నిఖిలదేవోత్తమ! నీ వొక్కరుఁడు దక్క నెవ్వఁడు నా మాయ నెఱుఁగ నేర్చు?
మానినియైన నా మాయచే మునుఁగక ధృతిమోహితుండవై తెలిసి తీవు
కాలరూపంబునఁగాలంబుతోడ నాయందును నీ మాయ యధివసించు
నీ మాయ నన్ను జయింప నేరదు నిజ మకృతాత్ములకు నెల్ల ననుపలభ్య
 
తే. మిపుడు నీ నిష్ఠపెంపున నెఱిఁగి’ తనుచు, సత్కరించిన సఖ్యంబు సాల నెఱపి
దక్షతనయ గణంబులుఁదన్నుఁగొలువ, భవుఁడు విచ్చేసెఁదగ నిజభవనమునకు.
407
శా. పారావారముఁద్రచ్చుచో గిరిసముద్వాహార్థమై కచ్ఛపా
కారుండైన రమేశువర్తనము నాకర్ణింపఁగీర్తింప సం
సారాంభోనిధిలో మునుంగు కుజనుల్‌ సంశ్రేయముంబొంది వి
స్తారోదారసుఖంబుఁజెందుదురు తథ్యంబింతయున్‌ భూవరా!
408
మ. ఎలమిన్‌ దైత్యుల నాఁడురూపమున మోహింపించి పీయూషముం
జలితాపన్నులకున్‌ సురోత్తములకుం జక్కన్‌ విభాగించి ని
ర్మలరేఖన్‌ విలసిల్లు శ్రీ విభునిఁ దన్మాయావధూరూపముం
దలఁతున్‌ మ్రొక్కుదు నాత్మలోన దురితధ్వాంతార్కరూపంబుగన్‌.
409
వ. అని చెప్పి శుకుండిట్లనియె. 410
తే. నరవరాధీశ! యిప్పుడు నడుచుచున్న, వాఁడు సప్తమమనువు వైవస్వతుండు
శ్రాద్ధదేవుం డనందగు జనవరేణ్య!, పదురు నందను లతనికిఁబ్రకటబలులు.
411
వ. వార లిక్ష్వాకుండును, నభగుండును, ధృష్టుండును, శర్యాతియు, నరిష్యంతుండును, నాభాగుండును, దిష్టుండును, గరూశకుండును, బృషద్ధ్రుండును, వసుమంతుండును నను వారు పదుగురు రాజులు; పురందరుండను వాఁడింద్రుం; డాదిత్య మరుదశ్వి వసు రుద్ర సంజ్ఞలు గలవారు దేవతలు; గౌతమ కశ్యపాత్రి విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ వసిష్ఠు లనువారు సప్తర్షులయి యున్నవా; రందుఁ గశ్యపున కదితి గర్భంబున విష్ణుండు వామనరూపుండై జనియించి యింద్రావరజుం డయ్యె; నిప్పు డేడు మన్వంతరంబులు సెప్పంబడియె; రాఁగల మన్వంతరంబులును శ్రీహరి పరాక్రమంబునుం జెప్పెద; దత్తావధానుండవై విను మని శుకుం డిట్లనియె. 412
సీ. జననాథ! సంజ్ఞయు ఛాయయు ననువారు గల రర్కునకు విశ్వకర్మతనయ
లిరువురు వల్లభ లిటమున్న చెప్పితిఁ బరఁగుఁదృతీయయు బడబ యనఁగ
సంజ్ఞకు యముఁడును శ్రాద్ధదేవుండును యమునయుఁ బుట్టిరి హర్ష మెసఁగ;
ఛాయకుఁ దపతియు సావర్ణియును శనైశ్చరుఁడును గలిగిరి; సంవరణుఁడు
 
తే. దపతి నాలిగఁ గైకొనెఁ దా వరించె, నశ్వియుగళంబు బడబకు నవతరించె;
వచ్చు నష్టమవసుపు సావర్ణి; వాఁడు, తపము సేయుచు నున్నాఁడు ధరణినాథ!
413
క. ఒకపరి సూచిన వెండియు, నొకపరి సూడంగ లేకయుండు సిరులకై
యొక నొకని చేటు వేళకు, నొకఁడొక్కఁడు మనువుఁగాచి యుండు నరేంద్రా!
414
వ. సూర్యసావర్ణి మన్వంతరంబున నతని తనయులు నిర్మోహవిరజస్కాద్యులు రాజులును, సుతపో విర0000జోమృత ప్రభులను వారు దేవతలును గాఁగలరు; గాలవుండును, దీప్తిమంతుండును, బరశురాముండును, ద్రోణపుత్త్రుండగు నశ్వత్థామయుఁ, గృపుండును, మజ్జనకుండగు బాదరాయణుండును, ఋష్యశృంగుండును సప్తర్షు లయ్యెదరు; వార లిప్పుడు దమతమ యోగబలంబుల నిజాశ్రమ మండలంబులం జరియించు చున్నవారు; విరోచన నందనుండగు బలి యింద్రుం డయ్యెడు నని చెప్పి శుకుం డిట్లనియె. 415
సీ. బలి మున్ను నాకంబు బలిమిమైఁ జేకొన్న వామనుండై హరి వచ్చి వేఁడఁ
బాదత్రయంబిచ్చి భగవన్నిబద్ధుఁడై సురమందిరముకంటె సుభగమైన
సుతలలోకంబున సుస్థితి నున్నాఁడు వెతలేక యటమీఁద వేదగుహికి
నా సరస్వతికిఁదా నట సార్వభౌముండు నాఁ బ్రభువయి హరి నాకవిభునిఁ
 
ఆ. బద విహీనుఁజేసి బలిఁ దెచ్చి నిలుపును, బలియు నిర్జరేంద్రు పదము నొందు;
నింద్రపదము హరికి నిచ్చిన కతమున, దానఫలము సెడదు ధరణినాథ!
416
వ. అట మీఁదటి కాలంబున వరుణ నందనుండగు దక్షసావర్ణి తొమ్మిదవ మను వయ్యెడు; అతని కొడుకులు ధృతకేతు, దీప్తకేతు ప్రముఖులు రాజులును, బర మరీచి గర్గాదులు నిర్జరులును, నద్భుతుం డనువాఁ డింద్రుండును, ద్యుతిమత్ప్రభృతు లగు వారలు ఋషులును నయ్యెద రందు. 417
ఆ. దనుజహరణుఁడంబుధార కాయుష్మంతు, నకు జనించి రక్షణంబు సేయ
మూఁడు లోకములను మోదంబుతో నేలు, నద్భుతాఖ్య నొప్పు నమరవిభుఁడు.
418
వ. మఱియు నుపశ్లోక సుతుండగు బ్రహ్మసావర్ణి దశమ మనువయ్యెడిఁ; దత్పుత్త్రులు భూరిషేణాదులు భూపతులును, హవిష్మత్ప్రముఖులు మునులును, శంభుండను వాఁ డింద్రుండును, విబుద్ధ్యాదులు నిర్జరులును నయ్యెద; రందు. 419
ఆ. విశ్వసృజుని యింట విభుఁడు విషూచికి, సంభవించు నంశసహితుఁడగుచుఁ
జెలిమి శంభుతోడఁ జేయు విష్వక్సేనుఁ, డనఁగ జగముఁగాచు నవనినాథ!
420
వ. మఱియుం దదాగమిష్యత్కాలంబున ధర్మసావర్ణి పదునొకండవ మను వయ్యెడి; మను తనూజులు సత్యధర్మాదులు పదుండ్రు ధరణి పతులును; విహంగమ కామగమన నిర్వాణరుచు లనువారు సురలును, వైధృతుండనువాఁడింద్రుండును, నరుణాదులు ఋషులును నయ్యెద; రందు. 421
ఆ. అంబుజాతనేత్రుఁ డా సూర్యసూనుఁడై, ధర్మసేతు వనఁగఁదగ జనించి
వైభవాఢ్యుఁడగుచు వైధృతుఁడలరంగఁ, గరుణఁద్రిజగములను గావఁగలఁడు.
422
వ. మఱియుఁ దద్భవిష్యత్సమయంబున భద్రసావర్ణి పండ్రెండవమను వయ్యెడి; నతని నందనులు దేవవ దుపదేవ దేవ జ్యేష్ఠాదులు వసుధాధిపతులును, ఋతధాముం డనువాఁ డింద్రుండును, హరితాదులు వేల్పులును, దపోమూర్తి తప ఆగ్నీధ్రకాదులు ఋషులును నయ్యెద; రందు. 423
ఆ. జలజలోచనుండు సత్యతపస్సూనృ, తలకు సంభవించుఁదనయుఁడగుచు
ధరణిఁగాచు నంచితస్వధామాఖ్యుఁడై, మనువు సంతసింప మానవేంద్ర!
424
వ. మఱియుం దదేష్యత్కాలంబున నాత్మవంతుండగు దేవసావర్ణి పదుమూఁడవ మనువయ్యెడి; మనుకుమారకులు చిత్రసేన విచిత్రాదులు జగతీనాయకులును, సుకర్మ సుత్రామ సంజ్ఞలు గలవారు బృందారకులును, దివస్పతి యను వాఁ డింద్రుండును, నిర్మోహ తత్త్వదర్శాద్యులు ఋషులును నయ్యెద; రందు. 425
ఆ. ధరణి దేవహోత్ర దయితకు బృహతికి, యోగవిభుఁడు నాఁగ నుద్భవించి
వనజనేత్రుఁడా దివస్పతి కెంతయు, సౌఖ్యమాచరించు జగతినాథ!
426
వ. మఱియు నట వచ్చుకాలంబున నింద్రసావర్ణి పదునాల్గవ మను వయ్యెడి; మను నందను లురు గంభీరవస్వాదులు రాజులును, బవిత్రచాక్షుషు లనువారు దేవగణంబులును, శుచి యనువాఁ డింద్రుండును, నగ్ని బాహు శుచి శుక్ర మాగధాదులు ఋషులును నయ్యెద; రందు. 427
తే. తనర సత్రాయణునకు వితానయందు, భవము నొందెడి హరి బృహద్భానుఁ డనఁగ
విస్తరించుఁ గ్రియాతంతు విసరములను, నాకవాసులు ముదమంద నరవరేణ్య!
428
క. జగతీశ! త్రికాలములను, బొగడొందు మనుప్రకారములు సెప్పఁబడెం;
దగఁబదునలువురు మనువులుఁ, దెగ యుగములు వేయు నడవ దివ మజున కగున్‌.
429
వ. అనినఁబరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె. 430
ఆ. ఈ పదంబులందు నీ మను ప్రముఖుల, నెవ్వ రనుపువార? లేమి కతన
నధికవిభవులైరి? హరి యేల జనియించె?, నెఱుఁగఁబలుకు నాకు నిద్ధచరిత!
431
వ. అనినం బారాశర్యకుమారుం డిట్లనియె. 432
సీ. మనువులు మునులును మనుసుతు లింద్రులు నమరులు హరియాజ్ఞ నడఁగువారు
యజ్ఞాదు లందఱు హరిపౌరుషాకృతు లా మనువులు దత్సహాయశక్తి
జగముల నడపుదు రొగి నాల్గుయుగముల కడపటఁ గాలసంగ్రస్తమైన
నిగమచయంబును నిజతపోబలముల మరలఁగాంతురు ఋషివరులు; దొంటి
 
తే. పగిది ధర్మంబు నాలుగు పాదములును, గలిగి వర్తిల్లు; మనువులు గమలనేత్రు
నాజ్ఞఁ దిరుగుదు; రేలుదు రవనిపతులు, జగతి భాగించి తమ తమ సమయములను.
433
వ. మఱియుఁ బ్రాప్తులయిన వారల నింద్రపదంబులను, బహుప్రకారంబుల దేవపదంబులను, హరి ప్రతిష్ఠించుచుండు; వారలు విహితకర్మంబుల జగత్త్రయంబునుం బరిపాలింతురు; లోకంబులు సువృష్టులై యుండును. 434
సీ. యోగీశరూపుఁడై యోగంబుఁజూపుచు మౌని రూపమునఁగర్మంబుఁదాల్చి
సర్గంబు సేయుఁ బ్రజాపతిరూపుఁడై యింద్రుఁడై దైత్యుల నేపడంచు
జ్ఞానంబు నెఱిఁగించుఁజతుర సిద్ధాకృతిఁ గాలరూపమునఁబాకంబు సేయుఁ
నానావిధములైన నామరూపంబులఁ గర్మలోచనులకుఁగానఁబడఁడు
 
ఆ. చనిన రూపములను జనురూపముల నింకఁ, జనఁగనున్న రూపచయము నతఁడు
వివిధుఁడై యనేకవృత్తుల వెలిఁగించు, విష్ణుఁడవ్యయుండు విమలచరిత!
435
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - aShtama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )