పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము అష్టమస్కంధము
వామనచరిత్ర కథాప్రారంభము
వ. అనిన భూవరుం డిట్లనియె. 436
మ. బలి నంభోరుహనేత్రుఁ డేమికొఱకై పాదత్రయిన్‌ వేఁడె? ని
శ్చలుఁడుం బూర్ణుఁడు లబ్ధకాముఁడు రమాసంపన్నుఁడై తాఁ బర
స్థలికిన్‌ దీనునిమాడ్కి నేల చనియెం? దప్పేమియున్‌ లేక ని
ష్కలుషున్‌ బంధన మేల చేసెను? వినం గౌతూహలంబయ్యెడిన్‌.
437
వ. అనిన శుకుండిట్లనియె. 438
సీ. పురుహూతుచే నొచ్చి పోయి భార్గవులచే బలి యెట్టకేలకు బ్రదికి, వారి
చిత్తంబురాఁ గొల్చి శిష్యుఁడై వర్తింప, వారు నాతని భక్తివలన మెచ్చి
విశ్వజిద్యాగంబు విధితోడఁజేయింప భవ్యకాంచనపట్టబద్ధరథము
నర్కువాజులఁబోలు హరులఁ గంఠీరవధ్వజము మహాదివ్యధనువుఁబూర్ణ
 
తే. తూణయుగళంబుఁ గవచంబుఁదొలుత హోమ, పావకుండిచ్చె; నమ్లానపద్మమాలఁ
గలుషహరుఁడగు తన తాత కరుణ నొసఁగె;, సోమసంకాశశంఖంబు శుక్రుఁడిచ్చె.
439
వ. ఇవ్విధంబున. 440
క. పాణియు, రథియుఁగృపాణియుఁ, దూణియు, ధన్వియును స్రగ్వి తురగియు దేహ
త్రాణియు ధిక్కృతవిమత, ప్రాణియు మణికనకవలయపాణియు నగుచున్‌.
441
మ. పలుదానంబుల విప్రులందనిపి తద్భద్రోక్తులంబొంది పె
ద్దలకున్‌ మ్రొక్కి విశిష్టదేవతల నంతర్భక్తిఁబూజించి, ని
ర్మలుఁబ్రహ్లాదునిఁజీరి నమ్రశిరుఁడై రాజద్రథారూఢుఁడై
వెలిఁగెన్‌ దానవభర్త శైలశిఖరోద్వేల్లద్దవాగ్నిప్రభన్‌.
442
క. దండితమృత్యుకృతాంతులు, ఖండితసురసిద్ధసాధ్యగంధర్వాదుల్‌
పిండితదిశు లమరాహిత, దండాధీశ్వరులు సములు దన్నుంగొలువన్‌.
443
క. చూపుల గగనము మ్రింగుచు, నేపున దివిభువియు నాత లీతల సేయన్‌
రూపించుచు దనుజేంద్రుఁడు, ప్రాపించెను దివిజనగరపథము నరేంద్రా!
444
వ. ఇట్లు బలవంతుండగు బలి సురేంద్రుని సాధింప సమకట్టి దండగమనంబు సేసి, నిడుద పయనంబులం జని చని. 445
మ. కనియెం బుణ్యజనౌకమున్‌ విగతరోగస్వప్నపీడాన్న ఖా
దనసంశోకముఁ బుష్పపల్లవఫలోద్దామద్రుమానీకమున్‌
స్వనితోద్ధూత పతాకముం బ్రవిచరద్వైమానికానీకమున్‌
ఘనగంగాసలిలైకమున్‌ మఘవయుక్తశ్రీకమున్‌ నాకమున్‌.
446
వ. కని రక్కసులఱేఁడు వెక్కసంబై చాల్పుగల వేల్పులనెలవు దఱియం జొచ్చి, చెచ్చెర ముందటికిం జని చని, ముందట నెడపడక మొనమోసి యిగురుచు చిగురు తలిరాకు జొంపంబునన మొగుడు మొగ్గ యరవిరి నెఱవిరి గుత్తి పిందె పూఁప దోరగాయ పండుగెలల తండంబుల వ్రేఁగు లాఁగలేక మూఁగి వీఁగి వ్రేఁకలగు మ్రాఁకుల ప్రోకలకుఁ బేఁట లగు పెందోఁటలును, దోఁటల గాటంబులై నివ్వటిల్లు మవ్వంపుఁ గ్రొవ్విరులకుఁ గవలు వివ్వక కసిమసలు గలిగి ముసరు కొసరి పూని పోని తేనియ లాని విసరు గలిగి మసరు కవిసి క్రొవ్వి రిమ్మగొని జుమ్ముజుమ్మనుచు జంజాటించు తేఁటి దాఁటులును, దాఁటు వడక నాఁటుకొని కూడి జోడు వీడక క్రొమ్మావుల కమ్మని కొమ్మల నిమ్ముల ముసరి పసిమిగల కిసలయమ్ములు వొసగంగ మెసంగి కిసరువడక కసరు సెడి బిట్టు రట్టడితనంబు మించి కరాళించు కోయిలల మొత్తంబులును, మొత్తంబులై చిత్తంబులు మత్తంబులుగఁ దత్తఱంబునం దియ్యని పండ్లకుఁ గయ్యంబులు నేసి చయ్యన నెసరేఁగి, బేసంబులు గాసంబులు గొని వాసికెక్కి పలుబాసలాడు బహుప్రకారంబులగు కీరంబులును, గీరంబులకు సరిగడచి మింటనంట నెగసి పెట్టలం బట్టి చీరి యిట్టట్టుఁ జనక నెట్టుకొని నెలవుల వ్రాలుచు నింపుగల రవమ్ములు గలుగు కలరవమ్ములును, గలరవమ్ము లలరం గొలంకుల కెలంకులఁ గడంకలఁ బ్రియల నిడుకొని క్రమ్మి దొమ్మి సేసి యెలదమ్మి తూఁడుల వాఁడులగు చంచువులం జించి మెక్కి చొక్కి మిక్కిలి కలఁకలం బడుచు నలబలంబులు సేయు కలహంసంబులును, హంసరుచి జనిత వికసనముల వికవిక నగుచుం బసగలిగి మిసమిస మెఱచు పసిడి కెందమ్ము లిందిరా మందిరమ్ముల చందంబులుగ నందమ్ములగు కొలంకులును, కొలంకుల కరళ్ళఁ దడిసి వడవడ వడంకుచు నల్లిబిల్లులు గొని సాఁగిన తీగెయిండ్ల గండ్ల యీఱములం దోరములు సెడి పలువిరుల కమ్మవలపుల వ్రేఁగునం దూఱలేక యీడిగిలం బడు గాడ్పులును, గాడ్పుల వలననెగసి గగనమున విరిసి పలువన్నెలం జెన్నగు మేలుకట్టుఁ బుట్టంబుల తెఱంగున దట్టంబులయిన కుసుమ పరాగంబులును, బరాగంబుల సరాగంబులగు వాఁగు వ్రంతల చెంతల గుంపులుగొని గఱిక జొంపంబులు లంపుదిని మంపులుగొని పెల్లు నెమర్లు వెట్టుచు నొదుఁగుల పొదుఁగులు గదల వాడల వాడల జాడలం బరుగులిడు దూడల క్రీడల వేడుకం గూడుకొని యిండ్ల వాకిండ్లకుం జేరి పౌరుల కోరికల కనుసారిక లగుచు నమృతంబు గురియు కామధేనువులును, గామధేనువులకు నిలువ నీడ లగుచు నడిగిన జనమ్ములకు ధనమ్ములు ఘనమ్ముగఁ బుడుకు కల్పతరువులును, కల్పతరువుల పల్లవ మంజరులఁ గుంజరులకు విఱచి యిచ్చుచు, మచ్చికల కలిమి నిచ్చ మెచ్చుచుఁ గృతకగిరుల చఱుల సిరుల నడరు పడఁతుల నడలకు గురువు లగుచు మెఱయు మురువుల నొత్తరించు మత్తేభంబులును, నిభంబుల సరస నొరసికొని వరుసఁ బరుసఁదనము లెడలి సుకరములగు మకరతోరణస్తంభంబులును, తోరణస్తంభంబుల చేరువ నిలిచి చెఱకు విలుతుం డొఱ వెఱికిన బెడిదములగు నవకంపు మెఱుఁగుం జిగురు టడిదముల తెఱంగున నిలుకడ సంపదలు గలుగు శంపల సొంపునం గరచరణాది శాఖలు గల చంద్రరేఖల పోఁడిమిని వాహిని గల మోహినీ విద్యల గ్రద్దనఁ జూపులకుం దీపు లొదవించుచు మర్మకర్మంబు వశంబు లరయు యశంబులు గలిగి యనూనంబు లగు విమానంబు లెక్కి చచ్చి వచ్చిన సచ్చరిత్రులకుం జెచ్చెర నెదురు చని తూకొని తోకొని పోవు రంభాది కుంభికుంభకుచల కలకలంబులును, గలహంస కారండవ కోక సారసబృంద సుందర సుందరియు, నిందీవరారవింద నందదిందిందిరయు, నభంగయు నగు గంగ నింగికిం బొంగెనో యని మిగుల దిగులువడఁ బొగడ్తల కెక్కిన యగడ్తలును, నగడ్తల మిన్నేటి తేటనీట నీటులీను పాటి సూటి చల్లులాటలు మేటి కూటువలు గొనుచు నేచిన ఖేచర కన్యకావారంబులును, వారవనితానుపూజిత రాజిత దేహళీ పాటవంబులగు గోపుర కనక కవాటంబులును, గవాట వేదికాఘటిత మణిగణ కిరణోదారంబు లగు నింద్రనీల స్తంభ గంభీరతలును, గంభీర విమల కమల రాగ పాలికా మాలికా వారంబులగు చతుర్ద్వారంబులును, ద్వార దేశంబుల చావిళ్ళం గావళ్లుండి ప్రొద్దువోక రక్కసుల వేల్పుల కయ్యంబులు నెయ్యంబులు సెప్పికొనుచున్న యస్త్ర శస్త్రధారులు శూరులు నయిన మహాద్వారపాలక వీరులును, వీరరస జలధివేలోదారంబులయి శుద్ధస్ఫటికబద్ధ మహోత్తానంబులగు సోపాన సుభగాకారంబులును, సుభగాకార ప్రదీప్రంబులగు వజ్రమహారజత వప్రంబులును, వప్రోపరి వజ్రకుడ్య శిరోభాగ చంద్రకాంత తరుణ హిమకరకిరణ ముఖరంబు లగు సాలశిఖరంబులును; శిఖర స్తోమధామ నికృత్తతారకంబులును, దారతార మణి శిలా కఠోరంబు లగుచు మిగుల గరిత యగు నగరిసిరి మీఱ నమరు మొగిలు వొడగని నిలుకడలకు నలువ నడిగికొని పడసిన పసిఁడి తెరలు వలువల బెడంగునం దోరంబులగు ప్రాకారంబులును,బ్రాకార కాంచనాంచిత యుద్ధసన్నద్ధ మహాఖర్వ గంధర్వ వాహినీ పాలకంబులగు మరక తాట్టాలకంబులును, నట్టాలకోత్తుంగ వజ్రమయస్తంభోదంచనంబులును, బరభట ప్రాణవంచనంబులు సముదంచనంబులు నగు దంచనంబులును, దంచనంబుల తుదను రథంబుల యిరుసులు నొరసికొనం, గోట యీవలి యావలి తివియని దివియల కరణి రుచిరము లగుచుఁ బచరించు నహిమకర హిమకర మండలంబులును, హిమకర మండలంబు నిద్దంపు టద్దంబని మూఁగి తొంగి చూచుచు నళిక ఫలకంబులఁ గులకములు గొను నలకములం దరపి తిలకములం దెఱఁగు పఱచుకొని సమయముల వెనుక నొదిగి కదిసి ముకురంబులం బ్రతిఫలితులైన పతు లితర సతుల రతుల కనుమతులని కనుకనిన్‌ మరలి నీడ తలంగినం గలంగి చని కాంతులకు సొలయు ముగుదలకు నేకాంతంబులై గగన సముత్సేధంబులైన రాజసౌధంబులును, సౌధంబుల సీమల ముత్తియంపు సరులతోడి నిబ్బరపు గుబ్బచన్నులు చెన్నులం బ్రక్కలం జుక్కపదవులుండ మండిత సౌధ శిఖరంబులకు శృంగారంబులయిన భృంగారంబులును, భృంగారశయన జాలక డోలికా శ్రేణికాది విశేషరమ్యంబులైన హర్మ్యంబులును, హర్మ్యకనక గవాక్షరంధ్ర నిర్గత కర్పూర కుంకుమాగరు ధూపధూమంబులును, ధూమంబులు జీమూత స్తోమంబులని ప్రేమంబు లుబ్బ గొబ్బునం డబ్బాటు పబ్బంబు లబ్బెనని మరులుగొని పురుల వన్నియల సిరులు సరులు గొనం గుటవిటపములఁ దటపెట నటించుచుఁ బలుకులు విసిరి కికురువొడుచు వలఱేని మఱుఁగు చదువుల టీక లనం గేకలిడు నెమిళ్లును, నెమిళ్ల పురుల నారలు నారులగు రతనంపు విండ్ల నినదంబులను తలంపుం దోఁకలు వడసి వీఁకలు మెఱసి మూఁకలు గొని దివికెగిరి రవికిం గవిసిన రాహువు క్రియం దివిఁ దడంబడు పడగలును, బడగలును గొడుగులును దమకు నాలంబులకు నడియాలంబులుగఁ దోరంబులైన సారంబుల బీరంబులు మెఱసి బెబ్బులుల గబ్బునం గరుల సిరుల సింగంబుల భంగుల శరభంబుల రభసంబుల ధూమకేతువుల రీతుల వైరిం జీరికిం గొనక శంకలుడిగి ఱంకెలిడుచు లంకెలై లెక్కకు మిక్కిలి యగుచు రక్కసుల చక్కటి యెక్కటి కయ్యముల దయ్యము లెఱుంగం దిరుగు వీరభట కదంబంబులును, గదంబకరవాల శూలాదుల మెఱుంగులు మెఱపుల తెఱంగుల దిశల చెఱంగులం దుఱంగలింప నేమి నినదంబులు దళములగు నుఱుములుగ నడమొగిళ్ళ పెల్లునం బ్రవర్షిత రథికమనోరథంబులగు రథంబుల గములును గములుగొని గమనవేగముల వలన హరిహరుల నగి గాలిం జాలింబడ గేలికొని ఘనంబులగు మనంబులం దెగడి నెగడు సురంగంబులగు తురంగంబులును, రంగదుత్తుంగ విశద మదకలకరటి కటతట జనిత మదసలిల కణగణ విగళిత దళశతనయన భుజ సరళ మిళిత లలిత నిఖిల దిగధిపతి శుభకరకర కనకకటకఘటిత మణిసముదయ సముదిత రేణువర్గ దుర్గమంబు లయిన నిర్వక్రమార్గంబులును, మార్గస్థలోపరి గతాగత శతశతాయుతానేక గణనాతీత రోహణాచల తట విరాజమానంబులగు విమానంబులును, విమాన విహరమాణ సుందర సుందరీ సందోహ సంవాదిత భూరిభేరీ వీణా పణవ మృదంగ కాహళ శంఖాది వాదనా నూన గాన సాహిత్య నృత్య విశేషంబులును, విశేషరత్న సంఘటిత శృంగార శృంగాటక వాటికాదేహ దేహళీ ప్రదీపంబులును, దీపాయమాన మానిత సభామండప ఖచిత రుచిర చింతారత్నంబులునుం గలిగి రత్నాకరంబునుం బోలె ననిమిషకౌశిక వాహినీ విశ్రుతంబయి, శ్రుతివాక్యంబునుం బోలె నకల్మష సువర్ణప్రభూతంబయి, భూతపతి కంఠంబునుం బోలె భోగిరాజకాంతంబయి, కాంతాకుచంబునుం బోలె సువృత్తంబయి, వృత్తజాతంబునుం బోలె సదా గురులఘు నియమాభిరామంబయి, రామచంద్రుని తేజంబునుం బోలె ఖర దూషణాది దోషాచరానుపలబ్ధంబయి, లబ్ధవర్ణు చరిత్రంబునుం బోలె నమలాంతరంగ ద్యోతమానంబయి, మానధనుని నడవడియునుం బోలె సన్మార్గభాతి సుందరంబయి, సుందరోద్యానంబునుం బోలె రంభాంచితాశోక పున్నాగంబయి పున్నాగంబునుం బోలె సురభి సుమనో విశేషంబయి, శేషాహిమస్తంబునుం బోలె నున్నతక్షమావిశారదంబయి, శారదసముదయంబునుంబోలె ధవళ జీమూత ప్రకాశితంబయి, సితేతరాజిన దానంబును బోలె సరసతిలోత్తమంబై, యుత్తమ పురుష వచనంబునుం బోలె ననేక సుధారస ప్రవర్షంబై, వర్షాదియునుం బోలె నుల్లసదింద్ర గోపంబయి, గోపతి మూఁపురంబునుం బోలె విచక్షురార్యాలంకృతంబయి, కృతార్థం బయిన యమరావతీ నామనగరంబు సేరం జని కోటచుట్టునుం బట్టు గలుగ బలంబులఁ జలంబున విడియం బంచి పొంచి మార్గంబు లెల్ల నరికట్టుకొని యేమఱక యుండె; నంత. 447
క. మాయరు; నగవులకును; గను, మూయరు కాలంబుకతన ముదియరు ఖలులన్‌
డాయరు పుణ్యజనంబులఁ, బాయరు సురరాజు వీటి ప్రమదాజనముల్‌.
448
వ. అప్పుడు. 449
క. దుర్భరదానవశంఖా, విర్భూతధ్వనులు నిండి విబుధేంద్రవధూ
గర్భములు పగిలి లోపలి, యర్భకతతు లావు రనుచు నాక్రోశించెన్‌.
450
వ. అంత. 451
సీ. బలి వచ్చి విడియుట బలభేది వీక్షించి గట్టిగాఁగోటకుఁగాఁపు వెట్టి
దేవవీరులుఁదాను దేవతామంత్రిని రప్పించి సురవైరి రాకఁజెప్పి
ప్రళయానలునిభంగి భాసిల్లుచున్నాఁడు ఘోరరాక్షసులను గూడినాఁడు
మన కోడి చని నేఁడు మరల వీఁడేతెంచె నే తపంబున వీని కింత వచ్చె?
 
ఆ. నీ దురాత్మకునకు నెవ్వఁడు దోడయ్యె?, నింక వీని గెల్వ నేది త్రోవ?
యేమి సేయువార? మెక్కడి మగఁటిమి?, నెదురు మోహరింప నెవ్వఁడోపు?
452
క. మ్రింగెడు నాకాశంబును, బొంగెడు నమరాద్రికంటెఁబొడువై వీఁడున్‌
మ్రింగెడుఁగాలాంతకు క్రియ, భంగించును మరలఁబడ్డఁబంకజగర్భున్‌.
453
క. ఈరాదు రాజ్యమెల్లను, బోరాదు రణంబు సేయఁ; బోయితి మేనిన్‌
రారాదు; దనుజుచేతను, జారా; దిటమీఁద నేమి జాడ మహాత్మా!”
454
వ. అనిన సురరాజునకు నాచార్యుం డిట్లనియె. 455
సీ. ‘వినవయ్య దేవేంద్ర! వీనికి సంపద బ్రహ్మవాదులు భృగుప్రవరు లర్థి
నిచ్చిరి రాక్షసు నెదురను నిలువంగ హరి యీశ్వరుఁడు దక్క నన్యజనులు
నీవును నీ సముల్‌ నీకంటె నధికులుఁ జాలరు; రాజ్యంబు సాలు; నీకు
విడిచిపోవుట నీతి విబుధనివాసంబు; విమతులు నలఁగెడు వేళ సూచి
 
తే. మరలి మఱునాఁడు వచ్చుట మా మతంబు;, విప్రబలమున వీనికి వృద్ధి వచ్చె
వారిఁగైకొన కిటమీఁద వాఁడి సెడును;, దలఁగు మందాఁక రిపు పేరు దడవవలదు.
456
క. పరు గెలువవలయు నొండెను, సరిపోరఁగ వలయు నొండెఁ జావలె నొండెన్‌
సరి గెలుపు మృతియు దొరకమి, సరసంబుగ మున్న తొలఁగి చనవలె నొండెన్‌.
457
వ. అనినఁ గార్యకాల ప్రదర్శియగు బృహస్పతి వచనంబులు విని కామరూపులై దివిజులు త్రివిష్టపంబు విడిచి తమ తమ పొందుపట్లకుం జనిరి; బలియునుం బ్రతిభట వివర్జిత యగు దేవధాని నధిష్ఠించి జగత్త్రయంబునుం దనవశంబు సేసికొని విశ్వవిజయుండై పెద్దకాలంబు రాజ్యంబు సేయుచుండె; శిష్యవత్సలులగు భృగ్వాదు లతనిచేత శతాశ్వమేధంబులు సేయించిరి; తత్కాలంబున. 458
శా. అర్థుల్‌ వేఁడరు; దాతలుంజెడరు; సర్వారంభముల్‌ పండుఁ; బ్ర
త్యర్థుల్‌ లేరు; మహోత్సవంబులను దేవాగారముల్‌ వొల్చుఁ; బూ
ర్ణార్థుల్‌ విప్రులు; వర్షముల్‌ గురియుఁ గాలార్హంబులై ధాత్రికిన్‌
సార్థంబయ్యె వసుంధరాత్వ మసురేంద్రాధీశు రాజ్యంబునన్‌.
459
వ. అంత. 460
సీ. తన తనూజుల ప్రోలు దనుజులు గొనుటయు వేల్పు లెల్లను డాఁగ వెడలుటయును
భావించి సురమాత పరితాపమునఁబొంది వగ ననాథాకృతి వనరుచుండ
నా యమ్మ పెనిమిటి యగు కశ్యపబ్రహ్మ మఱియొకనాఁడు సమాధి మాని
తన కుటుంబినియున్న ధామంబునకు నేగి నాతిచే విహితార్చనములు వడసి
 
ఆ. వంది వ్రాలి కంది వాడిన యిల్లాలి, వదనవారిజంబు వడుపుఁజూచి
చేరఁదిగిచి మగువచిబుకంబు పుడుకుచు, వారిజాక్షి! యేల వగచె దనుచు.
461
వ. అ మ్మహాత్ముండిట్లనియె. 462
మ. ‘తెఱవా! విప్రులు పూర్ణులే? చెలఁగునే దేవార్చనాచారముల్‌?
తఱితో వేలుతురే గృహస్థులు? సుతుల్‌ ధర్మానుసంధానులే?
నెఱి నభ్యాగత కోటి కన్న మిడుదే? నీరంబునుంబోయుదే?
మఱ లే కర్థుల దాసులన్‌ సుజనులన్‌ మన్నింపుదే? పైదలీ?
463
ఆ. అన్నమైనఁ దక్రమైనఁ దోయంబైన, శాకమైనఁ దనకు జరుగుకొలఁది
నతిథిజనులకడ్డ మాడక యిడరేని, లేమ! వారు కలిగి లేనివారు.
464
వ. మఱియు. 465
ఆ. నెలఁత! విష్ణునకును నిఖిలదేవాత్మున, కాననంబు శిఖియు నవనిసురులు
వారు దనియఁదనియు వనజాతలోచనుఁ, డతఁడు దనియ జగము లన్ని దనియు.
466
క. బిడ్డలు వెఱతురె నీ కఱ, గొడ్డంబులు సేయ కెల్ల కోడండ్రును మా
ఱొడ్డారింపక నడతురె, యెడ్డము గాకున్నదే మృగేక్షణ; యింటన్‌!
467
వ. అని పలికినం బతికి సతి యిట్లనియె. 468
ఉ. ప్రేమ యొకింత లేక దితిబిడ్డలు బిడ్డలబిడ్డలున్‌ మహా
భీమబలాఢ్యులై తనదు బిడ్డల నందఱఁదోలి సాహసా
క్రామితవైరులయ్యు నమరావతి నేలుచు నున్నవారు; నీ
కే మని విన్నవింతు? హృదయేశ్వర! మేలు దలంచి చూడవే!
469
క. అక్కాచెల్లెండ్రయ్యును, దక్కదు నాతోడి పోరు; దానును దితియున్‌
రక్కసులు సురల మొత్తఁగ, నక్కట! వలదనదు చూచు నౌనౌ ననుచున్‌.
470
సీ. ఎండకన్నెఱుఁగని యింద్రుని యిల్లాలు పలుపంచలను జాలిఁబడియె నేఁడు
త్రిభువనసామ్రాజ్యవిభవంబుఁ గోల్పోయి దేవేంద్రుఁ డడవులఁదిరిగె నేఁడు
గలిమి గారాబుబిడ్డలు జయంతాదులు శబరార్భకులవెంటఁ జనిరి నేఁడు
నమరుల కాధారమగు నమరావతి యసురుల కాటపట్టయ్యె నేఁడు
 
ఆ. బలి జగముల నెల్ల బలియుచునున్నాఁడు, వాని గెలువరాదు వాసవునకు
యాగభాగమెల్ల నతఁడాహరించుచుఁ, గడఁగి సురల కొక్క కడియు నీఁడు
471
క. ప్రజలకు నెల్లను సముఁడవు, ప్రజలను గడుపారఁగన్న బ్రహ్మవు నయ్యుం
ప్రజలందు దుష్టమతులను, నిజముగ శిక్షింపవలదె నీవు? మహాత్మా!
472
మ. సురలన్‌ సభ్యుల నార్తులన్‌ విరథులన్‌ శోకంబు వారించి ని
ర్జరధానిన్‌ నిలుపంగ రాత్రిచరులన్‌ శాసింప సత్కార్య మే
వెర వేరీతి ఘటిల్లు నట్టి క్రమమున్‌ వేగంబ చింతింపవే?
కరుణాలోకసుధాఝరిం దనుపవే? కల్యాణసంధాయకా!
473
వ. అనిన మనోవల్లభ పలుకు లాకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞానదృష్టి నవలంబించి భావికాల కార్యంబు విచారించి కశ్యపబ్రహ్మ యిట్లనియె. 474
మ. ‘జనకుండెవ్వడు?జాతుఁడెవ్వఁడు? జనిస్థానంబు లెచ్చోటు? సం
జననంబెయ్యది? మేను లే కొలఁది? సంసారంబు లే రూపముల్‌?
వినుమా యింతయు విష్ణుమాయ దలఁపన్‌ వే ఱేమియున్‌ లేదు; మో
హనిబద్ధంబు నిదాన మింతటికి జాయా! విన్నఁబో నేటికిన్‌?
475
వ. అగు; నయిననుం గాలోచితకార్యంబు సెప్పెద. 476
మ. భగవంతుం బరముం జనార్దనుఁ గృపాపారీణు సర్వాత్మకున్‌
జగదీశున్‌ హరిసేవ సేయు; మతఁడున్‌ సంతుష్టినింబొంది నీ
కగు నిష్టార్థము లెల్ల నిచ్చు; నిఖిలార్థావాప్తి సేకూరెడిన్‌;
భగవత్సేవలఁబొందరాదె బహుసౌభాగ్యంబులం బ్రేయసీ’!
477
వ. అనిన గృహస్థునకు గృహిణి యిట్లనియె. 478
క. ‘నారాయణుఁబరమేశ్వరు, నేరీతి దలంతు? మంత్ర మెయ్యది? విహితా
చారంబు లేప్రకారము?, లారాధన కాలమెద్ది? యానతి యీవే.’
479
వ. అనినఁ గశ్యపప్రజాపతి సతికిఁ బయోభక్షణం బను వ్రతంబుపదేశించి తత్కాలంబును, దన్మంత్రం బును, దద్విధానంబును, దదుపవాస దాన భోజన ప్రకారంబులును నెఱింగించిన నదితియును ఫాల్గుణ మాసంబు శుక్లపక్షంబునఁ ప్రథమ దివసంబునన్‌ దొరఁకొని పండ్రెండు దినంబులు హరిసమర్పణంబుగా వ్రతంబుసేసి వ్రతాంతంబున నియతయై యున్న యెడఁ జతుర్బాహుండును, బీతవాసుండును, శంఖచక్రగదా ధరుండునునై, నేత్రంబుల కగోచరుండైన నారాయణదేవుండు ప్రత్యక్షంబైనం గనుంగొని. 480
క. కన్నుల సంతోషాశ్రులు, చన్నులపైఁ బఱవఁబులకజాలము లెసఁగన్‌
సన్నతులును సన్నుతులును, నున్నతరుచిఁజేసి నిటల యుక్తాంజలియై.
481
క. చూపుల శ్రీపతిరూపము, నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై
వాపుచ్చి మంద మధురా, లాపంబులఁ బొగడె నదితి లక్ష్మీనాథున్‌.
482
సీ. ‘యజ్ఞేశ! విశ్వంభరాచ్యుత! శ్రవణ మంగళనామధేయ! లోకస్వరూప!
యాపన్నభక్తజనార్తివిఖండన! దీనలోకాధార! తీర్థపాద!
విశ్వోద్భవస్థితి విలయకారణభూత! సంతతానంద! శశ్వద్విలాస!
యాయువు దేహంబు ననుపమలక్ష్మియు వసుధయు దివముఁద్రివర్గములును
 
తే. వైదికజ్ఞానయుక్తియు వైరిజయము, నిన్నుఁగొలువని నరులకు నెఱయఁగలదె?
వినుతమందార! గుణహార! వేదసార!, ప్రణతవత్సల! పద్మాక్ష! పరమపురుష!
483
ఆ. అసురవరులు సురల నదలించి బెదరించి, నాక మేలుచున్ననాఁటనుండి
కన్నకడుపు గాన కంటఁగూరుకు రాదు, కడుపుఁ బొక్కు మాన్పి కావవయ్య’
484
వ. అనిన విని దరహసితవదనుండయి యాశ్రితకామధేనువైన యప్పరమేశ్వరుం డిట్లనియె. 485
శా. నీ కోడండ్రును, నీ కుమారవరులున్‌, నీ నాథుఁడున్‌, నీవు సం
శ్లోకింపన్‌ సతులుం బతుల్‌ మిగుల సమ్మోదింప రాత్రించరుల్‌
శోకింపన్‌ భవదీయగర్భమునఁదేజోమూర్తి జన్మించెదన్‌
నాకున్‌ వేడుక పుట్ట నీ సుతుఁడనై నర్తించి వర్తింపఁగాన్‌.
486
మ. బలిమిన్‌ దైత్యులఁజంపరాదు వినయోపాయంబునంగాని; సం
చలనంబొందకు; నేను నీ నియతికిన్‌ సద్భక్తికిన్‌ మెచ్చితిన్‌;
బలివిద్వేషియు నా నిలింపగణమున్‌ బౌలోమియున్‌ మెచ్చ దై
త్యుల రాజ్యంబు హరింతు, నింద్రునికి నిత్తున్‌; దుఃఖ మింకేటికిన్‌?
487
క. నీ రమణుని సేవింపుము, నా రూపము మానసించి నలి నీ గర్భా
గారంబు వచ్చి చొచ్చెద, గారామునఁబెంపవమ్మ కరుణన్‌ నన్నున్‌.
488
క. ఏలింతు దివము సురలను, బాలింతు మహేంద్రయువతి భాగ్యశ్రీలం
దూలింతు దానవుల ని, ర్మూలింతు రిపుప్రియాంగముల భూషణముల్‌!
489
వ. అని యిట్లు భక్తజన పరతంత్రుండగు పురాణపురుషుం డాన తిచ్చి తిరోహితుం డయ్యె; న య్యదితియుఁ గృతకృత్యయై సంతోషంబునఁ దన మనోవల్లభుండగు కశ్యపు నాశ్రయించి సేవించుచుండె; నంత నొక్కదినంబున. 490
ఆ. ఘనసమాధినుండి కశ్యపుఁడచ్యుతు, నంశ మాత్మ నొలయ నదితియందుఁ
దనదు వీర్య మధికతరము సేర్చెను గాలి, శిఖిని దారువందుఁజేర్చినట్లు
491
వ. ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్య ప్రతిష్ఠిత గర్భయై సురలతల్లి యుల్లంబున నుల్లసిల్లుచు నుండె; నంత. 492
క. చలచలనై పిదపిదనై, గలలంబై కరుడు గట్టి గళనాళముతోఁ
దల యేర్పడి గర్భంబై, నెలమసలం జీరచిక్కె నెలఁతకు నధిపా!
493
క. నెలఁతకుఁజూలై నెల రె, న్నెలలై మఱి మూఁడు నాల్గు నెలలై వరుసన్‌
నెల లంత కంత కెక్కఁగ, నెలలును డగ్గఱియె నసురనిర్మూలతకున్‌.
494
క. మహితతరమేఘమాలా, పిహితాయుతచండభానుబింబప్రభతో
విహితాంగంబులఁ గశ్యపు, గృహిణీగర్భమున శిశువు గ్రీడించె నృపా!
495
క. తన కడుపున నొక వెఱవున, వనరుహగర్భాండభాండవనధిచయంబుల్‌
గొనకొని జగముల నిడుకొని, తనుగతిఁగడు నడఁగి మడఁగి తనరెన్‌ బెడఁగై.
496
వ. అంత నక్కాంతాతిలకంబు క్రమక్రమంబున. 497
మ. నిలిపెన్‌ ఱెప్పల బృందిమన్‌ విశదిమన్‌ నేత్రంబులం, జూచుకం
బుల నాకాళిమ, మేఖలం ద్రఢిమ నెమ్మో మారఁగా బాండిమన్‌
బలిమింజన్నుల, శ్రోణిపాళిగరిమ, న్మధ్యంబునన్‌ బృంహిమన్‌
లలితాత్మన్‌ లఘిమన్‌, మహామహిమ మేనన్‌ గర్భదుర్వారయై.
498
క. పెట్టుదురు నుదుట భూతిని, బొట్టిడుదురు మేనఁ బట్టుఁబుట్టపుదోయిం
బెట్టుదురు వేల్పులమ్మకుఁ, గట్టుదురు సురక్ష పడఁతి గర్భంబునకున్‌.
499
వ. ఇ వ్విధంబున. 500
తే. విశ్వగర్భుఁడు దన గర్భవివరమందుఁ, బూఁటపూఁటకుఁ బూర్ణుఁడై పొటకరింప
వ్రేఁకఁ జూలాలితనమున వేల్పుఁబెద్ద, పొలఁతి కంతట నీళ్లాడు ప్రొద్దు లయ్యె.
501
వ. తదనంతరంబునఁ జతురాననుం డరుగుదెంచి యదితి గర్భపరిభ్రమ విభ్రముం డగు న ప్పరమేశ్వరు నుద్దేశించి యిట్లని స్తుతియించె. 502
సీ. ‘త్రిభువన జయరూఢ! దేవ! యురుక్రమ! పృథులాత్మ! శిపివిష్ట! పృశ్నిగర్భ!
ప్రీతత్రిణాభ! త్రిపృష్ఠ! జగంబుల, కాద్యంత మధ్యంబు లరయ నీవ!
జంగమస్థావర జననాది హేతువు నీవ; కాలంబవై నిఖిల మాత్మ
లోపల ధరియింతు లోనిజంతుల నెల్ల, స్రోతంబులోఁగొను సుందరతను;
 
తే. బ్రహ్మలకు నెల్ల సంభవ భవన మీవ; దివమునకుఁ బాసి దుర్దశ దిక్కులేక
శోకవార్ధి మునింగిన సురలకెల్లఁ, దేల నాధార మగుచున్న తెప్పవీవ.
503
క. విచ్చేయు మదితి గర్భము, చెచ్చెర వెలువడి మహాత్మ! చిరకాలంబున్‌
విచ్చలవిడి లే కమరులు, ముచ్చటపడి యున్నవారు ముదమందింపన్‌.
504
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - aShtama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )