పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము
పాండవులు బంధుసహితంబుగా ధృతరాష్ట్రుఁ జూడఁబోవుట (సం. 15-29-18)
వ. అమ్మానవనాథుండు కాననగమనంబు నిశ్చయించి పడవాళ్ళం బలిపించి ‘ధృతరాష్ట్రు దర్శింపఁ బోద; మనతి బహుళంబును బ్రధాన చతురంగ సముదీర్ణ భంగికంబునుం గా బలంబుల సమకట్టుం; డందలంబులునుం బాటబండ్లునుం గాఁ బెక్కాయితంబులు సేయుం; డనేక శకటంబులుం, బటకుటీరప్రకరంబును, నానావిధ భక్ష్య భోజ్యంబులునుం గొనివచ్చునట్లుగా నిపుణ పరిచారకుల నియమింపుండు; పౌర జనంబు లారాజుం జూచువేడ్కనెవ్వరు వచ్చినను వారల యోగక్షేమంబు లరసి సురక్షితంబుగా నడపింపం దగువారి నియోగింపుం; డెల్లి పయనం బని చాటింపుం’ డని పనిచిన వార లట్లు చేయ మఱునాఁడు యుయుత్సునిం గృపాచార్యుని ధౌమ్యుని రావించి ‘మీరు పురరక్షణంబునకు నిలువుం’ డని యత్యాదరంబునం జెప్పి, 026
సీ. ఏనికగములతో నేతెమ్ము నీ వని | బాహుదర్పోజ్జ్వలుఁ బవనతనయుఁ
దేరులగమి చెలువారు నీచే నని | దేవసమాను గాండీవధరుని,
గుఱ్ఱపు దళముల కొమరు వీ కలవడు | నని చారుతను మనోహారు నకులుఁ
గాల్బల మమరు నీ కలిసి వచ్చుట నని | సన్నుతచేష్టితుఁ బిన్నతమ్ముఁ
 
తే. బనిచె; వార లమ్మెయిఁ దూర్య నినద మెసఁగ | నాతపత్రావళి ధ్వజవ్రాత కలిత
రత్నరోచులు రోదోంతరంబు నిండ | నరుగుదెంచిరి వైభవ మతిశయిల్ల.
027
వ. ద్రౌపదీ ప్రముఖ వధూజనంబులనుం దక్కునుం గల భరత భార్యల నందలంబులను గనకంపు బండ్లను నిడికొని రండని యంతఃపురాధికారుల నబ్భూరమణుండు నియమించిన, వార లట్ల చేసిరి; తానును మణిభా సమానంబును నీలవాలశోభిత షోడశ శ్వేతాశ్వ వ్యూఢంబును నైన రథం బెక్కి మౌక్తిక ప్రాలంబ మాలి కాద్యోతితంబు లగు నాతపత్రంబు లుల్లసిల్ల. 028
తే. వేణువీణారవంబులు వివిధ గాన | నాదములుఁ బాఠకారావ మేదురంబు
లగుచు వంది బృందముల వాక్యాలి బెరసి | దిశలు దీటుకొనంగఁ బ్రదీప్తలీల.
029
వ. వెడలెఁ వివిధ వాహనారూఢు లయి పౌరు లప్పూరువంశవరు ననుగమించిరిత్తెఱంగున మెఱయు మహిమ నుజ్జ్వలుం డగుచుం జని భాగీరథి యుత్తరించి పాండవోత్తముండు కురుక్షేత్రంబు ప్రవేశించి చనుచుండ. 030
సీ. సంయమివరుఁ డైన శతయూప మునిపతి | యాశ్రమంబునఁ దదుపాంత భాగ
మునఁ గదలీశోభియును మృగాకీర్ణంబు | నగు ధృతరాష్ట్రుని యాశ్రమంబు
నెఱిఁగిన వా రదె యిదె యంచుఁ బేర్కొని | చూపి చెప్పిన ధర్మసుతుఁడు దేరు
డిగిన భీమాదులు డిగ్గిరి; వాహనం | బులు సర్వజనులు నప్పురుష వరుల
 
ఆ. ననుసరించి; రజ్జనాధిపుఁ డయ్యాంబి | కేయు నాశ్రమంబు డాయఁ జనుచు
నచటిజనుల నడిగె ‘నయ్య వేఁడీ?’ యని | గద్గదిక నెలుంగు గడలుకొనఁగ.
031
వ. అనిన వార లప్పుడమిఱేనితోడ. 032
క. ‘యమునా స్నానంబునకును | సుమతోయాహరణమునకు సువ్రతుఁ డా సం
యమి చనియె’ ననుచుఁ దన్మా | ర్గము సెప్పిరి నెమ్మిఁ దెలియఁ గౌరవముఖ్యా!
033
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )