పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము
నారదుఁడు శతయూపునితో ధృతరాష్ట్రాదులు సుగతిఁ బొందెడు తెఱంగు చెప్పుట (సం. 15-27-8)
సీ. ఆ సంయమీశ్వరుం డాతని కిట్లను | ‘నిచ్చమై నేను మహేంద్రు కడకు
నరిగి సంభాషణ మాచరించుచు నుండ | నా సభ నిక్కౌరవాధినాథు
వలనివార్తలు పుట్టి యలఘు తపోవృత్తి | నిష్ఠాతిశయము వర్ణించి’ రప్పు
డవ్వాసవుఁడు చెప్పె ననఘ! నాతో ముని | జాతుఁడు ధృతరాష్ట్ర జనవిభుండు
 
తే. తపము మూఁడేఁడు లొనరించి తాను సతియు | దేహము ల్విడ్చి చని ధనాధీశు చెలిమి
నతిశయిల్లు దివ్యాభరణాభిరాముఁ | డై విమానవిహార హృష్టాత్ముఁ డగుచు.
009
క. అని పాండుని మది ప్రమదం | బునఁ దేలఁగఁ జెప్పె ‘ననుడు మోదము ధృతరా
ష్ట్రుని నెమ్మనమున నిండా | రె; నఖిల జనచిత్తములను బ్రియము దలిర్చెన్‌.
010
వ. ఇట్లు సద్గోష్ఠి నడపి యత్తాపసోత్తము లక్కురుపతిసత్తము నభినందించి యామంత్రణంబు సేసి నిజనివాసంబులకుం జని; రక్కాలంబున. 011
సీ. పాండుపుత్త్రులు తల్లిఁ బలుమఱుఁ దలఁతురు | వగతురు, ధృతరాష్ట్రువలన సుబల
నందన దెసను మనంబిడి; చింతింతు | రట్ల పౌరులు వంత నారఁ గూరి
‘వృద్ధుండు ధృతరాష్ట్రవిభుఁడు సుఖార్హుఁడు | విగతజనం బైన విపినభూమి
నెత్తెఱంగున వసియించు? గాంధారియుఁ | గుంతియు నత్యంత కోమలాంగు
 
తే. లడవి నుండంగ నెట్లోర్తు రకట! యిట్టి కొడుకులను రాజ్యసౌఖ్యంబు విడిచి యట్లు
సనునె యక్కుంతిభోజుని తనయ? జనని | దొఱఁగిపోవుట కెంత గుందుదురొ వీరు!
012
క. ఆయాసంబున విదురుని | కాయము, సంజయుని మేనుఁ గందక యున్నే?
పోయిరి ధృతరాష్ట్ర మహీ | నాయకుపై భక్తిఁ గాననమున వసింపన్‌.’
013
క. అని యొండొరువులతోడ | న్వనట యెసఁగఁ బలుకుదురు మనంబులఁ గుంతీ
తనయులు మాతృవియుక్తత | కనయము నడలుదురు కౌరవాన్వయముఖ్యా!
014
సీ. ధర్మపుత్త్రాదులందఱు నొక్కచో నుండి | ధృతరాష్ట్రు నాతని దేవిఁ బేరు
కొని వారి కొడుకు లెల్లను ద్రుంగి రని, వార | లతి వృద్ధు లెమ్మెయి నడవిఁ గలిసి
యున్నా రనియు, నింక నెన్నాళ్ళు లుండెడి | గొంతి వనంబునఁ గూరఁ దినుచు?.
ననియును, బంధుల నదయతఁ దునిమితి | మలుక ధైర్యంబున నడఁప మైతి
 
తే. మనియు, నభిమన్యు వీరుని నతని తమ్ముఁ | గుఱ్ఱలను గర్ణునాఱడిఁ గోలుపోయి
యొంటి వడితి మనియుఁ, గడు నుమ్మలంపు | మాట లాడుదు ర్పరిజనుల్‌ మఱుఁగుచుండ.
015
వ. ఇ ట్లనుదినంబును ఘన చింతాక్రాంతులై యలంత నొందుదురు. 016
చ. విదురుని సంజయుం దలఁచి వేదనఁ బొందుదు; రట్లు నెవ్వగల్‌
హృదయముఁ గుందఁజేయఁ జెలువేది మనోజ్ఞము లైన భోగముల్‌
వదలి వినోదముల్‌ సలుపు లాలసతం బెడఁబాసి రాజ్యసం
పద నరయం దలం పెడలి పాడఱి యుండుదు, రేమి సెప్పుదున్‌!
017
క. ద్రౌపదియు సుభద్రయు సం | తాపం బందుదురు; పాండుతనయులు దలరన్‌
భూపాల భవజ్జనకుని | చూ పందఱ మానసముల శోకము నదుమున్‌.
018
ఆ. పరమధీరు లైన పాండుతనూభవు | లిట్లు ధైర్యసార మెడలి వికల
బుద్ధు లగుచు నుండి పోవం గడంగి ర | య్యంధనృపతిఁ జూడ నధిపముఖ్య!
019
వ. అట్టియెడ సహదేవుండు పాండవాగ్రజునకుం బ్రణమిల్లి భరితవినయుం డై. 020
క. ‘ఏను మును చెప్ప వెఱచితిఁ | గాని యధిప! గొంతిఁ జూడఁగా జను టర్హం
బైన పని; యింత కేదెస | దా నొందునొ విపినవాస దౌస్స్థిత్యమునన్‌?
021
తే. గొంతి ప్రాణంబుతో నుండఁ గురువరేణ్య! | యచ్చటికిఁ జని యొకమరి యమ్మహాను
భావ దర్శింప వలవదె? బావ నప్ప | ననుసరించుచు నెట్లున్న యదియొ సాధ్వి!
022
క. ధృతరాష్ట్రుఁడు గాంధారియు | నతిమృదులాంగకులు వల్కలాజినధరులై
వ్రతచర్యల వన్యాహా | రత నలఁగుచు నున్నవారు రాజవరేణ్యా!
023
ఉ. వారలఁ జూడఁ బోఁ దగు నవశ్యము దుర్దశ పుట్టకుండ మున్‌
మీ‘రని చెప్ప నప్పుడు సమీపమునం జెవి దార్చి నెవ్వగం
గూరుచు నున్న ద్రౌపది యగుం గరణీయము బంధు దుఃఖ సం
తారక! మీకు నీతఁ డుచితంబుగఁ జెప్పిన కార్య మెమ్మెయిన్‌.
024
తే. గొంతి కోడండ్రు రెల్లను గురువరేణ్య! | యెత్తినడుగుల నున్నవా రత్తపస్వి
నీ వరిష్ఠ దర్శింపంగఁ బోవఁ గోరి | యనియె నట్టు లయ్యిరువురు నాడుటయును.
025
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )