పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము
విదురుఁడు యోగమార్గంబున ధర్మరాజునందుఁ గలియుట (సం. 15-33-22)
సీ. ధర్మతనూజుండు తత్సమీపంబున | కేఁగి యయ్యోగి కట్టెదుర నిలిచి
యాతండు నయనంబు లర్ధమీలితములై | యుండంగ నూరక యున్నఁ గాంచి
‘నిర్మలాత్మక ! యేను ధర్మసూనుఁడ; నన్నుఁ | గనువిచ్చి చూడవే!’ యనుడు నతఁడు
ఱెప్పల నెగయించి యప్పాండవోత్తముఁ | దప్పక చూచి యుదాత్త యోగ
 
తే. బలము గైకొని యింద్రియములను బ్రాణ | ములను నింద్రియములుఁ బ్రాణములను గలిపి
నిజశరీరంబు విడిచి యా నృపతి తనువు | సొచ్చెఁ దేజోమయత్వవిస్ఫూర్తి మెఱయ.
060
ఆ. వినుము ధర్మపుత్త్రు తనువునఁ గాంతియు | లావు నప్పు డగ్గలంబు లయ్యె,
నొలసె బుద్ధి యధిక బల; మట్టు లగు టతఁ | డెఱిఁగి చోద్యమంది యెలమి నొందె.
061
క. తదనంతరంబ యప్పతి | విదురశవము మ్రాను సెంది వికృతరహితమై
నిదురమెయి నొఱగియున్న ప | గిది నుండం జూచి యగ్నికృత్యము నడపన్‌.
062
చ. తలఁచిన మింట నొక్కెలుఁగు ‘ధర్మతనూజ! యతిత్వ గౌరవో
జ్జ్వలుని కళేబరంబునకు వహ్నివిధాన మొనర్చు టర్హమే?
వల’దని మ్రోసె; నమ్మనుజవల్లభుఁ డప్పని దక్కి పోయి భ్రా
తలకును దండ్రికిన్‌ సువిదితంబుగ నంతయునుం గ్రమంబునన్‌.
063
వ. ఎల్లవారును వినుచుండం జెప్పిన నందఱు నద్భుత రసంబున మునింగిరి; పదంపడి ధృతరాష్ట్రుం డామంత్రణంబు సేయ మునిజనులు నిజనివాసంబులకుం జనిరి; తదనంతరంబ యాంబికేయుండు ధర్మనందనుని తోడ. 064
సీ. ‘భరతకులోత్తమ! ఫలమూలముల నుప | యోగింపు మొసఁగెద నొదవి తనకు
నెయ్యది యాహారమయ్యె నాతిథ్యంబు | దానిన నడపుట ధర్మసరణి’
యనవుడు ‘నట్ల కా’ కని ఫలంబులు మూల | ములు నుపయోగించె మోదభరితుఁ
డగుచు నప్పాండుసుతాగ్రణి యబ్భంగి | నఖిలజనములు నాహారకలన
 
తే. మాచరించి రయ్యందఱు నవని శయన | మొంది యారాత్రి నిద్రించి రుదితసూర్య |
కాలమగుటయు, సముచిత కర్మకరణ | మనుజులును దాను నడపె నమ్మనుజవిభుఁడు.
065
వ. అట్లు కాలోచితకృత్యంబులు నడపి సహోదరసహితుండును దారోపేతుండును నర్హపరివారానుగతుండును నై యాశ్రమపథంబు గలయ మెలంగి, పావనస్నాన పావకార్చన జపధ్యానాది తాపసధర్మచర్యా విధంబులు, నానామృగ నిర్భయ సంచార ప్రకారంబులు వివిధపక్షికుల నిశ్శంక కేళీవిభవంబులు నాలోకించి, కృత ప్రాతస్సవనకరణీయుం డై యున్న కురువృద్ధు కడకు వచ్చి వందనాభినందన వచనంబుల నతని యుల్లంబు పల్లవింపంజేసి యతఁడు వనుపఁ బవిత్రాసనోపవిష్టుం డై. 066
చ. అనుజులుఁ దాను భక్తి మెయి నమ్మహనీయునిఁ గొల్చియుండ న
య్యునికిఁ గనుంగొనంగఁ గరముత్సుకతన్‌ శతయూపుఁ డాదిగా
మునివరు లేఁగుదెంచినఁ బ్రమోదమునం గుశపీఠరాజిపై
నునుపఁగఁ బంచె గాఢవినయోక్తుల నా ధృతరాష్ట్రుఁ డందఱన్‌.
067
వ. అట్లున్న యమ్మునిజనంబులును బాండు పుత్త్రులునుం బరమధర్మమయ సంభాషణంబులు సేయుచుండ నినుండు నభోమధ్యగతుం డయ్యె; నప్పు డాంబికేయుండు సవినయంబుగా నత్తాపసోత్తములతో ‘మీకు మధ్యందిన కృత్యంబు లాచరింపవలయు; విజయం చేయుం’డనిన వారలు నిజనివాసంబులకుం జనిరి; తదనంతరంబ కౌంతేయుల మాధ్యాహ్నిక కరణీయంబులు నిర్వర్తించుట కరుగుం డని పనిచె; నని చెప్పినవిని జనమేజయుం డప్పాండవేయు లవ్విధంబున వనంబున నెన్ని దినంబులు వసియించి?’ రని యడిగిన వైశం పాయనుం డిట్లనియె. 068
సీ. ‘ధరణీశ! పాండునందను లట్లు సాంతఃపు | రంబును సపరివారంబుఁగాఁగ
నడవికి నేఁగి యయ్యంబికానందనుఁ | గాంచిన దినమునఁ గరము నియతి
ఫలమూలసమితి నాఁకలి వుచ్చి భూమిశ | యనమున నిద్రించి రాగరిష్ఠుఁ
డమ్మహితాత్ముల కర్థ్థితో మఱునాఁ | డనుజ్ఞ యిచ్చిన, సుమనోజ్ఞములును
 
ఆ. సన్నుతములు నైన యన్నపానాదుల | ననుభవించి మృదులహారి తల్ప
ముల శయించి; రట్లు నెలనాళు లయ్యెడ | నతనిఁ గొల్చియుండి రధిపముఖ్య!
069
వ. పదంపడి యొక్కనాఁ డెప్పటియట్ల పాండుపుత్త్రులు గాంధారీ కుంతీసముపాసితుండయియున్న విచిత్రవీర్యపుత్త్రుంబరివేష్టించియుండ నవ్విశిష్ట గోష్ఠికై శతయూపప్రభృతి మునివరులు చనుదెంచిన నక్కురువృద్ధుఁడర్హంబు లగునాసనంబులు వెట్టించి సంభావించిన. 070
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )