పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము
వేదవ్యాసుఁడు పాండవసహితుండైన ధృతరాష్ట్రునాశ్రమంబునకు వచ్చుట (సం. 15-34-21)
సీ. సముచితంబులు సధర్మములును నైన స | ల్లాపముల్‌ సెల్ల నుల్లంబు లలర
వార లున్నెడ సత్యవతికొడు కందుల | కేతేర నందఱు నెదురువోయి
వినతులై భక్తిఁ దోడ్కొనివచ్చి యతులకృ | ష్ణాజిన దర్భోత్తరాసనమున
నునిచి యమ్మునివరుననుమతిఁ దమతమ | యాసనంబుల నుండి; రమ్మహాత్ము
 
ఆ. నర్చితునిగఁ జేసె నాంబికేయుఁడు దద | నంతరంబ సమధికాదరమున
నతఁడు మధుర మృదు విధాక్షరంబుగ నమ్మ | హీశముఖ్యుతోడ నిట్టు లనియె.
071
సీ. ‘వనవాసమున నీకు మన మలవడియెనే? | నియతిమైఁ దాపసక్రియల కోర్చి
నడపెదవే పుత్త్రునాశజమైనశో | కము భవదంతరంగంబునందు
లేదు గదా? ధర్మవేదిని గాంధారి | యుమ్మలికంబు లే కున్న యదియె?
నీకుఁ బరిజ్ఞాననిష్ఠ గల్గెనె? గొంతి | శుశ్రూష మీ కొనర్చునె తగంగ?
 
తే. రాజ్య మొల్లక వచ్చె నరణ్యవాస | మునకు నీయమ; మీరు రాఁ దనకు నింట
నిలువఁ దగ దని యిమ్మేలు నీదు బుద్ధి | నొలసి యుండునె కౌరవకులపవిత్ర!
072
చ. అనఘ! యజాతశత్రునెడ నాదరణాతిశయాన్వితంబె నీ
మనము? వృకోదరున్‌ నరుని మాద్రితనూజుల సత్క్రియాభినం
దనముల గారవింతె? వినుతస్థితిఁ దద్దయు నిర్మలత్వ మొం
దెనె భవదీయచిత్తమున ధీమహితా! దృఢశాంతిమూలమై.’
073
వ. అని యంత నిలువక. 074
ఆ. ‘వినుము! దీర్ఘవైర వృత్తియు’ ద్రోహచిం | తనము లేక వాక్కు మనము నొక్క
చంద మగుట సకలజనములకును బంధు | సంపదాప్తి పరమసాధనంబు.’
075
వ. అని చెప్పి వెండియు. 076
సీ. ‘విదురుండు దేహంబు విడిచిన తెఱఁగెల్ల | నెఱిఁగితె? మాండవ్యుఁ డిచ్చినట్టి
పటుశాపమున శూద్ర భావంబు నొందిన | ధర్మదేవత బోధనిర్మలాత్ముఁ
డైన యమ్మహనీయుఁ డట్లగుటంబుజా | సనుని యాజ్ఞాపనమున విచిత్ర
వీర్యనృపాధీన విశ్రుతక్షేత్రంబు | నం దేఁ బ్రవర్తింప నధిప! కలిగె
 
తే. ధర్మదేవత మాఱట తనువు సూవె | యీ యుధిష్ఠిరు నుజ్జ్వలకాయ; మింత
యెఱిఁగి కాదె యమ్మహిత యోగీశ్వరుఁడు స | మీడ్య యోగబలంబున నితనిఁ గలసె.
077
ఆ. అట్లు దేవతామయాత్మకుఁ డైన యి | వ్విభుఁడు నిన్నుఁ బ్రేష్యవృత్తి నిట్లు
గొలిచి యునికి బుద్ధిఁ దలపోసి సంతస | మంది యుండుదే కులాగ్రగణ్య!’
078
వ. అనిన విని వైచిత్రవీర్యుం డప్పారాశర్యునకుఁ బరమవినయంబున నిట్లనియె, 079
సీ. ‘వనవాస మించుకయును నాకు దుఃఖంబు | సేయదు; దేహంబుఁ జిత్తమును ద
పఃక్రియలకుఁ బనుపడి యున్నయవి నన్ను | గాంధారిఁ బుత్త్రశోకం బొకింత
యేనియుఁ బొందంగ నీఁడు సభక్తిక | మైన వృత్తమున ధర్మాత్మజుండు
మునివర! యితనిపై ననుజుల మీఁద వ | త్సలము నా హృదయ మిద్ధరణివిభుఁడు
 
ఆ. దేవతాత్ముఁ డగుట దెల్ల మై యునికి మ | ద్వచనవర్తనములవలన నితఁడ
యెఱిఁగి యుండుఁ గొంతి తెఱఁగు శుశ్రూషయు | నద్భుతంబు ముదము నావహించు.
080
వ. నాకుం బరిజ్ఞానంబును మానస నిర్మలత్వంబును భవత్‌ ప్రసాదంబునం గలిగెడుఁగాక’ యనియె; నా సమయంబున ద్రౌపదీసుభద్రలును దక్కునుంగల్గు నంగనాజనంబులును బారాశర్య సందర్శన ప్రవణత్వంబునం జనుదెంచి సభక్తి ప్రణామంబు లాచరించి యంతంత నిలిచి; రయ్యలఘుజ్ఞాన మాననీయుండు ధృతరాష్ట్రు తోడ. 081
ఉ. మీయెడ చింత వాయఁగ సమీహితబుద్ధి యొనర్పఁ గోరి యే
నీ యెడ కిప్డు వచ్చితి నభీష్టము వేఁడుము శంక దక్కి భూ
నాయక! యెల్లభంగిని మనః ప్రియముం దగ నిత్తు’ నన్నఁ గౌం
తేయు లెలర్చి; రవ్వసుమతీపతి మోదము నొందె నెంతయున్‌.
082
వ. వ్యాసుండు వెండియు. 083
చ. ‘అనఘ! యమానుషం బయినయట్టిద యైనను నా తపంబుపెం
పునకు మునీంద్రు లద్భుతముఁ బొందఁగ మీ కవలీల నిత్తు నే’
ననుటయు నా కురుక్షితిపుఁ డాదటఁ గోరఁగ మీర లిందు వ
చ్చిన కరుణామయాదర విశేషముకంటెను మేలు గల్గునే?
084
క. మానుష మైన నమానుష | మైనను బ్రార్థనకు విషయమైనది భవదీ
యానూనకృపకు నెక్కుడు | గా నొక్కఁడుఁ గాన నేను గారుణ్యనిధీ!
085
ఆ. సంయమీంద్ర! నాదుజన్మంబు సఫలతఁ | బొందె మీరు విమలబుద్ధి నింత
యాదరించినపుడ; లే దింకఁ బరలోక | భీతి ధన్యతముఁడ నైతి నేను.
086
వ. అట్లయినను మీ రొక్కటి గోరు మనిన నామనంబున నెప్పుడుం గలయది యెఱింగింపవలసె; విన్నవించెద. 087
సీ. దుష్టచిత్తుం డగు దుర్యోధనుండు ని | ష్పాపస్వభావులఁ బాండుసుతులఁ
బరిభవించి సమస్తనరనాథు లనిఁ గరి | తురగయుతంబుగాఁ ద్రుంగఁజేసి
ధరణి రాజ్యముఁ గోరి గురుభీష్మకర్ణాది | సత్పురుషుల నెల్లఁ జంపికొనియె;
నన్నీచునకుఁగా ‘మహారాజు లాండ్రను | బిడ్డల విడిచి యభేద్య ధైర్య,
 
తే. వృత్తి రణమృతిఁ బొంది; రవ్విభుల కేది | గతియొ? యిమ్మెయి మూఢులై కలనఁ బడిన
కురుకుమారకు లెట్లైరొ పరమబోధ | మహిత! యెఱుఁగని వగ పెద్ద మాన్పు మనియె.
088
వ. అనుటయు నప్ప్రేముడి పలుకులు విని గాంధారికిం గుంతికిం బాంచాలికి సుభద్రకు మఱియునుం గలయంగనలకుం జిత్తంబుల నెవ్వగలు గ్రొత్తలయ్యె; నప్పు డాసుబలనందన పట్టావృతలోచనత్వంబునన చూచి దయాధామం బై యున్న యా మామ నుద్దేశించి మోడ్చిన చేతు లద్దెసకు నిగిడ్చి యిట్లనియె. 089
సీ. ‘మునినాథ యీ రాజు తనయు లందఱును గ | య్యంబునఁ దెగినదియాదిగాఁ బ
దాఱేండ్లు వగలపా లగుచుఁ దత్సన్నిధి | గల్గుటఁ గోరు;లోకంబు లెన్ని
యన్నియుఁ జూపంగనైనను జాలుదు | నిర్మలతపమున పేర్మి నీవు
పుత్త్రసాన్నిధ్య మీ భూపతి కొనరించు | టెంతటిపని? నీకు గొంతి ద్రుపద
 
తే. రాజపుత్రి సుభద్ర కౌరవ కుమార | శతము భార్యలు నూర్వురు సౌమదత్తి
పత్ని, యత్తన్వియత్త యప్పడఁతి యత్త | గోరుదురు యుద్ధమృతబంధుకోటిఁ జూడ.
090
వ. అంతయును భవదీయ దివ్యబోధంబు గనుచుండు. 091
క. పరమమునీంద్ర! సమరమృత | కురువీరుల మా మనముల గో డుడుగ భవ
త్కరుణ వెలయ లోకం బ | చ్చెరువందఁగఁ జూపవే విచిత్రపుమహిమన్‌’.
092
చ. అనునెడ గొంతి వాడువదనాబ్జముతోడ మదిం దలంచెఁ గ
ర్ణుని; నది యత్తపోధనవరుం డెదఁ గాంచి దయానురక్తి న
వ్వనిత గుఱించి యిట్లను ‘భవన్మతి నొందిన కోర్కి సెప్పు మే
ననఘచరిత్ర! దాని ఫల మందఁగఁజేసి యలంతఁ బాపెదన్‌’
093
వ. అనిన విని యయ్యింతి సంతసిల్లి యా సంయమివల్లభునకు దండప్రణామంబు చేసి చేతులు మోడ్చి లజ్జా సహితం బగు నంతరంగంబుతో వినయనమ్ర యగుచు నిట్లనియె. 094
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )