పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము
కుంతి వేదవ్యాసునితోఁ గర్ణుఁడు దనకు జన్మించిన తెఱంగెఱింగించుట (సం. 15-38-1)
సీ. ‘దేవతలకు నీవ దేవత; విట్టి ని | న్మామగాఁ బడసితి మహితకరుణ
ననుఁ జూచి నాదువిన్నప మాదరింపు మేఁ | గన్యాత్వదశ నుండఁగా మదీయ
జనకుని కడకుఁ గోపనుఁ డైన దుర్వాసుఁ | డన్మహాముని వచ్చె; నతని సవిన
యార్చన కలనాసమారాధితుండుగాఁ | జేసితిఁ బ్రీతుఁడై ‘చెలువ! నీకు
 
ఆ. నిత్తు వరము; వేఁడు మెయ్యది కోరికి?’ | యనియె; నతఁడు ‘మీ ప్రియంబుకంటె
ననఘ! మిగులు కోర్కియును గలదే? నాకు | నంటిఁ; గాని యొకఁడు నడుగ నైతి.
095
వ. అమ్మాట తనమనంబునకు రానిచందంబు మొగంబునం దోఁప నత్తాపసవరుండు ‘వరం బెల్లభంగి నొసంగక పోవ; నడుగు’ మనుటయు, వెఱచియు నాదువేడ్కతెఱం గట్ల యగుటను ‘బుత్త్రుంగోరితిఁ గోరిన నమ్ముని పతి యొక్క మంత్రం బనుగ్రహించి ‘దీన నీ వావహించిన దేవతలు భవద్వశగతులై సుతజన్మంబు గలిగింతురు; విశేషించి ధర్మువునకుఁ దల్లివి గాఁగలదాన’ వని పలికి యంతర్ధానంబు చేసిన. 096
ఆ. అద్భుతమునఁ బొంది యమ్మంత్రరూప ము | ల్లమున నెప్పుడును దలంతు; నొక్క
నాఁడు మేడమీఁదఁ బోఁడిమి నే నుండి | కంటిఁ బొడుచుచున్న కమలమిత్త్రు.
097
క. కని యిది కన్యకు దోషం | బని తలఁపక బాల్యసంభృతాజ్ఞానము వే
డ్క నొనర్ప నావహించితి | ముని మంత్ర బలమున సూర్యు మునినాథవరా!
098
తే. ఆవహించిన నద్దేవుఁ డాకసమున | నాత్మమూర్తి వర్తింప మూర్త్యంతరంబు
దాల్చి నాకడ కేతెంచెఁ దత్‌క్షణంబ | నాదుచిత్త మాశ్చర్యమగ్నంబు గాఁగ.
099
వ. ఇట్లు చనుదెంచి. 100
సీ. ‘అడుగు మిచ్చెద వరం’ బనిన వడంకుచుఁ | గేలు మొగిడ్చి ‘పొం డేల యిచట’
ననిన ‘వృథాహ్వాన మాచరించుట తప్పు | నిన్నును నెవ్వఁడు నీకు మంత్ర
మిచ్చె నాతని శపియింతుఁ జుమ్మీ!’యని | పలికె నయ్యర్కుఁ; డే నలికి గురుని
నిరపరాధుని శాపనిహతుఁగాఁ జేయుట | కోర్వక పుత్త్రకు నొసఁగు దేవ
 
తే. కృప భవత్సము’ ననిన నయ్యపరిమేయ | తేజుఁ డాత్మతేజమున నా దృఙఙఙ్ముఙఖేంద్రి
యములు మనసును సమ్మోహితములు సేసి | యపుడు తనయుండు పుట్టెడు’ ననియెఁ బిదప.
101
వ. అని నిర్దేశించి. 102
తే. ‘నీకుఁ గన్యాత్వ వికలత గాక యుండ | వరము నిచ్చితి’ ననుచు దివమున కరిగె;
జనకముఖబంధుచిత్తవంచనము నడపి | గూఢ మందిరాంతరమునఁ గొడుకుఁ గంటి.
103
క. కని యేటిలో నిడితిఁ గలఁ | గని నట్లయి యుండెఁ దత్ప్రకారం; బిది మీ
కనినయది దివ్య బోధంబున నత్తెఱఁ గంతరంగమునఁ గొని కాలున్‌.
104
తే. పాప మయ్యెఁ గా కుండె నప్పనిఁ దలంచి | యళుకుచుండుదు; మద్భయ మపనయింపుఁ
డతులకరుణ నిక్కురువృద్ధునభిమతమును | సఫలముగఁ జేయుఁ డివి నాకు సద్వరములు.
105
వ. అనిన విని యమ్మునీంద్రుం డమ్మానిని కిట్లనియె. 106
సీ. ‘నీ చెప్పినది యెల్ల నిక్కంబు కోడల! | యెగ్గు నీ యందు లే; దేల వెఱవ?
సుర లద్భుతాపాదిచరితులు; కర్ణున | కట్లుగా నున్నది యగుటఁ జేసి
యేటిలో నాతని నిడి తీవు; కన్యాత్వ | హాని లే కున్కిఁ గులాగ్రగణ్య
వైతి; భవద్వృత్త మమలిన మగుటకు | ననుమాన మించుక యైన వలవ’
 
ఆ. దనుచు నాదరార్ద్రుఁడయి పల్కి గాంధారి | తోడ ‘నీవు సుతులఁ దోడఁబుట్టు
వులను గాంతు, నీదు చెలియలు గొంతియుఁ | గర్ణుఁ జూడఁ గాంచు గణ్యచరిత!
107
ఉ. ద్రౌపదియున్‌ సుభద్రయును దక్కటి కాంతలు భ్రాతృపుత్త్ర పౌ
త్త్రోపవిలోక నోత్సవము నొందుదు రిచ్చటి కిప్డు వచ్చు టే
నీ పని యాచరించుటకు; నిమ్మనుజేంద్రుఁడు నీవు గొంతి చిం
తాపరితాపనోదన విధంబుగఁ గోరితి రట్లు చేసెదన్‌.
108
క. నీ కొడుకులకు మనుమలకు | శోకింపఁగ వలదు; వారు శూరత వెలయం
జే కొనిరి రణమరణమున | నాక భువనసుఖము సద్గుణస్తవనీయా!
109
ఆ. భామ! విను మవశ్య భవితవ్య మైన భా | రతరణంబు పొంటె నతుల మహిమ
మాననీయ దేవయోనులు జననంబు | నొంది రిందు మనుజయోనులందు.
110
సీ. ధృతరాష్ట్రుఁ డనఁగ వర్తిల్లెడు మేటి గం | ధర్వుఁడీ ధృతరాష్ట్రధరణివిభుఁడు
తన్వి! పాండుఁడు మరుద్గణ మయజని; ధర్మ | దేవత సూవె యుధిష్ఠిరుండు;
పవనుండు భీముఁడై ప్రభవించె; నరుఁ డను | ముని యర్జునుం డయి జనన మొందె.
నారాయణుఁడు గృష్ణనాముఁడై జనియించెఁ; | గనుఁగొను కవల నాశ్వినులు గాఁగ;
 
తే. ద్వాపరంబుగ నెఱుఁగు గాంధార రాజు; | గలి సుయోధనుఁ డయ్యె; రాక్షసులు పుట్టి
రతని యనుజులై; కర్ణుని నరుణకిరణుఁ | గాఁగ; నభిమన్యుఁ జంద్రునిఁ గాఁగఁ గనుము.
111
క. అనలుఁడు ధృష్టద్యుమ్నుం | డన ద్రౌపదితోడఁబుట్టె; ననిలుని యంశం
బున జనియించె శిఖండియు; | ననిమిషగురుఁ డుద్భవించె నస్త్రగురుండై.
112
తే. వినుము వసుశక్తి గాంగేయుఁ డనఁగ జనన | మొందె; రుద్రాంశమున ద్రౌణి యుదయ మయ్యెఁ
దెలియఁ జెప్పితిఁ గొందఱు కలరు మఱియు | నిర్జరాసురాంశముల జన్మించినారు.’
113
క. అని పలికి ‘మీ మనంబుల | వనట సమస్తంబుఁ బుచ్చి వైచెద నాతోఁ
జనుదెండు మీరు గంగకుఁ గనియెద రనిఁ దెగిన బంధుగణముల నచటన్‌.’
114
తే. అనుచు నుత్థితుఁ డగుటయు నార్పుటెలుఁగు | లాకసం బంద ధృతరాష్ట్రుఁ డాది గాఁగఁ
గలుగు నా సర్వజనులు నొక్కటఁ గడంగి | యరిగి రమ్మునినాథుతోఁ గురువరేణ్య!
115
క. అరుగఁగ మునిజనములు న | చ్చెరు వందుచు నమ్మునీంద్రు సేవించి మరు
త్సరిదుపకంఠ తలమునకు | నరిగిరి కౌతుకము మనములందు నెలకొనన్‌.
116
వ. అట్లు పౌరజానపదసహితు లై సకలజనంబులుం జని సాత్యవతేయుండు వనుప భాగీరథీతీరంబున విడిసి; ర వ్విచిత్రచరిత్రుండు దన చేయంబూనిన పని మఱునాఁడు రేపకడ సేయువాఁడుగాఁ బలికిన నయ్యందఱు నద్దినశేషంబు నా యామినియును శతసంవత్సరంబులుంబోలె నుండ సూర్యోదయసమయం బగుటయుఁ గాలోచితకృత్యంబు లాచరించి ధృతరాష్ట్రుుండును బాండుతనయులుం దపోధనులు నప్పారాశర్యుపాలికి నరిగి యమ్మునివరుం బరివేష్టించిరి; గాంధారీప్రముఖభామినులు నేతెంచి యొక్కవలన నతనిం గొలిచి యుండిరి; సర్వజనులు నఱ్ఱు లెత్తికొని యంతంత నిలిచిరి; తదనంతరంబ. 117
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )