| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అట్లు సమస్త జనంబులును విగతరోదను లై రప్పు డక్కౌరవనాథుండు నారదముని యాననం బాలోకించి యిట్లనియె. | 160 |
| సీ. |
‘ఎఱుఁగఁగ వచ్చునే యెవ్వరి కెత్తఱి | నేదెస యగునొ మునీంద్ర! యేము గలుగంగ దెస లేని పులుమానిసికిఁ బోలె | నక్కురువృద్ధున కట్టిచావు పాటిల్లె; సుముదీర్ణ బాహుదర్పోజ్జ్వలు | లైన పుత్త్రులు నూర్వు రట్లు గలిగి బలము నాగాయుతప్రాణసమం బగు | నమ్మహారా జట్టి యడవిచిచ్చు |
|
| తే. |
వలనఁ దెగటాఱె; నే మనఁ గలదు కమల | ముఖుల తాలవృంతానిలముల సుఖించు ప్రభువె కంక గృధ్రావలీపక్షవాయు | వడర నిలఁబడియున్నవాఁ డక్కటకట! |
161 |
| క. |
కల మృదుమాగధ గానం | బుల మేల్కనురాజు గృధ్రములునుం గాకం బులు నఱవఁగ నిడుద నిదుర | నొలసి తెలుప దిక్కుమాలి యున్నాఁడు గదే! |
162 |
| సీ. |
వల్లభుం డొక్క సద్వ్రతముఁ బూనినఁ దానుఁ | దద్వ్రత మూని గాంధారి యతని పోయినగతిఁ బోయె; నాయమకై యంత | వగవఁ; బుత్త్రుల రాజ్యవైభవంబు విడిచి మే యోమక యడవికి బోయిన | తల్లికి వగచెద; ధర్మసుతుఁడు భీమసేనుండును, బీభత్సుఁడును దన | కడుపునఁ బుట్టిన కొడుకు; లట్టి |
|
| తే. |
యెగ్గతంబునఁ దానుఁ గారగ్గిఁ గాలె | నటె యనాథయై దీనికి నంతరంగ మలఁదురక తల్లడిల్లక యారటమున | నుడుక కలమటఁ బడక యెట్లుండుఁ జెపుమ! |
163 |
| క. |
విను ఖాండవ దహనంబునఁ | దనకుఁ బ్రమోదంబు శక్రతనయుఁ డొసఁగె; నా తని తల్లిఁ గాల్పఁ దగునే | యనలునకుం; గడుఁగృతఘ్నుఁ డయ్యె మునీంద్రా! |
164 |
| సీ. |
మఱియొక్క నెవ్వగ మనమున జనియించె; | నాంబికేయుండు కారగ్గి నెరసె దానికి నెయ్యది యేను జేయుదు నొక్కొ?’ | యనవుడు నారదుం డానృపాలు తోడ నబ్భరతవృద్ధుఁడు శాంతి యెక్కుడై | సవిశేషమైన పూజా విధాన మున నుపాసించి తగిన యిష్టి సేసి య | గ్నులఁ దొలునాఁడ వీడ్కొనియె; ననియు |
|
| తే. |
నపుడు యాజకజనము లయ్యగ్ని చయము | నడవిలోన నుద్వాసించి యరిగె; ననియుఁ బేర్చి యది యవ్వనం బెల్ల నేర్చె ననియు | వింటి నాత్మాగ్నిఁ గాలె నా విభుఁడు వత్స!’ |
165 |
| ఉ. |
కావున నెవ్వగం బొరయఁగాఁ బనిలేదు నరేంద్ర! గొంతియుం బావకు నప్పకుం గరము భక్తి దగం బరిచర్య సేసి దే వావలి ప్రస్తుతింపఁగ నిరామయలోకము నొందె; వారికిన్ నీ వుదకంబు లీవలయు నిష్ఠమెయిం దిలసంయుతంబుగాన్. |
166 |