పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము
యుధిష్ఠిరుఁడు ధృతరాష్ట్రాదులకుఁ దిలోదక ప్రదానంబు చేయుట (సం. 15-47-10)
క. అనుజన్ములు నంతఃపుర | వనితాజనములును నీవు వసుధేశ్వర ! వే
చని నడపుఁ డుదకవిధి నీ | జనకునకును జననులకును జాహ్నవిలోనన్‌.’
167
ఆ. అనిన లెస్స గాక! యని ధర్మసుతుఁ డేక | వస్త్ర ధరణనియతి వఱల నెల్ల
వారు నట్ల యేఁగుదేరఁగఁ బౌరులు | బలసి చనఁగఁ జనియెఁ బౌరవేంద్ర!
168
వ. ఇట్లు చని గంగాస్నానం బాచరించి యమ్మహీపతి మొదలగు నర్హజనంబులు ధృతరాష్ట్రునకు గాంధారికిం గుంతికిం దిలోదకప్రదానంబులు నిర్వర్తించి, నివృత్తులై యశుచిత్వం బపనయించుటకుం బుర బహిరంగణంబునఁ బటకుటీర ప్రకరంబుల వసియించి; రట్టియెడ. 169
సీ. ఆంబికేయాదుల యస్థిపుంజముల గం | గాద్వార సలిల సంగమ విశిష్ట
సంస్కారమునఁ గూర్పఁ జాలెడు సంశుద్ధ | జనముల రావించి సబహుమాన
ఫణితుల వారి కప్పని యేర్పడఁగఁ జెప్పి | పనిచె నక్కౌరవ జనవిభుండు;
శ్రాద్ధార్హదినమున వృద్ధానుమతి నతం | డక్కురువృద్ధున కతని సతికి
 
తే. గొంతికిని రత్నకాంచన గోతురంగ | హస్తి కన్యా ధరిత్రీ గృహాది దాన
విధుల సర్వజనంబులు విస్మితులుగ | నియతిమెయిఁ బారలౌకిక క్రియ లొనర్చె.
170
ఆ. మునిజనములు వచ్చి యనుమోద మందంగ | సకల బంధుజనులు సంతసిల్ల
నన్న పర్వతముల నాజ్యనదులఁ బితృ | మేధ ముల్లసిల్లె మేదినీశ!
171
క. ద్వాదశ దినములు నారదుఁ | డాదరమున నొద్ద నుండి యంతయుఁ గని స
మ్మోదంబుతోడ నాశీ | ర్వాదం బొనరించెఁ బాండవ ప్రవరునకున్‌.
172
వ. అమ్మునీంద్రునిఁ దక్కునుం గలుగుతపస్విసత్తముల సమర్చితులం గావించి యుధిష్ఠిరుం డామంత్రితులం జేసిన నాసంయమివరులు నిజనివాసంబులకుం జని; రానృపకుంజరుండు బంధుమిత్రసహితుండై కుంజర పురంబు ప్రవేశించె; నిత్తెఱంగున నాంబికేయునకు భారతరణంబు పిదప దానాది పుణ్య క్రియాకలాపకరణంబులం బురంబునం బదియేనును, దపోనియమంబున వనంబున మూఁడునుంగాఁ బదునెనిమిది సంవత్సరంబులు చనియె; నివ్విధంబున వైచిత్రవీర్యుని సంసేవన సమస్తప్రకారంబుల సంఘటించి కృతార్థతానందంబునొంది ధర్మ నందనుండు జనంబు లభినందించుచందంబున సామ్రాజ్యంబుఁ బాలించె నని యిట్లు ధృతరాష్ట్రుని యాశ్ర మ వాసంబు విషయంబైన వర్తనంబు వైశంపాయనుండు చెప్పిన విని జనమేజయుండు ‘మహాత్మా యిట్లు కృతకృత్యతం బొందిన పాండవాగ్రజుండు భూభారంబు నిర్వహించుచుండం బదంపడి పుట్టిన విశేషంబు లెఱింగింపవే! యనుటయు. 173
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )