| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ప్రథమాశ్వాసము |
| మ. |
అమితాఖ్యానకశాఖలం బొలిచి, వేదార్థామలచ్ఛాయ మై, సుమహద్వర్గచతుష్కపుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో త్తమనానాగుణకీర్తనార్థఫల మై, ద్వైపాయనోద్యానజా త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసురప్రార్థ్య మై. |
66 |
| వ. | ఇట్టి మహాభారతంబు ననేకవిధపదార్థప్రపంచసంచితంబు నుపపర్వమహాపర్వోపశోభితంబు నుపద్వీపసంభృతం బయిన భువనం బజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు దత్తావధానుం డై సంవత్సరత్రయంబు నిర్మించి, దాని దేవలోకంబునందు వక్కాణింప నారదుం బనిచెఁ; బితృలోకంబున వక్కాణింప నసితుం డైన దేవలుం బనిచె; గరుడ గంధర్వయక్ష రాక్షసలోకంబులందు వక్కాణింప శుకుం బనిచె; నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె; మనుష్యలోకంబున జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిం బనిచె; నే నా వైశంపాయన మహామునివలన విని వచ్చితిఁ; దొల్లి కృతత్రేతావసాన సమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబులునుంబోలె ద్వాపరాంతంబునం బాండవధార్తరాష్ట్రులకు మహాఘోరయుద్ధం బయ్యె; నందు. | 67 |
| తరలము |
పదిదినంబులు భీష్ముఁ డాహవభారకుండు, గురుండు పం చదివసంబులు, గర్ణుఁడున్ దివసద్వయంబు, దినార్ధమం దుదితతేజుఁడు శల్యుఁ, డత్యధికోగ్రవీరగదారణం బది దినార్ధము గాఁగ నిట్లు మహాభయంకరవృత్తితోన్. |
68 |
| శా. |
ఏడక్షౌహిణు లెన్నఁ బాండవబలం; బేకాదశాక్షౌహిణుల్ రూఢిం గౌరవసైన్య; మీ యుభయమున్ రోషాహతాన్యోన్య మై యీడంబోవక వీఁక మైఁ బొడువఁగా నేపారు ఘోరాజి న ల్లాడెన్ ధాత్రి శమంతపంచకమునం దష్టాదశాహంబులున్. |
69 |
| వ. | ఇట్టి మహాభారతంబు కృష్ణద్వైపాయనమహాముని విరచితం బై ప్రవర్తిల్లుచుండు. | 70 |
| సీ. |
ఇమ్మహాభారతం బిమ్ములఁ బాయక | విహితావధాను లై వినుచునుండు వారికి విపుల ధర్మారంభసంసిద్ధి | యగుఁ బరమార్థంబ యశ్రమమున వేదముల్ నాలుగు నాదిపురాణముల్ | పదునెనిమిదియుఁ దత్ప్రమితధర్మ శాస్త్రంబులును మోక్షశాస్త్రతత్త్వంబులు | నెఱిఁగిన ఫల మగు, నెల్లప్రొద్దు |
|
| ఆ. |
దానములను బహువిధక్రతుహుతజప | బ్రహ్మచర్యములను బడయఁబడిన పుణ్యఫలముఁ బడయఁబోలు, నశేషపా | పక్షయంబు నగు, శుభంబుఁ బెరుఁగు. |
71 |
| ఉ. |
సాత్యవతేయ విష్ణుపద సంభవ మై, విబుధేశ్వరాబ్ధి సం గత్యుపశోభితం బయి, జగద్విదితం బగు భారతీయ భా రత్యమరాపగౌఘము నిరంతర సంతత పుణ్యసంపదు న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్. |
72 |
| వ. | అనిన విని శౌనకాది మహామునులుశ్రీమహాభారత కథా శ్రవణ కుతూహల పరు లయి యక్కథకున కిట్లనిరి. | 73 |