| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ప్రథమాశ్వాసము |
| మ. |
అనఘా! మున్ను శమంతపంచకము నయ్యక్షౌహిణీ సంఖ్యయున్ వినఁగా మా కెఱిఁగించి భారత కథావిర్భూతికిం గారణం బును దద్భారత విస్తరోక్తి విభవంబుం బాండవాడంబరం బును భీష్మాదికురు ప్రవీర చరితంబుం జెప్పు ముద్యన్మతిన్. |
74 |
| క. |
అనిన విని రోమహర్షణ | తనయుం డమ్మునుల కతిముదంబున వినయా వనతుఁ డయి గురులఁ దనహృ | ద్వనజంబున నిలిపి కొలిచి వాగ్గణపతులన్. |
75 |
| ఉ. |
ఇంబుగ సర్వలోకజను లెవ్వనియేని ముఖామృతాంశుబిం బంబున నుద్భవం బయిన భారతవాగమృతంబు కర్ణరం ధ్రం బను నంజలిం దవిలి త్రావుదు రట్టి మునీంద్రలోకవం ద్యుం బరముం బరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్. |
76 |
| వ. | అమ్మును లడిగిన కథ యథాక్రమంబున సవిస్తరంబుగాఁ జెప్పందొడంగె. | 77 |
| శా. |
త్రేతాద్వాపర సంధి నుద్ధత మదాంధీభూత విద్వేషిజీ మూతోగ్రశ్వసనుండు రాముఁ డలుకన్ ముయ్యేడుమాఱుల్ రణ ప్రీతిన్ వైరిధరాతలేశ్వరులఁ జంపెం బల్వురన్ దీర్ఘని ర్ఘాత క్రూరకుఠారలూన నిఖిలక్షత్త్రోరుకాంతారుఁ డై. |
78 |
| వ. | అప్పరశురాముండు నిజనిశిత కుఠారధారా విదళిత సకల క్షత్త్రరుధిరాపూర్ణంబులుగా నేను మడుంగులు గావించి తద్రుధిరజలంబులఁ బితృతర్పణంబు సేసి తత్పితృగణప్రార్థన నుపశమితక్రోధుం డయ్యె; దాననచేసి తత్సమీప ప్రదేశంబు శమంత పంచకంబునాఁ బరఁగె; మఱి యక్షౌహిణీసంఖ్య వినుండు. | 79 |
| సీ. |
వరరథ మొక్కండు వారణ మొక్కండు | తురగముల్ మూఁడు కాల్వురును నేవు రను సంఖ్య గల యది యగుఁ బత్తి, యది త్రిగు | ణం బైన సేనాముఖంబు, దీని త్రిగుణంబు గుల్మంబు, దీని ముమ్మడుఁ గగు | గణము, తద్గణము త్రిగుణిత మైన వాహిని యగు, దాని వడి మూఁట గుణియింపఁ | బృతన నాఁ బరఁగుఁ, దత్‌పృతన మూఁట |
|
| ఆ. |
గుణిత మైనఁ జము వగున్, మఱి దాని ము | మ్మడుఁ గనీకినీ సమాఖ్య నొనరు, నదియుఁ బదిమడుంగు లైన నక్షౌహిణి | యౌ నిరంతర ప్రమాను సంఖ్య. |
80 |
| వ. | ఇరువది యొక్కవేయు నెనమన్నూట డెబ్బది రథంబులు, నన్ని యేనుంగులు, నఱువదేనువేలు నాఱునూటపది గుఱ్ఱంబులు, లక్షయుం దొమ్మిదివేలున్ మున్నూట యేఁబండ్రు వీరభటులును గలయది యొక్క యక్షౌహిణి యయ్యె; నట్టి యక్షౌహిణులు పదునెనిమిదింట సన్నద్ధులై కురుపాండవులు యుద్ధంబు సేయుటం జేసి యా శమంతపంచకంబు కురుక్షేత్రంబు నాఁబరఁగె; నట్టి కురుక్షేత్రంబునందు. | 81 |
| చ. |
ప్రతిహతశత్రువిక్రముఁడు పాండవవంశ వివర్ధనుండు సు వ్రతుఁడు పరీక్షిదాత్మజుఁ డవద్యవిదూరుఁ డుదారకీర్తిని ర్మిత వివిధాధ్వరుండు జనమేజయుఁ డన్ జనపాలుఁ డుత్తమ స్తుతమతి దీర్ఘసత్త్ర మజితుం డొనరించె శుభాభికాంక్షి యై. |
82 |