| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
అంత దేవాహితు లమృతంబు గానక | యెంతయు నలిగి బలీంద్రుఁ గూడి మంతనం బుండి ‘యమర్త్యులతోడి పొ | త్తింతియ చాలు, నింకేల?’ యనుచు సంతనకట్టి, యుత్సాహసమేతులై | యంతంబులేని రథాశ్వములను దంతుల నమితపదాతుల నొడఁగూర్చి!| యంతకాకారు లై యార్చి, యమర |
|
| ఆ. |
వరులఁ దాఁకి యేసి రురుతరశరపక్ష | జాతవాతరయవిధూత మగుచుఁ జెదర జలదపంక్తి, బెదర వజ్రాయుధు | హృదయ, ముదిలకొనఁగఁ ద్రిదశగణము. |
21 |
| మహాస్రగ్ధర |
అమరేంద్రారాతు లిట్లాహవముఖమున నేయంగఁ దత్తీక్ష్‌ణబాణౌ ఘము ఘోరం బై సురానీకముపయిఁ బెలుచం గప్పినం జూచి, దైత్యో త్తములం గోదండచక్రోద్యతభుజులు మహాదారుణుల్ వీరలక్ష్మీ రమణుల్ దుర్వారవాత్యారయమున నరనారాయణుల్ దాఁకి రల్కన్. |
22 |
| మ. |
నరచాపప్రవిముక్తదారుణబృహన్నారాచధారల్ భయం కరదైతేయనికాయకాయములపైఁ గప్పెన్ దిశల్ నిండ బం ధురధాత్రీధరతుంగశృంగతటసందోహంబుపైఁ గప్పు దు ర్ధర ధారాధర ముక్తసంతతపయోధారావళిం బోలుచున్. |
23 |
| మ. |
పతదుర్వీధరధాతునిర్ఝరజలాభం బై మహాదేహని ర్గత సాంద్రారుణపూర మొక్కమొగి నొల్కం ద్రెస్సి, నారాయణో న్నతదోర్దండవిముక్తచక్రనిహతిన్ నాకద్విషన్మస్తక ప్రతతుల్ ఘోరరణంబునం బడియె భూభాగంబు కంపింపఁగన్. |
24 |
| వ. | ఇట్లు సముద్రతీరంబున నమరాసురులకు నతిఘోరయుద్ధం బయ్యె; నందు నరనారాయణు లపారపరాక్రము లై యసురవీరులఁ బెక్కండ్రం జంపిన నుక్కడంగి, దెసచెడి, యసురులు సముద్రంబు సొచ్చిన, నమరులు సమరలబ్ధవిజయు లై యమరపతి నమృతరక్షణార్థంబు ప్రార్థించి, యథాస్థానంబున మంథరనగంబు ప్రతిష్ఠాపించి, తమతమనివాసంబులకుం జని సుఖంబుండి రంత. | 25 |