| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
అమరాసురవీరులు ము | న్నమల పయోరాశిఁ ద్రచ్చి, యమృతము వడయన్ సమకట్టి, సురేంద్రపురో | గము లై హరిహరహిరణ్యగర్భులతోడన్. |
8 |
| ఉ. |
మేరుమహామహీధరముమీఁదికి నందఱుఁ బోయి, ‘యేక్రియన్ వారిధిఁ ద్రచ్చువారము? ధ్రువంబుగ దానికిఁ గవ్వ మెద్ది? యా ధారము దాని కెద్ది?’ యని తద్దయు వెన్బడియున్న, నచ్యుతాం భోరుహగర్భులిద్దఱును బూనిరి సర్వము నిర్వహింపఁగన్. |
9 |
| చ. |
అరుదుగ సర్వశైలములయంత తనర్పును నార్జవంబు సు స్థిరతయు నోషధీరసవిశేషతయుం గల దుత్తమంబు మం థరకుధరంబు గవ్వ మగు దానికి నంచును నిశ్చయించి, య య్యిరువురుఁ బంపఁగాఁ బెఱికి యెత్తె ననంతుఁడు తద్గిరీంద్రమున్. |
10 |
| వ. | ఇట్లు పదునొకండువేలయోజనంబులతనర్పును, నంతియపాఁతునుం గల మంథరనగం బనంతుం డనంత శక్తిం బెఱికి యెత్తిన, నందఱును నప్పర్వతంబు దెచ్చి, సముద్రంబులో వైచి, దానిక్రింద నాధారంబుగాఁ గూర్మరాజు నియమించి, యోక్త్రంబుగా వాసుకి నమర్చి. | 11 |
| శా. |
క్షోణీచక్రభరంబు గ్రక్కదల దిక్కుల్ మ్రోయఁగా నార్చి, య క్షీణోత్సాహసమేతు లై రయమునన్ గీర్వాణులుం, బూర్వగీ ర్వాణవ్రాతము నభ్ధిఁ ద్రచ్చునెడఁ దద్వ్యాకృష్టనాగానన శ్రేణీప్రోత్థవిషాగ్నిధూమవితతుల్ సేసెం బయోదావలిన్. |
12 |
| క. |
ఉరగపతితలలవల నురు | తరజవమున నసురు లూఁది, తత్పుచ్ఛము ని ర్జరవరు లూఁది మహామ | త్సరమున వడిఁ ద్రచ్చి త్రచ్చి జవమఱియున్నన్. |
13 |
| క. |
నారాయణుండు వారి క | వారితజవసత్త్వములు ధ్రువంబుగ నిచ్చెన్; వారును దొల్లిటికంటె న | పారప్రారంభు లై రపరిమితశక్తిన్. |
14 |
| చ. |
ఉడుగక యొండొరుం జఱచి యొక్కబలంబున దేవదానవుల్ వడిగొని వార్ధి నిట్లు దరువం దరువన్ విష ముద్భవిల్లి నల్ గడలను విస్ఫులింగములు గప్పఁగఁ బర్విన, దానిఁ జెచ్చెరన్ మృడుఁడు గడంగి పట్టుకొని మ్రింగి గళంబున నిల్పెఁ బొల్పుగన్. |
15 |
| వ. | మఱియు జ్యేష్ఠయుఁ జంద్రుండును శ్రీయును నుచ్చైశ్శ్రవంబును గౌస్తుభంబును నైరావణగజంబును నమృతపూర్ణశ్వేతకమండలు ధరుండైన ధన్వంతరియు నాదిగా ననేకంబు లుద్భవిల్లిన, నందుఁ ద్రిభువనవంద్య యయిన శ్రీదేవియు నిజప్రభాపటలపర్యుదస్త ప్రభాకరగభస్తివిస్తరం బయిన కౌస్తుభంబును నారాయణు వక్షఃస్థలంబున విలసిల్లె; నుచ్చైశ్శ్రవం బను యుగ్యంబు నైరావణగజంబును సురరాజయోగ్యంబు లయ్యె; నంత నయ్యమృతంబు నసురులు చేకొనిన. | 16 |
| క. |
నారాయణుండు కృత్రిమ | నారీరూపమునఁ దన్మనంబుల కతి మో హారంభకారుఁ డై, యమ | రారులచేఁ గ్రమ్మఱంగ నమృతము గొనియెన్. |
17 |
| వ. | ఇ ట్లుపాయంబున నసురుల వంచించి యమృతంబు గొని విష్ణుదేవుండు దేవతల కిచ్చిన, నయ్యమృతంబు దేవత లుపయోగించుచోదేవరూపంబు దాల్చి రాహువు వేల్పులబంతి నయ్యమృతం బుపయోగించుచున్నఁ దత్సమీపంబున నున్న చంద్రాదిత్యులు వాని నెఱింగి నారాయణునకుం జెప్పిన, నయ్యమృతంబు వాని కంఠబిలంబు సొరకముందఱ. | 18 |
| క. |
అమరారిమర్దనుఁడు చ | క్రము గ్రక్కున నేయ, రాహుకంఠము దెగి దే హము ధరణిఁ బడియెఁ, దన్ముఖ | మమృతస్పర్శమున నక్షయం బై నిలిచెన్. |
19 |
| వ. | నాఁటంగోలె రాహువునకుఁ జంద్రాదిత్యులతోడి విరోధంబు శాశ్వతం బై ప్రవర్తిల్లుచుండె. | 20 |