| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె: నట్లు జనమేజయుం డుపసంహృతసర్పసత్త్రుం డయి యథావిధి సంపూర్ణదక్షిణల ఋత్విజులను, సదస్యులనుం బూజించి, దీనానాథజనంబులకుఁ గోరినధనంబు లిచ్చి, యనేకపురాణపుణ్యకథాశ్రవణకుతూహలపరుం డగుచు విద్వజ్జనగోష్ఠి నుండి యొక్కనాఁడు. | 2 |
| మ. |
పరమబ్రహ్మనిధిం, బరాశరసుతున్, బ్రహ్మర్షిముఖ్యున్, దయా పరుఁ, గౌరవ్యపితామహున్, జనహితప్రారంభుఁ, గృష్ణాజినాం బరు, నీలాంబుదవర్ణదేహు, ననురూపప్రాంశు, నుద్యద్దివా కర రుక్పింగజటాకలాపు, గతరాగద్వేషు, నిర్మత్సరున్. |
3 |
| వ. | వైశంపాయన ప్రభృతి శిష్యవర్గంబులతో ననేకమునిగణపరివృతుం డయి, కనకమణిమయోచ్చాసనంబున నున్న వ్యాసభట్టారకు నతిభక్తి నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, వినయవినమితశిరస్కుం డై నమస్కరించి జనమేజయుం డి ట్లనియె. | 4 |
| సీ. |
ప్రీతితో మీరును భీష్మాదికురువృద్ధ | రాజులు నుండి భూరాజ్యవిభవ మెల్ల విభాగించి యిచ్చినం, దమతమ | వృత్తుల నుండక, వీఁగి పాండు ధృతరాష్ట్రనందనుల్ ధృతి చెడి, వా రేమి | కారణంబునఁ బ్రజాక్షయము గాఁగ భారతయుద్ధ మపారపరాక్రముల్ | చేసిరి? మీపంపు సేయ రైరి? |
|
| ఆ. |
యెఱిఁగి యెఱిఁగి వారి నేల వారింపర; | యిట్టి గోత్రకలహ మేల పుట్టె? దీని కలతెఱంగు దెలియంగ నానతి | యిండు నాకు సన్మునీంద్రవంద్య! |
5 |
| వ. | అని యిట్లు పాండవధార్తరాష్ట్రవిభేదనకథాశ్రవణకుతూహలపరుం డయి యడిగిన జనమేజయునకుం గరుణించి, కృష్ణ్ణద్వైపాయనుండు వైశంపాయనమునింజూచి ‘శ్రీమహాభారతకథాఖ్యానంబాద్యంతంబితనికి సవిస్తరంబుగాఁ జెప్పు’ మని పంచిచనిన. | 6 |