| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
జనమేజయుండు విద్వ | జ్జనపరివృతుఁ డై సమస్తజనపాలసభా జనయోగ్యుని వైశంపా | యనమునిఁ బూజించె వినతుఁ డై వినువేడ్కన్. |
7 |
| వ. | ఆ వైశంపాయనుండును నఖిలభువనవంద్యుం డయిన కృష్ణద్వైపాయనమునీంద్రునకు నమస్కారంబు సేసి, విద్వజ్జనంబుల యనుగ్రహంబు వడసి. | 8 |
| సీ. |
కమనీయధర్మార్థకామమోక్షములకు | నత్యంతసాధనం బయినదాని, వేడ్కతోఁ దవిలి తన్ వినుచున్నవారల | కభిమతశుభకరం బయినదాని, రాజుల కఖిలభూరాజ్యాభివృద్ధిని | త్యాభ్యుదయప్రదం బయినదాని, వాఙ్మనఃకాయప్రవర్తితానేకజ | న్మాఘనిబర్హణం బయినదాని, |
|
| ఆ. |
సత్యవాక్ప్రబంధశతసహస్రశ్లోక | సంఖ్య మయినదాని, సర్వలోక పూజ్య మయినదాని, బుధనుతవ్యాసమ | హామునిప్రణీత మయినదాని. |
9 |
| చ. |
వినుతపరాక్రముల్, ధృతివివేకులు, సత్యసమన్వితుల్, యశో ధనులు, కృతజ్ఞు, లుత్తములు, ధర్మపరుల్, శరణాగతానుకం పను లనఁగాఁ బ్రసిద్ధు లగు భారతవీరుల సద్గుణానుకీ ర్తనముల నొప్పుదాని, విదితం బగుదాని సభాంతరంబులన్. |
10 |
| శా. |
ఆయుష్యం, బితిహాసవస్తుసముదాయం, బైహికాముష్మిక శ్రేయః ప్రాప్తినిమిత్త, ముత్తమసభాసేవ్యంబు, లోకాగమ న్యాయైకాంతగృహంబునాఁ బరఁగి, నానావేదవేదాంతవి ద్యాయుక్తం బగుదానిఁ జెప్పఁ దొడఁగెం దద్భారతాఖ్యానమున్. |
11 |