| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | అని యిట్లు గంగా వసువు లొండొరులు సమయంబు సేసికొని చని; రంత నిక్కడ. | 132 |
| క. |
వీరుఁడు ప్రతీపుఁ డఖిల | క్ష్మారాజ్య, సుఖములఁ దనిసి మానుగ గంగా తీరమునఁ దపము సేయుచు | భారతకులుఁ డుండె ధర్మపరుఁడై నిష్ఠన్. |
133 |
| వ. | ఇట్లు యమ నియమవ్రత పరాయణుండై యున్నవానికిం బ్రత్యక్షం బై యొక్కనాఁడు. | 134 |
| ఉ. |
గంగ నిజాంగదీప్తు లెసఁగం జనుదెంచి లతాంగి సంగతో త్తుంగ పయోధర ద్వితయ తోయరుహానన చారునేత్ర ది వ్యాంగన యై ప్రతీపవసుధాధిపు శాలవిశాల దక్షిణో త్సంగమునందు మన్మథవశంబున నుండెఁ గరంబు లీలతోన్. |
135 |
| వ. | ప్రతీపుండును దానింజూచి యచ్చెరువంది ‘నీవెందులదాన? విట్లేలనాకుఱువెక్కి?’ తనిన నది యి ట్లనియె. | 136 |
| ఆ. |
ఏను జహ్నుకన్య నింద్రసమాన! నీ | సద్గుణావళులకు సంతసిల్లి భానుతేజ! నీకు భార్యగా వచ్చితి | నిష్టమునఁ బరిగ్రహింపు నన్ను. |
137 |
| చ. |
అనినఁ బ్రతీపుఁ డిట్లనియె; ‘నంబురుహానన యగ్నిసాక్షికం బునఁ బరిణీత యైన సతిఁ బొల్పుగ నొక్కతఁగాని యన్యలన్ మనముననేనియుం దలఁప; మానిని! యిట్టి జితాత్ము నన్ను ని ట్లని పలుకంగ నీ కగునె? యన్యులఁ బల్కినయట్ల బేల వై. |
138 |
| వ. | ‘మఱి యదియునుంగాక స్త్రీభాగం బయిన డాపలికుఱువెక్కక పురుషభాగంబై పుత్త్రారోహణ యోగ్యం బైన నావలపలికుఱు వెక్కితిగావున నాపుత్త్రునకు భార్య వగు’ మనిన నదియునట్ల చేయుదునని యదృశ్యయయ్యె; నంతం బ్రతీపుఁడును బుత్త్రార్థియై సకలతీర్థంబులయందు సునందాదేవియుం దాను వేదవిహితవ్రతంబులు సలుపుచుఁ బెద్దకాలంబు దపంబు సేసిన. | 139 |
| ఆ. |
అధికపుణ్యమూర్తు లైన యయ్యిరువుర | కమరనిభుఁడు కౌరవాన్వయంబు వెలుఁగుచుండఁ బుట్టె వీరాగ్రగణ్యుండు | సంతతార్థదాయి శంతనుండు. |
140 |
| వ. | ఇ ట్లుదయించి పెరిఁగి సంప్రాప్త యౌవనుం డైన కొడుకుం జూచి ప్రతీపుండు తనకు నక్షయపుణ్యలోకంబులు గలిగె నని సంతసించి, సకలరాజ్యభారధౌరేయుఁగా నభిషిక్తుం జేసి కొడుకున కి ట్లనియె. | 141 |
| మధ్యాక్కర |
తనుమధ్య దా నొక్కకన్య సురనదీతటమున నన్నుఁ గనిన నక్కన్యకఁ జూచి ‘నీ విట్టి కమనీయ రూప, వొనర నా సుతునకు భార్య వగు మన్న నొడఁబడి యియ్య కొనియెఁ; గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను.’ |
142 |