| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | మఱి యక్కోమలి కులగోత్రనామంబు లడుగక దానియిష్టంబు సలుపు మని కొడుకుం బంచి ప్రతీపుఁడు తపోవనంబునకుం జనియె; నిట శంతనుండు రాజ్యంబు సేయుచు నొక్కనాఁడు మహాధనుర్ధరుండై మృగయావినోదంబులఁ దగిలి యొక్కరుండును వనమ్ములోఁ గ్రుమ్మరువాఁ డనిలాలోలకల్లోలమాలాస్ఫాలన సముచ్చల జ్జలకణాసార శిశిరశిశిరం బగుచున్న గంగాపులినతలంబున. | 143 |
| క. |
తరళాయతలోచన న | త్యురుకుచఁ దేజోభిరామ నుత్తమదివ్యాం బర మాల్య మణిమయాలం | కరణోజ్జ్వలవేష నొక్కకన్యకఁ గనియెన్. |
144 |
| చ. |
కని ‘వనకన్యయో దనుజకన్యకయో భుజగేంద్రకన్యయో యనిమిషకన్యయో యిది వియచ్చరకన్యకయో యపూర్వ మీ వనమున కిట్టు లేకతమ వచ్చునె మానవకన్య’ యంచు న య్యనఘుఁడు దానిఁ జిత్తమున నాదట వోవక చూచెఁబ్రీతితోన్. |
145 |
| వ. | అదియు నమ్మహీపతి రూపయౌవనసౌందర్యవిలాసంబుల కోటువడి మహానురాగంబున వానిన చూచుచున్నంత. | 146 |
| క. |
ఇరువురు నొండొరువులఁ గడు | సురుచిరముగఁ జూచు వాఁడిచూడ్కులు దనకున్ శరములుగాఁ గొని యేసెను | మరుఁ డయ్యిరువుర మనోభిమానచ్యుతిగన్. |
147 |
| వ. | శంతనుండు దానిం జూచి ‘నీవెందులదాన‘ విట్లేల యేకతంబ యున్నదాన’ వని యడుగ నోడి మిన్నకయున్న నాతండు తనయందు దృఢానురాగుం డగుట యెఱింగి యది యి ట్లనియె. | 148 |
| క. |
భూనాథ! నీకు భార్యం | గా నన్నుఁ బరిగ్రహింపఁ గడుకొని యిష్టం బేని సమయంబు సేయుము | మానుగ నా కిష్టమయినమార్గముఁ బ్రీతిన్. |
149 |
| వ. | అది యెట్లంటేని -‘యే నెద్ది సేసినను దానికి నొడంబడి వారింపకుండను, నన్ను నప్రియంబులు పలుకక యుండను వలయు; నట్లైన నీకు భార్య నై యభిమతసుఖంబు లొనరింతు; నటుగాక నీ వెప్పుడేని నన్ను నప్రియంబులు వలుకు దప్పుడ నిన్నుఁ బాసిపోదు’ ననిన శంతనుండు నొడంబడి దానిం బరిగ్రహించె; గంగయు మనుష్యస్త్రీరూపధారిణియై వాని కిష్టోపభోగంబులు సలుపుచుండె; నంత. | 150 |
| సీ. |
వరుణుఁ డాదిగఁగల వసువులు దోడ్తోడఁ | బుట్టుచు నున్న నప్పొలఁతి వారి నల్లన పుట్టిన యప్పుడ కొనిపోయి | నిర్దయ యై గంగనీరిలోన వైచిన, నెఱిఁగి య వ్వసుమతీనాథుండు | ‘తనయుల ని ట్లేల దయయు లేక గంగలో వైచెదు’? కడు నధర్మం బేల | చేసెదు’ నా నోడుఁ; జెలువ దన్నుఁ |
|
| ఆ. |
బాసిపోవు ననియుఁ బలుకక యెప్పటి | యట్ల నెమ్మి నుండు; నంతఁ బుట్టెఁ దనయుఁ డష్టముండు దల్లిదండ్రుల కతి | ప్రీతియును ముదంబుఁ బెరుఁగుచుండ. |
151 |
| వ. | అక్కొడుకుం జూచి పుత్త్రమోహంబునఁ జంపనీనోపక శంతనుండు గంగ కి ట్లనియె. | 152 |