| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | ‘నీవు ధర్మమూర్తివి; మాచేసిన యజ్ఞానంబు సహించి మర్త్యంబునం బెద్దకాలం బుండకుండ మా కనుగ్రహింపవలయు’ నని ప్రార్థించిన నమ్ముని ప్రసన్నుం డయి ‘మీకోరినయట్ల యగు; నష్టముం డయిన యీప్రభాసుండుపెద్దయునపరాధంబుఁజేసెఁగావున వీఁడు మర్త్యలోకంబునం బెద్దకాలంబుండు; ననపత్యుండు నగు’ ననియె నని గంగాదేవి తనస్వరూపంబుఁ జూపి, వసూత్పత్తియు స్వర్గగమన నిమిత్తంబును గాంగేయ జన్మస్థితియునుం జెప్పి, ‘దేవవ్రతుం డయిన యిక్కుమారుండు పెరుఁగునంతకు నాయొద్దన యుండు’నని శంతను నొడంబఱిచి కొడుకుం దోడ్కొని యరిగిన; విస్మయం బంది శంతనుండు దానితోడి యిష్టోపభోగంబులం బెద్దకాలంబు సనిన నల్పకాలంబుకా వగచుచు హస్తిపురంబునకు వచ్చి. | 162 |
| మ. |
తన కాజ్ఞావశవర్తు లై మహిసమస్తక్షత్త్రవంశేశు లె ల్లను భక్తిం బనిసేయుచుండఁగ విశాలం బైన సత్కీర్తి ది గ్వనితా మౌక్తిక దామలీల వెలుఁగన్ వారాశిపర్యంత భూ జనరక్షాపరుఁ డయ్యె శంతనుఁడు రాజద్రాజధర్మస్థితిన్. |
163 |
| వ. | ఇట్లు లోకంబెల్లఁ దనధర్మమార్గంబ పొగడుచుండ సుఖంబుండి యాతం డొక్కనాఁడు మృగయావ్యాజంబున గంగాసమీపంబునం జనువాఁడు దన్నుంబాసి తనుత్వంబుఁ దాల్చినట్లు గడునల్పప్రవాహం బైయున్నదానిం గంగానదిం జూచి యిది యేమినిమిత్తంబో యనుచుం గొండొకనేల యరిగి. | 164 |
| తరలము |
కనియె ముందట నమ్మహీపతి గాంగసైకత భూములం బనుగొనన్ ధను వభ్యసించుచు బానసంహతి సేతుగా ఘనముగా నమరాపగౌఘముఁ గట్టియున్న కుమారు న త్యనఘు నాత్మసమాను నాత్మజు నాపగేయు మహాయశున్. |
165 |
| వ. | కని పుట్టిననాఁడ చూచినవాఁడు గావున నప్పు డెఱుంగనేరక విస్మయాకులిత చిత్తుం డయి యుండెఁ; గుమారుండు నాతనిం జూచి తండ్రిగా నెఱుంగనేరకయు నిసర్గస్నేహమోహితుం డై యుండె; నంత, | 166 |
| తే. |
దివ్యభూషణాలంకృతదేహుఁ డైన | కొడుకు వలపలిచేయూఁది కోమలాంగి దివ్యనది ప్రీతితోఁ జనుదెంచి పతికిఁ | జూపి ‘భూనాథ! వీఁడు నీ సూనుఁ’ డనియె. |
167 |
| వ. | మఱియును. | 168 |
| సీ. |
సాంగంబు లగుచుండ సకలవేదంబులు | సదివె వసిష్ఠుతో; సకలధర్మ శాస్త్రాది బహువిధశాస్త్రముల్ శుక్రబృ | హస్పతుల్ నేర్చినయట్ల నేర్చెఁ బరమాస్త్రవిద్య నప్పరశురాముం డెంత | దక్షుఁ డంతియ కడుదక్షుఁ డయ్యె; నాత్మవిజ్ఞానంబునందు సనత్కుమా | రాదుల యట్టిఁడ యనఘమూర్తి |
|
| ఆ. |
నొప్పుగొనుము వీని; నుర్వీశ!’ యని సుతు | నిచ్చి గంగ సనిన, నెఱిఁగి తనయు నెమ్మిఁ దోడుకొనుచు నిధి గన్నపేదయ | పోలె సంతసిల్లి భూవిభుండు. |
169 |
| వ. | తన పురంబునకు వచ్చి సకలరాజన్య ప్రధాన సమక్షంబున గాంగేయునకు యౌవరాజ్యాభిషేకంబు సేసి, కొడుకుతోడి వినోదంబులం దగిలి నాలుగువత్సరంబు లనన్యవ్యాపారుండై యుండి, యొక్కనాఁడు యమునాతీరంబున వేఁటలాడుచుఁ గ్రుమ్మరువాఁ డపూర్వసురభిగంధం బాఘ్రాణించి దానివచ్చిన వల నారయుచు నరిగి యమునాతీరంబున. | 170 |