| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
కనకావదాతకోమల | తనులతఁ దనుమధ్యఁ గమలదళనేత్రను యో జనగంధి నవనినాథుఁడు | గనియెను సురకన్యవోని కన్నియ నంతన్. |
171 |
| ఉ. |
దాని శరీరసౌరభము, దాని విలోల విలోకనంబులున్, దాని మనోహరాకృతియు, దాని శుచిస్మిత వక్త్రకాంతియున్, దాని విలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం తానహతాత్ముఁ డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్. |
172 |
| ఉ. |
‘ఎందులదాన? వేకతమ యియ్యమునానది నోడ నడ్పుచున్ సుందరి! నీకు నున్కి యిది చూడఁగఁ దా నుచితంబె?’ నావుడున్ మందమనోజ్ఞహాసముఖమండల మెత్తి మృగాక్షి చూచి సం క్రందనసన్నిభున్ నృపతిఁ గన్యక యి ట్లని పల్కెఁ బ్రీతితోన్. |
173 |
| వ. | ‘ఏను దాశరాజుకూఁతురఁ; దండ్రి నియోగంబున నిక్కార్యంబు ధర్మార్థంబు సేయుచుందు’ ననిన దాని యభినవ రూపసౌందర్యంబులు దొల్లియు విని యెఱింగినవాఁ డై యక్కోమలిం గామించి దాశరాజుకడకుం జని తనయభిప్రాయం బెఱింగించిన, నతండును సంతసిల్లి శంతను నత్యంతభక్తిం బూజించి యి ట్లనియె. | 174 |
| తే. |
పుట్టినప్పుడ కన్యకఁ బోలునట్టి | వరుస కిచ్చుట యిది లోకవర్తనంబు; వసుమతీనాథ! నీయట్టి వరున కిచ్చి | ధన్యులము గామె యిక్కన్యఁ దద్ద పేర్మి. |
175 |
| వ. | ‘అయినను నా డెందంబునం గలదానిం జెప్పెద; నిక్కన్యక నీకు ధర్మపత్నిగాఁ జేయునట్టి యిష్టంబు గలదేని నావేఁడిన దాని ని’మ్మనిన శంతనుండు ‘దాని నీనగునేని యిచ్చెదఁ; గానినాఁడీనేర; నది యేమి సెప్పు’ మనిన దాశరా జి ట్లనియె. | 176 |
| మధ్యాక్కర |
‘భూపాల! నీకు నిక్కోమలివలనఁ బుట్టిన సుతుఁడు నీ పరోక్షంబున రాజు గావలె; నెమ్మి ని ట్లీఁగ నోపుదే?’ యనిన శంతనుఁడు గాంగేయు యువరాజుఁ దలఁచి ‘యీపల్కు దక్కఁగ నొండు వేఁడుమ యిచ్చెద’ ననిన. |
177 |