| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | ‘నా కొండెద్దియు నిష్టంబు లే’ దనిన విని, యద్దాశరాజుచేతం బ్రతిహత మనోరథుం డయి, క్రమ్మఱి నిజపురంబునకు వచ్చి, శంతనుండు చింతాక్రాంతుం డయి సత్యవతిన తలంచుచు, నివృత్తకార్యాంతరుం డయియున్న; నొక్కనాఁడు గాంగేయుండు తండ్రిపాలికి వచ్చి యి ట్లనియె. | 178 |
| చ. |
భవదభిరక్షితక్షితికి బాధ యొనర్పఁగ నోపునట్టి శా త్రవనివహంబు లేదు; వసుధాప్రజకెల్ల ననంతసంతతో త్సవముల; రాజులెల్ల ననిశంబు విధేయుల నీకు; నిట్లు మా నవవృషభేంద్ర! యేలొకొ మనఃపరితాపముఁ బొందియుండఁగన్. |
179 |
| వ. | అనిన విని పెద్దయుంబ్రొద్దు చింతించి శంతనుండు గొడుకున కి ట్లనియె. | 180 |
| క. |
వినవయ్య! యేకపుత్త్రుఁడు | ననపత్యుఁడు నొక్కరూప యని ధర్మువులన్ విని, నీకుఁ దోడు పుత్త్రుల | ననఘా! పడయంగ నిష్టమయినది నాకున్. |
181 |
| క. |
జనవినుత! యగ్నిహోత్రం | బును సంతానమును వేదములు నెడతెగఁగాఁ జన దుత్తమవంశజులకు | ననిరి మహాధర్మనిపుణు లైన మునీంద్రుల్. |
182 |
| క. |
నీవస్త్ర శస్త్ర విద్యా | కోవిదుఁడవు; రణములందుఁ గ్రూరుఁడ; వరివి ద్రావణ సాహసికుండవు | గావున నీయునికి నమ్మఁగా నేర నెదన్. |
183 |
| వ. | ‘బహుపుత్త్రార్థంబు యత్నంబు సేయవలయు; వివాహం బయ్యెద’ ననిన విని గాంగేయుండు వృద్ధామాత్యపురోహితసుహృజ్జనంబులతోవిచారించి, యోజనగంధి రాజు చిత్తంబునం గలుగుట యెఱింగి, యనేక రాజన్యసమన్వితుం డయి దాశరాజుకడకుం జని’ మారాజునకు సత్యవతిని దేవింగా నిచ్చునది’ యని యడిగిన; నాతండును దేవవ్రతుం బూజించి, ‘నీవు ధర్మశీలుండ, వర్థానర్థవిదుండవు, సకలకార్య సమర్థుండవు. గుర్వర్థంబు కన్యార్థివై వచ్చితివి కావునం గృతార్థుండ నైతి; నెవ్వనియేని వీర్యంబున నిక్కన్య యుద్భవిల్లె నట్టి యుపరిచరుం డను రాజర్షి ‘యీ సత్యవతి నొరుల కీవలవదు; శంతనునక యిచ్చునది’ యనుటంజేసి తొల్లి యసితుం డయిన దేవలుండు కన్యార్థి యయి వచ్చి ప్రత్యాఖ్యాతుం డయ్యె; నిట్టి సంబంధ మెవ్వరికిఁ బడయనగు?’ | 184 |
| క. |
విను మైనను సాపత్న్యం | బను దోషము కలదు దీన; నదియును నీచే తన సంపాద్యము; నీ వలి | గిన నడ్డమె పురహరాజకేశవు లయినన్. |
185 |
| వ. | ‘ఆ దోషం బెట్లు పరిహృతంబగు నట్లుగా నీచిత్తంబునం దలంచి వివాహంబు సేయు’ మనిన గాంగేయుం డి ట్లనియె. | 186 |
| చ. |
వినుఁడు ప్రసిద్ధులైన పృథివీపతు లిందఱు నే గురుప్రయో జనమునఁ జేసితిన్ సమయసంస్థితి; యీలలితాంగి కుద్భవిం చిన తనయుండ రాజ్యమును జేయఁగ నర్హుఁడు; వాఁడ మాకు నె ల్లను బతి; వాఁడ కౌరవకులస్థితికారుఁ డుదారసంపదన్. |
187 |
| వ. | అని సభాసదులకెల్ల రోమహర్షణంబుగా సత్యవ్రతుండయిన దేవవ్రతుండు పలికిన వెండియు దాశరా జిట్లనియె. | 188 |
| క. |
‘నీ వఖిల ధర్మవిదుఁడవు | గావున నీ కిట్ల చేయఁగా దొరకొనియెన్; భావిభవత్సుతు లిట్టిరె? | నీవిహితస్థితియు సలుపనేర్తురె?’ యనినన్. |
189 |
| క. |
ధృతిఁ బూని బ్రహ్మచర్య | వ్రత మున్నతిఁ దాల్చితిని ధ్రువంబుగ; ననప త్యత యైనను లోకము లా | యతిఁ బెక్కులు గలవు నాకు ననుభావ్యము లై. |
190 |
| వ. | అని యిట్లు సత్యవతిని దనతండ్రికి వివాహంబు సేయుపొంటె నిజరాజ్యపరిత్యాగంబును బ్రహ్మచర్య వ్రత పరిగ్రహణంబును జేసిన దేవవ్రతు సత్యవ్రతంబునకు గురుకార్యధురంధరత్వంబునకు మెచ్చి దేవర్షి గణంబులు నాతనిపయిం బుష్పవృష్టిఁ గురిసి భీష్ముం డని పొగడిరి. దాశరాజును గరంబు సంతసిల్లి శంతనునకు సత్యవతి నిచ్చె నంత. | 191 |
| మ. |
ఇనతేజుం డతిభక్తిఁ గాంచనరథం బెక్కించి యక్కన్యఁ దో డ్కొని తెచ్చెం దనతల్లి సత్యవతినిన్ క్షోణీజనుల్ దన్ను బో రనఁ గీర్తింపఁగ శంతనుం డతిమనోరాగంబునం బొంద శాం తనవుం డాతతకీర్తి హస్తిపురికిం దత్కౌతుకారంభుఁ డై. |
192 |