| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| ఉ. |
‘ఈవసుధాధినాథుల జయించిన యట్టిద కాదు; చక్కనై పోవక నిల్వు నా కెదిరిపోర మదీయధనుర్విముక్త నా నావిధ మార్గణోగ్ర గహనంబున దిగ్‌భ్రమఁబొంద కెమ్మెయిం బోవఁగఁ బోలు నీకనుచుఁ బూరుకులోత్తముఁ దాఁకె వీఁకతోన్. |
205 |
| వ. | భీష్ముండును దనరథంబు నివర్తింపించి సంవర్తసమయ సమవర్తియుంబోలె నతిరౌద్రాకారుండయి నిలిచిన. | 206 |
| చ. |
‘అనిలజవంబునం బఱచు నమ్మదనాగ మెదిర్చి క్రమ్మఱిం చిన పరికాఁడ పోలెఁ గురుసింహవరూథము నిట్లు గ్రమ్మఱిం చునె యితఁ’ డంచునుం దగిలి చూపఱు సాల్వమహీశు విక్రమం బొనరఁగ నల్గడం బొగడుచుండిరి విస్మయసక్తచిత్తు లై. |
207 |
| వ. | అంత. | 208 |
| క. |
ధృతిమెయి శతసంఖ్యయు దశ | శతసంఖ్యయు శతసహస్రసంఖ్యయును శతా యుత సంఖ్యయుఁగా దేవ | వ్రతుమీఁదను సాల్వుఁ డేసె వాఁడిశరంబుల్. |
209 |
| క. |
ఘనభుజుఁ డన్నియు నడుమన | తునియఁగ వడి నేసి, వానితురగచయస్యం దన సూతుల నొక్కొక య | మ్మునఁ ద్రెళ్ళఁగ నేసె భరతముఖ్యుఁడు పోరన్. |
210 |
| క. |
రథమును రథ్యంబులు సా | రథియును వృథ యైన భగ్నరథుఁ డై భాగీ రథికొడుకుచేత విమనో | రథుఁ డై సాల్వుండు నిజపురంబున కరిగెన్. |
211 |
| వ. | ఇట్లు సకలరాజలోకంబు నెల్ల నశ్రమంబున నోడించి సాల్వరాజు మందల విడిచి పరాక్రమలబ్ధ లయిన కాశీరాజదుహితలనంబాంబికాంబాలికలందోడ్కొని వచ్చి భీష్ముండు విచిత్రవీర్యునకు వివాహంబుసేయనున్న నందుఁ బెద్దయది యైన యంబ యిట్లనియె. | 212 |
| ఆ. |
పరఁగ నన్ను సాల్వపతి వరియించినఁ | దండ్రిచేతఁ బూర్వదత్త నైతి నమ్మహీశునకు; నయంబున నెయ్యది | ధర్ము వెఱిఁగి దానిఁ దలఁపు మిపుడు. |
213 |