| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | మఱియు నత్యంతశోకార్ణవంబున మునింగిన తల్లిని మఱదండ్రను నాశ్వాసించి, యరాజకం బయిన రాజ్యం బకలంకంబుగాఁబ్రతిపాలించుచున్న కొడుకు నఖిలధర్మవిదు గాంగేయుం జూచి సత్యవతి యి ట్లనియె. | 218 |
| క. |
శంతను సంతానంబును | సంతతకీర్తియును బిండసత్కృతియును న త్యంత మహీభారమును బ | రంతప! నీయంద చిరతరం బై నిలిచెన్. |
219 |
| చ. |
జననుత సర్వధర్మములు సర్వజగత్పరివర్తనక్రమం బును మఱి సర్వవంశములుఁ బుట్టిన మార్గము నీవ నిక్కువం బనఘ! యెఱుంగు; దున్నతగుణాఢ్యుఁడవున్ భరతాన్వయావలం బనుఁడవు నీవ; నిన్నొకఁడు పంచెదఁ జేయుము మత్ప్రియంబుగన్. |
220 |
| క. |
ఇక్కురువంశంబున వీ | వొక్కరుఁడవ యున్నవాఁడ; వుర్వీరాజ్యం బెక్కటి సేకొని తేజము | దిక్కుల వెలిఁగింపు సంతతియుఁ బడయు మొగిన్. |
221 |
| క. |
‘నిరతంబు బ్రహ్మమొదలుగ | వరుసన యెడతెగక యిట్లు వచ్చిన వంశం బురుభుజ! నీ వుండఁగ నీ | తరమున విచ్ఛిన్న మగుట ధర్మువె?’ యనినన్. |
222 |
| క. |
విని భీష్ముఁ డనియె ‘మీ కి | ట్లని యానతి యీయఁదగునె? యమ్మెయి నాప ల్కిన పల్కును మఱి నా తా | ల్చిన వ్రతమును జెఱుప నంత చిఱుతనె చెపుఁడా’. |
223 |
| క. |
హిమకరుఁడు శైత్యమును, న | ర్యముఁడు మహాతేజమును, హుతాశనుఁ డుష్ణ త్వము విడిచిరేని గుర్వ | ర్థము నాచేకొనిన సద్వ్రతంబు విడుతునే? |
224 |
| వ. | ‘పృథివ్యాది మహాభూతంబులు గంధాదిగుణంబుల నెట్లు విడువ వట్ల యేనును గురుకార్యంబున మీశుల్కార్థంబుగా సర్వజనసమక్షంబున నాచేసిన సమయస్థితి విడువ; నది యట్లుండె; మీయానతిచ్చినట్లు నాయెఱుఁగని ధర్మువులు లేవు; శంతనుసంతానంబు శాశ్వతంబగునట్లుగ క్షత్త్రధర్మంబుసెప్పెద; నాచెప్పినదాని ధర్మార్థవిదు లయి లోకయాత్రానిపుణు లయిన పురోహితప్రముఖ నిఖిలబ్రాహ్మణవరులతో విచారించి చేయునది’ యని భీష్ముఁ డందఱు విన ని ట్లనియె. | 225 |
| చ. |
పితృవధజాతకోపపరిపీడితుఁ డై జమదగ్నిసూనుఁ డు ద్ధతబలు హైహయున్ సమరదర్పితుఁ జంపి యశేషధారుణీ పతుల వధించె గర్భగతబాలురు నాదిగ; నట్టిచోటఁ ద త్సతులకుఁ దొల్లి ధర్మవిధి సంతతి నిల్పరె భూసురోత్తముల్. |
226 |