| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె: నట్లు ధృతరాష్ట్రపాండువిదురులు భీష్మాభిరక్షితులై పెరుఁగుచు, నుపనయనానంతరంబున నధ్యయనం బొనరించి రాజవిద్యలయందు జితశ్రము లై యున్నంత. | 2 |
| సీ. |
అమరాపగాసుతు ననుశాసనంబునఁ| గౌరవ రాజ్యంబు గడు వెలింగెఁ, గురుభూము లుత్తరకురువులకంటెను | నధికలక్ష్మీయుక్తి నతిశయిల్లె, ధర్మాభిసంరక్షితం బైన భూప్రజ | కెంతయు నభివృద్ధి యెసఁగుచుండె, వలసినయప్పుడు వానలు గురియుట | సస్యసమృద్ధి ప్రశస్త మయ్యెఁ, |
|
| ఆ. |
బాలు సేఁపెఁ బుష్పఫలభరితంబు లై | తరువనంబు లొప్పె, ధర్మకర్మ నిరతిఁ జేసి కరము నెమ్మితో నన్యోన్య | హితముఁ జేయుచుండి రెల్ల జనులు |
3 |
| మ. |
అమలాచారపవిత్రభూసురవరేణ్యాగార పుణ్యప్రదే శములం దధ్యయనారవంబు విధివత్స్వాహాస్వధాస్వస్తిశ బ్దములున్ మంగళతూర్యఘోషములు నుద్యత్కౌతుకాశీర్నినా దములున్ రమ్యతరంబు లయ్యె ధరణిం దద్రాజ్యసంవృద్ధితోన్. |
4 |
| వ. | ఇట్లు బ్రహ్మోత్తరంబుగాఁ బ్రజాభివృద్ధియు సస్యసమృద్ధియు నగుచుండ, నాంబికేయు ధృతరాష్ట్రు రాజ్యాభిషిక్తుం జేసి, భీష్ముండు దనకు విల్లును విదురుబుద్ధియును సహాయంబులుగా రాజ్యంబు రక్షించుచున్నంత. | 5 |
| ఉ. |
ఆయము గర్వమున్ విడిచి యన్యపతుల్ పనిసేయ నిట్లు గాం గేయభుజాబలంబున నికృత్తవిరోధిసమాజుఁ డై కుమా రాయితశక్తిశాలి ధృతరాష్ట్రుఁడు రాజ్యము సేయుచుండె న త్యాయతకీర్తితోఁ దనకు హస్తిపురం బది రాజధానిగన్. |
6 |
| వ. | ఇట్లు రాజ్యంబు సేయుచు నారూఢ యౌవనుం డైన యా ధృతరాష్ట్రునకు వివాహంబు సేయ సమకట్టి, భీష్ముండు గాంధారపతి యయిన సుబులుకూఁతు గాంధారి యనుదాని, నతిశయ రూపలావణ్య శీలాభిజాత్య సమన్వితఁగా బ్రాహ్మణులవలన విని విదురున కి ట్లనియె. | 7 |
| క. |
ఈ వంశము విచ్ఛేదము | గావచ్చినఁ గులము నిలుపఁగా సత్యవతీ దేవి వచనమున సంతతి | గావించెను వ్యాసుఁ డను జగత్కర్త దయన్. |
8 |
| క. |
ఈ కులము వివర్ధింపఁగ | నా కభిమత; మేను వింటి నలినేక్షణ దా నేకశత సుతులఁ బడయఁగ | నా కన్యక వరము వడసె నటె హరుచేతన్. |
9 |
| వ. | ‘కావున ధృతరాష్ట్రునకు గాంధారిని వివాహంబు సేయుదము; గాంధారపతి మనతోడి సంబంధమునకుం దగు’ నని నిశ్చయించి సుబలు పాలికిఁ దగుముదుసళ్ళం బంచిన, సుబలుండును సుముఖుం డై ‘కురుకులవిస్తారకుం డయిన ధృతరాష్ట్రుండ యిక్కన్యకకు నర్హుండు గావున నా రాజునకు గాంధారి నిచ్చితి’ ననిన, వాని బంధుజనంబు లెల్లఁ దమలో ని ట్లనిరి. | 10 |
| తే. |
అంగములలోన మే లుత్తమాంగ, మందు | నుత్తమంబులు గన్నుల యుర్విజనుల, కట్టి కన్నులు లే వను నదియకాక | యుత్తముఁడు గాఁడె సద్గుణయుక్తి నతఁడు. |
11 |