| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| వ. | ఇట్లు పాండురాజు దిగ్విజయంబు సేసి తదుపార్జితంబు లైన యపరిమితధనంబులఁ దెచ్చి ధృతరాష్ట్రుననుమతంబున భీష్మునకు సత్యవతికిం దమతల్లు లైన కౌసల్యలకు విదురునకు సుహృజ్జనులకు బ్రాహ్మణులకు నిచ్చి, వారివలన ననేకాశీఃప్రశంసలు వడసి సుఖం బున్నంత. | 41 |
| చ. |
వినుతయశుండు పాండునృపవీరుఁడు దిగ్విజయంబు సేసి పెం పునఁ గొనివచ్చి యిచ్చిన యపూర్వ మహా ధనరాశి పేర్మి వా రని విభవంబుతోడ ధృతరాష్ట్రుఁడు సేసె శతాశ్వమేధముల్ దనిసన భూసురేశులకు దక్షిణ లిచ్చి యథోచితంబుగన్. |
42 |
| వ. | మఱియు నప్పాండురాజు వినయవిధేయత్వంబున ధృతరాష్ట్రునకు, నభిమతకార్యకరణంబున బాంధవులకు, ననుకూలత్వంబున సుహృజ్జనులకుఁ, బరిశ్రమజ్ఞానంబున విద్వాంసులకుఁ, గారుణ్యదానంబున ననాథులకు, నభయంకరత్వంబున మహీప్రజలకు సంతోషంబు సేయుచు. | 43 |
| క. |
‘మండిత గుణ సంపద నధి | కుం డగుచున్ బూరు భరత కురు పతులకుఁ దు ల్యుం డయి వంశకరుం డగుఁ | బాండుమహీశుఁ’ డని బుధసభలు దనుఁ బొగడన్. |
44 |
| క. |
నానాద్రవ్య నిరంతర | దానముల ననూనయజ్ఞదక్షిణలను ధా త్రీనాథుఁడు బ్రాహ్మణులను | శ్రీనిలయులఁ జేయుచుండె శిష్టప్రియుఁ డై. |
45 |