| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| మ. |
జనితామర్షణుఁ డంతఁ బార్థుపయిఁ బర్జన్యాస్త్ర మక్కర్ణుఁ డే సె; నపారం బయి భూనభోంతరముఁ దజ్జీమూతయూథంబు గ ప్పినఁ దద్ధ్వాంతతిరోహితాపఘనుఁ డై బీభత్సుఁ డుండెన్; విరో చనుఁ డాత్మద్యుతి విస్తరించె సుతుపై సంప్రీతచేతస్కుఁ డై. |
40 |
| వ. | అయ్యవసరంబున దుర్యోధనుందొట్టి ధృతరాష్ట్రనందను లందఱుఁ గర్ణువలన నుండిరి; భీష్మద్రోణకృప పాండవులు పార్థువలన నుండి రంత. | 41 |
| క. |
రవిసుతపార్థులఘోరా | హవమునకును వెఱచుచున్నయది కుంతి తదు ద్భవఘనతరశరతిమిరౌ | ఘవృతాంగుఁ దనూజుఁ జూడఁ గానక వంతన్. |
42 |
| క. |
ధృతి దఱిఁగి మోహమూర్ఛా | న్విత యైనను సంభ్రమించి విదురుఁడు ప్రత్యా గతజీవఁ జేసె నప్పుడ | యతిశీతలచందనోదకాసేకమునన్. |
43 |
| వ. | అంత నర్జునుం డనిలబాణంబున నమ్మేఘపటలంబు పఱవనేసి యాదిత్యసమతేజుం డయి యుండె; నంత విదురదర్శితు లైన యక్కర్ణార్జునులం జూచి కుంతి సంతసిల్లె; నపుడు ధర్మవిదుం డఖిలద్వంద్వయుద్ధసమాచార నిపుణుండు కృపాచార్యుం డయ్యిద్దఱ నడుమ నిలిచి కర్ణున కి ట్లనియె. | 44 |
| చ. |
కురుకులజుండు పాండునకుఁ గుంతికిఁ బుత్త్రుడు, రాజధర్మబం ధురచరితుండు; నీ వితనితోడ రణం బొనరించెదేని వి స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్పు,; చెప్పినన్ దొరయగుదేని నీ కెదిరి దోర్బలశక్తి నితండు సూపెడిన్. |
45 |
| వ. | అనిన విని కర్ణుండు దనకులంబును దల్లిదండ్రులను జెప్ప సిగ్గుపడి తలవాంచి యున్నం జూచి దుర్యోధనుండు గృపున కి ట్లనియె. | 46 |
| క. |
కులముగలవాఁడు, శౌర్యము | గలవాఁడును, నధికసేన గలవాఁడును, భూ తలమున రా జను నామము | విలసిల్లఁగఁ దాల్చు మూఁడువిధముల పేర్మిన్. |
47 |
| తే. |
రాజవరుఁ డైన పార్థుతో రాజు గాని | యీతఁ డని సేయఁగాఁ దగఁడేని వీని నెల్లవారును జూడంగ నీక్షణంబ | రాజుఁ జేసెద నే నంగరాజ్య మిచ్చి. |
48 |