| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అని యప్పుడ భీష్మధృతరాష్ట్రులకుం జెప్పి వారియనుమతంబున మహామహీసురసహస్రంబునకు గోసహస్రా యుతంబు దానంబు సేసి ‘యంగరాజ్యంబునకు వీఁ డర్హుం డయ్యెడ| మను బ్రాహ్మణవచనంబు వడసి, కర్ణుం గాంచనపీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసినఁ, గర్ణుండును మణిమకుట కేయూర హారాది భూషణ భూషితుం డై సకలరాజచిహ్నంబుల నొప్పి పరమహర్షంబుతోడం గురుపతి కి ట్లనియె. | 49 |
| క. |
బృహదబ్ధిమేఖలాఖిల | మహీతలక్షత్త్రవరసమక్షమున మహా మహిమాన్వితుఁగా నన్నును | మహీశుఁగాఁ జేసి తతిసమర్థత వెలయన్. |
50 |
| క. |
‘దీనికి సదృశముగా మఱి | యే నేమి యొనర్తు నీకు నిష్టం?’ బనినన్ ‘మానుగ నాతోఁ జెలిమి మ | హీనుతముగఁ జేయు; మిదియ యిష్టము నాకున్.’ |
51 |
| వ. | అనిన విని దుర్యోధనున కెంతయు సంతోషంబుగాఁ గర్ణుం డతనితోడి యిష్ట సఖిత్వంబున కొడంబడియె, నంతఁ గొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్షపరవశుం డయి సూతుండు రథంబు డిగ్గి కర్ణునొద్దకుం బఱతెంచినఁ, గర్ణుండును బితృగౌరవంబున సంభ్రమించి వానికి వినయవినమితోత్త మాంగుండయిన. | 52 |
| తే. |
కడఁగి సూతుండు పుత్త్రకుఁ గౌఁగిలించి | కొని తదీయమూర్ధాఘ్రాణ మొనరఁ జేసి యంగరాజ్యాభిషేకార్ధ్రమైన శిరముఁ | దడిపె వెండియు హర్షాశ్రుతతుల నొప్ప. |
53 |
| వ. | దానిం జూచి భీముండు గర్ణుని సూతకులసంభవుంగా నెఱింగి నగుచు ని ట్లనియె. | 54 |
| క. |
నీదు కులమునకుఁ దగఁగఁ బ్ర | తోదము గొని రథము గడపఁ దొరఁగుము నృపధ ర్మోదయుఁ డగు నర్జునుతోఁ | గా దనక రణంబు సేయఁగా నీ కగునే? |
55 |
| వ. | మఱి యదియునుం గాక. | 56 |
| తే. |
ఉత్తమక్షత్త్రియప్రవరోపయోగ్య | మైన యంగరాజ్యంబు నీ కర్హ మగునె? మంత్రపూత మై గురుయజమానభక్ష్య | మగుపురోడాశ మది గుక్క కర్హ మగునె! |
57 |
| వ. | అనినం గర్ణుండు వెల్లనయి యెద్దియుం జేయునది నేరక దీర్ఘోష్ణనిశ్వాసవ్యాకులిత వదనుం డయి యాకాశంబు వలన నున్న యాదిత్యుం జూచుచు మిన్నకుండె; నంత నంతర్విలులితుం డయిన యక్కర్ణుం జూచి భ్రాతృపద్మవన మధ్యంబుననుండి దుర్యోధనమదాంధగంధసింధురంబు వెలువడి వచ్చి కడు నలిగి భీమున కి ట్లనియె. | 58 |
| క. |
అనిలజ! నీ కి ట్లని ప | ల్కను దలఁపను నగునె? లేడి కడుపునఁ బులి పు ట్టునె? యిట్టి దివ్యతేజం | బున వాఁ డధమాన్వయమునఁ బుట్టునె చెపుమా! |
59 |
| సీ. |
శూరులజన్మంబు సురలజన్మంబును | నేఱులజన్మంబు నెఱుఁగ నగునె? మొగిని దధీచియెమ్మునఁ బుట్టదయ్యెనే | వాసవాయుధ మైన వజ్ర మదియు; గాంగేయుఁ డన మఱి కార్తికేయుం డన | నాగ్నేయుఁ డన రౌద్రుఁ డనఁగ శరవ ణోద్భవుం డన గుహుం డుద్భవిల్లఁడె? శర | స్తంబజన్ముఁడు గాఁడె ధర్మవిదుఁడు |
|
| తే. |
గృపుఁడు? ఘటసంభవుఁడు గాఁడె కీర్తిపరుఁడు | వరుఁడు ద్రోణుండు? విప్రులవలనఁ బుట్ట రైరె సత్క్షత్రియుల్ ఘను లవనిఁ గావఁ? | గడఁగి మీ జన్మములు నిట్ల కావె వినఁగ. |
60 |
| వ. | ‘వానితోడి దేమి? దివ్యలక్షణలక్షితుండును సహజకవచకుండలమండితుండును గాని ప్రకృతిపురుషుండు గాఁడు; తన బాహుబలంబున నీ యంగరాజ్యంబునక కాదు సకలమహీరాజ్యంబునకు నర్హుం డగు’ ననుచున్నయంత నాదిత్యుం డస్తంగతుం డైన, నస్త్రసందర్శనరంగంబు వెలువడి దుర్యోధనుండు గర్ణుం దోడ్కొని కరదీపికా సహస్రంబుతో నిజమందిరంబున కరిగెఁ; బాండవులును భీష్మద్రోణవిదుర కృపాచార్యులతో నిజనివాసంబుల కరిగిరి. | 61 |
| ఆ. |
కుంతి యంత సహజకుండలకవచాభి | రాముఁ గర్ణుఁ జూచి రవి సమానుఁ బ్రత్యభిజ్ఞ నెఱిఁగి ప్రథమపుత్త్ర స్నేహ | మెఱుకపడక యుండ నింతి యుండె. |
62 |
| క. |
వినుతధనుర్విద్యావిదు | ఘనుఁ గర్ణు సహాయుఁ బడసి కౌరవవిభుఁ డ ర్జునువలనిభయము సెడి ఱొ | మ్మునఁ జేయిడి నిద్రవోయె ముదితాత్ముం డై. |
63 |