| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| క. |
కరిఘటలఁ దాఁకి భీముఁడు | కరటికటీకుంభదంతకరముఖముల జ ర్జరితములఁ జేసె నిష్ఠుర | తరవజ్రనిపాతపటుగదాఘాతములన్. |
77 |
| ఉ. |
దారుణమౌ వృకోదరు గదాకులిశాహతి నన్యవాహినీ వారణసంచయం బభినవక్షతజారుణధార లొప్ప సం చారితధాతునిర్‌ఝరవిశాలశిలోచ్చయ సంచయాభమై వీరరణంబునం బడియె విక్షతహస్తిపవృక్షపంక్తితోన్. |
78 |
| చ. |
అనిలజుఁ డుగ్రుఁ డై ద్రుపదుహస్తిఘటావళి నశ్వసంహతిన్ ఘనరథకోటి భగ్నములుగా సమరంబునఁ జేసి పేదదు ర్మనుజులఁ జంప నేల యని మానుగ గోపుఁడు గోగణంబులన్ గొనకొని రొప్పునట్టు లధికుం డెగిచెం బృథుదండహస్తుఁ డై. |
79 |
| స్రగ్ధర |
అంతఁ గౌంతేయుఁ డత్యాయతభుజుఁడు నరుం డల్గి పాంచాలు దంతి ధ్వాంతంబున్ వానివాహోత్తమతుహినతతిం దద్భటోదారతారా సంతానంబున్ శరాంశూచ్చయవిభవమునన్ శాంతిఁ బొందించి యుద్య ద్ధ్వాంతారాతిప్రభుం డై తనరుచు వెలిఁగెన్ దద్రణవ్యోమవీథిన్. |
80 |
| క. |
ఆతనిఁ జూచి సహింపక | యాతతకార్ముకుఁడు ద్రుపదుననుజుఁడు శౌర్యో పేతుఁడు సత్యజితుం డను | నాతఁడు ధీరుఁ డయి తాఁకె నతిరభసమునన్. |
81 |
| క. |
కడఁగి ద్రుపదానుజుఁడు నె | వ్వడిఁ గవ్వడి నేసె నూఱువాఁడిశరములం గడు నలిగి వాని నన్నియు | నడుమన తునియంగ నేసె నరుఁ డస్త్రములన్. |
82 |
| క. |
వివిధాస్త్రకోవిదుఁడు వా | సవి వానిరథంబుఁ బార్‌ష్ణిసారథుల మహిం గువలు వడ నేసె నుగ్రా | హవమునకును వాఁడు విముఖుఁడై చెడి పఱవన్. |
83 |
| వ. | అంత. | 84 |
| క. |
శరమోక్షణవేగనిరం | తరమండలితోరుచాపదండుఁ డకాండో ద్ధురదండధరుఁడపోలెను | హరినందనుఁ దాఁకె ద్రుపదుఁ డత్యుద్ధతుఁ డై. |
85 |
| మ. |
పరమాస్త్రైకవిశారదుల్ బలయుతుల్ పాంచాలకౌంతేయు లొం డొరులన్ మార్కొని యేయునప్పుడు తదీయోగ్రాజిరంగంబు దు స్తర నీరంధ్ర నిశాత సాయక తమస్సంఛన్న మైనం బర స్పరయుద్ధంబులు దక్కి యోధులు నిశాభ్రాంతాత్ము లై రచ్చటన్. |
86 |