| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అంతఁ బ్రభాతం బగుటయు సమయనియమంబులు దీర్చి యాచార్యుండు శిష్యులనెల్ల రావించి ‘మీరు నాకు గురుదక్షిణ యిం’ డనిన నందఱు మ్రొక్కి యెదుర నిలిచి ‘మీ కెద్ది యిష్టంబు సెప్పుం’ డనిన విని ‘యవివేక కారణ దారుణైశ్వర్యావలిప్తుం డైన ద్రుపదు నొడిచిపట్టి తెం; డిదియ నా కిష్టం బైన గురుదక్షిణ’ యని పంచిన. | 64 |
| క. |
వల్లె యని రాజనందను | లెల్లను సమకట్టి, రథము లెక్కి దిశల్ భే దిల్లఁగ గర్జిల్లి, నిశా | తోల్లసిత కృపాణ కార్ము కోద్యతకరు లై. |
65 |
| ఉత్సాహము |
‘ఏల దీని నెడయుఁ జేయ? నీ క్షణంబ యేఁగి పాం చాలుఁ బట్టి తెత్త మధికశౌర్యలీల మెఱయఁగాఁ బోలు’ ననుచుఁ బెరిఁగి రాజపుత్త్రు లెల్ల నరిగి పాం చాలుపురము ముట్టికొని రసంఖ్య బలసమేతు లై. |
66 |
| వ. | పాండవులును రథంబు లెక్కి ద్రోణుం బరివేష్టించి పిఱుంద నరిగి; రంత నర్జునుం డాచార్యున కి ట్లనియె. | 67 |
| క. |
వడిగొని కౌరవు లొండొరుఁ | గడవఁగ మును చనిరి; వారిగర్వము సూడం గడిమిని ద్రుపదాధిపుతోఁ | బొడువఁగఁ దమ కలవియగునె భుజవీర్యమునన్. |
68 |
| క. |
అతగులచే ద్రుపదుఁ డనవ | హితుఁ డై పట్టువడ నంతహీనుఁడె? శౌర్యో న్నతుఁ డధికధనుర్విద్యా | న్వితుఁడు భవత్సఖుఁ డనంగ వినరొకొ వానిన్. |
69 |
| వ. | అనుచుం బాంచాలుపురం బాసన్నంబు గాఁ జనుదెంచునంతకు ముందఱ చని దుర్యోధన యుయుత్సు దుశ్శాసనవికర్ణజలసంధాదు లైన ధార్తరాష్ట్రు లనేకనృపకుమారసహితు లై పాంచాలుపురం బవరోధించినఁ బాంచాలపతి యలిగి యపారచతురంగబలసమేతుం డై కౌరవులం దాఁకి. | 70 |
| క. |
శరనికరసహస్రంబులఁ | బరువడి నందఱను గప్పెఁ బ్రావృడ్ధారా ధర మురుధారాజలముల | సరసిజములఁ గప్పునట్లు సంరంభమునన్. |
71 |
| క. |
కలయ నసిముసల దండం | బులు గొని కాంపిల్యనగరమున జను లెల్లన్ నలి రేఁగి యార్చి కౌరవ | బలసుభటులఁ బొడిచి రాజి బడలు వడంగన్. |
72 |
| క. |
ధృతరాష్ట్రకుమారకు లవ | హితు లై పాంచాలుమీఁద నేసిరి సాంద్రా తతబాణప్రకరతిరో | హిత మై రవికిరణజాల మేర్పడకుండన్. |
73 |
| క. |
వారల శరములు నడుమన | వారించుచు నధికలాఘవంబున వారిన్ ఘోరశరవిద్ధమర్ములఁ | గా రణమున సోమకుండు ఘనుఁ డై యేసెన్. |
74 |
| క. |
నానావిధ మార్గణముల | నానామార్గముల నేసినం, గురువీరుల్ వానిం జూచి భయంపడి | నానాతనుఁగా మనంబునన్ వగచి రనిన్. |
75 |
| వ. | ఇట్లు పాంచాలుబాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశరనిహత సురారికుమారులుంబోలె వెఱచఱిచి పాండవులయొద్దకుం బఱతెంచినం జూచి, యర్జునుం డాచార్యధర్మజులకు నమస్కరించి ‘మీర లింద యుండుం; డే నీక్షణంబ యప్పాంచాలుం బట్టి తెచ్చెద’ నని విజృంభించి, సంరంభంబున భీమసేనుండు దనకు సేనాగ్రచరుండుగా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజవాహినీసముద్రంబు దఱియం జొచ్చిన. | 76 |