| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అని పంచిన నదియును నతి త్వరితగతిం జని, ముందఱ వారల డాయ శంకించి, యొక్క వృక్షంబు మఱువునం గొండొక ప్రొ ద్దుండి. | 188 |
| మ. |
వనజాతాయతనేత్రు నున్నతబృహద్వక్షఃస్థలున్ సింహసం హననుం బాండవసింహమున్ హృదయజన్మాకారు నుద్యన్మహా శనికల్పస్థిరబాహుఁ జూచుచు మనోజాతాగ్నిసంజాతవే దన యై రాక్షసి కామరూపధర మర్త్యస్త్రీస్వరూపంబుతోన్. |
189 |
| క. |
వితత బహురత్నరుచిశో | భితభూషణములు వెలుంగ, బెడఁగగు నవపు ష్పితజంగమలతక్రియ ను | న్నతకుచ సనుదెంచెఁ బవననందను డాయన్. |
190 |
| క. |
రమణి నిజభ్రాతృనియో | గముఁ దలఁపక యపుడు భీముఁ గదిసెఁ; బతిస్నే హమ కామినులకు బలవం | తము; పెఱనెయ్యములు వేయుఁ దత్సదృశములే? |
191 |
| వ. | ఇట్లు మన్మథవ్యధాశిథిలితమానమానస యయి తనయొద్దకు వచ్చుదానిం బవమానసూనుం డవమాన పూర్వకంబున ‘నీ వెందులదాన? వింతప్రొ ద్దిందుల కేల వచ్చి? తెటవోయె? దెడ గలిగి పొ’ మ్మనిన విని హిడింబ యి ట్లనియె. | 192 |
| క. |
జననుత! యేను హిడింబుం | డను రక్కసుచెలియలం బ్రియంబున నినుఁ జూ చినయప్పటఁగోలెను గడు | మనోభవనిపీడ్యమానమానస నయితిన్. |
193 |
| క. |
నాకుఁ బతి వయిన నిన్నుం | జేకొని మాయన్న యెగ్గుసేయక కాచున్; నాకు మఱి నీవ పతివి గు | ణాకర యి జ్జన్మమున మహాస్నేహమునన్. |
194 |
| చ. |
ఉఱఁడు సురేంద్రు నైన బలియుండు హిడింబుఁడు వానిబారికిన్ వెఱవనివారలుం గలరె? వీరలు ముంద రెఱుంగ రక్కటా! యెఱిఁగిరయేని యిట్లు దమయిండులనుండిన యట్లు మెచ్చ కే మఱి శయనింతురే; కడుఁ బ్రమాదము సేసిరి బుద్ధిహీను లై. |
195 |
| వ. | ‘ఇది హిడింబువనంబు; దీనం జొచ్చి వెలువడుట జముకుత్తుకఁ జొచ్చి వెలువడునట్ల; యాతం డింతకు వచ్చు; వీరితోడి దేమి; నీవు నాకుఁ బతి వై ప్రాణంబు రక్షించుకొని నావలన నిష్టోపభోగంబు లందు; మేనును గామచారిణిని; నీ కిష్టం బైన చోటికి నిన్నుఁ దోడ్కొనిపోవనేర్తు ననిన దానికి భీముం డి ట్లనియె. | 196 |
| క. |
విను బేల! యెట్టికష్టుఁడుఁ | దన పురుష గుణంబు పెడఁగఁ దల్లిని దోఁబు ట్టినవారి విడిచి రాగం | బునఁ జపల స్త్రీ సుఖంబుఁ బొందునె చెపుమా. |
197 |
| వ. | అనిన విని హిడింబ వీరి ‘నందఱ రక్షించుట నీకుఁ బ్రియం బేని య ప్పురుషాదుండు రాకుండ ముంద వీరి నెత్తుకొని పోయెద; వీరలఁ బ్రబోధింపు’ మనిన భీముం డి ట్లనియె. | 198 |
| తే. |
అధికవీరుండు రక్కసుఁ డరుగుదెంచు | నని మనంబున భయమంది వనజనేత్ర! వీరిసుఖసుప్తులై యున్నవారి నిద్ర | సెడఁగ బోధింప నోప; నాకడిమి వినుము. |
199 |
| ఉ. |
క్రచ్చఱ నొక్కరక్కసుఁడ కాఁడు సురాసురులెల్ల నొక్కటై వచ్చిన నీవ చూడఁగ నవార్యబలోన్నతిఁజేసి వారలన్ వ్రచ్చి వధింతుఁగాక; యిటు వచ్చి శ్రమంపడియున్న నిచ్చట న్మెచ్చగువీరి దైన సుఖనిద్రకు భంగము సేయనెర్తునే. |
200 |
| వ. | ‘పెక్కులు వలుకక యారక్కసురాఁ బనుపు’ మని భీమసేనుండు విజృంభించి పలుకుచున్నంత నట హిడింబుండు హిడింబ మసలుటకు మహాక్రోధానలజ్వలితచిత్తుం డయి. | 201 |
| సీ. |
కాలమేఘంబునుబోలె విశాల మై | నీల మై దేహంబు గ్రాలుచుండ ఘనతటిల్లతలయ ట్లెనిమిది దంష్ట్రలు | మెఱవంగఁ బండులుఁ గొఱికి పెలుచ నతిరోషలోహితాయతవృత్తనేత్రముల్ | దిరుగంగఁ బెట్టుచుఁ బరుషకేశ జాలంబు గాడ్పునఁ దూలంగఁ గాలోప | మానుఁ డై చనుదెంచి మానుషాదుఁ. |
|
| ఆ. |
డనుజఁ జూచి ‘కష్టమనుజులఁ గూడి నా | పనుపు సేయకుండఁ జనునె నీకు?’ ననుచు నుదరిపలుక విని హిడింబయుఁ గడు | వెఱచి భీమసేను మఱువు సొచ్చె. |
202 |