| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అంత. | 203 |
| ఉ. |
పన్నగవైరి విక్రముఁడు పాండవ సింహము దానిఁ జూచి ‘మీ యన్నను నన్నుఁ జూడుము భయంపడకుండుమ’ యంచు, వాని న త్యున్నతిఁ దాఁకి ‘రాక్షస! వధోచిత! నీ బల గర్వ మేదఁగా నిన్ను వధించి యివ్వనము నెట్టన చేసెద నిర్భయంబుగన్’. |
204 |
| క. |
‘చక్క నగు’ మనిన రక్కసుఁ | డక్కజముగఁ బెరిఁగి ‘యియ్యయగు నిప్పుడు, నీ యుక్కును బీరముఁ జూచెదఁ | జిక్కక నిలు’ మనుచుఁ గడు విజృంభించి వడిన్. |
205 |
| క. |
చే సమరికొంచుఁ బొడువఁగ | డాసినఁ దద్భుజముతోన డగ్గఱఁగ జయో ద్భాసి యయి పట్టికొనియె మ | హాసత్త్వుఁడు భీమసేనుఁ డమ్మనుజాదున్. |
206 |
| క. |
‘నిరుపద్రవసుఖనిద్రా | నిరతాత్మకు లయిన వీరినిద్రకు నస్మ చ్చరణభుజఘాతశబ్దం | బరుదుగ విఘ్నంబు సేయు’ నని వగచి మదిన్. |
207 |
| క. |
వడముడి యారక్కసు న | య్యెడ కష్టధనుఃప్రమాణ మెడ గలుగఁగ నె వ్వడి నీడ్చె నల్పమృగమును | విడువక గజవైరి యీడ్చువిధమునఁ బెలుచన్. |
208 |
| వ. | అట్టియెడ. | 209 |
| చ. |
చరణహతిన్ మహాతరులు సాల్వడి జర్జరితంబు లై మహిం దొరఁగఁగ నిట్టు లొండొరులతోడ మదోద్ధతషష్టిహాయన ద్విరదములట్లు ఘోరరణవీరులు సేసిరి మల్లయుద్ధ ము ద్ధురబలు లై సమీరణసుతుండు హిడింబుఁడు తద్వనంబునన్. |
210 |
| క. |
భూరిపదఘాతజాత ధ |రారేణుప్రకరధూసరశరీరకు లై వా రిద్దఱు నొప్పిరి నీ | హారచ్ఛన్నంబు లయిన యద్రులపోలెన్. |
211 |
| క. |
ఆరాక్షసుండు భీము న | పారభుజాబంధనమున బంధించి మహా ధీరధ్వని రోదోంతర| పూరిత మగునట్లు గాఁగ బొబ్బిడి యార్చెన్. |
212 |
| వ. | అమ్మహాధ్వని విని కుంతియుఁ గొడుకులును మేల్కని, తమసమీపంబున నతిమానుషం బయిన రూప సౌందర్యములతో నున్న హిడింబం జూచి, ‘యిది వనదేవతయో సురకన్యయో’ యనుచు విస్మయంబంది; రంతం గుంతి శాంతవచనంబుల ‘నీ వెందులదాన? విట కేల వచ్చి?’ తని యడిగిన నది యి ట్లనియె. | 213 |
| సీ. |
నీలజీమూతంబులీల నాక్షేపించి | నల్ల నై తోతెంచు నల్లగృహము గల హిడింబుం డను బలితంపురక్కసు | చెలియల; నాతండు వెలయ మీకు రోయక యహితంబు సేయ నన్ బంచినఁ | జనుదెంచి, యేను మీ తనయునందుఁ బతిబుద్ధిఁ దాల్చి యుద్ధతమన్మథార్త నై | మసలితి; మసలిన నసుర వచ్చి. |
|
| తే. |
యలిగి, మీతోడ నన్నును గలయఁ బట్టి | మ్రింగ నున్న నయ్యసురతోడం గడంగి మల్లయుద్ధంబు సేయుచు నల్లచోట | నున్నవాఁడు మీసుతుఁడు దర్పోన్నతుండు. |
214 |
| వ. | ‘నన్నును మిమ్మును రక్షించి యా రక్కసు నుక్కడంగ నశ్రమంబున నిప్పుడు చంపుం జూడుం’ డనిన నందఱు లేచి యుద్ధతులై మల్లయుద్ధంబు సేయుచున్న భీమహిడింబులం జూచి; రంత నచ్చోటికిం జని యర్జునుండు భీమసేనున కి ట్లనియె. | 215 |
| ఉ. |
తూ ర్పరుణంబుగాఁ దొడఁగె దుష్టనిశాచరవేళ యయ్యెడున్ మార్పుము కాలయాపన మమర్పక యప్పిశితాశిఁ బట్టి పా లార్పఁగ నేల నావుడు బలాఢ్యుఁడు భీముఁడు మల్లవిద్య నే ర్పేర్పడఁగా హిడింబు బలహీనపరాక్రముఁ జేన్‌సెఁ జెచ్చెరన్. |
216 |
| క. |
వడి నసురవాత ముక్కున | నుడుగక రక్తప్రవాహ మొలుకుచు నుండన్ గడకాలు వట్టి వానిని | మడవక పవనజుఁడు నూఱు మాఱులు వీచెన్. |
217 |
| ఆ. |
లావు సెడఁగ నిట్లు వీవంగఁ బడి గత | చేష్టుఁ డయిన యసురఁ జిక్కఁ బట్టి నేలఁ బెట్టి వాని కోలెమ్ము బ్రల్లన | విఱిచి నడుము ద్రుంచి వీచి వైచె. |
218 |
| వ. | అట్టి చిత్ర వధం జూచి చిత్రీయమాణచిత్తు లై భీమసేను పరాక్రమంబు వొగడుచు నందఱు హిడింబానుగమ్యమాను లై చని; ర ట్లరుగునెడ భీముండు హిడింబ రాక కొడంబడక ‘రాక్షసులు వైరంబుఁ దలంచి మాయలు సేయుదురు కావున నీవు మాతోడ రావలవదు; నిన్ను విశ్వసింపము; నీవును మీయన్న వోయిన తెరువున పొ’ మ్మనిన నది భయంపడి వడవడ వడంకుచున్న దానిం జూచి కరుణారసార్ద్రచిత్తుం డయి ధర్మరాజు భీమున కి ట్లనియె. | 219 |
| తే. |
వధకు నర్హుఁడై వచ్చినవానిఁ జంపి | తదియు ధర్మువ; యిది చాల నబల; దీని కలుగఁ జన; దాత్మరక్షకు నగ్గలంబు | ధర్మరక్షయ యుత్తమధార్మికులకు. |
220 |
| క. |
ఆపద యైనను ధర్మువ | ప్రాపుగ రక్షింపవలయుఁ బరమార్థము; ధ ర్మాపాయమ ధార్మికులకు | నాపద జన్మాంతరమున ననుగత మగుటన్. |
221 |
| వ. | ‘దీనియందు రాక్షసభావం బుపలక్షింపవలవదు; మాకు నాత్మీయబుద్ధియ యుండు’ ననిన హిడింబ ధర్మరాజునకుం గుంతీదేవికి మ్రొక్కి యేకాంతంబునఁ గుంతి కి ట్లనియె; ‘నవ్వా! సర్వప్రాణులకు సామాన్యం బయ్యును మనోజరాగంబు వనితల కసహ్యం బయి విశేషంబయి యుండు; నేను వృకోదరునిమిత్తంబు మదనబాణబాధిత నయి నాచుట్టంబులను జెలులను విడిచితి; నాయిష్టంబు మీరు గావింపనినాఁ డిప్పుడ ప్రాణంబులు విడుతు; నన్ను రక్షించిన మీకు నిష్టంబులయినవాని నెల్లం దలంచి చేయుదు; నిమ్ముగానియెడ మి మ్మందఱ నెత్తికొని మీమెచ్చినచోటికిఁ బోవనేర్తు; నాపలుకులు నమ్ము నది; యే నతీతానాగతవర్తమానంబు లెల్లను దెల్లంబుగా నెఱుంగుదు; వలయునేని యనాగతంబు సెప్పెద వినుండు; ముందట నొక్క సరోవరంబును నొక్కవనస్పతియునుం గల; వవి రెండును శాలిహోత్రుం డనుమహామునిచేతం దపఃప్రభావంబునం బడయంబడినయవి; యక్కొలనినీళ్ళు ద్రావినవారికి నెన్నండును నాఁకలియును నీరువట్టును లే; వవ్వనస్పతియు శీతవాతాతపవర్షంబులవలన రక్షించు; మీర లందున్న మీ కడకుఁ గృష్ణద్వైపాయనుండు వచ్చి మీకు హితోపదేశంబు సేయు నని చెప్పిన. | 222 |
| క. |
విని కుంతియుఁ బాండవులును | మనమున విస్మయముపడి సమంజసభావం బున దాని దివ్యవనితయ | యని తద్దయు నాదరించి రప్పుడు కరుణన్. |
223 |
| వ. | అంత దాని వినయంబునకు ననాగతం బెఱుంగుటకు సంతసిల్లి కుంతి భీమున కి ట్లనియె. | 224 |