| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| ఉ. |
పుణ్యతపోమయుండు మునిపూజ్యుఁడు బ్రహ్మసమప్రభుండు బ్ర హ్మణ్యుఁడు ప్రావృషేణ్యజలదాసితవర్ణుఁ డశేషకిల్బిషా రణ్యద వానలుం డగు పరాశరనందనుఁ డేగుదెంచెఁ ద త్పుణ్యచయస్వరూపమునుబోలెఁ గరంబు మనోముదంబుగన్. |
228 |
| వ. | ఇట్లు వచ్చిన వేదవ్యాసమునీంద్రునకు నందఱు నతిభక్తి నమస్కరించి యాస నార్ఘ్యాది విధులం బూజించి యున్నవారలం గరుణార్ద్రదృష్టిం జూచి కృష్ణద్వైపాయనుం డి ట్లనియె. | 229 |
| పద్మకము |
కొడుకు పల్కు విని కూడదు నాక దుర్మాతుఁడై కడఁగి మీకు నపకారము సేసి ధరిత్రి వె ల్వడఁగఁబంచెఁ గడుఁబాపమతిన్ ధృతరాష్ట్రుఁ, డె య్యెడల దుర్జనుల నేమఱి నమ్మగఁ బోలునే. |
230 |
| వ. | ‘దీని నెఱింగి మీకు హితోపదేశంబు సేయ వచ్చితి; నిఖిల ధర్మవిదుల రయి వినీతుల రయిన మీకు బాంధవవియోజనం బయిన యీ కర్మంబు పురాకృతంబు; దీనికి శోకింపవలవదు; కొండొకకాలంబునకు మీరును బాంధవులం గలసి యెప్పటియట్ల రాజ్యంబు సేయుదు; రిది శాలిహోత్రుతపఃప్రభావంబున నైన కొలను; దీని జలంబు లుపయోగించినవారికి బుభుక్షాపిపాసలు లే; వివ్వనస్పతియును శీతవాతాతపవర్షంబువలన రక్షించు; నిం దొరు లెఱుంగకుండఁ గార్యార్థుల రై కతిపయదినంబు లుండి యేకచక్రపురంబున కేఁగి బ్రాహ్మణభావంబున బ్రాహ్మణగోష్ఠి నుండి నారాక ప్రతీక్షించియుండు నది’ యని కఱపి తనకు వినయావనతులయి కృతాంజలు లయిన మనుమల దీవించి కౌఁగలించుకొని, బాష్పపూరితనయన యయి మ్రొక్కియున్న కోడలి నూరార్చి; ‘నీకొడుకు ధర్మనిత్యుం; డీ యుధిష్ఠిరుండు నారాయణుభుజంబులంబోని తననలువురుదమ్ములబలంబున సర్వపార్థివుల శాసించి సార్వభౌముం డై రాజసూయాశ్వమేధాదిక్రతువులు సేసి పితృపైతామహం బైన రాజ్యలక్ష్మి ననుభవించుచుం గురుకులంబునెల్లఁ బవిత్రంబు సేయు’ నని శోకోపశమనంబుఁ జేసి; హిడింబం జూచి ‘దీనిపేరు కమలపాలిక యిది భీమునకు వశవర్తి యయి పరిచరించి మహాసత్త్వుం డయిన కొడుకుం గాంచు; నాతండు మి మ్మందఱ నాపద్విషయంబున నుద్ధరించు’ నని చెప్పి మునివరుండు తిరోహితుం డైన. | 231 |
| క. |
అమ్మునివరు కఱపిన మా | ర్గమ్మునఁ బాండవులు విగతకల్మషు లవిషా దమ్మున సుఖముండిరి విన | య మ్మొప్పఁగ శాలిహోత్రునాశ్రమభూమిన్. |
232 |
| వ. | అంత. | 233 |
| చ. |
పవనతనూజుఁ డక్కమలపాలికచేత వినీతుఁ డై మహా ర్ణవవృతభూమిలోఁ గల వనంబుల హంసబలాకసారసా రవరుచిరాపగావరసరఃపులినంబులఁ బర్వతంబులన్ వివిధవిహారుఁ డై యనుభవించె నభీష్టమనోజభోగముల్. |
234 |