| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| చ. |
నరవరుఁడైన భీమువలనం బ్రభవించె హిడింబకున్ సుతుం డురుతర భీమ రూపుఁడు ఘటోత్కచ నాముఁడు విస్ఫుర ద్భయం కర వదనంబు శంకునిభకర్ణములున్ వికృతాక్షులుం బయో ధరవరవర్ణమున్ వికటదారుణదంష్ట్రలు నొప్పుచుండఁగన్. |
235 |
| వ. | ఇట్లు సద్యోగర్భంబునం గామరూపధరుం డై ఘటోత్కచుండు పుట్టి తత్‌క్షణంబ నవయౌవనుండును ననేకాస్త్రశస్త్ర కుశలుండును నపరిమిత రాక్షస పిశాచ బలపరివృతుండును నై తల్లిదండ్రులకుఁ గుంతీదేవికి మ్రొక్కిన, నగ్రనందనుం డగుట నందఱును గరంబు గారవంబునఁ గొనియాడం గొన్నిదినంబు లుండి; యొక్కనాఁ డంజలి పుటఘటితమస్తకుం డయి ‘రాక్షసపిశాచబలంబులతోడ నాయిమ్ముల నుండెదం; బని గలయప్పుడు నన్నుఁ దలఁచునది; యాక్షణంబ వత్తు’ నని యందఱిచేత ననుజ్ఞాతుండై తల్లిం దోడ్కొని, యుత్తరాభిముఖుం డయి యరిగె; నిట పాండవులును శాలిహోత్రునొద్ద ననేకధర్మశాస్త్రనీతిశాస్త్రంబు లభ్యసించి యమ్మునివరు వీడ్కొని చని విదర్భమత్స్య త్రిగర్తకీచక విషయంబులు గడచి యేకచక్రం బను నగ్రహారంబు గని. | 236 |