| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| క. |
నలసారము సంసార మ | ఖిలదుఃఖావహము భయనికేతన మతిచం చలము పరాధీనం బిం | దుల జీవన మేల నమ్ముదురు తత్త్వవిదుల్. |
248 |
| క. |
ఆదిని సంయోగవియో | గాదిద్వంద్వములు దేహి యగు వానికి సం పాదిల్లక తక్కవు పూ | ర్వోదయ కర్మమున నెట్టి యోగికి నయినన్. |
249 |
| తరువోజ |
ఏనును బ్రజలును నీధర్మసతియు నే యుపాయంబున నిబ్బారిఁ గడవఁ గానేర్తు? మెయ్యది గర్జ? మిందుండఁ గా దేగుదమ యొండు గడ కని ముంద రే నెంత సెప్పిన నెన్నండు వినద యిది; యిట్టిదారుణ మిమ్మెయిఁ జేయఁ గా నున్న విధి యేల కడవంగ నిచ్చుఁ? గర్మవిపాకంబు గడవంగ లావె. |
250 |
| సీ. |
మంత్రయుక్తంబుగా మత్పరిణీత యై | ధర్మచారిణి యగు దాని వినయ వతిఁ బ్రజావతి ననువ్రత నెట్టు లసురకు | భక్ష్యంబ వగు మని పనుపనేర్తు? ధర్మాభివృద్ధిగాఁ దగు వరునకు నీగ | నిల్లడ బ్రహ్మచే నిడఁగఁబడిన యిక్కన్య యతిబాల యిం దుద్భవం బగు | దౌహిత్రలాభంబు దలుఁగ నెట్లు |
|
| ఆ. |
దీనిఁ బుత్తు? మఱి మదీయ పిండోదక | నిధిఁ దనూజుఁ గులము నిస్తరించు వానిఁ బితృగణంబువలని ఋణంబుఁ బా | చిన మహోపకారిఁ జిఱుతవాని. |
251 |
| ఆ. |
ఎట్టు సూచి చూచి యిది పాప మనక య | య్యసుర వాతఁ ద్రోతు నదయవృత్తి; నరిగి యేన యిప్పు డసురకు నాహార | మగుదు వీరిఁ బుచ్చ నగునె నాకు. |
252 |
| వ. | అని యాత్మపరిత్యాగంబునందుఁ గృతనిశ్చయుం డై యున్న బ్రాహ్మణుం జూచి బ్రాహ్మణి యి ట్లనియె. | 253 |
| క. |
మనుజులకు నెవ్విధంబున | ననతిక్రమణీయ మైన యాపద్విషయం బున సంతాపింపఁగ జన | దని యెఱిఁగియు నగునె యెట్టు లని శోకింపన్. |
254 |
| వ. | ఆ రక్కసున కే నశనం బయ్యెద; మీరు వగవకుండుఁడు; భార్యయందుఁ బడయంబడు నపత్యంబు నాయందు మున్న పడసితి; రేనును ఋణవిముక్త నయితిం; బ్రాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హితంబు సేయవలయు; మఱి యట్లుంగాక. | 255 |
| ఆ. |
పురుషుకంటె మున్ను పరలోక మేఁగిన | సతియ నోఁచినదియు సతులలోనఁ; బురుషహీన యైనఁ బరమపతివ్రత | యయ్యు జగముచేతఁ బ్రయ్యఁబడదె. |
256 |
| ఆ. |
పడిన యామిషంబు పక్షు లపేక్షించు | నట్లు పురుషహీనయయిన యువతిఁ జూచి యెల్లవారుఁ జులుక నపేక్షింతు | రిదియుఁ బాప మనక హీనమతులు. |
257 |
| ఆ. |
సతి విముక్త యయినఁ బతికిఁ బునర్దార | సంగ్రహంబు సేఁత శాస్త్రమతము; పతి విముక్తుఁ డయిన సతి కన్యపురుషసం | గ్రహముసేఁత లోకగర్హితంబు. |
258 |
| వ. | ‘కావున నేను భవద్విహీన నయి యొక్క నిమేషం బేనియు జీవింపనేర; నేర్చితినేనియు ని క్కుమారుల రక్షింపనేర; నె ట్లనిన శూద్రులు వేదశ్రుతిం బ్రార్థించునట్లు కులాచారసదృశులు గానివా రిక్కన్యం బ్రార్థించినం దత్ప్రతీకారంబు సేయను నిక్కుమారునందు గుణాధానంబు సేయను నాకొలంది గాదు; మత్పరోక్షంబునం బునర్దార పరిగ్రహంబు సేసి గృహస్థధర్మంబును నగ్నిహోత్రంబునుం బుత్త్రులను రక్షించునది | యనుచు మరణవ్యవసాయంబునం దున్న తల్లిని దండ్రిం జూచి కూఁతు రి ట్లనియె. | 259 |
| ఆ. |
ఒలసి యెంతకాల ముండిన నేను మీ | దానఁ గాన, యొరుల ధనమ; నన్ను నెన్నఁడయిన నొరుల కిచ్చుచో నసురకు | భోజనముగ నిచ్చి పుచ్చుఁ డిపుడ. |
260 |
| తే. |
తండ్రిచేయు తిలోదక దాన విధులు | పొందుఁ బరలోకగత యైన పుత్త్రియందుఁ; బుత్త్రి చేసిన విధులు దత్పురుషుఁ గాని | తల్లిదండ్రులఁ బొందవు ధర్మయుక్తి. |
261 |
| వ. | ‘మీకు నాయం దయ్యెడు దౌహిత్ర లాభంబునకంటె మీ రిద్దఱు జీవించిన ననేక పుత్త్ర పౌత్త్ర లాభం బగు; దానంజేసి కులంబు నిలుచుం గావున నన్నుఁ బుచ్చుం’ డనినఁ గూఁతుం గౌఁగిలించుకొని యేడ్చుచున్న వారల కన్నీళ్ళు దుడుచుచు. | 262 |
| తే. |
బాలకుం డొక కొండుక కోల చేతఁ | బట్టికొని యేన రక్కసుఁ గిట్టి చంపి చులుక వత్తు మీ రేడ్వఁగా వలవ, దనుచుఁ | గలయ నూరార్చెఁ దన తొక్కుఁబలుకు లొప్పు. |
263 |
| వ. | వాని యవ్యక్తవచనంబులు విని యందఱు నే డ్పుడిగిన, నయ్యవసరంబునం గుంతీదేవి వారల డాయంబోయి. | 264 |
| క. |
‘ఇది యేమి తెఱఁగు? దీనికి | మొద లెయ్యది నాకుఁ దెల్లముగఁ జెప్పుఁడు తీ ర్చెద’ నని విగతాసులఁ దన | మృదు వచన ప్రశ్న మను నమృతమున నెత్తెన్. |
265 |
| వ. | ఇ ట్లడిగినఁ గుంతీదేవికి నవ్విప్రుం డి ట్లనియె. | 266 |